అనుసృజన

ధ్రువస్వామిని- 4

హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్

అనువాదం: ఆర్. శాంత సుందరి

(శకదుర్గం లోపల ఒక పెద్ద గది.అక్కడ మూడు ఆసనాలు ఉన్నాయి.ఒకదాని మీద ధ్రువస్వామిని కూర్చుంది.ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకుని పెదవులమీద వేలు ఉంచుకుని ఏదో విచారంలో మునిగినట్టు కనబడుతోంది.మిగిలిన రెండు ఆసనాలు ఖాళీగా ఉన్నాయి.ఇంతలో బయట కోలాహలం వినిపిస్తుంది)
 
సైనికుడు ః ( ప్రవేశించి ) మహారాణి వారికి జయము !
ధ్రువస్వామిని ః ( ఉలిక్కిపడి) ఆఁ?
సైనికుడు ః విజయం గురించి విని రాజాధిరాజుల వారు కూడా దుర్గానికి ఏతెంచారు.ప్రస్తుతం వారు సైనికులతో మాట్లాడుతున్నారు.మహారాణి ఎక్కడున్నారని అడుగుతున్నారు.మీ ఆజ్ఞ అయితే…యువరాజు వారు ఏమన్నారంటే…
ధ్రువస్వామినిః ఏమన్నారు? నా అనుజ్ఞ తీసుకున్నాకే రాజుగారు ఇక్కడికి రాగలరని అన్నారు కదూ?సరే, ప్రస్తుతం నాకు చాలా అలసటగా ఉంది(సైనికుడు వెళ్ళిపోబోతూ ఉంటే అతన్ని ఆపి) ఇదిగో , కుమార్ గాయాలు నయమయాయో లేదో నువ్వు చెప్పనే లేదు ,ఇప్పుడెలా ఉన్నారు?
సైనికుడు ః గాయాలు మరీ అంత పెద్దవేమీ కాదు మహారాణీ! గాయాలకి కట్లు కట్టారు. ఆయన మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ధ్రువస్వామిని ః సరే వెళ్ళు.(సైనికుడు నిష్క్రమిస్తాడు)
మందాకిని ః (హఠాత్తుగా ప్రవేశించి)వదినా!
అభినందనలు
 
!(తప్పు చేసినట్టు) కాదు, కాదు, క్షమించండి మహారాణీ !
ధ్రువస్వామిని ః మందా, పొరపాటునే అయినా నువ్వివాళ చాలా అందమైన మాటన్నావు.దాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నావా? ఓహ్, అదే నిజమైతే!
(పురోహితుడు ప్రవేశిస్తాడు)
మందాకిని ః అందులో సందేహమేముంది?
ధ్రువస్వామిని ః నాకు ఇందులో సందేహమే కాదు, ఇంద్రజాలం కూడా కనిపిస్తోంది.నేను మహారాణినీ కాను, నీ వదిననీ కాను ( పురోహితుణ్ణి చూసి మౌనంగా ఉండిపోతుంది)
పురోహితుడు ః (ఆశ్చర్యంగా అటూ ఇటూ చూస్తూ) అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి?
మందాకిని ః మీరేమైనా చెప్పేందుకు వచ్చారా?
పురోహితుడు ః ఇలాంటి ఉపద్రవాలు ముంచుకు వచ్చినప్పుడు శాంతి చెయ్యాల్సి ఉంటుంది.అది చెయ్యాలనే వచ్చాను.కానీ మీరేమో మహారాణిని కాదంటున్నారు మరి !
ధ్రువస్వామిని ః ( తీక్ష్ణ ణంగా పలుకుతూ) అయ్యా, పురోహితులవారూ ! నాకు రాజకీయాలు తెలియవు.కానీ ఒక విషయమైతే తెలుసు, శత్రు రాజు దగ్గరకి కానుకగా పంపిన మహారాణి, పట్టపురాణి అనే ఉన్నతమైన పదవిని కోల్పోతుంది.
మందాకిని ః కానీ మీరు వదిన అనిపించుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు .
ధ్రువస్వామిని ః నీకు నన్ను అలా పిలవాలని మరీ ఉబలాటంగా ఉంటే పిలు.ఈ పురోహితులే ఆనాడు కొన్ని మంత్రాలు చదివారు.కానీ ఆనాటినుంచీ నాకు మహారాజుతో ప్రేమగా మాట్లాడే అవకాశమే చిక్కలేదు.నేనేం నేరం చేశానని నామీద అనుమానంతో నన్ను బహిష్కరించారో గాని, అప్పుడు నేను ఒక స్త్రీగా నా హక్కుని పరిరక్షించమని బతిమాలాను.అదీ నాకు దొరకలేదు. బలిపశువుగా , ఏమాత్రం దయ లేకుండా శకదుర్గానికి పంపించి వేశారు. అయినా నువ్వు నన్ను వదినా అనే పిలవాలనుకుంటున్నావా?
మందాకిని ః (తల వంచుకుని) ఇది చాలా గర్హించదగిన, బాధాకరమైన విషయం.
పురోహితుడు ః ఏమిటి మీరనేది? వీరాంగన లాగా అమితమైన సాహసంతో, మహాదేవి ఈ దుర్గాన్ని తమ వశం చేసుకున్నారు అని విని చాలా సంతోషించాను.
ధ్రువస్వామిని ః మీరు అబద్ధమాడుతున్నారు.
పురోహితుడు ః (ఆశ్చర్యపోతూ) నేను అసత్యమాడటమా?
ధ్రువస్వామిని ః అవును , మీరే. మీరు అబద్ధమాడటమే కాదు అసలు మీరే ఒక మిథ్య!
పురోహితుడు ః (నవ్వి) మీరు చెప్పేది వేదాంతమా? అలాగయితే ఈ లోకమే ఒక మిథ్య !
ధ్రువస్వామిని ః (కోపంగా) లోకం మిథ్యో కాదో నాకు తెలీదు, కానీ ఎప్పుడూ యౌవనంలో ఉన్న అందమైన స్త్రీలకి దుఃస్థితి కలిగించే మీ ఆచారాలూ శాస్త్రాలూ నిజమా?
పురోహితుడు ః (మందాకినితో) అమ్మా! నువ్వే చెప్పు, ఇది నా భ్రమా లేక నిజంగానే మహాదేవి కోపంగా ఉన్నారా?
ధ్రువస్వామిని ః కోపం, అవును కోపంతో రగిలి పోతున్నాను .ఇంత పెద్ద అపహాస్యమా ! ధర్మం పేరిట స్త్రీ ఆజ్ఞకి బధ్ధురాలై ఉంటుందో లేదో అని తెలుసుకునేందుకు ఇలాంటి పైశాచిక మైన పరీక్షా? అందుకు నన్ను బలవంతపెట్టటమా? నువ్వు పౌరోహిత్యం వహించి నాకు జరిపించిన రాక్షస వివాహం తాలూకు ఉత్సవం ఎంత బావుందో చూశావా? ఈ నర సంహారం చూడు,అవతల ఆ గదిలో శకరాజు శవం రక్తసిక్తమై పడి ఉంది. ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారో! ఈ రక్తధారలో తేలుతూ నేను రాక్షసిలా ఇంకా జీవించే ఉన్నా.నీ శాంతి మంత్రం నాకు శాంతిని ప్రసాదిస్తుందా?
మందాకిని ః అయ్యా, మాట్లాడరేం? మీరే కదా ధర్మ సూత్రాలని నియమిస్తారు? ధర్మం అనే బంధంతో కట్టివేసి స్త్రీల హక్కులన్నీఎవరైనా లాగేసుకుంటే , ఆ స్త్రీకి అటువంటి ఆపత్సమయంలో ఏదో ఒక ఆధారం చూపించేందుకు మీ ధర్మ సూత్రాలలో మార్గమే లేదా?
పురోహితుడు ః స్త్రీ పురుషులు పరస్పరం విశ్వాసం కలిగి ఉండి తమ హక్కులను రక్షించుకునేందుకు ఒకరికొకరు సహాయపడుతూ జీవించటమే కదా వివాహమంటే?అలా కానప్పుడు ధర్మమూ, వివాహం కూడా కేవలం ఒక నాటకమే.
ధ్రువస్వామిని ః నాటకమో కాదో,కానీ ఒక పిరికివాడైన భర్త భార్యని వదిలివేస్తే ఆమెకి ఇక మృత్యువే శరణ్యం.ఆమెకి శాంతి మంత్రాలూ, ఉపశమనాలూ అనవసరం.
పురోహితుడు ః నేను వినేదంతా నిజమేనా? నాకు నమ్మకం కలగటం లేదు.ఒకవేళ మీరు చెప్పేదంతా నిజమే అయితే నేను మళ్ళీ ఒకసారి ధర్మ గ్రంథాలని తిరగేయాలి !
 
( నిష్క్రమిస్తాడు)
 
(మిహిరదేవ్ , కోమా ప్రవేశిస్తారు)
ధ్రువ(స్వామిని ః ఎవరు మీరు?
కోమా ః పరాజయం పొందిన శక జాతి స్త్రీని .
ధ్రువస్వామిని ః ఊఁ,అయితే…
కోమా ః నేను ప్రేమించాను.
ధ్రువస్వామిని ః ఆ ఘోరమైన నేరానికి నీకు లభించిన శిక్ష ఏమిటి?
కోమా ః అందరు స్త్రీలకీ సామాన్యంగా లభించేదే – నిరాశ, యాతన, అపహాస్యం ! రాణీ నేను నిన్ను భిక్ష కోరేందుకు వచ్చాను.
ధ్రువస్వామిని ః శత్రువులకి ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు.మరీ మొండితనం చేస్తే శిక్ష కూడా పడవచ్చు.
మిహిరదేవ్ ః (గట్టిగా నిట్టూర్చి) పిచ్చి పిల్లా, అయిందా?ఇంకా ఇక్కడినుంచి కదలవా?
( కోమా తలవంచుకుంటుంది)
 
మందాకిని ః నీకేం కావాలిప్పుడు?
కోమా ః రాణీ, నువ్వు కూడా స్త్రీవే కదా ! స్త్రీవై ఉండి ఎదుటి స్త్రీ మనోవేదన అర్థం చేసుకోలేవా? ఈనాడు నీ విజయాంధకారం నీ స్త్రీత్వాన్ని కప్పివేస్తుందేమో,కాని అందరి జీవితాల్లోనూ ఏదో ఒక రోజు ప్రేమ జ్యోతి వెలుగుతుంది.తప్పకుండా వెలిగే ఉంటుంది.నీ జీవితంలో కూడా ఆ వెలుగులు ప్రకాశం నింపే ఉంటాయి.ఆ వెలుగులో ఒక హృదయం మరో హృదయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది, ఔదార్యం కనబరచి సర్వస్వాన్నీ ధారబోసేందుకు ఉత్సాహపడుతుంది…నాకు శకరాజు శవం కావాలి.
ధ్రువస్వామిని ః ( ఆలోచించి) కాలిపో, ప్రేమ కోసం కాలి పోవాలనుకుంటే ఆ శవం తీసుకెళ్ళి దానితోపాటు కాలిపో. జీవించి ఉండగా నీకు అంతా సుఖంగా గడిచిపోయినట్టుంది.నీ జీవితం ధన్యమైంది.(సేవకుడితో) ఈమెని తీసుకెళ్ళనివ్వు.
(కోమా నిష్క్రమిస్తుంది)
మందాకిని ః స్త్రీలు చేసే ఈ త్యాగానికి విలువే లేదు.ఎంత అసహాయ స్థితి! దుర్బలమైన తమ చేతులతో ఎప్పుడూ ఆసరా కోసం వెతుకుతూ వీళ్ళు పురుషుల పాదాలను పట్టుకుంటారు.అతను మాత్రం ఎప్పుడూ తిరస్కారం, ద్వేషం , దుఃస్థితి నే బహూకరిస్తాడు.అయినా ఈ వెర్రి స్త్రీ అతనే సర్వస్వమని నమ్ముతుంది !
 
ధ్రువస్వామిని ః అది పొరపాటు…భ్రమ ! (ఆగి)కాని దానికి కూడా ఒక కారణం ఉంది.పరాధీనత ఒక సంప్రదాయంగా వాళ్ళ నరనరానా , వాళ్ళ మస్తిష్కంలో ఎన్నో యుగాలుగా జీర్ణించుకుపోయింది.తెలిసి చేసే తప్పులే అవి.నేను మాత్రం, నన్ను బహిష్కరించినప్పుడు తప్పు చెయ్యలేదా? నా ఆత్మగౌరవం కోసం ఎంతగా విలవిలలాడాను!రారాజు రామగుప్తుడి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాలేదూ?కానీ అదేమైనా ఫలించిందా?పురుషాధిక్యం వలలో పడి వాళ్ళు చేర్చిన చోటికి చేరాను. మందా! దుర్గాన్ని జయించటం నా అదృష్టమో, దురదృష్టమో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.రాజు ఎదుటికి వెళ్ళాలని లేదు నాకు.పాతాళం నుంచి ఒక ఏహ్యభావం సాకార రూపం ధరించి నన్ను వెనక్కి వెళ్ళిపొమ్మని సైగ చేస్తోంది.ఇది నా మనసులోని కలుషితమైన భావమా? నేను పాపం చేస్తున్నానా?
 
( ద్రువస్వామిని భ్రమించిన దానిలా శూన్యంగా చూస్తూ నిష్క్రమిస్తుంది)
 
మందాకిని ః నారీ హృదయం…శాస్త్రాలు ఉచ్చరించిన ఒక మంత్రం అందులో మేకులా దిగబడింది. సహజంగా కలిగే భావనలు కలగకుండా అది అడ్డుకుంటోంది.ఆమె చంద్రగుప్తుణ్ణి ప్రేమిస్తోందనటంలో సందేహమే లేదు.
చంద్రగుప్త్ ః (అకస్మాత్తుగా ప్రవేశించి) ఎవరది? మందా?
మందాకిని ః అరే కుమార్ ! కాస్సేపు విశ్రాంతి తీసుకుందామా?
చంద్రగుప్త్ ః (కూర్చుంటూ) విశ్రాంతా? నాకెక్కడి విశ్రాంతి? ఇక్కణ్ణించి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను.నా కర్తవ్యం నిర్వహించాను.ఇక ఇక్కడుండటం సరి కాదు.
మందాకిని ః కానీ వదిన పరిస్థితి చాలా ఘోరంగా ఉందే !
చంద్రగుప్త్ ః ఏం, ఆమెకేమయింది? (మందాకిని సమాధానం చెప్పదు) చెప్పు, నాకు ఎక్కువ సమయం లేదు.రారాజు ఎదురుపడితే ఏమౌతుందో చెప్పలేను.ఇక ఈ రాజకీయ కుట్రలూ, కుతంత్రాలూ చెయ్యటం నా వల్లకాదు.
మందాకిని ః కానీ ఆమెని ఇలాటి స్థితిలో వదిలి వెళ్ళటం మీకు భావ్యమేనా? పైగా…(ఆగిపోతుంది)
చంద్రగుప్త్ ః పైగా ఏమిటి…మాట్లాడటం ఆపేశావేం?చెప్పు !
మందాకిని ః అది కూడా చెప్పాలా? మహారాణి అవకముందు ధ్రువస్వామిని మనసులో ఏముందో మీకు తెలియదా?
చంద్రగుప్త్ ః కాని మందాకినీ ! అదంతా ఇప్పుడు మాట్లాడి లాభం ఏమిటి?
మందాకిని ః మనసులో నైతిక బలం, నిజమైన ప్రేరణ ,పౌరుషం తాలూకు పిలుపు – ఈ మూడింటినీ కలిపి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి కుమార్!
 
( చంద్రగుప్త్ సందిగ్ధంలో పడి పచార్లు చెయ్యటం మొదలెడతాడు.నేపథ్యంలో ఎవరో కొందరు వస్తున్న అలికిడి, కోలాహలం)
 
చంద్రగుప్త్: ఈ కోలాహల మేమిటో, మహారాణి ఎక్కడికెళ్ళిందో చూసి వస్తాను.
 
(నిష్క్రమిస్తాడు)
చంద్రగుప్త్ ః నియమాల సిరా ఒక్క చుక్క పడితే చాలు భాగ్య లిపి నల్లగా మారి పోయేందుకు .ధ్రువస్వామిని నాది అని అంగీకరించేందుకు నాకు సంకోచంగా ఉంది.(ఆగి) అవును, ఆమె నాదే, మొదటి నుంచి ఆమెను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.నా మనసు లోతుల్లోంచి వస్తున్న ఈ మూగ స్వీకృతి ఇవాళ గొంతు విప్పి మాట్లాడుతోంది.లేదు,ఇది సరి కాదు, ఇంకొకరు నా వైభవాన్నీ, అధికారాన్నీ అన్యాయంగా లాక్కుంటూ ఉంటే కళ్ళారా చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదు.నాకు భార్యగా నిశ్చయమైన స్త్రీ – నేను నిరుత్సాహంగా ఉండిపోవడం వల్ల నాకు దక్కకుండా పోయింది.లేదు, ఇది మోసం, వంచన.నేనేమిటో స్పష్టంగా ప్రకటించుకోలేకపోయాను.ఇదేమి పరిహాసం ! వినయమనే ముసుగులో నా పిరికితనం ఎంతకాలం దాగి ఉండగలదు?
( ఒకవైపు నుంచి మందాకిని ప్రవేశిస్తుంది)
మందాకిని ః శకరాజు శవాన్ని తీసుకెళుతూ ఉండగా ఆచార్యులవారిని, ఆయన కుమార్తెను రారాజు సైనికులు వధించారు !
ధ్రువస్వామిని ః ( మరోవైపు నుంచి ప్రవేశిస్తుంది)
సామంతులు ః ( ఏకకంఠంతో) స్వామినీ ! మీ ఆజ్ఞని అతిక్రమించి రారాజు, పాపం ఏమీ ఎరగని శకులని హతమార్చారు.
ధ్రువస్వామిని ః అయితే మీరు ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నారు? రాజు ఆజ్ఞాపించాడు, జనం తలవంచి దానిని అంగీకరించాలి.
సామంతుడు ః కానీ ఇప్పుడు దాన్ని సహించ లేకుండా ఉన్నాము.రాజ్యాధికారం ప్రకటించేందుకు ఇంత భయంకరమైన ప్రదర్శన చెయ్యాలా? అసలు ఈ దుర్గంలోకి మీ అనుజ్ఞ లేకుండా రాజుగారు ప్రవేశించటం తప్పంటాను.
ధ్రువస్వామిని ః నాకు సాయం చేసేందుకు వచ్చిన వీరులారా ! నేనే ఒక దురదృష్టవంతురాలు అయిన , భర్త వదిలేసిన స్త్రీని. నా స్థితి గురించి ఊహిస్తేనే మనసు క్షోభిస్తోంది. ఇక నేనేం చెప్పను?
సామంతుడు ః నిజం చెప్తున్నాను, రామగుప్తుడి లాంటి రాజు రాజపదవికే ఒక కళంకం.అతనంటే నాకేమాత్రం గౌరవం లేదు.విజయోత్సవం జరుపుకునేందుకు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికొచ్చాడాయన?ఆయనొక క్రూరమైన వంచకుడు….పిరికివాడు.
రామగుప్త్ ( ఉన్నట్టుండి శిఖరస్వామి వెంట ప్రవేశిస్తాడు) ఏమన్నావు? మళ్ళీ ఒకసారి అను !
సామంతుడు ః గుప్తవంశానికి కళంకం తెచ్చే నువ్వు…!
శిఖరస్వామి ః ( అతనికి మధ్యలో అడ్డు వస్తూ) నోరు ముయ్యి! ఎవరైనా మిమ్మల్ని ఉసికొల్పితే ఇంత ఆవేశం ప్రదర్శిస్తున్నారా?( చంద్రగుప్తుడికేసి చూస్తూ) కుమార్, ఏమిటిది, ఏం జరుగుతోంది?
( చంద్రగుప్తుడు సమాధానం చెప్పాలని ప్రయత్నించి మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు)
రామగుప్త్ ః ఒరే పొగరుబోతులూ, మీకు క్రూరాతి క్రూరమైన దండన విధిస్తాను, చూస్తూ ఉండండి రా! ( లోపలికి చూస్తూ) ఈ ద్రోహులను బంధించండి !
 
(రామగుప్తుడి సైనికులు వచ్చి సామంత రాజులని బంధిస్తారు. రామగుప్త్ సైగ చెయ్యగానే సైనికులు చంద్రగుప్తుడి వైపు వెళ్తారు. అతన్ని సంకెళ్ళతో బంధిస్తారు)
ధ్రువస్వామిని ః కుమార్ , నా మాట విను, వీళ్ళని ఎదిరించు. ఏం నేరం చేశావని ఈ శిక్ష నీకు?
(చంద్రగుప్తుడు గట్టిగా నిట్టూర్చి మౌనంగా ఉండి పోతాడు)
రామగుప్త్ ః ( నవ్వి) కుతంత్రాలు చేసేవాళ్ళు ఏం మాట్లాడతారు?
ధ్రువస్వామిని ః అవును మరి, మాట్లాడే వాళ్ళందరూ, తాము పవిత్రులమని చాటే వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు కదూ? ( చంద్రగుప్తుడితో) కుమార్ ! నీకు మాట్లాడే హక్కుంది. నేనే నేరం చేయకపోవటమే నేను చేసిన నేరమని చెప్పరాదూ?
రామగుప్త్ ః మహాదేవీ !
ధ్రువస్వామిని ః ( అతన్ని లక్ష్యం చెయ్యకుండా, చంద్రగుప్తుడితో) తెంపి పారెయ్యి ఈ సంకెళ్ళని ! ఈ అబద్ధాలు, ఈ మోసం ఎవరూ భరించలేరు !
రామగుప్త్ ః ( గద్దిస్తూ) మహాదేవీ !ఇక చాలించు నీ మాటలు !
ధ్రువస్వామిని ః ( మొహంలో తేజస్సు ఉట్టిపడుతుంది) ఎవరు మహాదేవి? రాజా, ఇంకా నేను మహాదేవినేనా? శకరాజు శయ్యని పంచుకునేందుకు అమ్ముడయిన దాసిలా పంపించావే, ఆమెనేనా మహాదేవీ అని పిలుస్తున్నావు? ఎంత ఆశ్చర్యం!
శిఖరస్వామి ః మహారాణీ , ఈ రాజకీయాల యుక్తులలో సాఫల్యం…
ధ్రువస్వామిని ః ( కాలితో గట్టిగా నేలని తన్ని) నోరు ముయ్యి మోసకారీ! స్వార్థంతో, హేయమైన వంచనతో చేసిన పనిని సమర్థించుకోకు !
రామగుప్త్ ః అయితే నువ్వు మహారాణి వి కావా?
ధ్రువస్వామిని ః కాను ! ఒక మనుష్యమాత్రుడు ఇచ్చిన ఆ పదవిని వెనక్కి ఇచ్చేస్తున్నాను.
రామగుప్త్ ః మరి నా సహధర్మచారిణి?
ధ్రువస్వామిని ః ధర్మమే దాన్ని నిర్ణయిస్తుంది.
రామగుప్త్ ః ఆఁ, అందులోనూ సందేహమేనా?
ధ్రువస్వామిని ః అది మీ హృదయాన్నే అడగండి నేను నిజంగా మీ సహధర్మచారిణి నో కాదో !
 
(పురోహితుడు ప్రవేశిస్తాడు.అందరూ అక్కడ ఉండటం చూసి ఉలిక్కిపడతాడు.శిఖరస్వామి అతన్ని వెళ్ళిపొమ్మని సైగ చేస్తాడు)
పురోహితుడు ః లేదు, నేను వెళ్ళను.ప్రతి ప్రాణి అంతరంగం లోనూ ఉండే గొప్ప యోచన ధర్మం. దాని ఆజ్ఞ నేను శిరసావహించక మానను.ప్రస్తుతం ఏ సమస్యలైతే భయంకరమైన రూపం దాల్చి మిమ్మల్ని కలవరపెడుతోందో దానికి సరైన సమాధానం చెప్పే హక్కు నాకొక్కడికే ఉంది. వివాహానికీ ధర్మశాస్త్రానికీ ఉన్న సంబంధం విడదీయరానిది.
ధ్రువస్వామిని ః మీరు సత్యసంధులైన బ్రాహ్మణులు.దయచేసి చెప్పండి…
శిఖరస్వామి ః ( వినయంగా ఆమెకి అడ్డు వస్తూ) ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చెయ్యటం మంచిది కాదని నా అభిప్రాయం.
ధ్రువస్వామిని ః లేదు, ఈ వివాదం అంతు చూడటమే నాకు కావలసినది. నేనెవరిని అనే విషయం ఈవేళే తేలిపోవాలి.
రామగుప్త్ ః ధ్రువస్వామినీ, సిగ్గులేనితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది!
ధ్రువస్వామిని ః నేను సిగ్గుమాలినదాన్నే అయితే దానికి పిరికివాడైన ఒక నపుంసకుడే కారణం.స్త్రీ మానాన్ని దోచుకునే ఆ రాక్షసుడికి నేను …
రామగుప్త్ ః (అడ్డు వస్తూ) నోరు మూసుకో! పరపురుషుడి ప్రేమలో పడి నీ మనసు కలుషితమై పోయింది.నువ్వు కాలసర్పం లాంటి స్త్రీవి. ధర్మం అంటే కొంచెం కూడా భయం లేదా నీకు ! శిఖరస్వామీ, ఈమెని కూడా బంధించు.
పురోహితుడు ః ఆగండి ! మహారాజా కాస్త ఓరిమి వహించండి !! ధర్మం గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను.
శిఖరస్వామి ః ( కోపంగా) ఇప్పుడే చెపుతున్నాను, నువ్వు మాట్లాడకు, లేకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుంది.
(సైనికుడు ముందుకి వస్తాడు)
మందాకిని ః (మధ్యలో కల్పించుకుని) పురుషార్థాన్ని ప్రదర్శించేందుకు ఇంత గొప్ప ప్రహసనమా మహారాజా?అబల మీద ఇంత పెద్ద అత్యాచారమా?ఇది గుప్త సామ్రాట్ కి భావ్యమేనా?
రామగుప్త్ ః (సైనికులతో) చూస్తారేం?
( సైనికుడు మరి కొన్ని అడుగులు ముందుకి వేస్తాడు.చంద్రగుప్తుడు అవేశంతో సంకెళ్ళు తెంపేసుకుంటాడు.అందరూ ఆశ్చర్యపోయి భయం భయంగా చూస్తారు)
చంద్రగుప్త్ ః నేను కూడా ఆర్య సముద్రగుప్తుడి కుమారుణ్ణే.శిఖరస్వామీ, ఆయన నన్నే సింహాసనానికి వారసుడిగా చెయ్యాలనుకున్నారని నీకు తెలుసు. నీ నీచ బుద్ధిని ఇక సహించేది లేదు.నువ్వు నీ రాజుని వెంటపెట్టుకుని ఈ దుర్గం నుంచి సురక్షితంగా బయటకు నడు.ఇక ఇప్పుడు శకరాజు సమస్త అధికారాలకీ అధిపతిని నేనే.
రామగుప్త్ ః ( భయంతో బిగుసుకుపోయి చుట్టూ చూస్తాడు) ఏమిటిది?
ధ్రువస్వామిని ః (చంద్రగుప్తుడితో) అవును కుమార్…నువ్వే !
చంద్రగుప్త్ ః ( సైనికుణ్ణి గద్దిస్తూ) ఈ సామంత రాజులని విడుదల చేయండి.
( సైనికులు అతని ఆజ్ఞ పాటిస్తారు.శిఖరస్వామి సైగ చెయ్యగానే రామగుప్తుడు భయపడి నెమ్మదిగా వెనక్కి నడుస్తూ బైటికి వెళ్ళిపోతాడు)
శిఖరస్వామి ః కుమార్, ఈ కలహాన్ని రూపుమాపేందుకు మనం పరిషత్తు నిర్ణయాన్నే ఆమోదించాలి.మీరు ఆధిపత్యం వహిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు,కానీ అన్ని పనులూ పద్ధతి ప్రకారం జరగాలి.సామంతులు ఎలాగూ ఇక్కడే ఉన్నారు,నేను కులవృద్ధులని వెంటబెట్టుకు వచ్చేందుకు వెళ్తున్నాను.
(సైనికులు ఇంకా కొన్ని ఆసనాలని మోసుకొస్తారు.సామంతులు కత్తులు దూసి చంద్రగుప్తుడి వెనకాలే నిలబడతారు.ధ్రువస్వామినీ, చంద్రగుప్తుడూ పక్కపక్కనే ఒకర్నొకరు చూస్తూ నిలబడతారు. పరిషత్తు సభ్యులతో పాటు రామగుప్తుడు ప్రవేశిస్తాడు.అందరూ ఆసనాల మీద కూర్చుంటారు)
 
శిఖరస్వామి ః మీరు కూడా ఆసీనులు కండి కుమార్ !
చంద్రగుప్తుడు ః నా మీద నేరం మోపబడింది,ఎలా కూర్చోను?
శిఖరస్వామి ః గతాన్ని మర్చిపోవడం శ్రేయస్కరం.అన్నదమ్ములిద్దరూ ఆప్యాయంగా కౌగలించుకుని గుప్త వంశం గౌరవాన్ని నిలపండి.
చంద్రగుప్త్ ః మంత్రీ, నువ్వు దేన్ని గౌరవమంటున్నారు? అది ఏ మూలో వ్యాధిగ్రస్తమై , క్షీణించిపోయి పడి ఉంది.దాన్ని ఎన్ని ఆభరణాలతో అలంకరించినా అది కోలుకోదు.సుగంధ ద్రవ్యాలతో ఎంత లేపనం చేసినా ఆ కలుషితమైన శరీరం గౌరవాన్ని పెంపొందించలేదు. కుటిలత్వం మూర్తీభవించిన ఓ వంచకుడా, చెప్పు ! నాకు నిశ్చయించిన కన్యనీ, తండ్రి నాకు నిర్దేశించిన సింహాసనాన్ని అపహరించటం లాంటి కుతంత్రాలు చేసింది నువ్వే కదా?
రామగుప్త్ ః ఈ వ్యర్థ ప్రలాపాలు ఆపు ! ఎంతైనా నా తమ్ముడివి కదా, అందుకే నిన్ను క్షమిస్తున్నాను.
చంద్రగుప్త్ ః నేను క్షమాభిక్ష కోరడం లేదు, అంతే కాక నన్ను క్షమించే హక్కు నీకు లేదు.ఇప్పుడు నువ్వు రాజువి కావు.నీ పాపాలు ప్రాయశ్చిత్తాన్ని కోరుతున్నాయి.న్యాయం అందించే నిర్ణయం కోసం వేచి ఉండి , నువ్వు చేసిన నేరాలేమిటో విను.
మందాకిని ః ( ధ్రువస్వామినిని ముందుకు లాగి) ఈమే గుప్తవంశపు వధువు.
రామగుప్త్ ః మందా!
మందాకిని ః రాజుని చూసి భయపడి మందా గొంతు విప్పకుండా ఉండదు.మీకు ఏమాత్రం బుద్ధున్నా ఈ వంశ గౌరవాన్ని, ఈ స్త్రీని శత్రు దుర్గంలోకి ఇలా పంపించి ఉండరు.ఆ భగవంతుడు స్త్రీలని పుట్టించినప్పుడే వాళ్ళకి హక్కులేవీ లేకుండా చెయ్యలేదు.కానీ మీలోని రాక్షసత్వం వాళ్ళని దోచుకుంది.ఈ పరిషత్తు కి నేను విన్నవించుకునేది ఒకటే, ఆర్య సముద్రగుప్తులవారి నిర్ణయానికి భంగం కలిగించి రాజకీయ కుట్ర చేసి ఎవరు పాపం చేశారో, వాళ్ళని దండించ వలసిందిగా కోరుతున్నాను.
శిఖరస్వామి ః ఏమిటి నువ్వనేది?
మందాకిని ః మీ అందరి నీచబుద్ధి గురించీ వివరిస్తున్నాను. అనార్యుడా, చెవులకి కటువుగా ఉందా?నీ వంచనలు ఎలాంటి నరకాన్ని సృష్టించాయో చూడు…ఇక అవి అంతం కానున్నాయి.ఈ సామ్రాజ్యం ఎవరిది? ఆర్య సముద్రగుప్తులు ఎవరిని రాజుగా చేసి రాజ్యాధిపతి చెయ్యాలనుకున్నారు? చంద్రగుప్తుణ్ణా, లేక ఈ భీరువు రామగుప్తుణ్ణా? మోసం తో బలవంతంగా ఈమెని వివాహం చేసుకోవటమే కాక, పరపురుషుణ్ణి ప్రేమిస్తోందన్న నేరం మోపి శిక్షించమని ఆజ్ఞాపిస్తాడా ! అదే రామగుప్తుడు,పరమ నీచుడిలా శత్రు దుర్గం లోకి ఏమాత్రం అభ్యంతరం పెట్ట కుండా ఈ స్త్రీని పంపాడే, ఇతను మీ గుప్త సామ్రాజ్యానికి సామ్రాట్టా? ఇక ఈ ధ్రువస్వామిని, కొన్నాళ్ళ క్రితం వరకూ ఈమెని మీరందరూ మహాదేవి అని పిలిచారే, ఈమె ఎవరు?ఆమె అస్తిత్వం ఎలాంటిది? ధర్మశాస్త్రమనేది ఎక్కడైనా ఉంటే అది నోరు విప్పాల్సిన సమయం ఇదే.
 
పురోహితుడు ః శిఖరస్వామీ, ఇకనైనా నన్ను మాట్లాడనిస్తావా లేదా?నేను రాజ్యం గురించి ఏమీ చెప్పాలనుకోవడం లేదు.అదంతా నీ రాజనీతికే తెలియాలి.కానీ ఈ వివాహం గురించి నేను కొంత చెప్పక తప్పదు.
ఒక వృద్ధుడు ః చెప్పండి స్వామీ, మీరే కదా ధర్మశాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసిన విజ్ఞులు !
పురోహితుడు ః వివాహం తంతు దేవి ధ్రువస్వామినినీ, రామగుప్తుణ్ణీ దంపతులుగా బంధించింది, కానీ అది నిజమైన వివాహబంధం కాదు. ధర్మం ఉద్దేశాలని ఇలా కాలరాయడం సరికాదు. ధర్మానుసారం తల్లిదండ్రులు చేసే ప్రమాణాల ఆధారంగా జరిగే వివాహాలు దంపతులకి ఒకరి మీద ఒకరికున్న ద్వేషం కారణంగా విచ్చిన్నం కావు. కానీ ఈ సంబంధంలో అలాంటి ప్రమాణాలేవీ లేవు.ఇక పోతే ( రామగుప్తుడికేసి చూసి) ఈ రామగుప్తుడు చనిపోలేదు, సన్యాసం పుచ్చుకోలేదు,కానీ గౌరవాన్ని కోల్పోయాడు, పతితుడిలా ప్రవర్తించాడు, ఇతను రాజ్యం పట్ల పాపాలు చేసిన భీరువు.ఇటువంటి పరిస్థితిలో అతనికి ధ్రువస్వామిని మీద ఎలాంటి హక్కులూ లేవు.
రామగుప్త్ ః ( లేచి నిలబడి కోపంగా) మూర్ఖుడా! నీకు మృత్యువంటే భయం లేదా?
పురోహితుడు ః బొత్తిగా లేదు.బ్రాహ్మణుడు కేవలం ధర్మానికి భయపడతాడు. ఇతర శక్తులన్నిటినీ తుచ్ఛమైనవిగా భావిస్తాడు.నువ్వు నియమించిన హంతకులు నన్ను సత్యం పలకకుండా ఆపలేరు.వాళ్ళని పిలు, నేను సిద్ధంగా ఉన్నాను.
మందాకిని ః మీరు ధన్యులు మహాశయా !
శిఖరస్వామి ః కానీ , బ్రాహ్మణుడా, ఏమాత్రం భయం లేకుండా భీరువు అని అంటున్నావే!
పురోహితుడు ః (నవ్వి) రాజకీయ రాక్షసుడా! నువ్వు నాతో శాస్త్రాల గురించి తర్కించకు. భీరువు… శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి భీరువని ఎందుకన్నాడు?తన భార్యని ఇంకొక పురుషుడి దగ్గరకి పంపించేందుకు ఏమాత్రం సంకోచించని వాడు భీరువు కాక ఇంకేమిటి?నేను స్పష్టంగా చెబుతున్నాను, ధర్మశాస్త్రాలు ధ్రువస్వామినికి రామగుప్తుడి దగ్గరనుంచి విముక్తిని ప్రసాదిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
పరిషత్తు లోని సభ్యులందరూ ః అనార్యుడా, పతితుడా, నపుంసకుడా ! నీకు పవిత్రమైన గుప్త సామ్రాజ్య సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు!
రామగుప్త్ ః ( అనుమానంగా భయపడుతూ అటూ ఇటూ చూస్తాడు) మీరందరూ మోసగాళ్ళు, ద్రోహులు. నాకు న్యాయoగా చెందవలసిన అధికారాన్ని – మీలాంటి కుక్కలు మొరుగుతున్నాయని – వదులుకోను.
శిఖరస్వామి ః కానీ పరిషత్తు నిర్ణయాన్ని ఆమోదించవలసిందే.
రామగుప్త్ ః ( ఏడుపు గొంతుతో)శిఖర్ ! నువ్వు కూడా అదే మాటా? లేదు, నేను ఒప్పుకోను.
ధ్రువస్వామిని ః రామ్! తక్షణం ఈ దుర్గం వదిలి వెళ్ళిపో!
రామగుప్త్ ః ఆఁ? ఏమిటీ మార్పు? అయితే నేను నిజంగానే నపుంసకుణ్ణా?
( నెమ్మదిగా పక్కకి వెళుతూ, చంద్రగుప్తుడి వెనకాల చేరి అతన్ని బాకుతో చoపాలని చూస్తాడు.చంద్రగుప్తుడు ఆపదలో ఉండటం చూసి కొందరు కేకలు పెడతారు.చంద్రగుప్తుడు వెనక్కి తిరిగే లోపల ఒక సామంతుడు రామగుప్తుడి మీదకి లంఘించి చంద్రగుప్తుణ్ణి కాపాడతాడు.రామగుప్తుడు కింద పడతాడు.)
సామంత రాజులు ః రాజాధిరాజ చంద్రగుప్తుడికి జయము జయము !
పరిషత్తు ః మహాదేవి ధ్రువస్వామినికి జయము జయము !
………….సమాప్తం…..…….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.