
జ్ఞాపకాల ఊడలు
(నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)
– దుద్దుంపూడి అనసూయ
ఎప్పుడు మొలిచానో ఆమె చెబితే గాని నాకుతెలియనే తెలియదు కానీతన అమృత హస్తాలతో లాల పోయటం విన కమ్మని జోల పాటతోనిదుర పొమ్మని జోకొట్టటం గుర్తొస్తూ ఉంటుంది నడక నేర్చిన సంబరంతోనేను పరుగెడుతుంటేపడిపోకుండా పట్టుకుంటు కోట గోడలా నా చుట్టూచేతులు అడ్డు పెడుతూ పహారా కాయటంగుర్తొస్తూ ఉంటుంది వచ్చీ రాని నా మాటలకేనేనేదో ఘన కార్యం చేసినట్లు నా నత్తి నత్తి మాటలనే నారాయణ మంత్రంలా నాలాగే పలుకుతూ పదే పదే పది మందితో పంచుకోవటంగుర్తొస్తూ ఉంటుంది పాల బువ్వ పెట్టేటప్పుడు బొజ్జ నిండిందో లేదో తడిమి తుది ముద్దతో దిష్టి తీయటం ఆమెని ఏమార్చి కట్టు కధలల్లిఉట్టుట్టి ఒట్లు పెట్టి పట్టు బడినప్పుడుఆమెతో తీపి తిట్లు తినడంగుర్తొస్తూ ఉంటుంది ఆమెనే అనుసరిస్తూ అనుకరిస్తూ ఆటలాడే నాకు పలకా బలపం చేతికిచ్చి పాఠశాలలో నన్నొదిలేసి తిరిగెళ్లే తనలో బెంగా బెరుకూ నా పెళ్ళిలో అప్పగింతలప్పుడు తన తడి కళ్ళలో మళ్ళీ చూడటంగుర్తొస్తూ ఉంటుంది నేనమ్మనైనా అమ్మమ్మ నైనావటవృక్షంలా వృద్ధి చెందినాఆనాటి తన అమ్మ తనం చాటున నా చిన్నతనమంతాఇంకా మదిలో మెదులుతూనే ఉందిఎన్నేళ్ళు గడిచినా అన్నీజ్ఞాపకాలై మనసు కొమ్మలను వీడకుండా మర్రి ఊడల్లావేలాడుతూనే ఉన్నాయి.
*****

దుద్దుంపూడి అనసూయ రాజమండ్రి పరిసరాల్లో ముసునూరి రామారావు, రత్నంబ గార్లకు తొమ్మిదో సంతానంగా జన్మించినా పెరిగింది భద్రాచలంలో..పదవ తరగతిలోనే వివాహముకాగా అత్తగారి సహకారంతో డిగ్రీ పూర్తి చేసి, భోదన పై మక్కువతో పేద పిల్లలకై లాభాపేక్ష లేకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించగా ఈ మద్య కరోనా అలజడితో ఆపేసారు. ప్రస్తుత నివాసం భర్త చంద్ర శేఖర్ తో రాజమండ్రిలో. పాతికేళ్ళ క్రతం అక్క జాస్తి రమాదేవి (రచయిత్రి) ప్రోత్సాహంతో కవితలు వ్రాస్తే జ్యోతి లాంటి వార పత్రికల్లో అచ్చయ్యాయి. మళ్ళీ ఇప్పుడు కధలు, కవితలు వ్రాస్తుంటే ..సహరి, మాధరి లాంటి పత్రికలు, నమస్తే తెలంగాణా ములకనూరు సాహిత్య పీఠము వారు బహుమతులిచ్చి ఉత్సహ పరుస్తున్నారు.

కవిత బాగుంది
కవిత చాలా బాగుంది మేడం.
అమ్మ ను తలచుకొనే మరొక మధురమైన జ్ఞాపకం
రచయిత్రికి ధన్యవాదాలు