మిట్ట మధ్యాహ్నపు మరణం- 22

– గౌరీ కృపానందన్

“హలో ఈస్ ఇట్ ఆదర్శ మెషిన్ టూల్స్ ?”

“రాంగ్ నంబర్.” అవతలి వైపు నిద్ర మత్తులో వినబడింది.

మాధవరావు ఫోన్ పెట్టేశారు. కాసేపు ఆలోచించాడు. డి.ఎస్.పి. కి ఫోన్ చేసి తాను ఇంత వరకు కనుగొన్న వివరాలను చెప్పాలా వద్దా?

తొందరపడుతున్నామేమో? ఒక సంతకం, ఒక ఉత్తరం పచ్చ రంగు సిరాలో ఉన్నంత మాత్రాన సందేహించ గలమా? డి.సి.పి. ఖచ్చితంగా చాలదు అంటారు. ఫోటో ఎన్లార్జ్ చెయ్యడానికి ఇచ్చింది రేపు వచ్చేస్తుంది. పార్కు ఫోటో, క్రికెట్ టీం ఫోటో ఒకే సైజుకి చేయించి, పోల్చి చూస్తే గానీ రుజువు కాదు. అప్పుడే రాకేష్ ని సందేహించడానికి ఆస్కారం ఉంటుంది. రేపు ఉదయం ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఎంక్వయిరీ చేసి రావాలి. ఫ్యాక్టరీ ఇంకా ఉందో లేదో. భగవంతుడా ఆ ఫ్యాక్టరీ ఇంకా అక్కడే ఉండాలి. పరిశోధన సగంలో ఆగిపోతే నా ఉత్సాహం నీరుకారి పోతుంది.

రాకేష్ ని కనుక్కోగలనా? ఒక వేళ అతనే హంతకుడు అయితే ఇంకా ఈ ఊళ్ళోనే ఉంటాడా, నా బుద్ది తక్కువ కాకపోతే. కానీ పరిశోధనకు చాలా సహనం, ఆఖరు వరకు ప్రయత్నాన్ని కొనసాగించే పట్టుదల ఉండాలి.

మాధవరావు ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి తొమ్మిదిన్నర దాటింది. ఆయన భార్య, “మీ కోసం రెండు మూడు సార్లు ఫోన్ వచ్చింది” అంది.

“ఎవరు? పేరు అడిగావా?”

“పేరు చెప్పలేదు.”

“ఆడా మగా?”

“మగ గొంతుకే.”

“ఇంకోసారి ఎవరైనా ఫోన్ చేస్తే పేరు అడిగి తెలుసుకో.”

“వాళ్ళు చెప్పందే.”

ఉదయం త్వరగాలేచి, టిఫిన్ ముగించుకున్నారు. పీణ్యాలో ఎంక్వయిరీ చేయడానికి బయలుదేరారు. అడ్రస్ తేలికగానే దొరికింది. “ఆదర్శ మిషిన్ టూల్స్” అన్న బోర్డును చూడగానే ఆయనకి ఉత్సాహం నమ్మకం కలిగాయి. చిన్న ఫ్యాక్టరీ. లోపల ఎటువంటి సందడి లేదు. వాచ్ మెన్ మాత్రం ఉన్నాడు. టీ తాగడానికి బైటికి వెళ్ళిన అతను ఇనస్పెక్టర్ ని చూడగానే దగ్గిరికి వచ్చాడు.

“త్వరగా రావయ్యా.”

పరిగెత్తినట్టే వచ్చాడు. “ఫ్యాక్టరీ ఈ రోజు సెలవండి.”

“ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు?”

“తెలియదండీ.”

“రాకేష్ ఇక్కడికి వస్తూ ఉంటాడా?

ఆ పేరు అతనికి పరిచయం లేదని అతని ముఖం చూస్తేనే తెలిసి పోయింది.

“నీకు పై అధికారి ఎవరు?’

“సెక్యూరిటీ ఆఫీసర్ అండీ.”

“ఆయన ఎక్కడ ఉంటారు?”

“తెలియదు అయ్యా.”

“ఏంటీ? ఏది అడిగినా తెలియదు అంటున్నావు. ఈ ఫ్యాక్టరీలో ఏదైనా దొంగతనం జరిగితే, అగ్నిప్రమాదం జరిగితే ఎవరికి తెలియ చేస్తావు?”

“టెలిఫోన్ నంబరు ఇచ్చారండి. బాబూ సార్ ది.”

“ఆ నంబరు ఇవ్వు.”

“ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తారండీ, అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూడడానికి.”

“సరే.” మాధవరావు ఎదురు చూస్తూ కూర్చున్నారు.

కాస్సేపటిలో బాబు వచ్చాడు. యువకుడే. సెలవురోజు కాబట్టి యూనిఫారం వేసుకోనట్లున్నాడు.

“మీ పేరు?”

“బాబూ జాన్.”

“మిస్టర్ బాబు! నేను రాకేష్ గురించి ఎంక్వయిరీ చేయడానికి వచ్చాను.”

అతని ముఖం మారింది. “ఏమయ్యింది? మళ్ళీ ఏదైనా చిక్కుల్లో పడ్డాడా?”

“లేదు. అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి.” హమ్మయ్య మొట్ట మొదటిసారిగా రాకేష్ అన్న మనిషి ఉన్నట్లు రూఢీగా తెలిసింది.

“అతను ఇక్కడికి రావడం లేదు.”

“ఆఖరు సారిగా ఎప్పుడు వచ్చాడో చెప్పగలరా?”

“ఎనిమిది నెలలకి పైనే అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అతను ఫ్యాక్టరీ చూసుకోవడానికి రావడం లేదు. వర్క్స్ మేనేజర్ గణేషన్ నిర్వాకాన్ని చూస్తున్నారు.”

“రాకేష్ ఎక్కడ స్టే చేస్తుంటాడు?”

“మీరు కేసు ఏమిటో చెప్పండి.”

“అతనితో మాట్లాడాలి అంతే.”

“ఏదైనా ప్రాబ్లమా?”

“లేదు లేదు. అనుమానం మాత్రమే. అతని తల్లి తండ్రులను కూడా చూడాలి.”

“తండ్రి జర్మనీలో ఉన్నారు. తల్లి లేదనుకుంటాను.”

“రాకేష్ ను నేను తప్పకుండా చూడాలి.”

అతను కాస్త తటపటాయించాడు.

మాధవరావు కాస్త ఆలోచించి, “ఏం లేదు. చిన్న ఎంక్వయిరీ. మీరూ నాతో రండి. మీరు కూడా అతన్ని చూసినట్లు ఉంటుంది.”

“అది కూడా మంచిదే” అంటూ జీప్ లో ఎక్కాడు. “పాలస్ అప్పర్ పాలస్ కి వెళ్ళండి” అన్నాడు. “అక్కడే ఉండాలి. ఫ్లాటు నేనే ఇప్పించాను. అతన్ని ఛూసి సంవత్సరం పైనే అయి ఉంటుంది. కాసెట్ ఏదో కొని ఇమ్మన్నాడు. అది తీసుకు వెళ్ళి ఇచ్చేటప్పుడు చూసింది. ఫ్యాక్టరీలో ట్రైనింగ్ తీసుకోమని చెప్పి పెద్దాయన ఇక్కడ వదిలి వెళ్ళారు. ఇతను ఆ పని తప్ప అన్ని పనులూ చేస్తున్నాడు. ఇప్పుడు కేస్ ఏమిటని మీరు ఇంకా చెప్పలేదు. డ్రగ్స్?”

“అదేదీ కాదు. జస్ట్ రొటీన్ ఇన్వెస్టిగేషన్.” అతడిని కన్ప్యూజ్ చేయదలచు కోలేదు. బాగానే సహకరిస్తున్నాడు.

“ఈ ఇల్లే.”

విడిగా ఉన్న ఇల్లు. వరండా. ముందు చిన్నగా తోట. కాలింగ్ బెల్ నొక్కాడు. కిటికీ తలుపులన్నీ వేసే ఉన్నాయి. గాజు తలుపుల ద్వారా లోపలికి తొంగి చూశాడు.

“కాస్త ఉండండి. నౌకరు అవుట్ హవుస్ లో ఉంటాడు. చూసి వస్తాను.”

మాధవరావు చూసినంత వరకు టేబుల్ క్లీన్ గా కనబడింది. గడియారంలో 1:07 అని ఉంది. ఎవరూ లేరు.

“ఎక్కడికి వెళ్లి ఉంటాడు?”

నౌకరు తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మాధవ రావును చూసి బ్రేక్ వేసినట్లు ఆగి పోయాడు. అతని చేతిలో తాళం చెవుల గుత్తి.

“అయ్యగారు రానే లేదే?”

“ఎన్ని రోజులయ్యింది?”

“ఒక నెల పైనే ఉంటుందండీ. తలుపులు తీయనా?”

“తీయి.”

సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూశాడు. అతను కాస్త ఇబ్బందిగా అన్నాడు. “ఎందుకని చెబితే మంచిది కదా.”

“చెబుతాను. లోపలికి వెళ్ళగానే చెబుతాను. తలుపు తియ్యవయ్యా.”

హాల్లో కాస్త దుమ్ము పేరుకుని ఉంది.

బాబు జాన్ అడిగాడు. “రోజూ శుభ్రం చేయవా నువ్వు?”

“వారానికి ఒకసారి చేస్తాను బాబూ. రాకేష్ అయ్యగారు అలాగే చెయ్యమన్నారు.”

“ఎక్కడికి వెళ్ళారో నీకు తెలియదా?” మాధవరావు అడిగాడు.

“ఊహుం. నాతో చెప్పరండి. ఉన్నట్టుండి వెళ్లిపోతారు. రోజుల తరబడి రారు. అలాగే ఉన్నట్టుండి ఏదో ఒకరోజు వస్తారు.”

గోడ మీద ఉన్న దినసరి కాలండర్ లో మార్చ్ 17 కనబడింది. మాధవరావు గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంది.

“ఇదేనా బెడ్ రూమ్?”

మంచం మీద పరుపు చాలా రోజులుగా వాడనట్లు కనబడింది. డ్రస్సింగ్ టేబుల్ మీద హేరాయిల్, హెయిర్ బ్రష్, పవుడర్, గోద్రెజ్ హెయిర్ డై.

కబోర్డులో ఉన్న డ్రాయర్ లను ఒక్కొక్కటిగా లాగి చూశారు. ఉత్తరాలు, డైరీలు. నాలుగో డ్రాయర్ లాక్ చేసి ఉంది.

“ఈ డ్రాయర్ కీస్ నీ దగ్గర ఉన్నాయా?”

“లేవండీ. ఆయన దగ్గరే ఉన్నాయి.”

“ఒక గునపం తీసుకుని రా.”

“ఇనస్పెక్టర్! ఐ అబ్జెక్ట్!”

“ఆల్ రైట్! సెర్చ్ వారంటుకి ఏర్పాటు చేస్తాను. పక్కన టెలిఫోన్ ఉందా?”

“పక్క ఇంట్లో ఉంది సార్.”

“మీ పేరు ఏమిటి?”

“రాం మోహన్.”

“మిస్టర్ రాం మోహన్. కొంచం సేపు వెయిట్ చేయగలరా?”

“కేసు ఏమిటో చెప్ప కూడదా సార్?”

“పూర్తిగా సెర్చ్ చేసిన తరువాత చెబుతాను. ఇల్లీగల్ గా ఏదీ చెయ్యడం నాకు యిష్టం లేదు. ఐ విల్ గెట్ ఎ సెర్చ్ వారంట్ ఫస్ట్.”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.