
స్వేచ్ఛ
-పి.సుష్మ
వాళ్లంతా భద్రత అనే బంగారు పంజరంలో బందీలు
రెక్కల క్రింద స్వేచ్ఛను కట్టేసుకొని
అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటారు
ఎగిరే కొద్దీ వెనక్కిలాగే వాళ్ళు కొందరు
స్వేచ్ఛ ఇచ్చామని అంటూనే రెక్కలు విరిచేస్తూ ఉంటారు ఇంకొందరు
విరిగిపోయిన రెక్కలు ఈకలై ఎగిరిపోవడం చూసే ఉంటావు
అది ఎవరికీ భయపడని స్వేచ్ఛ
ఈకలన్ని చదివే ఉంటాయి ఆకతాయి గాలి చేష్టలు
అయ్యో అంటూ అక్కున చేర్చుకున్న బండరాయి సందులో కొన్ని
ముళ్ళకంపలో కొన్ని ఇలా అక్కడక్కడా ఇరుక్కు పోయి కనిపిస్తూ ఉంటాయి
భద్రత లేని బ్రతుకుకు
ఎదురుచూపు ఎప్పుడు మిగిలిపోయిన ఆఖరి కోరికే
నచ్చిన వాళ్ళు కొందరు గుర్తుగాను
ఇష్టపడిన వాళ్లు కొందరు జ్ఞాపకంగాను
ప్రేమించిన వాళ్ళు కొందరు జీవితంలో బందీలుగాను మిగిలిపోతారు
బలహీనమైన ఈకలన్ని ఒక్కప్పటి బలమైన రెక్కలని
మర్చిపోయి
బంధం వేసుకున్నా తాడుకి బందిగా మిగిలిపోతారు.
****

మాది సోమేశ్వరబండ గ్రామం, మక్తల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ. నేను M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నాను. చిన్నప్పటినుంచి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. 10వ తరగతి చదువుతున్న రోజుల నుంచే కవిత్వం రాస్తున్నాను. ఖాళీ సమయంలో చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను.

అంతర్గత కట్టుబాట్లతో, సౌందర్యాత్మక ఆంక్షలతో… తననుతాను బందీ చేసుకుని…. ఎప్పుటికప్పుడు రెక్కలను తెగ్గోసుకుంటూ… గడపకివతలే… ఏకాంత నావ చప్పుడు వినడానికి అలవాటుపడిపోయిన… ఈ విహంగాలు విహాయాసంగా విహరించేదెప్పుడూ? కవిత బాగుండటమే కాదు… ఆలోచనాత్మకంగా ఉంది కవయిత్రి కి అభినందనలు👏
మీ ప్రతిస్పందనకు చాలా ధన్యవాదాలు సార్
Simply superb sushma garu👌
thank you sir