
అనుసృజన
ప్రవాహం
హిందీ మూలం: రామ్ దరశ్ మిశ్ర్
అనుసృజన: ఆర్ శాంతసుందరి
ఒక పరిమళభరితమైన అల
ఊపిరితో కలిసి
అలా అలా వెళ్ళిపోతుంది
ఒక కూనిరాగమేదో
చెవులని అలవోకగా తాకుతూ
ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది.
అదృశ్య రూపం ఒకటి స్వప్నంలా
కళ్ళలో తేలి వెళ్ళిపోతుంది.
ఒక వసంతం గుమ్మంలో నిలబడి
నన్ను పిలిచి వెనుదిరుగుతుంది.
నేను ఆలోచిస్తూ ఉండిపోతాను.
అలని చుట్టెయ్యాలనీ
స్వరాలని పోగుచేసుకోవాలనీ
రూపాన్ని బంధించాలనీ
వసంతంతో-
ఒకటి రెండు నిమిషాలు నా గుమ్మంలో నిలబడరాదా
అని అనాలనీ-
కానీ అది ఒక ప్రవాహం
ఎక్కడ ఆగుతుంది?
ఏదో ఒకరోజు నేనూ ఇలాగే ముగిసిపోతాను
‘ఓహ్ ! పొందగలిగినదాన్ని
పొందలేకపోయానే…’
అంటూ-
బైట వసంతం వచ్చేసింది
మూసిన గదుల్లో కూర్చుని
ఎంతకాలం ఎదురుచూస్తావు దానికోసం?
చూడూ,
వసంతం మూసిన ఇనప తలుపుల బైట నిలబడి కేకవేయదు
మూసిన గాజు కిటికీల లోంచి తొంగి చూడదు
వైభవమైన రాజసభలోకి
హుందాగా నడిచొచ్చే రాజరికపు ధోరణి కాదు దానిది
అది గ్రామఫోను రికార్డు కూడా కాదు
నువ్వు సైగ చెయ్యగానే నీ తలదగ్గర కూర్చుని పాడేందుకు.
బైటికి పద
చూడు
దిక్కులని చీల్చుకుంటూ
దుమ్ముగాలులు వీస్తున్నాయి
దిగులు లయతో రాలి పడుతున్నాయి ఆకులు
దీర్ఘ నిశ్శబ్దంతో భారంగా వంగింది ఆకాశం
బండరాయిలా అటూ ఇటూ కదులుతూ
ఒక వ్యాకులత సుళ్ళు తిరుగుతూనే ఉంది
అన్ని స్తబ్ధతల మధ్యా
కదలని కళ్ళు తమలో తాము పోట్లాడుకుంటూ
బైటికి రావాలని ప్రయత్నిస్తున్నాయి
రా
చూడు వీటన్నిటినీ
ఎండతో నిండిన గాలుల్లో ప్రవహించే
చిన్న చిన్న రంగుల నదులు
ఆకుల దిగులు లయలోంచి మొలిచే
నవహరిత స్వరాల వనం
నగ్న వృక్షాల మధ్య నలిగి పోతుంది
ఎర్రెర్రని కాంతుల ఒక కొత్త ఆకాశం
శిలలని విరగ్గొడుతూ ప్రవహించాలని
వెలుగు జలపాతాలకి కలవరింత
రెపరెపలాడే కళ్ళ మధ్య తేలియాడే
అంతులేని కొత్త నీడలు.
ఎన్నాళ్ళని ఎదురుచూస్తావు వసంతం కోసం
మూసిన గదుల్లో ఉన్న నీకు తెలీదు గాని
బైట వసంతం ఎప్పుడో వచ్చేసింది !
(రామ్ దరశ్ మిశ్ర్ హిందీ కవిత్వ గ్రంథానికి 2015 కి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్నారు.. 1924 ఆగస్టు 15 న జననం . ఢిల్లీ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పనిచేశారు .)
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
