
ప్రతిఫలం
-ఆదూరి హైమావతి
అనగా అనగా ఒక అడవిప్రాంతంలో ఒక వేపచెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుని నివసించేది. దానికి రెండుపిల్లలు . వాటికి బయటి నుండీ తిండి తెచ్చిపెడుతూ ఉండేది. కాస్త పెద్దవి అవుతుండగా , ‘అమ్మఒడి ప్రధమబడి’ కదా!అందుకని తనపిల్లలకు బుధ్ధి మాటలు చెప్పేది.
“బలవంతులతో విరోధం పెట్టుకోకండి. మనస్థాయికి తగినవారితో స్నేహం చేయండి. మనకడుపు నింపే విత్తనాల మొక్కలపట్ల కృతజ్ఞత తో ఉండండి. ఎవరికీ హానిచేయకండి. ఐకమత్యమే మహా బలం అని మరువకండి. కలసి మెలసి ఉండండి, మీరు తిన్న ఏ విత్తనాన్నైనా రెండు గింజలను వేరే ప్రదేశంలో వదలండి. అవి మొక్కలై మనజాతికేకాక , ఇంకా చాలా మన జాతి పిట్టలకు తిండి నిస్తాయి” ఇలా అనేక మంచి మాటలు చెప్పేది.
పిల్లలు తల్లి మాటలను బాగా గుర్తుంచుకున్నాయి.
అవికాస్త పెద్దవి కాగానే తమ తిండి తామే సంపాదించుకుంటూ ఎగిరి వెళ్ళిపోయాయి .ఒక రోజున అవి తియ్యని వేప పండ్లు తింటూ అమ్మ మాట గుర్తు వచ్చి చెరో విత్తనాన్నీ పట్టుకుని వెళ్ళి దూరంగా వదిలాయి.
వానా కాలం వచ్చింది. ఆవిత్తనాలు మొక్కలుగా మొలిచి క్రమేపీ పెద్ద మొక్కలై , కాలక్రమాన వేప మానులుగా పెరిగాయి. రెండు మొక్కలూ పక్క పక్కనే మొలవటాన రెండూ కలసి పెద్ద మానుగా కలసిపోయాయి.
ఒకరోజున వానాకాలాన రెండు పిచ్చుకలు వానలో తడిసి ఆవేప వృక్షాల క్రిందకు చేరి ,రెక్కలు ఆర్చుకుంటుండగా చూసిన వేపమాను ” పిచ్చుకలారా! మీజాతి తాత ముత్తాతలు విత్తనాలు వేసి మాకు జీవ మిచ్చాయి. మేము రెండు వృక్షాలమూ కలసి పెరగటాన మా కొమ్మలు రాచుకుని మధ్య ఒక చిన్న తొర్ర ఏర్పడింది.మీరా తొర్రలో నివాసం ఉండవచ్చు. మీ జాతి పిట్టల వలన పెరిగిన మేము మీకు నివాసం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తాము. ” అనిచెప్పగా వానలో తడిసి నివాసం లేని ఆరెండు పిచ్చుకలూ , వేప మానుకు ధన్యవాదాలు చెప్పు కుని, తమ తాతముత్తాతలు చేసిన మంచి పనికి వారికీ ధన్యవాదాలు చెప్పుకుని , వారిలాగే తామూ తప్పక అలా చేయాలని అనుకుంటూ ఆ చెట్టు తోర్రలో నివాసం ఏర్పర్చుకుని హాయిగా జీవించాయి.
అదన్నమాట పిల్లలూ! మనం ఎవరి వలననైనా సాయం పొంది నపుడు ,అమ్మచెప్పిన మాట గుర్తుంచుకున్న ‘ఈ పిచ్చుకల్లా ,చిన్న సాయం చేస్తే తిరిగి అది మన జాతికి తప్పక ప్రతిఫలంగా అందు తుందని ‘మర్చిపోకండేం.
*****

నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.
