
స్నేహహస్తం
-డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం
ఎన్నుకున్నావో ? ఎదురొచ్చానో!
శూన్యం నిండిన నా ఎదలోనికి
సంపెంగల తావివై తరలివచ్చావు
స్నేహ సుగంధమై పరిమళించావు.
మమత కరువై బీటలు వారిన
నా మనసుపై ప్రేమ జల్లువై కురిసావు
ముద్ద ముద్దలో మమకారం రంగరించి
మధువు తాపి మాలిమి చేసుకున్నావు
ఆకాంక్షల కౌగిలివై కమ్ముకున్నావు
వ్యామోహపు మత్తువై హత్తుకున్నావు
నీ ఆలింగనంలో మైమరచిన నన్ను
నిస్సంకోచంగా నెట్టివేసావెందుకు?
నీవు నేను మమేకమనుకున్నా
నా గుండె ఆలాపన వింటున్నావనుకున్నా
నీ నీడ దాటి అడుగేసానని అలిగావా?
నీ గరిమను గారవించలేదని కినిసావా?
అల్లుకున్న చెలిమి తీవెలు తెంచేసావెందుకు?
అవ్యక్తమైన నా ప్రేమ నీ తనివి తీర్చలేదా?
కాలంలో నీ జాడలు కరిగిపోక ముందే
కలుప గలవా నేస్తం మరోసారి నీ స్నేహహస్తం
****

పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం ) చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు. వుద్యోగం: ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ రచనలు: కథలు:- 1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పత్రికలలో నవలలు 4 ( ఆంధ్రప్రభ, స్వాతి మాస పత్రికలలో) కథాసంకలనాలు:- 1.ఆశలమెట్లు 2.కలవరమాయె మదిలో,3.వెన్నెలదీపాలు,4.మంగమ్మగారి అమెరికా కథలు,5.మనసు పరిమళం,6.ఏదేశమేగినా,7.జగమంతకుటుంబం. ఇంకా:- కవితలు, ఆంగ్లకథలు, ఆంగ్ల సాహిత్య వ్యాసాలు ప్రచురితం. ఆకాశవాణిలో పలు ప్రసంగాలు. ప్రశంశలు:జ్యోతి, ఆంధ్రభూమి, రచన పత్రికలలో నా కథలు బహుమతి పొందాయి 1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండీ ఉత్తమ అధ్యాపకురాలి ” పురస్కారం ఈ సంవత్సరం అమెరికా తెలుగు కథానికలో నా కథ ప్రచురితం. తెలుగు కథ శతజయంతి కథా సంకలనం “ నూరు కథలు- నూరుగురు కథకులు” లో నా కథ చోటుచేసుకుంది .ఇంకా పలు కథానికా సంకలనాలలో నా కథలు ప్రచురితం.
