
శిథిల స్వప్నం (కవిత)
– డా.కటుకోఝ్వల రమేష్
భద్రంగా కూడేసుకున్న
బ్రతుకు తాలూకు
కలలు ముక్కలవ్వటం
ఎవ్వరూ తీర్చలేని వెలితి
అకస్మాత్తుగా కుప్పకూలిన
కాలపు గోడల మధ్య
దేహాలు నుజ్జయి పోవటం
అత్యంత సహజం కావచ్చు
కానీ………
రూపాంతరం చెందని
ఎన్నో స్వప్నాలు
శిథిలమవుతాయి కూడా…
ఒకానొక కాళరాత్రి
విరుచుకు పడిన విధి
మహావిషాదాల్ని పరచి పోవచ్చు
కానీ……..
ప్రపంచ గుమ్మాన
కన్నీళ్ళతో మోకరిల్లి
చరిచిన వేదనా భరిత గుండె చప్పుళ్ళకు
ఎవ్వరూ ఆసాంతం అద్దం పట్టలేరు
బాధలు ఎప్పుడూ
వందశాతం గ్రంథస్థం కావు
దృశ్యాలను చూసే కళ్ళు
మనసును తోడుక్కున్నప్పుడే
స్వప్నాలు శిథిల మవ్వటం కనిపిస్తాయి
భౌతికంగానో మానసికంగానో
గాయపడ్డ ప్రాణాలు
తెరిపిన పడాలంటే..
అనివార్యంగా మరుపు లేపనాలు
మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ వుండాలి
ఎవ్వరైనా ఇప్పుడు
చెయ్యాల్సింది ఒక్కటే..
హృదయ కుహరం అహరహం
కొత్తదనాలు తొడిగెట్టు
ఆనందాల్ని పోగు చేసుకోవాలి
కూలిన కునారిల్లిన
శిథిల స్వప్నాల నుంచి
*****

డా.కటుకోఝ్వల రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (మం)లో 30-06-1969 లో పుట్టిన డాక్టర్.కటుకోఝ్వల రమేష్ వృత్తి రిత్యా ఉపాధ్యాయుడైనా ప్రవృత్తి రిత్యా కవి, విమర్శకులు. ప్రస్తుతం ఖమ్మం లో వుంటున్నారు. ఇంటర్ కళాశాల మ్యాగజైన్ లో తన కవిత “జాగృతి చేసేయ్” “మార్పు”కథానికల ప్రచురణతో ఆయన రచనా ప్రస్థానం మొదలయ్యింది. 1986లో స్రవంతి మాస పత్రికలో అన్యాయం పై నా యుద్దం..కవిత అచ్చయ్యింది.ఇప్పటి వరకూ వెయ్యికి పైగా పలు రచనలు పలు దిన,వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. 2018 లో “అగ్నిశిఖ”కవితా సంపుటి వెలువరించారు.దూరదర్శన్,ఆకాశవాణి కెంద్రాల నుంచి ఆయన కవితలు ప్రసారం అయ్యాయి. 2005 “నాయన” సంకలనం మొదలుకొని కవితా-2023 వరకూ పలు ప్రముఖ సంకలనాల్లో రమేష్ కవితలు చోటుచేసుకున్నాయి. ఈయన అగ్నిశిఖ సంపుటికి గిడుగు పురస్కారం, కవి రత్న జాతీయ పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో, కార్డ్ కథల్లోనూ రమేష్ రచనలు చోటుచేసు కున్నాయి. “కకోర” కలం పేరుతో అంతర్జాలంలో వీరు రాసిన “జిందగీ”రచనలు బహుళ ప్రచారం పొందాయి. బహుశా రమేష్ కవిత్యం monotony breck చేస్తుందేమో అంటారు కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహిత కె.శివారెడ్డి గారు. ప్రతీ కవిత్వ నగను అగ్నిపునీతం చేసి మనకు అందిస్తాడు రమేష్ అంటారు ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్ రావు గారు. రసవిద్య బాగా తెలిసిన వారు కవి రమేష్ అంటాడు ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశొక్ తేజ. నిద్రమాని కవిత్వం కోసం పలువరించిన గొప్పకవి రమేష్ అంటాడు ప్రజాకవి గోరటి వెంకన్న. ఇలా ప్రముఖుల వాక్యాలు అయన కవిత్వాన్ని ప్రస్పుటం చెస్తుంది. వీరి కవితా రచనల్లో భావశిల్పం, అర్థ వైచిత్రి, శభ్ద వైచిత్రి, కొసమెరుపులు, చక్కటి చిక్కటి మెటాఫర్ లు ప్రత్యేక వస్తువు ఎంపికలు దర్శనమిస్తాయి.

అద్భుతంగా చెప్పారు. కూలిన కునారిల్లిన స్వప్నాల నుండి ఆనందాలను పోగుచేసుకోవాలి… గాయపడ్డ ప్రాణాలకు అనివార్యంగా మరుపు లేపనాలు రాసుకోవాలి… గ్రేట్ పాజిటివ్ ఆటిట్యూడ్.. loved it
చాలా బాగుందండి.
శిధిలాలను పునాదులుగా చేసుకోవాలనే భావుకత ,
మరపు లేపనాలే మనసు గాయానికి మందు.
చాలా బాగుంది
కవి గారికి అభినందనలు.
.
శ్రీ కటుకోఝ్వల రమేష్ గారి శిధిల స్వప్నం కవిత ఒక ఆశావహ దృక్పధాన్ని పెంపొందించుకొనవల్సిన ఆవశ్యకతను తెలియచేసే మంచి కవిత. భౌతికమైనవైనా, మానసికమైనవైనా నష్టాలు మన జీవితంలో తారసిల్లినప్పుడు, ఆనందమనే ఆయుధంతో వాటిని ఎదుర్కొని అధిగమించవచ్చనీ, మరపు అన్ని గాయాలను మాంపివేయగలిగే చక్కటి మందు అని మంచి మెటఫర్ల ద్వారా తెలియచేశారు. కవికి, నెచ్చెలి సంపాదక వర్గానికీ, అభినందనలు.
బి.వి. శివ ప్రసాద్