మిట్ట మధ్యాహ్నపు మరణం- 21

– గౌరీ కృపానందన్

          “రాకేష్! ఆ పేరుగలవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి.”

          “ఈ అడ్రస్సే ఇచ్చారు మల్లీశ్వరం యూత్ అసోసియేషన్ క్లబ్బులో.” మాధవరావు అన్నాడు.

          “ఈ ఇంట్లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. నాలుగు ప్లాట్లలోనూ బాచిలర్స్ ఉన్నారు. ఎవరి పేరూ రాకేష్ మాత్రం కాదు.”

          “పోయిన సంవత్సరం ఆ పేరుగల ఎవరైనా అద్దెకు ఉన్నరా?”

          “సార్! నేను ఇక్కడ మేనేజర్ని. అద్దె వసూలు చేసుకోవడానికి మాత్రం వస్తాను. అప్పుడప్పుడూ వాళ్ళ వాళ్ళ స్నేహితులు కూడా వచ్చి స్టే చేస్తూ ఉంటారు. మీరు సాయంత్రం వస్తే ఆ సరికి ఆఫీసు నుంచి వచ్చేస్తారు. మీరు వివరాలు తెలుసుకోవచ్చు.”

          “సరే. సాయంత్రం వాళ్ళను ఎక్కడికీ వెళ్ళకుండా ఉండమని చెప్పండి.” మాధవరావు జీప్ లో ఎక్కారు. పేరు అడ్రస్ దొరికిన తరువాత కూడా కేసు ముందుకు సాగలేదు. ఇంకా డి.ఎస్.పి. దగ్గర చెప్పలేదు. హంతకుడు ఇంకా బెంగళూరులోనే ఉన్నాడా?

          ఆయన మనసులో ఆ వాక్యం మెదిలింది. “వస్తున్నాను….మాయ”  ఆకుపచ్చ రంగు సిరాతో వ్రాయబడింది.

          రాకేష్ సంతకం ఆకుపచ్చ రంగు ఇంకుతో. ఒక వేళ అతను ఉమను వెతుక్కుంటూ చెన్నైకి వెళ్లి ఉంటే? వెంటనే ఉమను కాంటాక్ట్ చేయదలచుకున్నారు మాధవరావు.

          డ్రైవర్ తో, “నేరుగా ఆఫీసుకు వెళ్ళు. మళ్ళీ ఇక్కడికి రావచ్చు.”

          ఆఫీసుకి రాగానే పేపర్లను తిరగేసి చూశాడు. ఉమ అడ్రెస్ దొరికింది. కాంటాక్ట్ నంబరు ఏదీ లేదు. పోస్ట్ ఆఫీసుకు ఫోన్ చేస్తే కబురు చేస్తారు. కాని దానికి ముందు హంతకుడు రాకేష్ అని నిర్దారణ చేసుకోవద్దా? డి.ఎస్.పి. తో మాట్లాడి సలహా అడుగుదామా? అన్నిటి కన్నా ముందు ఆ అమ్మాయికి ఒక టెలిగ్రాం పంపించుదామా? ఇది సబబుగా ఉన్నట్లు అనిపించింది. మెసేజ్ వ్రాశాడు.

          “రాకేష్ అన్న వ్యక్తి మిమ్మలిని కలిస్తే వెంటనే మాకు తెలియ పరచండి…. మాధవరావు.

          మాధవరావు మళ్ళీ ఆలోచించాడు. వెంటనే తమిళనాడు పోలీసులను  కాంటాక్ట్ చేసి … ఊహుం. కేసు ఇంకా స్పష్టంగా లేదు. మొదట రాకేష్ గురించి క్లియర్ గా ఏమీ తెలియదు. కొంచం తటపటాయించాడు. చురుకుగా, నైపుణ్యంగా కేసులను శోదించే మాధవరావు పప్పులో కాలు వేసింది ఇక్కడే. గ్రాఫాలజీ ఎక్స్పర్ట్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.

          “చాలా కష్టం సార్. ఇంగ్లీషు, తెలుగులో వ్రాయబడిన రెండు  వాక్యాలు. రెండింటినీ కంపేర్ చేస్తే ఆకుపచ్చ సిరాతో వ్రాయబడింది అన్న పోలిక తప్ప వేరే ఏ విషయాన్ని రూడీగా చెప్పలేము. ఇద్దరూ ఒకరే అయి ఉండవచ్చు. కాకపోవచ్చు.”

          మాధవరావు కాస్త ఆగదలచుకున్నారు. తొందరపడి టెలిగ్రాం పంపించదలచుకో లేదు.

          “కానిస్టేబుల్! ఆ టెలిగ్రాం  ఇప్పుడు పంపించకండి. కాస్త ఎంక్వయిరీ చేసిన తరువాత పంపిద్దాము.”

          మాధవరావు సాయంత్రం ఆ ఫ్లాటుకి వెళ్లినప్పుడు అతని కోసం ఎదురు చూస్తున్నారు, ఫ్లాటులో నివసించే వ్యక్తులు.

          “రాకేష్! అతన్ని నాకు తెలుసు.”

          “అతను ఎక్కడ ఉన్నాడు?”

          “ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ ఆరునెలల క్రితం నాకు రూమ్ మేట్ గా ఉన్నాడు.”

          “ఈ ఫోటో చూడండి. ఇతనేనా?”

          “అవును. ఇతనే. క్రికెట్ ఆడుతాడు. తెలుసు “

          “స్టూడెంటా?”

          “కాదు. లా చదివి ముగించాడు. ప్రాక్టీస్ చేయలేదు. వాళ్ళ నాన్నగారికి ఫ్యాక్టరీ ఉంది. మెషిన్ టూల్స్ ఫ్యాక్టరీ. అక్కడ అప్రెంటీస్ గా ఉండే వాడనుకుంటాను.”

          “ఫ్యాక్టరీ పేరు తెలుసా?”

          “తెలియదు. కానీ టెలిఫోన్ డైరక్టరీ ని చూస్తే గుర్తుకు వస్తుందను కుంటాను.”

          “కాస్త చూసి చెప్పండి. ఒక టెలిఫోన్ డైరక్టరీ ఎలాగైనా తీసుకుని రావయ్యా కానిస్టేబుల్.”

          “అది వచ్చేంత వరకు కాస్త రాకేష్ గురించి చెప్ప గలరా?”

          “కాస్త రిజర్వ్డ్ టైప్. షేక్స్పియర్ చదువుతాడు. మంచి రంగు. సున్నితమైన స్వభావం తనకి. చిరునవ్వుతో మాట్లాడుతాడు.”

          “వయసు?”

          “చాలా యంగ్! ఇరవై ఆరేళ్ళు ఉంటాయి.”

          మాధవరావు ఆ ప్రశ్నను అడగడానికి కాస్త తటపటాయించారు.

          “మిస్టర్ వాసుదేవన్! అతను హెయిర్ డై ఉపయోగిస్తాడా?”

          “మై గాడ్! ఎలా సార్ మీకు తెలుసు?”

          మాధవరావుకి ఉద్వేగం ఎక్కువై రక్తం వేగంగా ప్రవహించ సాగింది. బ్లడ్ ప్రెషర్ అధికమైనట్లు వేడిగా అనిపించింది. ఈజీ… ఈజీ… కొద్ది కొద్దిగా చేరువ అవుతున్నాను.

          “సరిగ్గా చెప్పండి. జుట్టుకు రంగు వేసుకుంటాడా?”

          “అవును సార్.”

          “తెల్ల వెంట్రుకల కోసమా?”

          “ఆ విషయం సరిగ్గా తెలియదు. ఒక సారి అతను గోద్రెజ్ హెయిర్ డై వేసుకుంటూ ఉండగా చూశాను.”

          “అతను ఎక్కడ ఉంటాడో ఇక్కడ ఉన్న వాళ్ళెవరికైనా తెలుసా?”

          వాసు తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అడిగాడు, “ఏం బ్రదర్? రాకేష్ అని ఒకతను తెల్లగా, ఎత్తుగా ఉంటాడు. క్రికెట్ కూడా ఆడతాడు. జ్ఞాపకం ఉందా?”

          వాళ్ళలో వాళ్ళు తగ్గు స్వరంలో మాట్లాడుకున్నారు కాని ఎవరూ చెప్పలేదు. పోలీసులను చూస్తే భయం. సాక్ష్యం కోసం కోర్టుకు పిలుస్తారేమో అన్న భయం!

          మాధవరావు అన్నారు . “జెంటిల్ మెన్! మీలో ఎవరికైనా అతని గురించిన వివరాలు తెలిస్తే చెప్పండి. పోలీసుకి చాలా సహాయంగా ఉంటుంది, ముఖ్యమైన హత్య కేసులో. మీరు ఎటు వంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మీకు ఏ విధంగానూ ప్రాబ్లం రాదు.”

          మౌనం..

          “వివరాలు మాత్రం చెబితే చాలు.”

          అప్పుడు కూడా ఎవరూ నోరు విప్పలేదు.

          టెలిఫోన్ డైరక్టరీ చేతికి వచ్చింది.

          “ఫ్యాక్టరీ పేరైనా గుర్తు చేసుకుని చెప్పగలరా?”

          “ఏ ఫ్యాక్టరీ సార్?”

          “మై గాడ్! ఇప్పుడే కదా అన్నారు. పీణ్యాలో మెషిన్ టూల్స్ ఫ్యాక్టరీ ఉందని.”

          అతను టెలిఫోన్ డైరక్టరీని తిరగేస్తూ ఉన్నాడు. “ఏ పేరు తెలియకుండా ఎలా వెతకడం?”

          “మరి డైరక్టరీ చూస్తే గుర్తుకు రావచ్చని మీరే కదా అన్నది?” గద్దిస్తున్నట్లు అన్నాడు మాధవరావు.

          ఇంతలో గుంపులోంచి ఒకతను, “ ఓ అతనా రాకేష్! ఎడం చేత్తో రాస్తాడు.” అన్నాడు.

          “కాదురా. అది శివకుమార్.”

          “ఇతను వికెట్ కీపర్ గా ఉండేవాడు కదూ.”

          వాళ్ళలో వాళ్ళే ప్రశ్నలూ జవాబులు.

          “సార్! ఇది చూడండి. బట్ ఐ యాం నాట్ ష్యూర్.”

          ఆదర్శ మెషిన్ టూల్స్. B-1-7 పీణ్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్, బెంగళూరు 5838417

          “ఎలా గుర్తుకు వచ్చింది?”

          “డైరక్టరీలో క్లాసిఫైడ్ లో ఈ కంపెని పేరున్నట్లు గుర్తు. ఇదేనని ఖచ్చితంగా చెప్ప లేను.”

          “ఇదే కూడా అయి ఉండవచ్చుగా?”

          “ఉండవచ్చు. ఎందుకైనా మంచిది. మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చుగా?”

          “రాకేష్ అక్కడ ఉన్నాడంటే, అది సరియైన ఇన్ఫర్మేషన్ గా మీరు తెలుసుకోవచ్చు కదా సార్.”

          “థాంక్స్. కానీ వాళ్ళ నాన్నగారికి పీణ్యాలో ఫ్యాక్టరీ ఉన్న మాట నిజమేగా?”

          “నిజమే సార్. అతనే స్వయంగా ఒక సారి చెప్పాడు.”

          “థాంక్స్. వస్తాను.”

          మాధవరావు బైటికి వస్తున్నప్పుడు కాస్త ఉత్సాహం తగ్గినట్లు అనిపించింది. జుట్టుకు హేయర్ డై ఉపయోగించే వ్యక్తి, పొడుగ్గా ఉంటాడు, క్రికెట్ ఆడతాడు … అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ కానీ ఈ రాత్రి పూట ఫ్యాక్టరీకి వెళ్లి ఏమని తెలుసుకోవాలని? ఎందుకైనా మంచిది. ఒక సారి ఫోన్ చేసి చూద్దాం. వాచ్ మాన్ అయినా ఉండడా.

          ఆఫీసుకి రాగానే ఫోన్ చేసి చూశాడు. చాలా సేపు రింగ్ అయ్యింది. ఎవరూ తీయలేదు. ఇంకో సారి చేసి చూద్దాం. తరువాత పెట్టేద్దాం అనుకున్నారు.

          ఒకటి… రెండు… మూడు… నాలుగు…

          ఎవరో తీశారు. “హలో!”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.