
నా పల్లె లోకం లో …
– గవిడి శ్రీనివాస్
వేలాడే ఇరుకు గదుల నుంచీ
రెపరెపలాడే చల్లని గాలిలోకి
ఈ ప్రయాణం ఉరికింది .
ఔరా |
ఈ వేసవి తోటల చూపులు
ఊపిరి వాకిలిని శుభ్ర పరుస్తున్నాయి .
కాలం రెప్పల కిలకిలల్లో
ఎంచక్కా పల్లె మారింది.
నిశ్శబ్ద మౌన ప్రపంచం లో
రూపు రేఖలు కొత్త చిగురులు తొడిగాయి .
పండిన పంటలు
దారెంట పలకరిస్తున్నాయి .
జొన్న కంకులు ఎత్తుతూ కొందరు
ఆవులకు గడ్డిపెడుతూ కొందరు
మామిడి తోట కాస్తూ కొందరు
ఇక్కడ చిరు నవ్వుల తోటను చూసాను .
కాసింత పల్లె గాలికి వికశించాను
ప్రయాణాలు ఎన్ని చేసినా
దూరాలు ఎన్ని మారినా
చెదరని స్వప్నంలా నా పల్లె నిలిచింది.
ఇంటిలో కూచుంటే చాలు
చుట్టూ కాకుల కూతలు
పిచ్చుకల కిచకిచలు
ఆప్యాంగా వాలుతుంటాయి.
తడితడిగా మనసుని కుదుపుతుంటాయి .
పల్లె తాకిన ప్రపంచం లో
మరో కొత్త అనుభవం పరచుకుంటుంది .
ఈ చల్లని పల్లె గాలుల్లో తడిస్తే చాలు
కోల్పోయినవి అనుభూతి చెందుతున్నట్లు ఉంటుంది .
****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
