
అముద్రిత కావ్యం
(నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)
– శింగరాజు శ్రీనివాసరావు
పుట్టినది ‘పాప’ అన్న మాట చెవుల బడితే చాలు
పుడమి లోపలికి కూరుకుపోయిన భావనలు
ఆమె బడికి పోతానని అడిగితే చాలు
వళ్ళంతా వాచేలా బడిత పూజలు
వయసు ఉబికి వస్తున్నదంటే చాలు
ఉరికి మించిన భయంకరమైన ఆంక్షల శిక్షలు
కట్టుకున్న గుడ్డలో నుంచి కాయం గాయపడేలా
గుచ్చుకునే ఆకలి చూపుల శూలాలు
అగ్నిహోత్రం సాక్షిగా ఆవిరయిపోయిన
కొద్దిపాటి స్వేచ్ఛా స్వాతంత్రయాలు
అమరేశ్వరునిలా ఎదిగిపోతుందేమోనని
భయపడి ఎదగకుండా అణచివేసే ధోరణులు
తరాలను పెంచే తరుణిపై ఎందుకింత అక్కసు?
తాను కరుగుతూ వెలుగునిచ్చే దివ్వెపై నిర్లక్ష్యం దేనికి?
ఛాందసాలను వీడి చల్లని మదితో ఆలోచించండి..
ఆమె హృదయం
కరిమబ్బుల దాగిన అమృతవర్షం
మండువేసవి వేడిమిని తగ్గించే మలయమారుతం
వేదనలో ఓదార్పును అందించే కమ్మని నేస్తం
వివక్షతను పక్కనబెట్టి
విశాల హృదయంతో చదువగలిగితే
ఆమె ఒక అముద్రిత అద్భుత కావ్యం…
సంసార సాగరాన్ని దాటించే వారిరథం…
*****

నేను భారతీయ స్టేట్‌బ్యాంకులో డిప్యూటిమేనేజరుగా బాధ్యతలు నిర్వహించాను. పదవీ విరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో 2016 సంవత్సరం నుంచి కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టాను. నా మొదటి కవితను మరియు మొదటి కథను ప్రచురించినది “ఆంధ్రభూమి వారపత్రిక”. మొదటిసారిగా “నేలతల్లి” కథకు ఆంధ్రభూమి దినపత్రికలో ద్వితీయ బహుమతి లభించింది. ఇప్పటి వరకు సుమారు 50 కథల పైగా వివిధ వార, మాస పత్రికలలోను, అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. అందులో 20 కథలకు బహుమతులు లభించాయి. రెండు వందల వరకు కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో 30 కవితల వరకు బహుమతులు పొందాయి.
