
నదిని నేనైతే
-నస్రీన్ ఖాన్
ప్రపంచమంతా
నా చిరునామా అయినప్పుడు
నా ప్రత్యక్ష
అంతర్థానాల
కబుర్లెందుకో ఈ లోకానికి?
అడ్డుకట్టలు
ఆనకట్టలు
నా ఉత్సాహ పరవళ్ళు
నిలువరించాలని చూసినా
పాయలుగా విస్తరించడం తెలుసు
వాగులూ వంకలూ
పిల్ల కాలువలుగా ప్రవహించడమూ తెలుసు
పుట్టుకతోనే
ఉనికి ప్రకటించుకునే నేను
ముందుకు సాగేకొద్దీ
జీవరాశులెన్నింటికో ఆలవాలమౌతాను
సారించిన చూపంత పచ్చదనం
పశుపక్ష్యాదుల దాహార్తి తీర్చే చెలిమ
నా ప్రతిబింబమైన ప్రకృతి
నాలో చూసుకుంటూనే ముస్తాబై పరవశిస్తుంది
అలసట
ఎరుగని పయనం నాది
లోకానికి
పునర్జన్మనిచ్చే తపన నాది
వేగంగా
పరుగెత్తీ పరుగెత్తీ
ఉనికి పోగొట్టుకుంటానని తెలిసినా
ప్రకృతి ధర్మం వీడని అప్రమత్తత నాది
కలుపుకు పోవడమే తెలిసిన నేనూ
ఊర్లను
తన మాలలో గుదిగుచ్చి
సాగుతూ పోయే జీవనదీ
ఇద్దరమూ ఒక్కటే
జీవితాన్నీయడమే తెలుసు
నవ్వుతూ జీవించడమొక్కటే తెలుసు
*****

నస్రీన్ ఖాన్ కవిత్వం, కథలు రాస్తుంటారు. 2006లో తొలి కవిత రాసినప్పటికీ, 2016 నుంచి కవిత్వాన్ని విరివిగా రాస్తున్నారు. 2019లో ‘ౙఖ్మీ’ కవితా సంపుటి వెలువరించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తూ ఆ సంస్థ వెలువరించిన ‘శ్రామిక, ఉరేనియం’తదితర పుస్తకాలకు సంపాదకురాలిగా పని చేసారు. జర్నలిజం నుంచి వచ్చిన ఈమె సాహిత్యం ఎక్కువగా మానవ జీవితంలోని నిత్య సంఘర్షణలను పట్టి చూపుతుంది. త్వరలోనే కథా సంకలనం తీసుకురానున్నారు.

ఉనికి కోల్పోతానని తెలిసినా ప్రకృతి ధర్మం వీడని అప్రమత్తత నాది అంటూ… చిక్కని కవిత్వం ఝళిపించారు నస్రీన్ ఖాన్ గారు.🙏🙏💐💐
Good poem. నదిని నేనైతే అంటూ Nasreen తన సిరా నిధిని కురిపించారు. కవిత్వం అవకాశ మిస్తే , కాలువలా , కెరటంలా, కుంభవృష్టి లా మన ఆలోచనలకి రెక్కలు కట్టచ్చు.
Very nice