
జీవితం ఒక పుస్తకమైతే
– డా . సి. భవానీదేవి
జీవితం ఒక పుస్తకమైతే
జరగబోయేవి ఇప్పుడే చదివేసేదాన్ని
ఏది నన్ను చేరుకుంటుందో
మనసు దేనిని కోల్పోతుందో
కొన్ని స్వప్నాలనైనా ఎప్పుడు నిజం చేసుకుంటానో
గాయాల చెట్టునయి ఎప్పుడు కూలిపోతానో
జీవితం ఒక పుస్తకమైతే …..
చదువుతుంటే తెలిసిపోయేది!
ఏడిపించిన జ్ఞాపకాలను చింపేసేదాన్ని
మురిపించిన అనుభవాలను దాచుకునేదాన్ని
మధురమైన సందర్భాలకు
మరిన్ని పేజీలను చేర్చుకునేదాన్ని
చివరి పేజీ చదివేటప్పటికి
గెలుపు ఓటముల లెక్క అర్ధమయ్యేది
ముళ్ళకంపలమధ్య మల్లెపూల విలువ తెలిసేది
నిజంగానే .. ..
జీవితం ఒక పుస్తకంగా నాచేతికి వస్తే
కాలచక్రాన్ని వెనక్కి నడపాలని
విరిగిపడిన అలల కలల్ని
ఆశల నురగలతో అంటించాలని !!
****

డా||సి.భవానీదేవి నివాసం హైదరాబాదు. ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందారు. కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన అన్ని ప్రక్రియలలో రచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉప కార్యదర్శి. 12 కవితా సంపుటులు, వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించారు. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి.

జీవితమొక పుస్తకమంటు నిత్యము జీవనములో జరిగే సంఘటనలు మధుర జ్ఞాపకాలు అధ్భుతంగా విశ్లేషించారు
జీవితంలో జరిగే సంఘటనలను మీ కవిత తో తెలియపరిచారు ..
భవాని దేవి గారు మీ కవిత చాల బాగుంది …