
చిత్రం-26
-గణేశ్వరరావు
ఆస్ట్రేలియా లో ఉన్న క్యురేటర్ వసంతరావు ‘వసంతఋతువు’ మీద ఒక online చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసారు. అందులో పసుపులేటి గీత చిత్రానికి ఒక స్థానం కల్పించారు, అంతే కాదు, ఆమెనూ, ఆమె చిత్ర రచనని అద్భుతంగా పరిచయం చేసారు. వారి వ్యాఖ్యలు – తిరుగులేని తీర్పు లాటివి.పసుపులేటి గీత బహుముఖ ప్రజ్ఞావంతురాలు – పాత్రికేయురాలు, కవయిత్రి, చిత్రకారిణి..’వస్తువు’ కు చిత్రకారిణి గీత ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఆమె చిత్రంలో – ‘తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి…వసంత నాట్యమే హాయ్ హాయ్’ అంటూ నృత్యభంగిమలో ముచ్చటగా కనిపిస్తున్న మూడు నందులు ఉన్నాయి. అసలు ‘నంది’ అంటే అర్థం ‘ఆనందాన్ని’ ఇచ్చేది, శివుని వాహనంగా అది పూజనీయం అయింది . నూతనమైన విచిత్ర ఆకృతుల్లో ఆ మూడిటిని వయ్యారంగా అందంగా ఆమె చిత్రించింది. అవి ఈశ్వరుని శక్తికీ చైతన్యానికీ ప్రతీకలు. వాస్తవంలో చిత్రకారిణి గీతకు జంతువుల పట్ల ఉన్న ఆప్యాయతకూ , అనురాగానికి కూడా అవి నిదర్శనం. కొమ్ములు త్రిశూలం ను గుర్తు చేస్తాయి. రేఖలూ, వృత్తాలూ చిలుకలుగా మనకు గోచరిస్తాయి. . రూపాలు ఆమె కల్పనా జగత్తులో నేల మీద నిలవక, రెక్కలు కట్టుకొని నింగిలోకి ఎగిరి పోతున్నట్టు కనిపిస్తున్నాయి. రూపాలు రంగులలోకి మారి చిత్రం మొత్రం ఒక వర్ణ కవనం అయింది. గీత చిత్రంలో ‘వాస్తవికత’ ఉందా? లేక ‘ఆధునికత’ ఉందా? నిజానికి ఈ చిత్రం tradition and modernity కి ఉదాహరణ! .. వాస్తవికత/ఆధునికత పేరు మీద పొలాల్లో, మావిడి తోటల్లో రవికెలు లేని పల్లె పడుచులు, అందమైన ఆవు దూడలూ.. pastoral beauty ..లు .లేవు. భారతీయ సంప్రదాయ చిత్రకళా పధ్ధతిలో తాత్వికత, ఆధ్యాత్మికత రీతులు కలగలిసిపోయాయి. అవి చూపరుల మనస్సులలో ప్రశాంతతను నింపుతున్నాయి. . రంగుల ఎంపికతో ఆకారాలకు కొత్త రూపు వచ్చి ఏదో మాయాజాలం చూపరులను కట్టిపడేస్తోంది. దాన్ని నిర్వచించగలమా!
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
