
జ్ఞాపకాల ఊయలలో-4
-చాగంటి కృష్ణకుమారి
నా ఒకటవ క్లాసు చదువును మధ్యలోనే ఆపేసి మాపల్లె కు వెళ్లాక అక్కడ బడికి ఒకటి రెండు రోజులకన్నా ఎక్కువ పోలేదు.ఒక చిన్నతాటాకు చదరని తీసుకొని బడికి వెళ్లాలి.చదర మీద కూర్చొని ఇసుకలొ ఎవో కొన్ని తెలుగు పదాలు రాయడం,దిద్దడం వంటివి చేసిన గుర్తుంది.మరి ఆ బడికి నన్ను పంపలేదు. ఇంట్లోనే ఏవో నేర్పుతూ వుండేవారు.
ఇవి ఏడూ .. వారముల పేర్లు, ఈ పన్నెండు నెలల పేర్లు– అన్న పంథాలో రాయప్రోలు సుబ్బారావు, బసవరాజు అప్పారావు, విశ్వనాధసత్యనారాయణ , దేవుల పల్లి కృష్ణ శాస్త్రి, నండూరి సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి , అబ్బూరి రామ కృష్ణారావు, గుర్రం జాషువా అని నాచేత ఈ పేర్లను తులసి వల్లె వేయించేది.ఎందుకో మరి నాకు తెలియదు.గుర్రం జాషువా పేరు నాకు తమాషాగా అనిపించేది . అలా నాకు ఈ పేర్లు తెలుసు.
“ నీ పుట్టదరికి నాపాప లొచ్చారు” అనే నాగుల చవితి కవిత నేర్పింది. ఆకవిత లో “అటుకొండ ఇటుకొండ ఆరెంటి నడుమ…. “ నాకు చాలానచ్చేది, పగలనక రేయనక పనిపాటలందు…. కంపచాటున నుండి కొంపదీకోయి …” ఇంకానచ్చేది . ఈ కవితని పూర్తిగా ….
నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు
పాపపుణ్యమ్ముల వాసనే లేని
బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి!
కోపించి బుస్సలు కొట్టబోకోయి!
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
చీకటిలోన నీ శిరసు తొక్కేము
కసితీర మమ్మల్ని కాటేయబోకు
కోవపుట్టలోని కోడెనాగన్న
పగలు సాధించి మాప్రాణాలు దీకు
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ
పాపమే యెఱగని పసులు తిరిగేని
ధరణికి జీవనాధార మైనట్టి
వాటిని రోషాన కాటేయబోకు
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ
నాగులకొండలో నాట్యమాడేటి
దివ్యసుందరనాగ! దేహియన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి!
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
పగలనక రేయనక పనిపాటలందు
మునిగి తేలేటి నా మోహాలబరిణె
కంచెలు కంపలూ గడచేటివేళ
కంపచాటున వుండి కొంప దీకోయి!
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
( ఇది బసవరాజు అప్పారావుగారిదని తరువాత ఎప్పటికో తెలిసింది)
అలాగే రాయప్రోలు సుబ్బారావుగారి ఏ దేశమేగినా ఎందుకాలిడినా, శ్రీలు పొంగిన జీవగడ్డయి, అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు వంటి కొన్ని కవితలు నేర్పి వరుసగా అప్పచెప్పమనేది . ఉత్సాహంగా అప్పచెప్పేదాన్ని. ఇటువంటి కవితలేకాక గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర లో కొన్ని పద్యాలూ , ఇంకా “నల్లని వాడు పద్మ నయనంబులవాడు ….” వంటి పద్యాలు కూడా అప్పచెప్పగలిగేదాన్ని. మాబామ్మ కాళ హస్తీశ్వర శతకం లో పద్యాలు కూడా చదువుతూ వుండేది . వాటిలో ఈ పద్యాన్ని చలా ఇష్ట పడేదాన్ని
అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుదా
జింతాకంతయు జింత నిల్పండుగదా శ్రీ కాళహస్తీశ్వరా .
“ శైశవ గీతి” లో
“మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా !
అచ్చటి కిచ్చటి కనుకోకుండా
ఎచ్చ టెచ్చటికో ఎగురుతూ పోయే,
ఈలలు వేస్తూ ఎగురుతూ పోయే
పిట్టల్లారా !పిల్లల్లారా !” — భాగాన్ని ఇష్టపడేదాన్ని.
నాన్న నాకు ఓ నర్సరీ రైమ్ ను ఇంగ్లీషువారి రాగం లో నేర్పాడు. అది —
I had a little pony,
His name was Dapple Grey,
I lent him to a lady,
To ride a mile away.
She whipped him, she slashed him,
She rode him through the mire;
I would not lend my pony now,
For all the lady’s hire.
ఇది ఇప్పటికీ గుర్తుంది. ఏదైనా సరే, చెపితే మనసుకు నాటుకు పోయేలా చెప్పేవాడు.
*****

చాగంటి కృష్ణకుమారి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో పరిశొధన చేసి డాక్టరేట్ ను పొందారు. విజయనగరానికి చెందిన ఈమె ప్రముఖ రచయత చాగంటి సోమయాజులు గారి ( చాసో) కుమార్తె. 36 సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళాకళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలోనూ పనిచేసారు.1993లో ఆసోసియేట్ ప్రొఫసర్ గా పదోన్నతి పొందారు. తెలుగు అకాడమి లో డెప్యుటేషన్ పై రసాయన శాస్త్ర పుస్తక, పదకోశాల ప్రచురణవిభాగంలో పనిచేసారు. వీరు రాయల్ సొసైటి ఆఫ్ కె మిస్ట్రి (RSC)లండన్. సభ్యురాలు.
ఇండియన్ కెమికల్ సొసైటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిష్ట్రి, ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్,ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వారి కన్వె న్షన్ ల లోనూ వర్క్ షాపుల్లోనూ పత్రాలను సమర్పించి రెండుసార్లు సర్వోత్తమ పత్ర సమర్పణా అవార్డులను పొందారు.ఆకాశవాణి కేంద్రాలనుండి, ఇందిరాగాంధి సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి GYAN VANI కార్య క్రమాలలో వైజ్ఞానిక అంశాలపై సుమారు 80 ప్రసంగాలను ఇచ్చారు. RSC IDLS వారు, స్థానిక విద్యా సంస్థల వారు నిర్వహించిన సెమినార్లు, వర్క్ షాప్ లలో పాల్గొని సుమారు 50 జనరంజన వైజ్ఞానిక ఉపన్యాసాలను ఇచ్చారు.
ఈవిడ మంచి ఉపన్యాసకురాలు, పరిశోధకురాలు, అనువాదకురాలు. క్లిష్ట మైన వైజ్ఞానిక విషయాలను చక్కని తెలుగులో ఆసక్తి దాయకంగానూ, సుబోధకంగానూ, సరళంగానూ ఆద్యంతం ఆకట్టుకొనే శైలి లో చెప్పగల రచయిత్రి. ఎం.ఎస్ సి; పి.హెచ్.డి డిగ్రీలను ఆంద్రా యునివర్సిటి నుండి పొందారు. డిగ్రీ స్థాయిలో ప్రతిస్ఠాత్మక బార్క్ (BARC) స్కాలర్ షిప్, ఎం.ఎస్.సి.లో మెరిట్ స్కాలర్షిప్, పిహెచ్ డి ప్రోగ్రామ్లో యు.జి.సి.ఫెలోషిప్ ని పొందారు.
2000 లో లోహ జగత్తు. 2001 లో వైజ్ఞానిక జగత్తు. 2010 లో మేధో మహిళ , భూమ్యాకర్షణకి దూరంగా.. దూర దూరంగా… సుదూరంగా…. 2012 లో రసాయన జగత్తు. 2016 లో వైజ్ఞానిక రూపకాలు. 2017 లో జీవనయానంలో రసాయనాలు 2018 లో వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి ? 2019 లో కంటి వైద్యంలో ప్రాచీన భారత దేశ జ్ఞాన సంపద ( నిజానిజాలపై అమెరికా వైద్యనిపుణుల విశ్లేషణ) వంటి వైజ్ఞానిక శాస్త్ర గ్రంధాలను ప్రచురించారు. వీరు రచించిన పుస్తకాలను నేషనల్ బుక్ ట్ర ష్ట్ ,న్యూ ఢిల్లి; తెలంగాణ అకాడమి ఆఫ్ సై న్స స్ ,హైదరా బాద్; వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థలు ప్రచురించాయి.
ఈమె రాసిన భారతీయ సాహిత్య నిర్మాతలు:చాగంటి సోమయాజులు(చాసో)మోనో గ్రాఫ్ ని సాహిత్య అకాడమి 2014 ప్రచురించింది
