పరిశోధకుల కరదీపిక – సిరికోన భారతి

-డా. రాయదుర్గం విజయలక్ష్మి

“నేర్చుకుంటూ, నేర్పిస్తుంటాం, పంచుకుంటూ పెంచుకుంటాం” అనే ధ్యేయంతో, ‘సాహిత్య సిరికోన’ వాక్స్థలిలో వచ్చిన, విలువైన, పరిశోధనాత్మకమైన వ్యాసాలతో, విద్వత్చర్చలతో వెలసిన, “సిరికోన భారతి” అన్న  పుస్తకం, తెలుగు సాహితీ వనంలో కొత్తగా నాటబడిన, సురభిళసుమాలను పూయించే స్వచ్ఛమైన పారిజాతం మొక్క! భాష, సాహిత్య, సంస్కృతులకు సంబంధించిన వ్యాసాలు, చర్చాకార్యక్రమాలతో కూడిన ముప్ఫై వ్యాసాలతో విలసిల్లే ఈ పుస్తకం లోని ప్రత్యంశమూ, మౌలికమైనది, కొత్త ఆలోచనలను రేకెత్తించేది కూడా!

   ఒక పరిశోధకవ్యాసంలో, ఒక దృక్పథానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.  విభిన్న అంశాలు, భిన్నస్వరాలతో నినదిస్తూ, ఒకే అంశాన్ని ఎన్ని దృక్పథాలతో చూడవచ్చో, ఆ అన్నిటి నుండి ఏది సరియైన అంశామో నిగ్గుదేల్చే పరిశోధనాత్మకతను నిరూపించడం, ఈ సిరికోన భారతి ప్రత్యేకత! సాహిత్య విభాగంలో 13 వ్యాసాలు, భాషా విభాగంలో, 9 వ్యాసాలు, సంస్కృతీ  విభాగంలో 8  వ్యాసాలతో, 2020 లో , ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి సహసంపాదకత్వంతో వెలువడిన ఈ పుస్తకం, ఇటు నిష్ణాతులైన సాహితీ వేత్తలను రంజింపజేయడమే కాదు, అటు, పరిశోధక విద్యార్థులకు కూడా విలువైన ఆకర గ్రంథంగా ఉపకరిస్తుంది అనడం అతిశయోక్తి కాదు.

  మచ్చుకు కొన్ని ఉదాహరణలను చూద్దాం. “సరళమైన సాధారణ అనుభవాలనుండి, అసాధారణ భావాలను పిండి, కొత్త అనుభూతి నందించేది కవిత్వం/సాహిత్యం.. సాధారణ జీవితాన్ని తేజోవంతం చేసేది కవిత్వ లక్షణ”మని  చెబుటూ,  భాష అంటేనే, గొప్ప ప్రజా ఉత్పత్తి, సామూహిక ఉత్పత్తి,  భాషను ఏ కొందరికో పరిమితం చేసే, పాండిత్య ప్రకర్ష రూపాలు, ఎక్కువకాలం చలామణి కాలేవని, అట్టి పరిస్థితిలోనే వచన కవితలు పుట్టుకు వచ్చాయని చెబుతూ, కవితాత్మకతకు కొన్ని సూత్రాలను నిర్వచిస్తుంది(కవితాత్మకత : కొన్ని సూత్రాలు..గంగిశెట్టి లక్ష్మీనారాయణ) ఈ పుస్తకం.  మంచి రచనకు, పాఠకులను ఆర్ద్రీభూతం  చేయగలిగిన భావుకత, ఒక అనిర్వాచ్యమైన భావాన్ని, పాఠకునిలో నిలిపి, హృదయద్రవీకరణను కలిగించే రసధ్వని, శబ్దచమత్కారంతో కూడిన తాత్విక శైలీ నిర్మాణం ముఖ్యమనికూడా చెబుతుంది.  

  “శబ్దానికి ఉండే అనేక శక్తులనుండి, అనుభూతితో తడిసి వచ్చేది కవిత్వమని, వస్తువును పదేపదే భావన చేసి, దానిని చెప్పడానికి కొత్త మార్గాన్ని అన్వేషించి, దానికి లోకాన్ని జోడించి ఔచితీవంతంగా చెప్పడమే కవిత్వమని (కవిత్వభాష.. బులుసు వెంకటేశ్వర్లు), చెప్పే యీ వ్యాసాలు, “వస్తువును మనస్సులో పదేపదే మధించడం అన్నది కవిత్వానికే కాదు, కథకు కూడా అవసరమేననీ, మనిషి అంతరంగంలోకి తొగిచూసి, సంఘర్షణను చిత్రించి, జీవన వాస్తవికతకు దూరం కాకుండా చింత్రించినపుడే మంచికథ అవుతుందని,  గమ్యం కంటే, ప్రయాణానికి;  సందేశం కంటే సంఘటనకు ప్రాముఖ్యమిచ్చే జీవన వాస్తవికత కథకు ప్రాణం అని, (“కథ, కవిత… వగైరాలు…… జొన్నవిత్తుల, గంగిశెట్టి ల.నా.), చెబుతాయి. “…ఈ నాడు వచనకవితగా నామకరణం పొందిన నిర్నిబంధ కవిత, కవి దృక్పథానికి చేరువగా ఉండే ఉద్వేగపూరితమైన వచనరచన!” … అన్న రోణంకి అప్పలస్వామి గారి మాటలను గుర్తుచేస్తూ, వచనం, కరపత్రాల స్థాయిని దాటి, తాత్విక గవేషణ, వైజ్ఞానిక ప్రగతిని ప్రదీప్తం చేసే చైతన్య సరళితో, సామాజిక సంబంధమైన, కవితలుగా మారినపుడే వచనకవితాస్థాయి పెరుగుతుందని(నవ్య కవిత్వం – ఒక చర్చ…గవేరా) కూడా ఈ వ్యాసాలు, చర్చిస్తాయి.  విరియాలకామసాని,1100 శతా., నాటికే శాసనాలలో వృత్తపద్యాలను రచించిన తొలి తెలుగు కవయిత్రి అని,(కవయిత్రులు-కవిత్వ కల్పనా విభాగాలు…దివాకర్ల రాజేశ్వరి), ‘గాథాసప్తశతి కర్త హాలుడు తెలుగు వాడే’ ననడాన్ని, ‘అత్త’, ‘శారిక’ వంటిపదాల ద్వారా నిరూపించడం, గోదావరిని గోలా అని సప్తశతి పేర్కొన్నదని, ‘రాఇఆఇ పత్తాఇం…. అంటే ఆవాల ఆకు అనేకన్నా రావి ఆకు అనేందుకే అవకాశమెక్కువ … అన్న మౌలిక పరిశోధనాశాలతో(డా. కోడూరి ప్రభాకరరెడ్డి ‘గాఢాసప్తశతి’ అనువాద పరిచయం…గంగిశెట్టి లక్ష్మీ నారాయణ) కూడిన వివరణలను  ఈ వ్యాసాలు అందిస్తాయి.

భాషావిభాగంలో, ‘జెంటూ’ అన్న వ్యాసం పేర్కొనదగినది. “వాస్కోడ గామ భారతదేశం లోని మలబారు ను చేరుకొన్నపుడు, (1490)లో ఇక్కడి ప్రజల భాష, ఆచారవ్యవహారాలు అర్థం గాక, వారిని జెంటూలు అని పిలవసాగారు. మద్రాసు ప్రెసిడెన్సీ లోని వారిని జెంటూలు  అని పిలిచేవారు! తెలుగువారిని ఉద్దేశిస్తూ మర్యాదాపూర్వకంగా మాత్రమే ఈ పదాన్ని వాడేవారని, తరువాత వచ్చిన ఆంగ్లేయులు, జంతువులు అనే అర్థంలో  ఉపయోగించేవారని, కానీ పోర్చుగీస్ భాషలో J అక్షరాన్ని, సందర్భాన్నిబట్టి, ‘హ’ ‘ఓ’ లుగా, t అన్న అక్షరాన్ని , త, ద, లుగా  పలికేవారని తెలుస్తోంది.  ‘jentuu’ అంటే, హిందూ” అని అర్థం, అని పరిశోధనాత్మకంగా[పెద్దు సుభాష్ (విద్యార్థి)} నిరూపించిన, యీ వ్యాసం, ఎన్నో  మౌలికాంశాలను అందిస్తోంది.  వాక్కును వివరించేందుకు, వేదాలనుండి,బ్రాహ్మణాలనుండి, భర్తృహరి వాక్యపదీయంనుండి, శ్రీ విద్యారణ్యులవారి సూత సంహితనుండి ఆకరాలను స్వీకరించి, (వాగ్రూపం : భావం, స్థితులు… పిల్లలమర్రి కృష్ణకుమారు) వాక్కు దేవతా రూపమని, మానవులు మాత్రమే తురీయమైన వాక్కును పలుకగలుగుతారని, శబ్దబ్రహ్మమైన శక్తి, విశుద్ధ చక్రంలోనే శబ్ద, పద, వాక్య రూపాలు దాలుస్తుందని, చెప్పే వివరణలు, వాక్కు, వాగ్రూపాలగురించి చేసే పరిశోధనలకు  గొప్ప ఆధారంగా మాత్రమే కాదు, పరిశోధించవలసిన మార్గాన్ని కూడా సూచిస్తోంది.  

సంస్కృతి విభాగంలో, మలేషియాలో, తమిళ హిందువులు తమ సంప్రయానుగుణంగా, బతు గుహలలో సుబ్రహ్మణ్య స్వామికి ఆలయనిర్మాణం గావించి, జనవరి – ఫిబ్రవరి( త్తై నెల)లో చేసుకొనే ‘తైపూసం’ (నాగరాజు రవీందర్),  గూర్చిన వ్యాసం భారతీయ సంస్కృతి, దేశపు ఎల్లలను దాటి, విదేశాలను సుసంపన్నం చేసిన విధానాన్ని వివరిస్తుండగా, ‘బార్సెలోనా, లిస్బన్ అనుభవాలు’ (వేణు ఆసూరి) అన్న వ్యాసం, ఆయా ప్రాంతాలలోని అపూర్వమైన శిల్ప చిత్రకళను,వాటి చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ,  అక్కడి మనుష్యులలోని మానవత్వ వివరణతో మనసును తడిచేస్తుంది…  

అసలు ‘సిరి కోన భారతి’ అన్న ఈ పుస్తకం  ప్రతిభ అంతా చర్చా విభాగంలో కనిపిస్తుంది. ధాతు విభజన నుండి ప్రారంభమై,  ఒక పదాన్ని నిర్వచించడం, సంస్కృతం, తెలుగు మాత్రమే కాకుండా అవసరమైతే ఇతర భాషలలో  కూడా వాటి వ్యవహార రూపాలను గుర్తించడం, ఆ పద, లేదా అర్థ చర్చలో తమ అభిప్రాయాలను పంచుకొనే స్వేచ్చ అందరికీ ఉండడం, దీని ప్రత్యేకత. ఒకటి రెండు ఉదాహరణలను చూద్దాం!

“ఏది కవిత్వమో చెప్పడం కష్టం. కవిత్వం రసనాగ్ర నర్తకి “అన్నారు చెళ్ళపిళ్ల వారు. దాదాపు ఏడు పేజీల పర్యంతం చర్చించిన యీ వ్యాసంలో(‘రసనాగ్ర నర్తకి’ సాహిత్య వివేచనా సంవాదం…. సంవాదకులు; కవెరా, గంగిశెట్టి ల,నా., రాణీ సదాశివమూర్తి, సర్వమంగళ గౌరి) ఏ శబ్దం చెవిన పడగానే హాయి అనిపిస్తుందో, మనలోని సత్తు, చిత్తు లను ఏకకాలంలో మేల్కొలుపుతూ తురీయమైన ఆనందానికి మూలస్తంభంగా ఏ శబ్దం నిలుస్తుందో అదే శక్తిమంతమైన శబ్దం అని, పరస్పరం సమాం తరంగా సాగే స్వ-పర ల సహితత్వమే సాహిత్యం అని సహృదయ ప్రమాణంగా తేల్చి చెప్పడం గొప్ప నిర్వచనం.  మరో వ్యాసం. ‘మాండలికం-యాస’ (ప్రధాన చర్చా వ్యాసం: జో.శ్రీరామచంద్రమూర్తి; సంవాదకులు: పెద్దు సురేశ్, దివికుమార్, తుమ్మూరి. ల.నా.,) గూర్చిన చర్చాకరంబం, “పలికే ద్వనిని, ఒకప్పుడు యాస అనేవారు, ప్రస్తుతమది మాండలికభాషా రీతికే పర్యాయపదంగా మారిపోయిందని, ద్వనులు, వర్ణాలు, పదాలు, పదాంశాలు, విభక్త్యాదులు, వాక్యాలు,..ఇవన్నీ, వాటి అర్థాలు, అర్థాంతరాలు, కాకువులు కలిస్తే భాష అని, వీటన్నిటిలో నున్న సాదృశ్యతతోబాటు , విభిన్నత కూడా అంతే ఉండేది మాండలికమని యిచ్చిన నిర్వచనం పేర్కొనదగినది.

‘ప్రాచీన చరిత్ర సంస్కృతి: ద్రావిడ సంస్కృతి’ అన్న చర్చా కదంబం, ఇంకా పరిశోధనకు అవకాశమున్న అంశం. చరిత్రకు సంబంధించిన లిఖిత ఆధారాలలో, మొదట శాసనాలు, తర్వాత సాహిత్యం ,తర్వాత అన్యదేశీయుల రాతలు, తతిమ్మావి…. ముఖ్యమైనవని, అశోకుని తదనంతరమే లిఖిత ఆధారాలు పరిగణనకు తీసుకోవాలని, యీ అంశంపై ఇంకా చర్చించవలసిన అవసరముందని సూచించడం యీ వ్యాస ప్రత్యేకత!

ఇంకా ‘కొన్ని శబ్దాల, స్వరూపం అర్థాలు’,  ‘కొన్ని దేశీయమైన పేర్లు : నేపథ్య విశ్వాస, ఆచారాలు’  ‘శబ్ద తత్వార్థ వివేచన’, ‘తృతీయ ప్రకృతులు’, ‘ప్రసారమాధ్యమాల పరిభాష’… ఎలా ఎన్నో అంశాలను  విస్తారంగా చర్చించి, నిగ్గుదేల్చిన వివరాలు;..  జిడ్డు కృష్ణమూర్తి నుండి, విశ్వనాథ సత్యనారాయణగారి దాకా సాగిన మరెన్నో విషయాలు ….. ఎన్నో అరుదైన అంశాలను అందిస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, పూదోటనీలిమ క్షయవ్యాధితో, నిరుత్సాహానికి గురైనపుడు, సురేశ్ అనే వ్యాయామశిక్షకుడు, తనలో నింపిన దైర్యంతో నేపాల్ నుండి హిమాలయ పర్వతారోహణకు, సిద్ధమైన తరుణంలో  తన తల్లికి రాసిన లేఖలను,  ‘ఫ్రమ్ ఎవరెస్ట్ విత్ లవ్’ పేర  ప్రచురించింది. అందులోని, ‘A Good Pebble’ అన్న కవితకు, పెద్దు సుభాష్ గారు చేసిన అనువాదం, భావాత్మికమైన స్వేచ్ఛానువాదమెలా ఉండాలో చెబుతుంది. ఇలా ఎన్నో మౌలికాంశాలతో కూడిన,   ప్రతి వ్యాసం, ప్రతి చర్చా కదంబం…. ఆణి ముత్యాలతో పోల్చదగినవే!  వాక్స్థలి అనుదిన సాహిత్య పత్రికలో వచ్చిన అంశాలు ప్రతిదీ పరిశోధకులకు ఆకరసాక్ష్యాలుగా ఉపకరించేవే అన్నది, అక్షరసత్యం.

ప్రతులు లభించు చోట్లు:

  1. ఆచార్య జి. లక్ష్మీనారాయణ, 34454, Bendevieck Ln, Fremont, CA, US#94555
  2. పాలపిట్ట బుక్స్ , హైదరాబాద్, ఫోన్: 040-27678430.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.