
అనుసృజన
ఎండిపోయిన చెట్టు
ఆంగ్ల మూలం: సయెదా మిరియమ్ ఇక్బాల్
అనువాదం: ఆర్.శాంతసుందరి
ఎండిపోయిన చెట్టు కోల్పోయింది విత్తనాలన్నిటినీ
అవి ఎగిరిపోయాయి దూరంగా సుదూరంగా
తెలిసిన ప్రదేశాలకీ తెలియని ప్రాంతాలకీ
మొత్తంమీద వెనక్కి రావాలన్న కోరిక లేకుండా.
చెట్టు మాత్రం నిలబడే ఉంది మిగిలి ఉన్నానన్న ధైర్యంతో
వేళ్ళు తెగి, ప్రేమ కరువై ఒంటరిగా.
కొమ్మలు ఆర్తితో ఒంగిపోయాయి
వెతకటానికి కోల్పోయిన వేళ్ళనీ , విత్తనాలనీ,
తనని అంతకాలం నిలబెట్టిన నేలని కౌగలించుకున్న
మనసు విరిగిపోయిన చెట్టు, నెత్తురు కారుస్తూ కుమిలిపోయింది
ఒక చిన్న ఆశ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని ఎదురుచూస్తూ
తను అనుసరించేందుకు కలని వెతుక్కుంటూ ఉండగా,
ఒకరోజు దాని వెతుకులాట ఫలించింది.
తను గమనించలేదు కాని, తన గింజల్లో ఒకటి
తన ఒడిలోనే పెరుగుతోందని తెలిసింది
ఎండిపోయిన వేళ్ళ నుంచి తన వేళ్ళని పొడిగిస్తూ,
తనలోని మొలకకి పోషణ అందిస్తోంది.
ఈ గింజ ఎందుకు వెనక్కి వచ్చిందో కారణం తెలీదు,
కానీ నిస్పృహ చెందిన చెట్టు కన్న కలలా నిలిచింది.
ప్రాణం లేని ఒంటరి అన్వేషకురాలైన చెట్టు
ప్రారంభించింది మళ్ళీ జీవించటం,
తన నీడనంతటినీ, కొమ్మల కింది రక్షణనీ, గట్టి బెరడునీ
పోగుచేసుకుంది తన కలని కాపాడుకునేందుకు.
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
