బతుకు చిత్రం-31

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత  

***

          ఊరంతా వసంతను గురించిన ముచ్చటనే మాట్లాడుకుంటాడ్రు. వసంతను ఈడికే తెస్తారని. గలుమట్ల ఏసి పంచాయిది వెట్టి పైసలు గుంజుతరని ఒగరు, లే ..లే ..అల్లుడని గూడ సూడకుంట ఈపు ఇమానం మొగిచ్చి సాపు జేసి పోతరని ఒగరు, ఎహే ..!గట్లేట్ల అయితది? ఈళ్ళు ఈ పాటికే బిస్తరు గడుతాండ్రు గావచ్చు. దేన్కపోను. అని ఒగరు
ఎవరికీ తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుండగా వసంత శవం రానే వచ్చింది.

          ఏం జరుగుతదోనని అందరు ఆసక్తిగా చూడ సాగారు. కానీ, తీసుకచ్చినంత సేపు గూడ ఉంచకుండా తతంగమంత పూర్తి చేసి స్మశానానికి చేర్చి దహనకార్యం చేసి వచ్చారు.

***

          జాజులమ్మ ను సైదులు అడిగాడు. ఊళ్లే ఎవలదన్న పీనుగ లేసిందా? అని.

          ఏందయ్యా? గట్లడుగుతవు? మంగళమ్మ పాలోళ్ళు అని నీకు ఎరుకగా లేదా?

          అయింది గని, ఆమెను ఇటే తెచ్చిన్ద్రాని?

          ఇటే తెచ్చిండ్రు ముత్తమంత సేపు గూడ ఉంచలే, కాలేసి వచ్చిండ్రు.

          అవునా! వాళ్ళు కాలేసిన్ద్రా? అన్నాడు కొంచెం సంబరపడుతూ.

          జాజులమ్మ, అదేంది? నువ్వెందుకో సంబురపడుతానట్టున్నావ్?

          లోపల సరూప చెప్పినట్టు బొక్కలు దొరుకుతానాయని సంబురమున్నా, కాదు …కాదు …తాగి ఏం లోల్లులు పెట్టుకోకుండా అయినయని, గంతే అన్నడు.

          సరే, గని ఆ ముచ్చట ఇడ్సి పెట్టు గని, కమల నీరసంగా ఉంటాంది. ఏందో అడుగ పోయినావ్ ?

          నేను అడుగుడేంది? అవ్వ, నువ్వు ఉన్నంక.

          గట్ల గాదు. ఎంత రెండో భార్యైనా, ఆమెకు గూడ కొన్ని కోరికలుంటయ్. అవి మాతోని
గాక నీతోని జెప్పుకోవాలనే ఆస సుతం ఉంటది. కాబట్టి ఈసారి పరీచ్చలకు నువ్వే తోల్క  పోవాలె.

          ఎప్పుడున్నది?

          రెండు ,మూడు రోజులల్ల.

          అబ్బో ..! ఈ తాపకు నాకు తీరదు గని, నువ్వే పో .!

          గదేంది, ఒక్క రోజు కూలి, కంటే కమల బాగు ముఖ్యం. రేపే తొలక పో ..!

          రేపు ఇంక అస్సలే కుదరదు.

          ఏం ..?

          మూడో రోజు దినం పుట్టియ్యక ముందే బొక్కలు ఎరుకచ్చుకోవాలని లేకుంటే వీలు
గాదని, అదంతా జాజులమ్మకు చెప్పలేక, అన్ని నీకు చెప్పాల్నా? సప్పుడు జేకుండు అన్నాడు లేని కోపం తెచ్చుకుంటూ గట్టిగా.

          పిల్లలతో సహా అందరూ అక్కడికి చేరారు.

          జాజులూ! ఏమాయెనే? అడిగింది ఈర్లచ్చిమి.

          ఏమీలే అత్తా! నన్ను రేపు కయికిలికి పోకు అంటాండు. నిమ్మలంగ చెప్తే ఇంటలే నని కోపం చేత్తాండు, గంతే.

          మాట మార్చిన జాజులును చూసి సైదులుకు బాధ కలిగింది. అనవసరంగా తనను
కోపగించుకున్నానని .

          కమలను చూసి, తిన్నావా? అడిగాడు.

          కమల తిన్నానన్నట్టుగా తలూపడంతో,

          ఎల్లుండి దవాఖానాకు బోదం, ఈ తాపకు నేనే వత్త, అన్నడు.

          కమలకు చాలా సంతోషం కలిగింది. తనను తానె తీసుకుపోతాననడం.

          ఈర్లచ్చిమి జాజులు మొకంలో సంతోషం జూసి, లోపల అనుకున్నది. మొగుణ్ణి
ఒప్పించిందని, వాణ్ని ఎనుకేసుకచ్చిందని తెలుసుకున్నదయి, సవితి పోరు లేక పోవడం కమల అదృష్టమని అనుకున్నది.

***

          మరునాడు సైదులు హడావిడిగా లేచి బయటకు వెళ్ళడం గమనించింది జాజులమ్మ.

          సైదులు సరాసరి స్మశానంకు నడుస్తుండగా …..సరూప ఎదురచ్చింది. ఆశ్చర్య పోయాడు, నువ్వు ఇటేక్కడికి? అన్నాడు.

          నాకు తెలుసు, నువ్వు ఈ పనే చేత్త్వని, నిన్ను ఊ కంట కనిపెడుతనే ఉన్న. అలుకు జల్లపెండ కోసమని ఇటత్తె నువ్వే ఎదురయినవ్. నిన్ననే నీకు చెప్పుదా మనుకున్న. ఇట్ల నడుమిట్ల పానం తీసుకున్నోళ్ళ బొక్కలు పనికి రావు. ఎవలికి వాళ్ళు ఉసురు తీసుకోవడం, తియ్యడం మహా పాపం గదా! అందుకని అవి అక్కరకు రావు. నేను చెప్పినాయనను కలువు. మాపటికి ఓపారి రా! ఇంకా ఎక్కువ సేపు ఉంటె ఎవరన్న జూత్తే బాగుండదు, అనుకుంటూ వెళ్ళిపోయింది.

          సైదులు ఆమె చెప్పింది విని నీరసించాడు. నిరాశగా వెనుదిరిగాడు.

          జాజులమ్మ చూసింది. అదేమిటో ఎలాగయినా కనుక్కోవాలని అనుకున్నది.
సాయంత్రం తను పనిచేసే దగ్గరకు వెళ్ళయినా విషయం తేల్చుకోవాలని ఆ మాటే
చెప్పింది సైదులుతో .

          సమయం వచ్చినప్పుడు నేనే చెప్త గని ఇప్పుడు నన్ను ఇసిగియ్యకు అన్నాడు.
జాజులమ్మ ఊరుకుండి పోయింది.

***

          పనికి వెళ్తుండగా ఒక కొత్త మనిషి సైధులు కోసం రావడం గమనించింది. అతనిని ఎక్కడో చూసిన యాది కలిగి గుర్తు చేసుకోసాగింది.

          అవును ..అతను కాటికాపల వాడు. తమ ఊర్లో ఎవరో చనిపోయినప్పుడు వచ్చి అడిగిన డబ్బులు ఇచ్చే దాకా పట్టుపట్టి అమాంతం పేర్చిన చితి పై పండి చేసిన ఒళ్ళు గగుర్పొడిచే ఆ విన్యాసాలు గుర్తుకు రాగా ఒక్క సారి భయంతో వణికి పోయింది. ఈమె ఆలోచనల్లో ఈమె ఉండగానే అతను మాట్లాడి వెళ్ళిపోయాడు.

          జాజులమ్మను చూసి సైదులు అర్థం చేసుకొని రమ్మని పిలిచి తనతో పాటు సైకిల్ పై ఎక్కించుకొని ఊరు చివరికి చేరుకున్నాడు.

          ఎవరూ తమను చూసే వీలు లేని దాపు చూసుకొని కూర్చుండబెట్టి సరూప తనతో చెప్పిన సంగతి ఏది దాచకుండా పూసగుచ్చినట్టుగా చెప్పేశాడు.

          నాకు అవ్వకు ఖరీదయిన మందులు ఇప్పిచ్చే స్తోమత లేదు. కనీసం దీనితో నయినా అవ్వ బతికితే అదే పదివేలు అనుకున్నాను, అందుకే మొన్న వసంత చావు తెలిసి సంబరపడ్డాను, నా పని అవుతుందని. కానీ, అవి పనికి రావని చెప్పడంతో ఆమె చెప్పిన ఈ కాటికాపల వాడిని కలిశాను. కానీ, అతను కూడా బొక్కలు ఇవ్వడానికి చానా పైసలు అడుగుతున్నడే! నన్ను ఏం చేయ్యమంటవే? జాజి! అని గొల్లుమన్నాడు.

          జాజులమ్మ సైధులు బాధ అర్థం చేసుకున్నది.

          చూడయ్యా! గుండెలు దీసి గుండెలు పెడుతూ, చనిపోయిన వాళ్ళ కళ్ళు దీసి
చూపులేని వాళ్ళకు పెడుతూ డాక్టర్లు దేవుల్లాయి నయం చేస్తుంటే ఇంకా అగ్యానం తోటి ఇట్లాన్టీ వాళ్ళను నమ్మడం రీతి గాదు. నా మాట ఇని ఆ ప్రయత్నాలు మానుకో. నిమ్మళం గా ఉండు. దారి దొరుక పోదు,

          పదా! ఇంటికాడ అందరు మనకోసం చూస్తున్నారు గావచ్చు, అని ఇంటి ముఖం పట్టారు.

          వచ్చే దారిలో చెరువు కట్టమీద చేపలు పట్టి అమ్ముతుంటే తీసుకున్నది.

          ఇప్పుడు చాపలేన్దుకే? మనసు ఆగమాగం ఉంటె? అన్నాడు.

          అది ఇంటి బాధ్యత గల మనం చూసుకోవాలె, గని మన  పొల్లగాండ్లు, అయ్యవ్వ లకు, కమలకు ఎరుక జేయ్యద్దు గదా! వాళ్ళకు మంచి తిండి పెట్టాలె గదా! ఇంట్ల అందరికి ఇష్టమేనాయే! అని మాటల్లో ఇల్లు చేరుకున్నారు.

          ఈర్లచ్చిమికి చాపలు అప్పగించి కూలికి బయలుదేరింది. కైకిలి కాడ అందరు వసంత ముచ్చాత్నే అనుకోసాగారు.

          మనుమరాండ్లు ఆగంయితరని వసంత తల్లిదండ్రులు అత్తగారి గురించి ఏం శికాయిదులు చెప్పలేదట. మా బిడ్డే పాణం మంచిగా లేక అట్ల చేసుకున్నదని కేసులు లేకుంట చేసింద్రట.

          వింటున్న కొద్దీ జాజులమ్మకు తన అత్త మంచితనం, ఆమెకు వచ్చిన రోగం గుర్తుకు రాగా కంట నీరు దిరిగాయి. అంత మంచి మనిషికి రాకూడని జబ్బు ఎలా ఇచ్చావయ్యా దేవుడా అని కుమిలి పోసాగింది.

          గమనించినట్టె తన తోటి పని కచ్చిన గంగావ్వ అడగనే అడిగింది. 

          ఏందే? పొల్ల? పని సాగదీస్తాన్నావ్? మనసు ఇంటికి పోయినాదే? అని.

          లేదత్తా !ఎగిరం ఏమున్నదని ?అన్నది.

          ఎగిరం ఎందుకు లేదే పిస్సదానా? ఊల్లెకు ఆడోల్లకు పరీచ్చలు చేయ్యనికి ఫ్రీగా
పెద్ద డాక్టర్లు పట్నం నుండి అత్తాన్రట. కానియ్ ..కానియ్ అని తొందర పెట్టింది.

          అమ్మో !మల్ల పరీచ్చాలా ?ఈసారి మళ్లేం బయటవేడుతరో ఏమో, నేనయితే పొయ్యేదేలేదని మనసుల గట్టిగ అనుకున్నది.

          ఇంటికి పోయి బియ్యం జేసుకోవాలే! అత్తకు రికామన్న ఇయ్యాలె అనుకున్నాది.

          అందరు ఆ పూట పని ముగించి ఇంటి బాట పట్టారు.

***

          జాజులూ! ఊళ్ళెకు డాక్టర్లు అచ్చిండ్రట. ఈ మధ్యన నడుమునొప్పి అనుకుంటివి
గదా! అట్నే బలానికి ఏమన్న గోలీలు ఇత్తరేమో పోయిరాపో !అని ఈర్లచ్చిమి అంటే ,
నేను పోనత్త నాకు మంచిగనే ఉన్నద్ధి. ఆడెంతమందో పని తెర్లయితది. అనుకుంటూ
బియ్యం చెరగడం మొదలుపెట్టింది.

          అప్పుడే అట్నుండి వెళుతున్న చంద్రమ్మ జాజులును చూసి ఇంట్లోకి వచ్చింది.
ఏమే పిల్లా! బియ్యం చేత్తానవ్! ఒక్కదానివే చెయ్యక పోతే మీ సమితి, మీ అత్త గూడ ఓ చెయ్యి ఎయ్యక పోయిండ్రా? అని జల్లెడ తీసుకొని తిప్పడం మొదలు పెట్టింది.

          ఇవి ఏ పాటి అత్తా !అత్తమ్మ పోలగాన్డ్లను చూసుడుకే సగం అయితాంది. ఇగ కమల వట్టి మనిషి గాదాయె !

          అవునే !నేను మర్సేపోయిన. ఔ పొల్ల మరి ఒడెప్పుడు నింపుతానవ్ ?

          ఆమె తను ఇప్పటి వరకు ఆలోచించని విషయం అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అత్తమ్మ మంచి రోజు చూపిత్తన్నన్నది , నేను అడుగుడే మర్సిన మంచిగా యాది చేసినవ్ అత్తా !

          ఆడదానికి ఉన్న సంబురాలు గవ్వే గదేనే , అయినా ఈర్లచ్చిమి మరువదులే, మన్చి రోజు చూపించే ఉంటుందిలే.

          నీకు కండ్ల పండుగోలె జెయ్యలే. ముత్తయిదువల పిలిచి కన్న బిడ్డకు చేసినట్టే
చేసే. ఆయింత కమలకు సుత చేత్తే ఆమెకు గూడ తుర్తిగా ఉంటది అని చాలా సేపు వసంత ముచ్చట అదోటిదోటి మాట్లాడి వెళ్లిపోయింది.

          చంద్రమ్మత్త ఎంత మంచిది కాకుంటే కమలకు సుత శ్రీమంతం చెయ్యాలని
చెప్పింది. తమకు ఇంత వరకు ఆ ఊసే లేదు అనుకోని, పోలగాండ్లను బయటికి తీసుకెళ్ళిన అత్త రాగానే చంద్రమ్మ వచ్చి వెళ్ళిన సంగతి చెప్పింది.

          కరువుల కక్కచ్చే అన్నట్టు నా పాణమే బాగుంట లేదాయే, అందరం కూసోని
తినవడితిమి. నువ్వు ఒక్కదానివి ఎట్లా ఎల్లదీస్తావ్? ఏదో ఓ రోజు ఇంత శావాలు వండి
పెడుదం తీయ్! అని అన్నది.

          ఆమె అన్నది నిజమే అయినా కమలకు కూడా ముచ్చట ఉంటది గదా! ఎట్లన్న ఆ వేడుక జరిపియ్యాలె ఈయన తోన్ని మాట్లాడాలె అని ఎట్లెట్ల ఏమేమి చెయ్యాలో ఎంత
ఖర్చు అయితదాని లెక్కలు మొదలు వెట్టింది.

          సైదులు రాగానే తను అనుకున్నది చెప్పింది.

          సైదులు కూడా ఈర్లచ్చిమి లెక్కనే అన్నాడు, రాజయ్య మాత్రం చేస్తేనే బాగుంట దని వత్తాసు పలికాడు.

          అయ్యవారిని అడిగిరా మావా! అని పురమాయించింది.

          ఈర్లచ్చిమి జాజులమ్మ ఉత్సాహాన్ని చూస్తూ ఉండిపోయింది. కమల లోపల సంతోషించింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.