తోట తగలబడి పోతుంటే
గోళ్ళు గిల్లుకుంటూ
నిల్చోన్నవాణ్ణి !
గుండెల మీద చితిపేర్చి
కొరకంచుతో నిప్పంటీస్తే
మౌనంగా భరిస్తున్నవాణ్ణి
నా మూడొందల గడపల బతుకుశ్వాసలో !
కల్తీగాలులు వీస్తుంటే
నా వెయ్యిన్నూటపదారుకళ్ళ నరీక్షణికి వలసరెక్కలు పోడుచుకొస్తుంటే
నా పల్లె పరాయితనంలోకి
పరకాయ ప్రవేశం చేస్తుంటే
నేనిప్పుడు ప్రేక్షకుణ్ణి మాత్రమే
నిలువెల్లా నిరాశల గాయాల తొడిగిన
క్షతాత్మగాత్రుణ్ణి మాత్రమే
మా పల్లెకి కలలమ్మినవాళ్ళే
మా రాత్రిళ్ళని దోచుకున్నారు
మా ఆశలకి నీరుపోసినవాళ్ళే మా చిరునవ్వులు
లాగేస్తున్నారు
మా పొలాల్లో లంకెబిందెలు చూపి
మా పంటలు నూర్చుకున్నారు
ఉదయ సాయంత్రాలు చిలకలువాలే తోటని
తొండలు గుడ్లుపెట్టే
బండనేలగా మార్చారు
పల్లెబతుకు మీద సమాధికట్టి
అభివృద్ధికి ప్రాణం పోస్తున్నవాళ్ళు
మండే కడుపుల పైన బండరాళ్ళ ఫలకాలు పాతి
వాగ్దానాల గుడ్లని పొదగడం మర్చిన గిన్నికోళ్ళు
కంప్యూటర్ ప్రపంచాన్ని పల్లె
చేసిందంటే
పల్లె నిజాయితీని ప్రేమించిదనుకున్నాను
ప్రపంచాన్ని పల్లెచేసి
పల్లెని నామరూపాల్లేకుండా చేసింది.
పల్లెని యిల్లూ వాకిల్లేకుండా చేసింది.
లేమాలో కూడ చేమట చెమ్మని నమ్ముకున్న
పల్లెకి జీవితం లేకుండా
చేసింది.
ఇప్పుడు పల్లెవుంది
పల్లెకి పేరుంది
పల్లేతనమే పేరుకైనా లేదు !