అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 6

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తి చేసి, ఎం.బి.ఏ లో చేరింది. అనుకోకుండా మొదటి వివాహ సంబంధం రాగానే పెళ్ళి కుదిరింది. తన స్నేహితులని పెళ్ళికి రమ్మని ఆహ్వానించింది. విశాల, విష్ణుసాయి వివాహం వైభవంగా జరిగింది. పెళ్ళవగానే ఇద్దరు రిజిష్టర్ ఆఫీసులో మేరేజ్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అనుకున్నవిధంగా విష్ణుసాయి, విశాలకు కూడా ఆస్ట్రేలియా వెళ్ళడానికి పాస్ పోర్ట్ అప్లై చేసాడు…

***

          జీవితం ఒక చదరంగం. చదరంగం ఆటలాగే ఏ ఒక్క రోజు ఎపుడూ ఒకేలా ఉండదు. మనిషికి మనిషికి మధ్య అనుబంధం పెరిగినపుడు జీవితంలో విలువలు, ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి.

          విశాల ఇపుడు పెళ్ళి అయి వైవాహిక జీవితంలోకి అడుగిడిన తరుణంలో, క్రొత్త ఆశలు మ్రొగ్గ తొడిగి చిగురిస్తున్న వేళ, ఎన్నో మధురోహల పరిమళాలతో విష్ణుసాయి తన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తున్నాడనే చెప్పాలి. మనసులో భవిష్యత్తు పై ఒక క్లారిటీ రావడంతో, విశాల ఫైనల్ ఇయర్ ఎం.బి.ఏ పరీక్షలు ఆషామాషీగా పూర్తి చేసేసింది. తన ప్రోజెక్ట్ కి థీసీస్ కూడా సబ్మిట్ చేసింది.

          అడపా దడపా ఇటు అత్తవారింటికి, పుట్టింటికి మధ్య తిరుగుతోంది. శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో అత్తవారింట చేసుకుంది. అక్కడ అందరి ప్రేమాభిమానాలు చూరగొంది విశాల.

          ఒకరోజు విష్ణుసాయి బెంగుళూర్ నుంచి వచ్చి విశాలతో తన అక్కగారింటికి వెళ్ళాడు. బావగారు వెంకట్ పేరొందిన బిజినెస్ మెన్. ఇద్దరినీ చూసి అభినందిస్తూ ఇలా అన్నారు.

          “అమ్మా విశాలా! ‘వివాహం, విద్యా నాశయ!’ అన్న నానుడి తప్పు అని నిరూపించా వు. పెళ్ళి అయినా కూడా ఏ మాత్రం చెక్కుచెదరకుండా, డిస్టింక్షన్ లో ఎం.బి.ఏ పూర్తి చేసావు. కంగ్రాట్యులేషన్స్! మున్ముందు కూడా మీ ఇద్దరి జర్నీ ఆస్ట్రేలియాలో అధ్బుతం గా కొనసాగాలి” అంటూ ఇద్దరినీ దీవించి వాళ్లకి బట్టలు పెట్టారు.

          విశాల చిరునవ్వుతో, “అన్నయ్యగారు, చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ నాకు ఇస్తున్న ప్రోత్సాహం చాలా విలువైనది.”అంది.

          విశాల, విష్ణు అక్క, బావల కాళ్లకి దణ్ణం పెట్టారు.

          “అవును, ఆస్ట్రేలియా అంటే గుర్తొచ్చింది. నాకు తెలిసిన క్లయింట్స్ సిడ్నీలో ఉన్నారు. వాళ్ళ వివరాలు ఇస్తాను. నిజంగా ఆస్ట్రేలియా చాలా అందమైన దేశం. వెరీ పీస్ ఫుల్ కంట్రీ. దే ఆర్ ఫన్ లవింగ్ పీపుల్. టైమ్ కి చాలా విలువనిస్తారు.”

          వెంకట్ చెపుతున్న విషయాలని ఇద్దరూ శ్రద్ధగా విన్నారు.

          విష్ణుసాయి తనవైపు బంధువుల అందరి ఇళ్ళకి విశాలతో వెళ్లి వస్తున్నాడు. మరో ప్రక్క విశాలకు పాస్ పోర్ట్ అప్లై చేసి ఆస్ట్రేలియా వీసా కోసం ప్రయత్నాలు చేస్తూ కన్సల్టెం ట్ ని కలిసి వచ్చారు.

          అలా రోజులు ఆనందంగానే గడిచిపోతున్నాయి. విశాల క్రొత్త జీవితంలో వచ్చిన మార్పులకు అలవడుతూ, నూతన పరిచయాలు చేసుకుంటోంది.

          ఒక రోజు తను, విష్ణుసాయి అత్తగారింట్లో అందరూ కలిసి రెస్టారెంట్ లో బావగారి  అబ్బాయి పుట్టిన రోజు వేడుకలకి వెళ్ళారు. రోజంతా పాటలతో, సందడిగా గడిచింది.

          ఇంటికి వచ్చి, హాలులోకి అడుగు పెట్టగానే, ఫోన్ రింగవుతోంది. విశాల వెంటనే వెళ్ళి ఫోన్ ఎత్తింది.

          “విశాలా, నేను నీకు మధ్యాహ్నం నించి ఫోన్ ప్రయత్నిస్తున్నాను. తాతగారి పరిస్థితి ఏమి బాగాలేదు. నేను, అమ్మ ఇపుడే బయలుదేరి వెడుతున్నాము.”

          “నాన్నగారు, ఏమైంది తాతయ్యగారికి? నేను కూడా వస్తాను,” అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది.

          “నువ్వు కంగారు పడకు, వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాము.”

          విశాల మనసు మనసులో లేదు. పెళ్ళి అయిన తరువాత మళ్ళీ తాతగారిని కలిసే అవకాశం రాలేదు. విశాల అత్తగారు వచ్చి విషయం తెలిసాక,

          “నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు కష్టపెట్టుకోకు. రేపు మీరు ఇద్దరు ఆస్ట్రేలియా ఎంబసీకి వెళ్ళాలి కదా అది గుర్తు ఉంచుకో.” అన్నారు.

          విష్ణుసాయి వచ్చి, “విశాలా, నువ్వు అక్కడకు వెళ్ళి చేసేదేమి లేదుకదా. ఉయ్ విల్ సెండ్ అవర్ ప్రేయర్స్”అన్నాడు.

          విశాలకు మనసులో ఒక్కసారిగా వైరాగ్యం ఆవరించింది. గత నెల రోజులుగా విందు లు, వినోదాలు వీటితో తనవాళ్ళెవరూ గుర్తుకు రాలేదు.

          తాతగారికి సీరియస్ అని తెలిసాక, తాతగారితో అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడాయి.

          అన్యమనస్కంగానే ఆ రోజు విశాల ఉంది. విష్ణు, విశాల కలిసి ఆస్ట్రేలియా ఎంబసీకి ప్లైయిట్ లో ఢిల్లీ వెళ్ళారు. అక్కడ పని పూర్తి చేసుకుని, తిరిగి హైద్రాబాద్ వచ్చేసారు.

          విశాల కేవలం భౌతికంగానే ఇక్కడ అత్తవారింట్లో ఉండి, అన్ని పనులు యాంత్రికం గా చేస్తోంది. మనసంతా తాతగారి చుట్టూ తిరుగుతోంది.

          ఆ రోజు మధ్యాహ్నం విష్ణు ఇంటర్నెట్ లో చూసి, విశాలతో ఆనందంగా,

          “యస్ ఎవ్విరిథింగ్ ఈజ్ క్లియర్ నౌ, నీకు వీసా అప్రూవ్ అయింది” అనగానే, అందరూ కంగ్రాట్స్ చెప్పారు.

          అపుడే మళ్ళీ ఫోన్ రావడంతో, విశాల ఆదుర్దాగా ఫోన్ తీసింది.

          అక్కడ నుంచి తండ్రి,“విశాల, తాతగారు ఈజ్ నో మోర్. చాలా సునాయాస మరణం. ఇబ్బంది పడుకుండా వెళ్ళిపోయారు. నువ్వు జాగ్రత్త.” అని ఫోన్ పెట్టేసారు.

          విశాల నోట మాట రాకుండా అలాగే ఉండి పోయింది. వెక్కి వెక్కి ఏడుస్తుంటే అత్తగారు వచ్చి సముదాయించి, “నువ్వు బాధ పడకు. మనసు దిటవు చేసుకో. నువ్వు వెళ్ళే పరిస్థితిలో లేవు కదా. విష్ణూ, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. కాస్త ధైర్యంగా ఉండాలి నువ్వు. ఆయన ఆశీస్సులు నీ వెంటే ఉంటాయి.”అన్నారు.

          విష్ణుసాయి, విశాలని తీసుకుని వాకింగ్ కి వెళ్ళాడు.

          “నీ బాధ నాకు అర్థమౌతోంది విశాలా! నువ్వు ఇంటికి పెద్ద మనవరాలివి, మన ఇద్దరినీ పెళ్ళి మండపంలో నిండు మనస్సుతో దీవించారు. ఆయన చల్లని మనసు ఇపుడు సేద తీరుతోంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సునాయాసంగా వెళ్ళిపోయారు, నువ్వు నీ మనసులో బాధంతా నాతో పంచుకో.”

          విశాల ఆ మాటలతో కాస్త ఊరట చెందింది. తాతగారితో చిన్నప్పటి నుంచి జరిగిన తీపి గుర్తులని నెమరువేసుకుంటూ అన్నీ విష్ణుసాయితో పంచుకుంది.

          దూరాభారాలు మనుషుల మధ్య అగాధాలను సృష్టిస్తున్నాయి కదా…

          అవసరమైనపుడు ఆఖరిచూపుకోసమైనా వెళ్ళలేని నిస్సహాయ స్థితి. కొత్త పెళ్ళి కూతురు, వ్రతం నాలుగువారాలు చేయాలి అని అత్తగారు చెప్పడంతో విశాల మారు మాట్లాడలేకపోయింది.

          తల్లీ,దండ్రీ తిరిగి వచ్చాక వారిని కలుసుకుని తాతగారి ఆఖరి క్షణాలు గురించి చెపుతుంటే వింది. తాతగారు విశ్వనాథంగారి ఫోటో చూస్తూ, చెమర్చిన కన్నులతో, “తాత గారూ! మీరు నా మనసులో ఎప్పుడూ శాశ్వతంగా నిలిచి ఉంటారు. చక్కని దస్తూరి, తెలుగు భాషలో నుడికారాలు, శ్లోకాలు ఎన్నో నేర్పించారు. మీరు భగవంతుని సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నారని నమ్ముతున్నాను” అని తన మనసులోని భారాన్ని దించుకుంది.

          ఆ ప్రొద్దున్న యూనివర్సిటీ నుంచి ఫోన్ రావడంతో కాన్వొకేషన్ ఇన్విటేషన్ వచ్చే వారం అని తెలియటంతో సంతోషంగా విష్ణుకి చెప్పింది.

          రెండేళ్ళ కష్టానికి, తను సాధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీడిష్టింక్షన్ కి గాను పత్రం వైస్ ఛాన్స్ లర్ చేతుల మీదుగా అందుకుంది. చేత్తో తనివితీరా ప్రతి అక్షరాన్ని స్పృశిం చింది విశాల.

          మనసులో తన ఇష్టదైవానికి కృతజ్జతలు సమర్పించుకుంది.

          అకడమిక్ వర్క్ పూర్తి కావడంతో విశాలను బెంగుళూర్ రమ్మని విష్ణు ఫ్లైయిట్ బుక్ చేసి తీసుకెళ్ళాడు. బెంగుళూర్ లో కన్నడ భాష. ఆ విధంగా అక్కడ కొన్నిపదాలు నేర్చు కుంది. ‘భలే, రెండు భాషలు అక్క, చెల్లెళ్ళలా ఉన్నాయి.’ తెలుగు, కన్నడ లిపిలో దగ్గర పోలికలు గమనించింది. ఆ రోజు విష్ణు తన కొలీగ్స్ డిన్నర్ కి పిలిచారని విశాలతో వెళ్ళాడు. అక్కడకు వెళ్ళగానే వాళ్ళకి సర్ప్రైజ్ పార్టీ అని మిగతా కొలీగ్స్ అందరూ ‘న్యూలీ వెడ్ కపుల్ వెల్ కం’ అని ఘనంగా స్వాగతం పలికారు.

          అక్కడ బెంగుళూర్ లో బసవన్న వినాయక గుడికి ఇద్దరూ వెళ్ళి దర్శనం చేసు కున్నారు.

          బెంగుళూర్ లో దస్ ప్రకాష్ హోటల్ లో బిస్సిబేళబాత్, నల్ పాక్ లో వంగీబాత్, శతాబ్ధి ఎక్స్ప్రెస్ లో మద్దూరి వడ,  రుచులని విశాలకి తినిపించాడు విష్ణు.

          కర్ణాటకలో మైసూర్ బృందావన్ గార్టెన్స్  అనీ, నంజనగూడులో నంజుండేశ్వర ఆలయం, చాముండి దేవాలయం, శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఇలా ఒకటేమిటి, అన్ని ప్రదేశాలకు విష్ణు, విశాలను తీసుకెళ్లడంతో ఇద్దరి మధ్య చక్కని అన్యోన్యత ఏర్పడింది. విశాల ఇంత వరకు తల్లిదండ్రులని వదలి బయటకు వెళ్ళిన సందర్భాలు లేవు. ఇదే మొదటిసారి ఇలా పెళ్ళైన తరువాత బయటకు రావడం. ఎక్కడా బెంగ అన్నది రాకుండా, నిరాశ చెంత చేరకుండా, విష్ణు ఆమెను కంటికి రెప్పలా  చూసుకుం టున్నాడు.

          ఆ రోజు రాత్రి కాలనీలో అందరూ క్రొత్త సంవత్సరం మిలీనియంకు స్వాగతం చెబుదామని గెట్ టుగెదర్ ఏర్పాటు చేసారు.

          విశాల కూడా వెరైటీగా కొన్ని చిట్స్ వేసి అందరిచేత డాన్స్ లు, పాటలు , స్కిట్స్ చేయించింది.

          డిన్నర్ చేస్తూ అందరూ టి.వి లో ప్రపంచంలో జరుగుతున్న న్యూ ఇయర్ సంబరా లు చూస్తున్నారు.

          ప్రపంచంలో మొట్టమొదట న్యూ మిలీనియం 2000 సంవత్సరంలోకి అడుగిడిన న్యూజిలాండ్ ఆక్లాండ్ లో వేడుకలు స్కై టవర్ దగ్గర జరుగుతున్న సంబరాలు చూస్తు న్నారు.

          తరువాత మరింత ఘనంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, ఒపెరా హౌస్ నుంచి కౌంట్ డౌన్ చెప్తూ త్రీ, టూ, వన్ అని హ్యాపీ మిలీనియం, హ్యాపీ,హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఫైర్ వర్క్స్, 2000 సంవత్సరానికి అట్టహాసంగా ఆస్ట్రేలియా లో వేడుకలు టి.విలో చూసి విష్ణుసాయి, విశాల వాళ్ళు కొన్ని రోజులలో ఆ దేశానికే వెళ్ళి స్థిరపడబోతున్నందుకు ఆనందంగా ఒకరి మోహాలు ఒకరు చూసుకున్నారు.

          అపుడే అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు “అరె, మిలీనియంలో ఒలింపిక్స్ ఆస్ట్రేలియా దేశంలో జరుగబోతున్నాయి. ఆస్ట్రేలియా ఈస్ బ్యూటిఫుల్ కంట్రీ. వెళ్ళితీరాల్సిన ప్రదేశం.” అన్నారు.

          ఆ మాటలకు విశాలకు ఒకింత గర్వం కూడా వచ్చింది. బహుశా తను, విష్ణు ఆ సమయంలో అక్కడ ఉంటాం కదా! అనుకుంటూ ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది.

          విష్ణు ఆస్ట్రేలియా వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటూ, విశాల డాక్యు మెంట్స్ కూడా జత చేసి అన్నీ కన్సల్టెంట్ కి పంపించాడు. టికెట్ కి మంచి రోజు చూడ మని మామగారికి ఫోన్ చేసి అడిగాడు.

          శ్రీనివాస్ గారు వెంటనే సిద్ధాంతి గారికి ఫోన్ చేసి అడిగారు. ఆయన విష్ణు, విశాల ఇద్దరి నక్షత్రాలు చూసి, జనవరి నెలలోనే పంచమి రోజు నిర్ణయించి తేదీ ఖరారు చేసారు.

          “ఇంత తొందరగా ఆస్ట్రేలియా వెళ్ళడమా?” అని విశాల ఉక్కిరిబిక్కిరి ఐంది.

          “ఇదిగో విశాల! నువ్వు అక్కడకు వెళ్ళినా గానీ హరి అచ్యుతరామశాస్త్రి గారి క్యాసెట్ పెట్టుకుని చక్కగా వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి చేసుకో. ఎక్కడికి వెళ్ళినా మన సంప్రదాయాలు, పండుగలు మర్చిపోకూడదు”అంటూ ఒక కవర్ అన్నపూర్ణ గారు ఆమెకి ఇచ్చారు.

          ఆవిడ ముందు చూపుకి, వాత్స్యల్యానికి విశాలకి ఆవిడ మీద అభిమానం రెట్టింపైం ది. ఒక్కసారిగా “అత్తయ్యా!”అని ఆవిడని హత్తుకుంది.

          ఆవిడ విశాల బుగ్గ నిమిరి,“నువ్వు ధైర్యవంతురాలివి. నువ్వు, అబ్బాయి జాగ్రత్త” అన్నారు.

          విశాల, విష్ణు ఆస్ట్రేలియా వెళ్ళే రోజు రానే వచ్చింది. విశాల ప్రయాణమవ్వడానికి కన్వీనియంట్ గా కొత్తగా కొనుక్కున్న జీన్స్ మొదటిసారిగా వేసుకుంది. ఇంత వరకు సాంప్రదాయక దుస్తులు ధరించిన విశాల, ఒక్కసారిగా తనను అద్దంలో జీన్స్ వేషధారణ లో కొత్తగా చూసుకుంది.“ఇది నేనేనా, వేరే అమ్మాయా?” బయటకు జీన్స్ లో అందరి ముందుకు రావాలంటే కాస్త సిగ్గుగా అనిపించింది.

          బయటకు వచ్చి “ఎలా ఉంది నా గెటప్?”అని అక్కడకు అపుడే వచ్చిన విష్ణుసాయిని అడిగింది.

          ‘వావ్, ఎవరీ అమ్మాయి? పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయావు, కాలేజీ స్టూడెంట్ లా ఉన్నావు. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్.” అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

          “కల్చర్ షాక్!” అంటూ విశాల బయటకు వచ్చింది.

          అక్కడే ఉన్న బావగారి అబ్బాయ్ అభినవ్,“పిన్నీ! యూ ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్” అని క్లాప్స్ కొట్టాడు.

          అన్నపూర్ణ గారు కోడలిని మురిపెంగా చూసుకున్నారు.

          అపుడే అక్కడికి వచ్చిన విశాల తల్లిదండ్రులు విశాలను పోల్చుకోలేకపోయారు.

          విశాల తల్లిదండ్రులని చూడగానే కౌగలించుకుంది.

          “ఎప్పుడూ మిమ్మల్ని వదిలి బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు సప్తసముద్రాలు దాటి, దేశ సరిహద్దులు దాటి వెడుతున్నాను” అని చేతులు పట్టుకోగానే ఆమె కళ్ళవెంట ధారా పాతంలా కన్నీళ్లు జలజలా రాలాయి.

          శారద గారు వెంటనే “ఏమిటో, అప్పగింతలపుడు కూడా అమ్మాయి ఇంత బాధ పడలేదు. నిజమే మొదటిసారి మమ్మల్ని వదలి అమ్మాయి దూరం వెడుతోంది. కాలేజీ లో తన ఫ్రెండ్స్ వెడుతున్నా, నేను మిమ్మల్ని వదిలి వేరే దేశం వెళ్ళను అనేది.”

          విష్ణు వెంటనే,“నేను జాగ్రత్తగా విశాలను చూసుకుంటాను. విదేశీయానం ఒకందుకు మంచిదే. ఆలోచనా పరిధి, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయి. మీరు వర్రీ అవ్వద్దు మామయ్యా, అత్తయ్యా” అని మాట ఇచ్చి కారు ఎక్కారు.

          అందరూ వాళ్ళిద్దరికీ భారీగా  సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.