
రంగవల్లి
-అశోక్ గుంటుక
తెలుగు లోగిలి ప్రతి వాకిలి
ఆనందం ఆకృతి దాల్చిన రంగవల్లి…
ముగ్గునగొబ్బిపూలు
ఎగురుతున్న గాలిపటాలు
హరిదాసులు బసవన్నలు;
ప్రతి ఇంటా పరుచుకున్న వసంతం…
ప్రకృతి పల్లె చేరి పరవశం…
ఆకాశం రాలిన నక్షత్రాలు..
ఆ వెంటే విరిసిన ఇంద్రధనుస్సులు…
అతనొచ్చి ఓ ముగ్గు చుక్కపెట్టి
సెల్ఫీ యై…
అహాన్ని చల్లార్చుకున్నా
ఆకాశంలో సగం అంటూ
సగాన్ని మిగుల్చుకున్నా…
నిజానికి ఇక్కడ అతనుశూన్యం…
పండుగ వేళ –
వాకిలి క్యాన్వాస్ పై తీర్చిదిద్దిన కళాకృతులు……
తరతరాలు
లోలోనే దాగిన సృజనాత్మక భావాలేగా…
ఇదంతా తన ప్రపంచం…
ఓ అందమైన ప్రపంచం…
తరుణి ప్రపంచం…
*****

అశోక్గుంటుక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జన్మించారు. బిఏ, బిఎడ్ పూర్తి చేశారు. 1989లో ‘పల్లకి’ వార పత్రికలో మొదటిసారిగా వీరి రాసిన కవిత అచ్చయింది. 1989 నుండి 1994 వరకు పలు దిన, వార పత్రికల్లో సామాజిక లేఖా రచయితగా ప్రజా సమస్యలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా 2016 నుంచి కవిత్వం తిరిగి రాయడం ప్రారంభించారు. మొత్తంగా ఇప్పటి వరకు 200లకు పైగా కవితలు, పది వరకు గేయాలు రాశారు.
