
“నెచ్చెలి”మాట
నెచ్చెలి ప్రచురణలు!
-డా|| కె.గీత
“నెచ్చెలి”కి మూడేళ్లు దాటి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఈ సంవత్సరం (2022) నుంచి “నెచ్చెలి ప్రచురణలు” పేరుతో స్త్రీల సాహిత్య ప్రచురణల సంకల్పం ప్రారంభమైంది. నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనంగా పరాజయం లేనిది, ఎదురులేనిది, శక్తివంతమైనది అనే అర్థమైన ‘అపరాజిత’ స్త్రీవాద కవితా సంకలనం విడుదల అయ్యింది. ఆగస్టు 7న ఆవిష్కరింపబడిన ఈ సంకలనం నీలిమేఘాలు తర్వాత గత మూడు దశాబ్దాల స్త్రీవాద కవిత్వాన్ని నమోదు చేసిన సమగ్ర సంకలనం. గత దశాబ్దిగా స్త్రీలపై పెరిగిన అమానుషాల నేపథ్యంలో ‘అపరాజిత’ స్త్రీవాద కవితా సంకలనం తక్షణ అవసరంగా తీసుకురావడం జరిగింది. ఈ “అపరాజిత” ముప్ఫై సంవత్సరాల తర్వాత వస్తున్న స్త్రీవాద కవయిత్రుల సంకలనంగా చరిత్ర సృషించడమే కాకుండా, పూర్తిగా ఆధునిక స్త్రీ మనోభావజాలాన్ని, చైతన్యాన్ని సుస్పష్టం చేస్తూ ఇప్పటి స్త్రీవాదబలాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఇంటా ఉండదగ్గ ఈ సంకలనం కావాలంటే editor@neccheli.com ను సంప్రదించొచ్చు.
అమెరికా నించి వెలువడుతున్న నెచ్చెలికి ఇండియా నించి, ఇతర దేశాల నించి కవయిత్రుల్ని సంప్రదించడం, రచనల్ని సేకరించడం, ప్రచురణ చెయ్యడం తలకు మించిన భారమయ్యింది. ఆ ప్రయత్నంలో ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా తిరుగులేని ‘అపరాజిత’ సిద్ధమైనందుకు సంతృప్తిగా ఉంది.
ఈ ప్రయత్నంలో నెచ్చెలికి సహకరించిన ‘అపరాజిత’సంకలనంలోని 93 మంది స్త్రీవాద కవయిత్రులకి నెనర్లు.
ఆగస్టు 7 నెచ్చెలి వ్యవస్థాపక సంపాదకురాలినైన నాకూ చారిత్రాత్మక మైనదే. ఇదే రోజున నా వెనుతిరగని వెన్నెల నవలకి “తెన్నేటి హేమలత- వంశీ” జాతీయ పురస్కారం లభించింది. అంతేకాకుండా నా అయిదవ కవితా సంపుటి “అసింట” ఆవిష్కరింపబడింది.
అభినందనల వెల్లువ కురిపించిన మిత్రులు, అభిమానులందరికీ వేనవేల నెనర్లు!
నెచ్చెలి ప్రచురణల తరువాతి ప్రచురణ ఏవిటా అని ఆలోచిస్తున్నారా? కాస్త ఊపిరి పీల్చుకోనిద్దురూ!!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటు రాసిన వారికే కాక ఆర్టికల్ కు సంబంధించిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
జూలై, 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: రాజ్ రెడ్డి
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: కథ- నిర్ణయం
రచయిత్రి: అనురాధ బండి
ఇరువురికీ అభినందనలు!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

నమస్కారం మేడం. మీరు ప్రచురించిన అపరాజిత స్త్రీ వాద కవిత్వం రెండు పుస్తకాలు కావాలి. మీ చిరునామా లేదా ఫోన్ నంబర్ ఇవ్వగలరు. విద్యార్థులకు తక్కువ ధరకు లభించే అవకాశం ఉందా ఏమైనా. దయచేసి కాస్త సహాయం చేయగలరు అని మనవి చేస్తున్నాను. మీ భవదీయుడు దాదా ఖలందర్ 9030746756
కందుకూరి దాదా ఖలందర్ గారూ! పుస్తకాల కోసం, ఇతర వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన ఫోను నంబరుని సంప్రదించండి. *అపరాజిత పుస్తకాన్ని ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే నెచ్చెలి ఇండియా ఫోను నంబరు (+917995733652) కి ఒక కాపీకి రూ.300 ఫోను పే ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ పంపించి, మీ అడ్రసు, ఫోను నంబరు తెలియపరిస్తే పుస్తకాన్ని పోస్టులో పంపిస్తాం.
అభినందనలు గీత గారూ. మీరు నడుపుతున్న నెచ్చెలి అచిరకాలంలో వెబ్ పత్రికలలో ప్రుమఖస్థానం పొందింది. మీకృషి శ్లాఖనీయం. తెన్నేటి హేమలత వంశీ జాతీయ పురస్కారం అందుకున్నసంధర్భ్ంలో అభినందనలు.
ధన్యవాదాలు మాలతి గారూ!
అభినందనలు గీత గారూ. మీకృషి శ్లాఘనీయం. హేమలత వంశీ పురస్కారం పొందినందుకు ప్రత్యేక అభినందనలు.
తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం లభించినందుకు గీతగారికి హృదయపూర్వక అభినందనలు. నెచ్చెలి మూడేళ్ల వయసు కే ఓ ఛైల్డ్ ప్రాడిజీ లా ఎన్నెన్నో విశేష అంశాలతో కొత్తగా,తాజాగా ప్రతినెలా విందు చేస్తూనే ఉంది. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు.
ధన్యవాదాలు సునీత గారూ!
ముచ్చటగా హాట్రిక్ జరుపుకుని బౌండరీ
లోకి అడుగుగిడుతున్న మీకు శుభాభిశందనలు.
శుభాకాంక్షలు.
ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ!