
అనుసృజన
వీరవనితా!
హిందీ మూలం: ముక్త
అనుసృజన: ఆర్ శాంతసుందరి
స్త్రీ దేహం మీద నీలం గుర్తులు
రక్తం గడ్డ కట్టిన వైనం
అత్యాచారం జరిగిందని చెబుతోంది
పాత కథల్లో ఎప్పుడూ బైటికి రాని కథ ఇది
అత్యాచారానికి గురైన ప్రతి స్త్రీ శరీరం
అందంగా ఉంటుంది
ఆ కథల్లో అత్యాచారం చేసే
వాడి దౌర్జన్యం ఉండదు
అత్యాచారం చేసిన రాజుల గోళ్ళ గురించి
గాని పళ్ళ గురించి గాని
ఆ కథలు చెప్పవు
ఆ కథల్లో స్త్రీ ఉండదు
ఆమె శరీరం మాత్రమే ఉంటుంది
నియాన్ లైట్ల కాంతిలో
ఆ కథల కొత్త ముద్రణలు
మెరిసి పోతున్నాయి
ప్రపంచ విపణిలో స్త్రీ శరీరం ఒక నీలి నది
కథల్లో ఇంద్ర ధనుస్సు
ఏడురంగుల అద్భుతాలు
మిరుమిట్లు గొలిపే
ఆ అద్భుతాల లోంచి బయటికి రా
ఓ వీర వనితా!
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
