బోధనా వృత్తి నుండి భారతదేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు..!! 
 “ద్రౌపది ముర్ము” 
-డా. సిహెచ్.సుశీల
          భారతదేశ రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవి, భారత దేశ ప్రథమ పౌరుడు “రాష్ట్రపతి”. 
          రాష్ట్రపతి ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉండకుండా, కేవలం దేశ ప్రజల ప్రయోజనాల కోసమే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు లో ప్రవేశ పెట్టే అంశాలను అనేక కోణాల్లో విస్తృతంగా ఆలోచించాలి. ఆచితూచి వ్యవహరించాలి. దేశ భవితవ్యం క్షేమం గా ఉండేందుకు అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఏవైనా సందేహాలు కలిగితే ప్రభుత్వం నుండి వివరణ కోరవచ్చు.
          ఇంతటి బాధ్యతా యుతమైన పదవికి తమ అభ్యర్థిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ను ఎన్డీయే కూటమి ప్రకటించింది. దాదాపు 20 పేర్లను పరిశీలించి చివరికి ఈ పేరు ప్రకటించడంతో దేశమంతా ‘ఎవరీమె’ అని ఆసక్తిగా చూసారు. సాధారణ టీచర్ వృత్తి నుండి అసాధారణ రీతిలో ఎదిగిన ఆమె జీవిత ప్రస్థానం ఎంత స్ఫూర్తిదాయక మైనదో తెలుసు కొంటున్నారు.
          ద్రౌపది ముర్ము తండ్రి బిరంచి నారాయణ తుడు ఒడిశా లోని బైడపోసి గ్రామానికి చెందిన సంతాల్ తెగ సంతతి వారు. ఆ నిరుపేద కుటుంబం లో 1952 జూన్ 20 జన్మించారు ద్రౌపది. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల మధ్య, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూనే చదువు కొనసాగించారు ఆమె. భువనేశ్వర్ లోని రమాదేవి విమెన్స్ కాలేజీ లో బి.ఏ. చదివారు. మొదట శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఆనరరీ అసిస్టెంట్ టీచర్ గా పనిచేసారు. తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం లో చేరారు. 
          తండ్రి , భర్త శ్యామ్ చరణ్ ముర్ము , ఇరువురు కుమారులు మరణించడం ఆమె జీవితం లో పెద్ద విషాదం. 
          1997 లో బి.జె.పి. లో చేరడం, రాయ్ రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికవడం తో ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో ఒడిశా లో బీజేడీ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం లో ఎం.ఎల్.ఏ. గానూ, తర్వాత మంత్రి గానూ ప్రజా సంక్షేమం దృష్టి పెట్టి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 2002 వరకు రవాణా, వాణిజ్య శాఖ మంత్రి గానూ, 2004 వరకు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గానూ పనిచేసారు. 
          ఒడిశా బీ.జే.పి. గిరిజన మోర్చా ఉపాద్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా పనిచేసారు. 2010, 2013 ల్లో మయూర్ భంజ్ జిల్లా బీ.జే.పీ. ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా చేసారు.
          ద్రౌపది ముర్ము మృదుభాషి. అత్యంత సౌమ్యురాలు. చేసే పని పట్ల నిబద్ధత కల వ్యక్తి. అందుకే 2015 లో జార్ఖండ్ రాష్ట్ర ప్రధమ పౌరురాలు, ‘గవర్నర్’ పదవి ఆమెను వరించింది. ఆ పదవిని ఎంతో హుందాగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ మరియు ప్రజల ప్రశంసలు పొందారు.
          స్వాతంత్య్ర భారతదేశానికి రాష్ట్రపతులుగా బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, ఎం. హిదయతుల్లా, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్, ఆర్. వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాధ్ కోవింద్ వంటి ప్రముఖ ధురంధరులు తమ సేవలను అందించారు. 
          ఈసారి 2022 జులై 18న రాష్ట్రపతి ఎన్నికల్లో తూర్పు భారతం నుండి ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము అభ్యర్థి గా నిలవడం ఒక అరుదైన గౌరవం. స్వాతంత్రయానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతి అభ్యర్థిగా కొత్త రికార్డు సృష్టించనున్నారు.
          ఇప్పటి వరకు భారత ఎన్నికల కమిషను 15 సార్లు రాష్ట్రపతి పదవికి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. ఈసారి కూడా అదే తరహాలో పూర్తి స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు పూనుకొంది. సాధారణంగా రాష్ట్రపతి పదవీకాలం ముగిసే సమయం 60 రోజులు ఉందనగా ఎన్నికల షెడ్యూల్ జారీ చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఎలెక్టోరల్ కాలేజీ సభ్యులు – దేశ వ్యాప్తంగా ఉన్న ఎం.పీ.లు, ( రాజ్యసభ లోక్ సభ సభ్యులు), అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంచు మించు 4809 మంది ఈ ఓటింగ్ కి అర్హులు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – ఎన్నికల ముందు నామినేటెడ్ సభ్యులు కాకుండా, ఓటింగ్ అర్హత కలవారి జాబితాను సిద్ధం చేస్తారు. లోక్ సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ లకు ఒక్కొక్క విడత అటార్నింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తారు. ఎలక్ట్రోరల్ కాలేజీ లో 50 మంది ఓటర్లు రాష్ట్రపతి అభ్యర్థి ని ప్రతిపాదించాలి. 50 మంది బలపరచాలి. అప్పుడు గానీ అభ్యర్థి ‘రాష్ట్రపతి’ పదవికి పోటీ చేయడానికి వీలుకాదు.
          ఇంతా చేసి, మన రాష్ట్రపతి కి ‘ రబ్బర్ స్టాంప్’ అనే అనవసర, అర్ధం లేని ముద్ర పడడం దురదృష్టకరం. దేశ ప్రధమ పౌరునిగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేసే పదవి లో నున్న వ్యక్తి పై ఏదో ఒక ముద్రను వేయడం సరికాదు.
          ఇంతటి ప్రతిష్టాత్మక మైన పదవిని “తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము” పొందబోతున్న శుభ తరుణం లో దేశ ప్రజలందరూ ఏక కంఠంతో హర్షధ్వానాలు వెలువరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్త్రీలు గర్వించవలసిన విషయం ఇది. ఆమె గెలుపు ప్రక్రియ లాంఛనమే నని, జులై 25న ఆమె పదవీ స్వీకారం చేయడం చూస్తామని దేశ ప్రజలు భావిస్తున్నారు.
          ద్రౌపది ముర్ము సమాజ సేవ కు, అణగారిన అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితం అంకితం చేశారు. పరిపాలనా పరమైన అపార అనుభవం ఉంది. గవర్నర్ గా అత్యుత్తమ సేవ లందించారు. విధాన పరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయా స్వభావం, కష్టపడే తత్వం ఈ దేశ ప్రజలకు ఎంతో ఉపయోగ పడతాయి అనడంలో సందేహం లేదు. 
          అత్యధిక ఓట్లు రావడం గెలుపు అనుకునే కంటే, ద్రౌపది ముర్ము విషయంలో ఆమె వ్యక్తిత్వం వల్లనే గెలుపు అవకాశాలు ఉన్నాయి. పేదరికం, అణచివేతలకు గురౌతున్న వారు ముఖ్యం గా స్త్రీలు ఆమె జీవితం నుండి స్పూర్తి పొందుతారనడం సత్యం. 
          టీచర్, జూనియర్ అసిస్టెంట్ స్ధాయి నుండి భారత రాష్ట్రపతి వరకు ద్రౌపది ముర్ము జీవిత ప్రస్థానం అత్యంత ఆసక్తికరం… ఎందరికో ఆదర్శనీయం.
*****
					 
						
Good selection —100% sure she is our next president
Sad part is my state is not supporting her —stupid politics
KCR is a king -not c.m
రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ గారి పరిచయం బాగుంది
కాబోయే రాష్ట్రపతి గురించి చక్కగా brief చేశారు.కృషి ఉంటే స్త్రీలు కూడా ఆ స్థానానికి ఎలా చేరుకుంటారు అన్న విషయం మగువ landarilo స్ఫూర్తి కలిగేటట్టు రాశారు. Madam గారికి అభినందనలు.
డాక్టర్ సుశీలమ్మ గారు కాబోయే రాష్ట్ర పతి గురించి రాసిన వ్యాసం సవివరంగా వుంది. చాలామందికి ఆవిడ గురించి అసలు తెలియదు. రాష్ట్ర పతి అభ్యర్ధిగి(ఎన్.డి.ఎ..కూటమి) ఆమెను భారతీయజనతా పార్టీ ప్రకటించిన తరువాత నే అందరి దృష్టి ఆవిడమీద పడింది. ఆవిడ అభ్యర్ధిత్వం అందరూ స్వాగతించవలసిందే.
రబ్బర్ స్టాంపు ముద్ర, వూరికేపడిన్ది మాత్రం కాదు.దానికి సరైన కారణాలు ఉన్నాయి. వ్యాస రచయిత్రి అసలు ఆ విషయం ప్రస్తావించకుండా వుంటే బాగుండేది.
డా.సుశీలమ్మ గారికి అభినందనలు
—–డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా