గోడమీద అడవి

-దేవనపల్లి వీణావాణి

అటవీ శాఖ పనుల తనిఖీ కోసం ఈ రోజు మా బృందం ఏటూరునాగారం నుంచి గోదావరి నదికి కింది వైపు ఉన్న అడవికి వెళ్లాం. దారిలో చిన్న చిన్న గ్రామాలు. గోదావరి నదికి ఆనుకొని ఉన్న  గూడాలను 1986 ప్రాంతంలో వచ్చిన వరదల కారణంగా నదికి దూరంగా అడవిలో నివాసం కల్పించినందు వల్ల  ఈ గ్రామాలు ఏర్పడ్డాయి.  గత ముప్పై ఏళ్లుగా అడవిలో దొరికే మట్టి కర్రలను ఉపయోగించి కట్టుకున్న కుటీరాలే వారి నివాసాలు. అడవికి, వారి ఇళ్ళకి హద్దులు నిర్ణయించడం అత్యంత క్లిష్టమైన పని.  
ఏటూరు వేరే నాగారం వేరే.రెండూ వేరు వేరు ఊర్లు. నాగారం పేరుతో రెండు మూడు ఊర్లు ఉండడం తో  ఏటూరునాగారం అన్న పేరు స్థిరపడింది.
 
ఎప్పుడైనా ఏటూరునుంచి అడవిపైపు  వెళితే ఈ చిన్న చిన్న అడవిగ్రామాలు ప్రపంచంతో అవసరం లేకుండా , రాకుండా బతుకుతున్నాయని ఇట్టే తెలుసుకుంటాం. ఆవులు, గొర్రెలు ఎక్కువ. గేదెలు తక్కువ .  ఆల మందలు వాటి పాటికి అవి తిరిగినా అన్నింటినీ కలిపి   ఉంచే దడీ కుటీరాలకు అదనంగా కనిపిస్తాయి.    ఒక్కొక్కరికి వందల సంఖ్యలో ఆవులు ఉన్నా వాటి నుంచి పాలు తీయరు.అందుకే పాలు, నెయ్యి దొరకవు. ఇక్కడి ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడం ఒక కొత్త  ఉత్సాహం అని అనుకుంటాను. మూడొందల కిలోమీటర్ల  భౌతిక దూరంలోనే రెండు భిన్న ప్రపంచాలు.. మరి వాటి మధ్య పెరిగిన దూరం..? 
ఆ దూరాన్ని కొలుచుకోవడం లో నాకు కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి.వాటిని ఇలా రాయకపోతే అదృశ్యం అయిపోతాయని నాకు బెంగ. అందులో ఒకటి ఈరోజు చూసిన గోడమీద అడవి. 
 

ఆమె  పేరు    బానక్క. బుట్టాయి  గూూడెం లో  చిన్న మట్టి     ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. నిన్న  కొన్ని పనుల తనిఖీ కొరకు వెళ్ళినప్పుడు అందంగా ముగ్గులు వేసిన మట్టిగోడలు నన్నెంతో ఆకర్షించాయి. ఈ ప్రాంతం అంతా కూడా పొరక తో గోడలు కట్టి నల్ల మట్టి గానీ ఎర్రమట్టి గానీ  పెండతో కలిపి పూత పెట్టి గోడలాగా చేస్తారు. పైకప్పు వాసాలు ఉంటాయి. పలుచని మట్టి పైన గూన పెంకలు పేర్చి కట్టుకున్న ఇంటికి కర్రలతో ప్రహరీ కడతారు. కర్రలతోనే గేటు కూడా ఉంటుంది. గేటు కి కూడా చక్కని అలంకరణ, ముగ్గులు పెడతారు. ఒక్కో ఇంటికి ఒక్కో అలంకరణ. పొద్దున్నే కనుక వెళ్తే అప్పుడే అలుకు జల్లిన వాకిట్లు, పసుపు కుంకుముతో పూదిచ్చిన గడపలు, వాకిట్లో ముగ్గులతో ఎంతో అందంగా కనిపిస్తాయి.  అయితే గోడలమీద మాత్రం సంవత్సరానికి ఒకసారి ఇలా మట్టి , పెండ పూత తర్వాత సున్నం గీతలు పెడతారు.  నేను చాలా సార్లు అవి ఎలా పెడతారు అని తెలుసుకోవాలని అనుకున్నాను.కానీ కుదరలేదు.నిన్న మాత్రం బానక్క ఇంటిగోడలు నన్ను వాళ్ల ఇంటిముందు ఆగేలా చేసాయి. వెంటనే ఆమె కలిసి అభినందించి వివరాలు తెలుకున్నాను. బానక్క ఇంటిలో లోపల కూడా అందమైన ముగ్గులు.. అవి వారానికి ఒక సారి వేస్తుందట.ఆ చిన్న ఇంట్లో లోపల భవాని అమ్మవారికి ఒక గది కేటాయించిన లోగిలి వారిది.

గోడమీద ముగ్గు ప్రత్యేకత ఏమిటంటే అది చేతి వేళ్ళని సున్నంలో ముంచి విసరడం. వాటింజ్5 కఱ్ఱలేయడం , గోటీశలు అంటారు. ఆ డిసైన్ చెట్టు అట. ముందు చెట్లన్నీ వేసి మధ్యలో బొట్లు పెట్టిందట.బొట్లు పెట్టడం లో.ఒక్కొక్క రిది ఒక్కో విధానం. వారి సృజనాత్మకత. ఇంటికి చుట్టూరా ఉన్న కర్రల ప్రహరీ కి కర్రలతో నే కట్టిన పెద్ద దర్వాజ.  దానికీ అలుకు పూతలు. అక్కడా ఎంతో వైవిధ్యమైన అలంకరణ.    నిత్యం అడవిలో ఉండి మళ్ళా అడవినే తమ ఇళ్ళమీద కూడా అలంకరించుకోవడం చూసినేనెంతో ఆశ్చర్యపోయాను..పరిపూర్ణ ప్రాకృతిక జీవన ప్రతీకగా నాకు బానక్క కనిపించింది.  ఇంకా నాగరికత  కాలుష్యం పట్టని  సజీవ భారత సంస్కృతి అనిపించింది.
 
 కొన్ని దశాబ్దాల కింద వరకూ నా పూర్వీకులు కూడా ఇలాగే ఉండి ఉండవచ్చు. నా తల్లిదండ్రుల తరమో , తాతల తరమో వారి పూర్వీకులు శతాబ్దాలుగా వెంట నడిపించిన సాంస్కృతిక ధారని గమనించకుండానో , భద్రపరచకుండానో ఒక్కొక్కటిగా వదిలేసుకున్న జీవన వివరాలు ఇక నాకు ఎప్పటికీ తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు. 
ఇక్కడ కూడా కొన్నాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. పరిస్థితులు మారతాయి. బానక్క మరికొంత కాలానికి సిమెంటు ఇల్లు కట్టుకుటుంది. మరింత భద్రమైన జీవితం గడుపుతుంది. మంచిదే.అలా జరగాలి కూడా . కాకపోతే జనసమూహాల మధ్య సాంస్కృతిక జీవన వైవిధ్యం మాసిపోయి నాగరికత మాటున జీవన ఏకత్వానికి మారుతున్న ఈ సంధి కాలంలో , సాంస్కృతిక వైవిధ్యాన్ని భద్రపర్చుకోవాల్సిన బాధ్యత    ఈ తరమైనా చేయాల్సిఉందనిపించింది. ఇంతకు ముందు ఇటువంటి పని ఏ విశ్వ విద్యాలయాలైన తలకెత్తుకున్నాయో లేదో తెలియదు. నేను మాత్రం బానక్క గోడమీద అడవిని కొన్ని ఛాయాచిత్రాలుగా మాత్రం   మార్చుకున్నాను. ఆమె దిద్దిన అందమైన గడప ఆదిగా ఈ పని కొంసాగిచాలని నిర్ణయించుకున్నాను.అతి త్వరలో అదృశ్యం కాబోతున్న ప్రాచీన నాగరికతను ఇలా భద్రపరుస్తున్నాను.

*****

Please follow and like us:

2 thoughts on “గోడమీద అడవి”

  1. వీణావాణి గారి గోడమీద అడవి… మా నానమ్మ వాళ్ళ ఊరిని, ఆ ఇంటిని గుర్తు చేసింది. రచయిత్రి ఆలోచనలకి ‘hats off’. అదృశ్యం కాగల ప్రాచీన నాగరికతను ఇలా భద్రపరచాలన్న ఆసక్తి ఉండడమంటేనే అరుదైన విషయం… భానక్క ‘కుటీరం’ అనవచ్చేమో…. కళ్ళకు కట్టినట్టుగా వివరించారు.. మా నానమ్మ వాళ్ళది ఎర్రగుంట పాలెం.. నేను చూసాను అక్కడ ఇంచుమించు ఇలాగే ఉండేవి కొన్ని ఇళ్ళు.. నేను కాస్త పెద్దయ్యేప్పటికీ .. మా నాన్నగారే ఆ మట్టిఇంటి స్థానంలో ఇల్లు కట్టించారు. సెప్టిక్ ట్యాంక్ పెట్టించి ఇటుకలతో ప్రహరీ కట్టించారు.

    ‘పరిపూర్ణ ప్రాకృతిక జీవన ప్రతీకగా నాకు బానక్క కనిపించింది. ఇంకా నాగరికత కాలుష్యం పట్టని సజీవ భారత సంస్కృతి అనిపించింది.’ అన్న వాక్యాలు .. ఎంతో ఫీలింగ్ తో రాశారు.. నచ్చింది. శుభాకాంక్షలు.. కొన్ని చిత్రాలు కూడా పెట్టిఉన్నట్టయితే బాగుండేది…

    ఉమాభారతి

Leave a Reply to Uma Bharathi Cancel reply

Your email address will not be published.