జ్ఞాపకాల సందడి-44

-డి.కామేశ్వరి 

 కావమ్మ కబుర్లు -20

         మా నాన్న క్లబ్ నించి తెచ్చే ల.న మ్యాగజైన్స్ లో భారతిలో ఒకే ఒక్క కథ వేసినా, ఎంత మంచి కథలుండేవో! అలా చదివిన పురాణం కథలలో ‘కోతి’ అనే కథ ఈనాటికీ నా మనసులో నిలిచిపోయింది. పురాణంవి ఎన్నో మంచి కథలు చదివి ఆయన అభిమానిని అయిపోయాను. 

         ఆయన, నీలి, సీతాజడ… పేర్లు గుర్తు లేవు. భమిడిపాటి రామగోపాలం అన్నా అభిమానమే. కథలంటే ఇప్పటిలా అయిదారు పేజీల కథలు కావు. కనీసం ఇరవై పేజీలు  ఉండేవి. ఒక జీవిత చిత్రణ ఉండేది. మధురాంతకం, కాళీపట్నం ఎవరు వ్రాసినా, పెద్ద కథలుండేవి. కథ అంటే అది. ఇప్పుడు వచ్చే వాటిని కథానికలు అనాలి. అలాగే నవల అంటే పేజీలు కనీసం రెండు మూడు వందలుండేవి. ఇప్పుడు వస్తున్నవి ‘నవలికలు’ అనాలి అని పురాణం వారే కాబోలు అన్నారు. 

         నవల అంటే సమగ్ర జీవిత చరిత్ర. అనేక పాత్రలు, అనేక సంఘటనలు, అనేక సమస్యలు, సమాధానాలు ఉండాలి. కథ అంటే ఒకటి రెండు సంఘటనలు, రెండు మూడు పాత్రలైనా ఉండాలి. 

         ఇంగ్లీష్ లో కూడా సోమర్సెట్ మాం లాంటి వారు అంత పెద్ద కథలే వ్రాసేవారు. మిగతావి అన్నీ వదిలేసి భారతిని మాత్రం కథల కోసం చదివేదాన్ని. మా నాన్న పెర్రీ మాసన్ కథలు విపరీతంగా చదివే వారు. మా ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటు అందరికీ – మా పిల్లలకి, మనవలకు, అక్కచెల్లెళ్ళ పిల్లలకు అబ్బింది.

         మా నాన్నకి జాతకాల పిచ్చి చాలా ఉండేది. ఉండటమే కాదు, నేర్చుకున్నారు కూడా. హస్త సాముద్రికం కూడా చూసేవారు. రోజూ పిల్లల చేతులు చూసేవారు. రోజూ మారిపోతాయా రేఖలు? ఊరిలోకి ఎవరు వచ్చినా అందరి జాతకాలూ వ్రాయించే వారు. 

         మాకు గోపీ అని ఒక తమ్ముడు ఉండేవాడు. మా అన్నయ్య తరువాత ముగ్గురు ఆడపిల్లలం పుట్టటంతో వాడంటే విపరీతమైన ఇష్టం. వాడికి సరిగా చదువు అబ్బలేదని బెంగ పడేవారు. మా ఇంట్లో మా అన్నయ్య ఎప్పుడూ ఫస్ట్ మార్కులతో పాసయ్యేవాడు. చదువు తప్ప ఆటపాటలుండేవి కాదు. 

         మా అక్క కూడా తెలివిగా, బాగానే చదివేది. ఎటొచ్చీ నేను, మా గోపీ తమ్ముడు చదువులో వెనకుండే వారం. నేను లెక్కల్లో ఎప్పుడూ జీరోనే. గోపీకి చదువు మీద దృష్టి ఉండేది కాదు. ఆటపాటల మీదనే కాలక్షేపం చేసేవాడు. అన్నయ్య లాగా ఇంజనీరింగ్ చదివించాలన్న కోరిక తీరక పోగా, ఎలాగో అలాగ ఇంటర్ గట్టెక్కాక, ‘నేను ఇంజనీరింగు లు అవీ చదవలేను, నాకు చదువు రాదు… ఎయిర్ ఫోర్స్ లో జాయినవుతాను…’ అని పట్టు బట్టాడు. 

         వాడికి చిన్నతనం నుంచీ కార్లు, మెషిన్స్, మెకానికల్ సైడ్ ఎక్కువ ఇష్టపడే వాడు. అన్నయ్య ఇంజినీరింగ్ అయ్యాక, నేవీలో చేరాడు. అప్పటికి ప్రైవేట్ ఉద్యోగాలు చాలా తక్కువ. ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ సైడ్ అంటే అమ్మా నాన్న అసలు ఒప్పుకోలేదు. వీడు ఇంట్లోంచి వెళ్ళిపోయి జాయిన్ అవుతానంటే నాన్న ఎంతో మందికి వాడి జాతకం చూపిస్తే, ‘ఏం ఫరవాలేదు, ఎనభై ఏళ్ళ ఆయుర్దాయం ఉంది’ అని చెప్పారు. 

         ‘వీడు పనికి రాకుండా అయిపోతాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతభత్యా లుంటాయి…’ అని ఆఖరికి ఒప్పుకున్నారు. దురదృష్ట వశాత్తు ఇంగ్లాండ్ లో ఫైటర్ ప్లేన్ ట్రయినింగ్ లో ఉండగా సముద్రంలో ప్లేన్ కూలి పోయి, మూడు రోజుల వరకు గాలించినా బాడీ దొరకనంత లోతుకెళ్లి చనిపోయాడు, మూడో రోజుకి దొరికింది. పట్టుమని 21 ఏళ్లకే నూరేళ్లు నిండాయి వాడికి.

         సాధారణంగా ఏదయినా ఆక్సిడెంట్ జరిగినపుడు ఒక బటన్ నొక్కితే బెల్ అవుట్ పైలట్ సీట్ తో సహా బెల్ట్ కట్టుకుంటారు. కనక వాడి దురదృష్టం కొద్దీ అవి తెరుచుకోలేదో, లేక వీడికి తెలియకుండా జరిగిందో…

         జాయిన్ అయి ట్రయినింగ్ పీరియడ్ లోనే ఇలా జరగడంతొ మా నాన్న తట్టుకోలేక పోయారు. ప్రెసిడెంట్, పీఎం., ఆనవాయితీగా ఉత్తరాలు రాసారు. మా అన్నయ్య వెళ్లి వాడి సామాను తెచ్చాడు మా ఇంటిలో అదొక ట్రాజెడీ 1963 లో. 

         అప్పటికి మా ఆఖరి తమ్ముడు పుట్టాడు. ఒక రోజు ఓ కోయవాడు వచ్చి, ‘నీకు ఆరుగురు పిల్లలే…’ అంటే అమ్మ, ‘కాదు ఏడుగురు!’ అంటే, ‘లేదు, నీకు ఆరుగురే ఉంటారు’ అంటే, అమ్మ ఆఖరు తమ్ముడు చిన్నప్పటినించి పాల ఉబ్బసంతో బాధ పడుతుండేవాడు. వాడికి ఏమన్నా అవుతుందేమో అనుకునేదట. మా నాన్నకి అప్పటికి జాతకాల పిచ్చి. వదిలింది. 

         నేను చిన్నప్పటి నుంచి చదువులో వెనకే . అయినా ‘ఈవిడ పేరు తెచ్చుకుని పైకి వస్తుంది’ అని జాతకంలో ఉంటే, ‘దీని మొహం! ఎలా పేరొస్తుంది? చదువే అబ్బలేదు. సంగీతమన్నా రాదు గొంతు బాగుండదు గదా! దేనిలో పేరొస్తుంది?’ అని కొట్టి పారేసారుట. 

         ఆఖరికి 1970లో అనుకుంటాను, నాన్న డెబ్బైవ ఏట ఒక సారి నేను ఈ ఊరు వచ్చినపుడు ఏదో అవార్డు – మాదిరెడ్డి సులోచన అనుకుంటా, మెడలో దండ, శాలువా, మెమెంటో పట్టుకుని, ఇంటికి వస్తే, ఆయన కళ్ళ నీళ్ళతో, ‘ఇది ఇంత పైకి వచ్చి పేరు తెచ్చుకుంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు… జాతకాల మీద నమ్మకం పోయినా, కొన్ని నిజమౌతాయి కాబోలు!’ అని కళ్ళు తుడుచుకుంటూ అత్తయ్యతో అన్నారు. 

కావమ్మ కబుర్లు – 21

         మా అక్క పెళ్లి 1949లో అయింది. అప్పుడు ఆవిడ మూడ్ సరిగ్గా లేదు.

         అసలు దాని చదువు యస్సెసెల్సీతో ఆపేసారని, కాలేజీలో చేర్పించలేదని అమ్మా నాన్నల పైన చాలా కోపంగా ఉండేది.

         ఆ రోజుల్లో నెలసరి వస్తే, మూడు రోజులు విడిగా ఓ గదిలో ఉంచేవారు. అక్కా, దాని ఫ్రెండూ కూడబలుక్కుని, విడిగా ఉండకుండా, ఇంట్లో కలిపేయటం ప్రారంభించారు. 

         ఒకసారి అక్క ఇంట్లో కలిపిన సంగతి గమనించలేదు అమ్మ. ఆవిడ, ‘ఏమిచేసిందో కూతురు!’ అని గాభరా పడిపోయి మా అత్తకి భయపడుతూ ఉత్తరం రాసింది. నాన్న అత్తయ్య వేరే ఊర్లో ఉండేవారు ఉద్యోగ రీత్యా. వాళ్లిద్దరూ భయపడిపోయి పరిగెత్తి వచ్చారు. అక్కను నానా విధాలుగా భయపెట్టి బతిమిలాడి ప్రశ్నించినా ఉన్న సంగతి  చెప్పలేదు. ఈ లోగా మళ్లి నెల వచ్చిన బయట కూర్చోలేదు.

         అప్పుడు మా అత్తయ్య అక్క సంగతి కనిపెట్టి నానా తిట్లు తిట్టి ‘అమ్మయ్య!’ అని శాంతపడి అప్పుడు మళ్ళీ ఊరికి వెళ్లారు. అలాటి తిక్కపనులు చేసి ఏడిపించేది. సరే, పెళ్ళిచూపులకి ఇష్టం లేకుండా పిలిచారని వాళ్ళ ముందు నిర్లక్ష్యంగా జవాబులు చెప్పడం. సంగీతం నేర్పించారు కొన్నాళ్ళు. ఫిడేలు వాయించి పాడేది. దాని గొంతు చక్కగా ఉండేది. పాట పాడమంటే ‘ఎంత నేర్చినా ఎంత చూసినా, ఎంత వారలైన కాంతాదాసులే’ అన్న కృతి ఎత్తుకుంది. మా నాన్న తరువాత దాని తిక్క వేషాలకి కొట్టినంత పని చేసారు. మానాన్న ఎప్పుడూ ఆడపిల్లల ఒంటి మీద చేయి వేయలేదు. మరీ కోపం వస్తే ‘దున్నపోతా!’  అనేవారు. మగపిల్లాడిని ‘గాడిద’ అనేవారు. ఎప్పుడూ ఒంటి మీద చెయ్యి వేయక పోయినా ఆయన్ని చూస్తేనే భయపడిపోయి, అయన వీథిలో ఉంటే పెరట్లో, పెరట్లో ఉంటే వీథిలో ఉండేవారం. అసలు ఆయన ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళు తిరుగుతుంటే, మేము అమ్మతో రామచంద్రపురంలో ఉండేవారం.

         అక్క పెళ్ళి కుదిరింది. అది ఎన్ని వేషాలు వేసినా, చక్కగా ఉండేదని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో ఐదు రోజుల పెళ్ళి ఖర్చు ఎంతో తెలుసా? ఎనిమిది వేలు – కట్నం, లాంఛనాలతో కలిపి.

         ఆ రోజుల్లో పెళ్లి అంటే ఎంత చాకిరో… ఇప్పటిలా కేటరర్స్, ఇంకా డబ్బున్న వాళ్లైతే ఈవెంట్ మేనేజర్ లు ఉండి అన్ని ఏర్పాట్లు చేయడానికి, మగ పెళ్లి వారితో పాటుగా వచ్చి వాళ్లతో పాటు కూర్చుని, భోజనం చేసి ‘తిన్నారా?’ అని అడగటానికి అలిసిపోతున్నారు ఆడపెళ్ళి వారు. అపుడు అడుగడుగునా మర్యాదలు. ముందు మగ పెళ్ళివారు తిని  లేచాక ఆడపెళ్ళివారు తినాలి. కాఫీ టిఫిన్లకి కూడా మేళంతో వెళ్లి, కావడిలో ఫలహారాలు పెట్టుకుని, పొద్దున్న సాయంత్రం వెళ్లి ఇచ్చి రావాలి.  ‘భోజనాలు రెడీ!’ అని ఒకసారి పిలవాలి.

అలా ఐదు రోజులూ…

  1. ఏదన్నా లోటు వస్తే ఆడ పెళ్ళివారు భయపడిపోయి దండాలు పెట్టి, ‘తప్పు అయిపోయింది’ అని క్షమాపణలు చెప్పాలి.
  2. ఇదంతా ఎందుకంటే రేపు అమ్మాయి కాపురానికి వెళ్ళాక, దెప్పి, సాధించి భాధలు పెడతారని. ఇదంతా వింటే ఇప్పుడు ఆడపిల్ల జీవితం ఎంత బాగుపడిందో తెలుస్తుంది.

         ఇంకా బోలెడు చాకిరీ… మొదలే పెట్టలేదు. మా అమ్మ పెళ్లి కుదిరాక రెండు మూడు నెలలు ఎంత పని చేసేదో!  ఆ విశేషాలు వింటే పూర్వపు పెళ్లి అంటే ఎలా ఉండేదో అర్థం అవుతుంది.

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.