
అనుసృజన
సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్):
అనువాదం: ఆర్.శాంతసుందరి
ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని నుంచి నేను అర్థం చేసుకున్న దేమిటంటే, నేను కోరుకునేది కూడా నన్ను కోరుకుంటుంది. నా కోసం వెతుకుతూ, నన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. అర్థం చేసుకోగల వారికి ఇక్కడ ఒక గొప్ప రహస్యం కనిపిస్తుంది. 2. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే బాధపడకండి…వాళ్ళు వినేది మీ గొంతునే,కానీ వాళ్ళ మనసుల్లో వినిపించేది మాత్రం వాళ్ళ ఆలోచనల శబ్దమే. 3. అవతలివాళ్ళు చెప్పినట్టు చేశాను. గుడ్డివాడిగా ప్రవర్తించాను. ఎవరో పిలిస్తే వచ్చాను. దారి తప్పి పోయాను. అప్పుడు అందరినీ వదిలేశాను – నన్ను సైతం.తర్వాత అందరినీ తెలుసుకున్నాను – నన్ను కూడా.. 4. ప్రేమ ఒక భావన కాదు. అదే నీ అసలైన అస్తిత్వం. 5. ఏదో ఒకరోజు తెల్లవారే సమయంలో నువ్వు నీ లోపలి నుంచి ఉదయిస్తావు సూర్యుడిలా 6. కానీ నేను చెప్పేది వినండి.ఒక్క క్షణం దిగులుగా ఉండటం మానండి. దీవెనలు తమ పూలని మీ చుట్టూ రాలుస్తు న్నాయి. వినండి. 7. అవతలివారి హృదయాన్ని గాయపరచకండి. ఎందుకంటే దైవం ఉండేది అక్కడే. 8. అది సాధ్యం కాదు,’ అంది గర్వం.’అది ప్రమాదకరం,’ అంది అనుభవం.’ అది నిరర్థకం,’ అంది వివేకం.’ ఒక్కసారి ప్రయత్నించి చూడు,’ అంది రహస్యం చెపుతున్నట్టు హృదయం . 9. ఇన్ని యుగాలు గడిచినాసూర్యుడు ఎప్పుడూ భూమితో,”నువ్వు నాకు రుణపడి ఉన్నావు,” అనడు.అలాంటి ప్రేమ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి ! అది ఆకాశాన్నంతా వెలుగుతో నింపేస్తుంది. 10. నేను దేవుడి దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను.నేను క్రిస్టియననీ , హిందువనీ, ముస్లిమనీ , బౌద్ధుణ్ణనీ, యూదుననీ అనలేను.సత్యం నాతో పంచుకున్న విషయాలు అంతులేనివి. అందుకే నేను పురుషుణ్ణనీ, స్త్రీననీ, దేవదూతననీ, చివరికి పరిశుద్ధమైన ఆత్మనని కూడా అనలేను.ప్రేమ స్నేహంతో నన్ను పూర్తిగా వశపరుకుని నన్ను బూడిదగా మార్చేసిందిఇంత వరకూ నా మనసులో ఉండిన ఒక్కొక్క భావననీ, చిత్రాన్నీ తుడిచివేసి నన్ను విముక్తుణ్ణి చేసింది.
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
