కళ్ళల్లో ప్రాణాలు

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

-జి . ఎస్. లక్ష్మి

 “కాట్” గట్టిగా వినిపించిన కేకకి ఎక్కడో దూరంగా కూర్చుని లెక్కలు చూసుకుంటున్న ఆ సినిమా నిర్మాత లోకనాథం ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గబుక్కున షూటింగ్ స్పాట్ వైపు చూసేడు. చిరాకు పడుతూ డైరెక్టరు శ్రీహర్ష ప్రొడక్షన్ మేనేజర్ శేషాద్రిని చూస్తూ గట్టిగా ఏదో అంటున్నట్టు కనిపించింది. జోరుగా జరుగుతున్న షూటింగ్ కి “కట్” చెప్పిన డైరెక్టరు, మేనేజర్ మీద ఎందుకు అరుస్తున్నాడో ననుకుంటూ కూర్చున్నచోటునుంచి లేచి అటు పరిగెత్తేడు లోకనాథం.

  “ఎక్కణ్ణించి తీసుకొస్తావయ్యా ఇలాంటివాళ్లనీ. ఇది హీరో ఇమేజ్ ని పెంచే సీను. ఒక ముసల్దాన్ని ఎత్తుకు తీసుకొచ్చి, హీరో స్వయంగా ఆవిడకి అన్నం పెట్టే సీను. ఆ ముసల్ది బక్కచిక్కి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకునుండాలి. గాజుకళ్ళలాంటి ఆ కళ్ళలో అసలు జీవమనేదే కనిపించకూడదు. ఈ సీను చూస్తున్నప్పుడు ప్రేక్షకుల మనసు ద్రవించిపోవాలి. హీరో ఇమేజ్ ఇంతెత్తు పెరిగిపోవాలి. మరి దానికి నువ్విలాంటి మనిషిని తీసుకొస్తావా! ఆ మనిషిని చూస్తే ఎవరికైనా అసలు జాలీ, దయా అనిపిస్తాయా!”

  డైరెక్టరు చూపించినవైపు చూసేడు నిర్మాత లోకనాథం. అక్కడ ఒక వయసు మళ్ళినావిడ స్థిమితంగా కూర్చుని టిఫిన్ తింటోంది. నిజంగానే డైరెక్టర్ కోరుకున్నట్టు ఆమె సన్నగా బక్కచిక్కి లేదు. కాస్తంత నిండుగానే వుంది. కళ్ళల్లో దీనత్వం లేదు. ఎంత చిరిగిన చీర చుట్టబెట్టి రోడ్డు పక్కన కూర్చోబెట్టినా ఆవిడని చూడగానే అస్సలు జాలీ, దయా లాంటివి మనిషన్న వాడికి పుట్టవు. శ్రీహర్ష చెప్పింది నిజవే ననిపించింది లోకనాథానికి. ప్రశ్నార్ధకంగా మేనేజర్ శేషాద్రి వైపు చూసేడు. 

   “ఏం చెయ్యమంటారండీ. ఈ సీను గురించి రైటర్ గారు నిన్ననే రాసిచ్చేరు. నిన్నట్నించీ ఎక్స్ ట్రా ఆర్టిస్ట్ లని సప్లై చేసేవాళ్లకి చాలామందికి చెప్పేను. వాళ్ళు తెచ్చినవాళ్లలో ఈవిడే కొంచెం సూటవుతుందనిపించింది. కాస్త టైముంటే ఇంకెవర్నైనా తీసుకొద్దును. కానీ హీరోగారి డేట్స్ ఇవాల్టితో అయిపోతాయి.  అందుకే…”
  శేషాద్రి చెప్పిన మాటలకి నీరుగారిపోయేడు లోకనాథం. ఎంతో కష్టం మీద దొరికిన హీరో డేట్స్. సెటింగ్ కీ, కాస్ట్యూమ్స్ కీ బోలెడయింది. ఇవాళ షూటింగ్ పూర్తి చేసుకోకపోతే ఎలా! రేపు ఆయనగారు వేరే ఫిల్మ్ షూటింగ్ కి బాంకాక్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ హీరో డేట్స్ ఎప్పటికి దొరుకుతాయో..

“పోనీ, ఈమె తోనే సర్దుకుని ఎలాగో కానిచ్చెయ్యండి డైరెట్రుగారూ. లాంగ్ షాట్స్ తీసి కవర్ చేసెయ్యండి..” తనకి తెలిసున్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించేడు లోకనాథం. 

 ”ఎలా కుదుర్తుందండీ! ఈ సీను పండితేనే హీరో ఇమేజ్ ఎలివేట్ అవుతుంది. లేకపోతే ఎలా తెలుస్తుందీ..క్లోజ్ షాట్స్ తీస్తే కానీ సీను పండదు.. కళ్ళల్లో ప్రాణాలున్న బాగా బక్కచిక్కిన ముసల్దాన్ని తీసుకు రమ్మనండి.” అంటూ అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయేడు శ్రీహర్ష. 

   అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్టు డైరెక్టర్ ని యేమీ అనలేక అదంతా శేషాద్రి మీద చూపించేడు లోకనాథం. 

శేషాద్రి ఆ కోపాన్ని తనకి ఇంకా లోకువైన  ఆ ముసల్దాన్నిఎగస్ట్రా ఆర్టిస్ట్ గా తీసుకొచ్చిన రామం మీద తీర్చుకున్నాడు. 

 “ఆర్టిస్ట్ లని సప్లై చేసినందుకు మేవిచ్చే డబ్బులు కాకుండా వాళ్ల దగ్గర కమిషన్లు కూడా మింగుతూనే వున్నారు కదయ్యా..అంతే కాకుండా పిల్ల పురిటి కొచ్చిందంటూ మీదపడి డబ్బులు తీసుకుంటూనే ఉన్నావయ్యె.. కాస్తైనా శ్రధ్ధ పెట్టి పని చెయ్యాలి. ఇప్పుడు చూడు. ఇవాళ సాయంత్రంలోగా ఈ సీను చెయ్యకపోతే లక్షల్లో నష్టం వస్తుంది. నీ బాబు కడతాడా!..” 

 కేవలం డబ్బులిస్తున్న కారణంగా శేషాద్రి అంటున్న మాటలు వింటున్న యాభైయేళ్ళు పైబడ్ద  రామానికి అక్కడి కక్కడే భూమిలోకి దిగి చచ్చిపోతే బాగుణ్ణనిపించింది. కానీ బిగపట్టుకున్నాడు. మనసుని కట్టడి చేసుకున్నాడు. పెదవి విప్పితే జరిగే అనర్ధం తెలుసు కనక దించిన తల యెత్తకుండా  అలాగే రాయిలా నిలబడ్డాడు. 

 “వెళ్ళు, వెళ్ళీ లంచ్ టైమ్ అయేలోపల ఆ డైరెక్టరు అడిగినలాంటి ముసల్దాన్ని తీసుకురా.. లేకపోతే ఏం చేస్తానో నీకు చెప్పక్కర్లేదుగా..” అంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయేడు శేషాద్రి. 

  తెలుసు.. శేషాద్రి యేం చేస్తాడో రామానికి బాగానే తెలుసు. ఇచ్చే డబ్బులు యివ్వడు. మళ్ళీ యెంతమంది కాళ్ళు పట్టుకోవాలో.. చిన్నప్పుడు చదువూ సంధ్యా లేక సినిమాల మోజులో తిరిగేడు. ఎలాగైనా సినిమాల్లో హీరో అయిపోవాలని వచ్చిన తను ఆఖరికి యిలా ఎగస్ట్రాలని సప్లయి చేసే స్థితిలో బతుకుతున్నాడు. నిలకడలేని సంపాదన. 

అక్కడికీ భార్య సీత అక్కడా ఇక్కడా పని చేసి నాలుగు డబ్బులు తెస్తోంది కనక ఇల్లు రోడ్డున పడకుండా వుంది. 

  బలవంతంగా కూడదీసుకుంటున్న రామం మనసు చేతిలో మొబైల్ మోగడంతో ఒక్కసారి ఈ లోకంలో కొచ్చింది. ఆ కాల్ వచ్చింది తన తల్లి నుంచిన వృధ్ధాశ్రమం నుంచని మొబైల్ స్క్రీన్ మీద చూడగానే మరీ నీరసపడిపోయేడు. రెండ్రోజుల్నించీ అక్కడ్నుంచి ఫోన్ లు వస్తున్నాయి. పనివత్తిడిలో పడి తను యెత్తటం లేదు. ఇప్పుడు మళ్ళీ చేసేరంటే ఒకవేళ అమ్మ ఆరోగ్యం బాగులేదేమో అనుకుంటూ, “హలో..” అంటూ ఫోన్ యెత్తేడు. 

“హలో..రామంగారాండీ..మీరొకసారి ఆశ్రమానికి రావాలండీ..”

“ఎందుకు!” జవాబు యేమొస్తుందోననే ఉత్కంఠతో నెమ్మదిగా అడిగేడు రామం.

“మీ అమ్మగారు జానకమ్మగారు రెండ్రోజుల్నించి యేమీ తినటం లేదండీ. మీరొస్తే కానీ యేమీ తిననంటున్నారు. ఎంత నచ్చచెప్పినా వినిపించుకోటంలేదు.”

ఖర్మ.. ఈ ముసల్దానికి పంతాలూ, పట్టుదలలూ కూడానూ అనుకుంటూ, “ఆవిడ ఆరోగ్యం యెలా వుందీ!” అనడిగేడు.

“మీకు తెలీనిదేవుందండీ.. వయసు మీద పడడం వల్ల ఆవిడ తినడం తగ్గిపోయింది. అందులో రెండ్రోజుల్నించీ మీరు రావాలని పట్టు పట్టుక్కూర్చున్నారేమో అసలేవీ ముట్టుకోడంలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు తియ్యటంలేదు. యేం చెయ్యాలో మాకు తోచటం లేదు. థాంక్ గాడ్.. ఇప్పుడైనా ఎత్తేరు..” ఆ గొంతులో రిలీఫ్ వినిపించింది రామానికి. 

 “నేనెందుకు రావడం.. నెల నెలా డబ్బులు కడుతున్నాను కదా.. ఆమాత్రం ఆవిడ అన్నం తినేలా చూడలేరా!” తనపైబడ్ద విసుగునంతా వాళ్ల మీద చూపించేడు రామం. 

 “అదికాదండీ.. మొన్న మీ పుట్టినరోజుట. మీకోసం దేవుడికి పూజ చేసేరుట. ఆ ప్రసాదం మీకు పెట్టి, మిమ్మల్ని ఆవిడ ఆశీర్వదించాలిట. అప్పుడు కానీ మెతుకు ముట్టనని కూర్చున్నారు. అసలే బక్కప్రాణం. ఇలా యేవీ తినకపోవడంతో ఆవిడకి ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేసేయి.”

  విసుగ్గా వింటున్న రామం మనసు ఆశ్రమం వాళ్ళు చెపుతున్నమాటల్లో “కళ్ళల్లో ప్రాణాలు..” అనే మాట దగ్గర ఆగిపోయింది. ఒక్కసారి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఈ మాట ఇప్పుడే యెక్కడో విన్నాడు..  ఎక్కడా.. ఎక్కడా అనుకుంటుంటే ఇందాక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మాట డైరెక్టర్ శ్రీహర్ష అన్నట్టు గుర్తొచ్చింది. అక్కడ ఒక వయసు మళ్ళినావిడ కావాలంటే ఆమెని తీసుకొచ్చింది తనే. కానీ ఇప్పుడావిడ పనికిరాదంటున్నారు. కళ్ళల్లో ప్రాణాలున్న ముసల్ది కావాలిట.. కళ్ళల్లో ప్రాణాలు…కళ్ళల్లో ప్రాణాలు.. ఒకటికి రెండుసార్లు ఆ మాటే మననం చేసుకుంటుంటే ఆశ్రమంవాళ్ళు  తన తల్లి గురించి అదే మాట అనడం యాదృఛ్ఛికమా!..అమ్మ ఈ ముసల్దాని పాత్రకి  సరిపోతుందా! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు రామం. 

 ఒక్కసారిగా రామం ఆలోచనలు అమ్మ రూపురేఖలకీ ముసల్దాని పాత్రకి మధ్యగల పొంతనలవైపు మళ్ళాయి.. నిజవే.. అమ్మ బక్కప్రాణే..దానికితోడు రెండ్రోజుల్నించి తిండి కూడా తినటంలేదుట..ఆశ్రమం వాళ్లన్నట్టు కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చేసుంటాయి. లేచి నడవగలుగుతోందో లేదో.. ఎవరైనా పట్టుకుని నడిపించాలేమో.. ఈ పాత్రకి అమ్మైతే సరిగ్గా సరిపోతుంది. వెంటనే వెళ్ళి అమ్మని మధ్యాహ్నం షూటింగ్ టైమ్ కి తీసుకొచ్చేస్తే డైరెక్టరు అన్నట్టు హీరో ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. డైరెక్టరు హాపీ, నిర్మాత హాపీ. తను హాపీ. అలా జరిగితే సాయంత్రం శేషాద్రి ఖచ్చితంగా తనకి పేమెంట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడో అప్పుడో కనడానికి సిధ్ధం అన్నట్టు ఇంట్లో వుంది కూతురు. ఆ పురిటిఖర్చులకోసమే ఈ నెల అమ్మ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఈ డబ్బులకోసం పని చేస్తున్నాడు. 

    తనకి వచ్చిన ఆలోచనకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రామం. తనకసలు బుధ్ధుందా! ఒక కొడుకు ఆలోచించవలసిన తీరు ఇదేనా!  పుట్టిన్రోజుకి ఆశీర్వదించాలని తిండి కూడా తినకుండా తనకోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న కన్నతల్లిని ఇలా సంపాదించి పెట్టే మనిషిగా అనుకోవడం ఎంత హీనత్వం. ఒక్కసారిగా లేవబోయిన రామం ఈ ఆలోచనతో గభాలున కూలబడ్డాడు. 

“అవునయ్యా ఏకాంబరం. అర్జంటుగా ఓ బక్కచిక్కిన ముసల్ది కావాలి. గంటలోగా స్టూడియోలో వుండాలి. తేగలవా!”

ఎదురుకుండా చెట్టు కింద నిల్చుని ఏకాంబరమనే మరో ఎగస్ట్రాలను తెచ్చే మనిషితో మాట్లాడుతున్నాడు శేషాద్రి మొబైల్ లో. ఆ మాటలు చెవిని పడడంతో ఉలిక్కిపడ్డాడు రామం. ఆ ఏకాంబరం కనక ఏ ముసల్దాన్నైనా తెస్తే ఇంక తనకీవారం  పేమెంటుండదు. కూతురికి ఏ టైమ్ లో పురుడొస్తుందో ఏంటో.. చేతిలో పడ్ద డబ్బులు ఎగిరిపోతున్నట్టనిపించింది రామానికి. ఒక్కసారిగా లేచి శేషాద్రి దగ్గరికి వెళ్ళేడు. 

 “నేను…నేను ఇప్పుడే తీసుకొస్తానండీ..” గబగబా చెప్పేసేడు. 

“ఇప్పటివరకూ తేలేనివాడివి ఇంకిప్పుడేం తెస్తావయ్యా!”

“తెస్తానండీ.. మా అమ్మే వుంది. ఓల్డేజ్ హోమ్ లో. నన్ను చూడాలంటోందని ఇప్పుడే ఫోనొచ్చింది. వెళ్ళి తీసుకొచ్చేస్తాను.”

ఒక్కసారి సాలోచనగా చూసేడు శేషాద్రి రామాన్ని. 

“మీ అమ్మ ఫొటో ఏమైనా వుందా నీదగ్గర..” అడిగేడు.

వెంటనే క్రితం నెల ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళీనప్పుడు తల్లితో కలిసి తీయించుకున్న ఫొటో మొబైల్లో వుంటే తీసి చూపించేడు రామం. ఆ ఫొటోని చాలా పరిశీలనగా చూసేడు శేషాద్రి. 

శేషాద్రిని ఇంకా ఒప్పించేందుకు “రెండ్రోజుల్నించీ నా కోసం చూస్తూ మా అమ్మ మెతుకు ముట్టలేదుటండీ. కళ్ళల్లో ప్రాణాలున్నాయని ఇప్పుడే హోమ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పేరు. మా అమ్మతో కనక హీరో ఈ సీన్ చేస్తే నిజంగానే ఆయన ఇమేజ్ పెరిగిపోతుంది.” అంటూ ఛాన్స్ ఎక్కడ మిస్సయిపోతుందోనని గబగబా చెప్పేసాడు రామం. 

మొబైల్ లో రామం తల్లి ఫొటో చూసిన శేషాద్రి, “ఓసారి డైరెట్రుక్కూడా చూపిద్దాం ఫొటో..” అంటూ అటెళ్ళేడు. వెనకాలే రామం కూడా వెళ్ళేడు. డైరెక్టరు ఫొటోని పరీక్షగా చూసి, “ఊ..సరిపోతుంది. తొందరగా తీసుకురా..” అని చెప్పి, మళ్ళీ అడిగాడు రామాన్ని. “అవునూ, ఇంతకీ మీ అమ్మకి యాక్ట్ చెయ్యడం వొచ్చా!” ఖంగు తిన్నాడు రామం. 

“ఇప్పటివరకూ ఎక్కడా చెయ్యలేదండి..” ఇంక ఛాన్స్ పోయినట్టే అనుకుంటూ, నిజాయితీగా చెప్పేసేడు రామం నీరసంగా. 

  డైరెక్టర్ ఆలోచించేడు. మనిషి బక్కచిక్కి పాత్రకి సరిపోయేట్టే వుంది. కళ్ళు కూడా వయసు వల్ల బాగా లోపలికి పోయి, గాజుకళ్ళలా కనిపిస్తున్నాయి. కానీ నటన రాకపోతే ఎలా అనుకుంటూ, “ఓ పని చెయ్యవోయ్ రామం..” అన్నాడు. అదేమిటో వినడానికి శ్రధ్ధగా ముందుకు వంగాడు రామం. 

“ఈవిణ్ణి తీసుకురావడానికి నువ్వెళ్ళకు. నిన్ను చూడగానే ఆవిడ కళ్ళలో ఆనందం వచ్చేస్తుంది. వేరే ఎవర్నైనా పంపించు. ఇక్కడి కొచ్చేక కూడా నువ్వు వెంటనే కనపడకు. నేను చెప్పినప్పుడు కనిపించి, నేను చెప్పినట్టు చెయ్యి.”

  డైరెక్టర్ చెప్పింది విన్న రామం మొహంలోకి అప్పటిదాకాలేని ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. వెంటనే అక్కడే పనిచేస్తున్న సత్యాన్ని ఓల్డేజ్ హోమ్ కి పంపించి, తను తీసుకురమ్మన్నట్టు చెప్పి, తల్లిని తీసుకురమ్మన్నాడు.  ఆవిడ వచ్చేలోపల శేషాద్రి అక్కడ షాట్ కి కావల్సిన ఏర్పాట్లలో ములిగిపోయేడు. డైరెక్టరు హీరో దగ్గర కూర్చుని ఆ సీన్ గురించి వివరించేడు. 

  అరగంటలో జానకమ్మని తీసుకుని సత్యం వచ్చేసేడు. వణుకుతున్న ఆమె చేతిని పట్టుకుని సత్యం నెమ్మదిగా జానకమ్మని వేన్ లోంచి దింపేడు. వేన్ దిగగానే జానకమ్మ చూపులు కొడుకు రామంకోసం చుట్టూ చూసేయి. ఎక్కడా రామం కనపడకపోవడంతో ఆ కళ్ళలో ఒకవిధమైన నిరాశ కనిపించింది. సత్యం డైరెక్టరు చెప్పినట్టే  ఆమెని సెట్టింగ్ లో వేసిన  ఆ రోడ్డులో పక్కనున్న రాయి మీద కూర్చోబెట్టి పక్కకి తప్పుకున్నాడు. ముందే ఏర్పాటు చేసిన కెమెరాలు జానకమ్మకి తెలీకుండానే ఆమె మీద ఫోకస్ చెయ్యబడ్డాయి. ఎర్రటి ఎండ. కళ్ళలోకి పొడుస్తున్నట్టుగా వున్న సూర్యుడికి చేతులడ్దం పెట్టుకుంటూ కొడుకు కోసం అటూ ఇటూ చూస్తోంది జానకమ్మ. ఆ కళ్ళల్లో కొడుకుకోసం వెతుకులాట, అతనింకా కనిపించలేదన్న ఆరాటం, అలా కనిపించకపోవడం వల్ల వచ్చిన నిరాశ, నిస్పృహవంటి భావాలన్నీ స్పష్టంగా కనిపించాయి.  కెమెరామెన్ ఆ ఫీలింగ్ లన్నీ జూమ్ లో తీసుకున్నాడు. 

 ఆ తీక్షణమైన ఎండని జానకమ్మ అడ్డుపెట్టుకున్న చేతులు ఏమాత్రం ఆపలేకపోతున్నాయి.  అదిచూసిన రామానికి ఒక్కసారిగా వెళ్ళి అమ్మని ఆ ఎండలోంచి ఎత్తుకుని నీడకి తెచ్చేసుకుందామనుకుని లేవబోయాడు. అంతలో పురిటికి పుట్టింటికొచ్చిన కూతురు అతని  కళ్ళముందు కొచ్చింది.

  ఇక్కడ స్పాట్ లో డైరెక్టర్ చెప్పగానే హీరో ఆమె దగ్గరగా వెళ్ళేడు. బేలగా కూర్చున్న ఆమెపై కళ్ళల్లో సానుభూతి కురిపిస్తూ రెండు చేతులతోటీ పైకి లేపబోయేడు. అతన్ని పరీక్షగా చూసింది జానకమ్మ. “మా రామా యేడీ!” అనడిగింది. 

పైకి చూపిస్తూ “అక్కడున్నాడు. మీరు ఆ ఎత్తు ఎక్కలేరు. నేను తీసుకువెడతాను రండమ్మా..” అంటూ జానకమ్మని రెండు చేతులతోటీ ఎత్తుకుని తీసుకువచ్చి, రోడ్డు పక్కనున్న చిన్నహోటల్ ముందున్న బెంచీ మీద కూర్చోబెట్టేడు. 

“మా రామా ఏడీ!” అదేమాట ఆవిడ మళ్ళీ అడిగింది. హీరో పాకహోటల్ లోకి వెళ్ళినట్టు షూట్ చేసారు. 

  అప్పుడే డైరెక్టరు రామానికి సైగ చేసేడు. వెంటనే రామం “అమ్మా..” అంటూ వెళ్ళేడు. 

 జానకమ్మ మొహంలోకి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. గబుక్కున రామం చెయ్యి పట్టుకుని, ఆత్రంగా తడుముతూ “మొన్న నీ పుట్టిన్రోజురా.. గుళ్ళో పూచ్చేయించేను. ఇదిగో ప్రసాదం. నీకిద్దావనే తెచ్చేను. కళ్ళకద్దుకుని తిను. ఆ దేవుడు చల్లగా చూస్తాడు.” అని నీరసంగా అంటూ కొంగుకి కట్టిన చిన్న ముడి విప్పింది. ఆ ముడిలో ఒక చిన్న న్యూస్ పేపర్ కాగితమ్ముక్కలో చుట్టిన చితికిపోయిన లడ్డూలాంటిదాన్ని వణుకుతున్న చేతులతో తీసి రామాని కివ్వబోయింది. 

“అలాగేనమ్మా, ముందు నువ్వు కాస్త అన్నం తిను..” అంటూ కలిపిన పెరుగూ అన్నం తల్లి నోటికి అందించేడు. రామం చేతులు జానకమ్మ నోటిలో అన్నం పెడుతుండడం జూమ్ లో తీసేడు కెమెరామెన్. 

అలా రెండుసార్లు పెట్టాక, జానకమ్మ కళ్ళలోకి కాస్త జీవం వచ్చింది.  దానిని కెమెరాలో బధించేడు కెమెరామెన్. 

“కట్..” అన్నాడు డైరెక్టరు సంతృప్తి నిండిన గొంతుతో. 

డైరెక్టరు కెమెరామెన్ తో ఏదో చెపుతున్నట్టు కనిపించింది రామానికి. షాట్ ఎలా వచ్చిందో ననే కుతూహలంతో పెరుగన్నం వున్న ప్లేటు తల్లి చేతిలో పెట్టి, “తింటూండమ్మా, ఇప్పుడే వస్తానూ..” అని అటెళ్ళేడు రామం. 

“హీరో హోటల్లోంచి అన్నం తెచ్చినట్టూ, ఆ ముసల్దాని పక్కన కూచున్నట్టూ చూపించాలి. హీరో కళ్ళలో ప్రేమా, సానుభూతీ కనిపించాలి. అన్నం పెడుతున్న చేతులు మటుకే రామానివి. ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ అన్నీ హీరోవి.  ఇవిరెండూ కలిపి ఈ సీన్ పండేలా చూడాలి” అంటూ కెమెరామెన్ కి సూచనలిచ్చేడు డైరెక్టరు. 

రామంతోపాటు ఇదంతా వింటున్న శేషాద్రి మొహం కూడా విచ్చుకుంది. రామం భుజం తడుతూ

“ఇంటి కెడుతూ పేమెంట్ తీసికెళ్ళవోయ్ రామం. ఇదివాళ నీకు మీ అమ్మగారిచ్చిన ప్రసాదం అనుకో..” అన్నాడు నవ్వుతూ. 

శేషాద్రి నోట ప్రసాదం అన్న మాట విన్న రామానికి తల్లి తెచ్చిన దేవుడి ప్రసాదం గుర్తొచ్చి అటు పరిగెత్తేడు. 

   ఒక్క ఉదుటున తల్లి దగ్గరికి వెళ్ళి “ఏదమ్మా, ప్రసాదం పెట్టూ..” అంటూ చెయ్యి చాచిన అతనికి తల్లిలో ఏదో తేడా కనిపించింది. “అమ్మా.. అమ్మా.. “ అంటూ గట్టిగా పిలుస్తూ తల్లిని పట్టుకున్న అతని చేతుల్లో నిర్జీవంగా వాలిపోయింది జానకమ్మ. ఆమె చేతిలోని చిదిమేసినట్టున్న లడ్డూ పాత న్యూస్ పేపరుముక్కతో సహా నేలపాలయింది. అప్పటివరకూ కొడుకుకి దేవుని ప్రసాదం పెట్టడానికే ఉగ్గబట్టుకుని కళ్ళల్లో ప్రాణాలుంచుకున్న ఆ తల్లి కళ్ళల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయేయి. ఏ కళ్ళల్లో ప్రాణాలకోసమైతే కొడుకు ఆమెని తీసుకొచ్చేడో జానకమ్మ కళ్ళల్లో ఇప్పుడా ప్రాణాలే లేకుండాపోయేయి.

****

ఆర్ట్: జావేద్

Please follow and like us:

10 thoughts on “కళ్ళల్లో ప్రాణాలు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)”

  1. ఇటువంటి సంఘటనలు నేనూ కొన్ని చూసానుప్రత్యక్షంగా . విన్నాను పరోక్షంగా. ఇటువంటి వాటికి నా స్పందన ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.. బాధ, నైరాశ్యం. ఇంత చక్కగా ఈ కధలో తల్లి ఆత్రుత చెప్పారు.. కొడుకు స్వార్ధం … తల్లి పట్ల అలసత్వం కూడా అంతే గొప్పగా పండించారు. ఇటువంటి కధానికలు ఎన్ని చదివినా ఇదో అంతులేని వలయం అండీ.. మనిషికి స్వతహాగా తల్లితండ్రుల పట్ల ప్రేమ దయ జాలిఉండాలి.. వేరు దారి లేదు.. అద్భుతంగా ఉంది మీ రచన లక్ష్మి గారు.

    1. మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు ఉమాభారతి గారూ.

  2. పిండేశారు అక్కా… ఇందులో కొడుకుగా రామం పాత్రలో తప్పు ఉన్నా.. మళ్ళీ తండ్రిగా కూతురి గురించి ఆవేదన ఉంది. ఏదైనా కథ వ్రాయడం లో మీకు మీరే సాటి…. అభినందనలు అక్కా!

  3. పరిస్థితులు మనిషిని ఎంత బలహీనులని చేస్తాయో ఈ కథ చదివితే తెలుస్తోంది.చాలా బాగా రాసారు సుబ్బలక్ష్మి గారు.ఆవిడ రచనలన్నీ మన చుట్టూ జరిగే సంగతులతో ముడివడి ,మనసుకి దగ్గరగా ఉంటాయి.

    1. కథ నచ్చినందుకు ధన్యవాదాలు కామేశ్వరిగారూ..

  4. చాలా హృదయవిదారకంగా ఉంది. కొడుకును పాపం అనాలో, తల్లిని పాపం అనాలో.

    1. అవునండీ.. ఎవరినీ తప్పు పట్టలేని పరిస్థితి..

  5. ఏడిపించారు కదమ్మా 😑 ఎంత హృదయవిదారకంగా ఉందీ కథ. నాకు మాటలు కరువయ్యాయి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి.. అన్నట్టు, ఇటువంటి కుపుత్రులను చూస్తుంటే మనసు రగిలిపోతోంది. తమ రక్తాన్ని ధారపోసి పిల్లల్ని కంటారు. కానీ అదే పిల్లలు రాక్తాశ్రువులకు కారణమౌతున్నారు.

    1. మీ బాధలో అర్ధముందండీ కిరణ్ గారూ.. కథ నచ్చినందుకు ధన్యవాదాలండీ..

Leave a Reply to G.S.lakshmi Cancel reply

Your email address will not be published.