
తరుణి తరుణం
(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
-కొత్తపల్లి అజయ్
తరుణి తరుణం
భళ్ళున తెల్లారింది!
కళ్ళు నులుపుకుంటు
ఉదయపు వాకిలిలో..
కళ్ళు తెరిస్తే పేపర్బోయ్
ఎప్పటిలా!? చదువుదామని
ఉద్యుక్తురాలినై చేతిలో పేపర్
ఎపుడెపుడాని ఎదురు
చూసే రోజురానే వచ్చింది
ఎదురు చూసి చూసి
కళ్ళు కాయలైనాయి
తరుణీ తరుణం!!
మహిళాసాధికారత
మహిళాబిల్లు!!
నవవసంతం వచ్చినట్టైంది
ఇక చెల్లవు !!
మగధీరుల హుకుంలు!
ఇక చెల్లవు!!
వళ్ళు హూనంలు
ఇక మేముండం!!
మగ్గిన చీకటి పూవులుగా
వికసిస్తాము!
వెలుగు పూవులుగా!
తెల్లారిమొదలు,
పుక్కిట పురాణాలు
వల్లించే నీతిపాఠాలు
మా చెవులుచిల్లులైనై!
ఇక..చాలు చాలు..
మీ ఉద్భోదనలు..
ఇక..చాలు చాలు
మీ ఉపన్యాసాలు.
రాలిన ఈకల వళ్ళు
ఇపుడిపుడే స్వేచ్ఛామొగ్గలు
తొడుగుతున్నయ్!!
వినీలాకాశంలో
హాయిగా ఎగిరిపోతం!
ఆకాశంలో సగం కాదు
ఆకాశమే మేము.
ఇక అన్నిటా మేమే
ఎవరు అడ్డురారు
ఏ అరచేయి వెలుగును ఆపదు
మేమే ముందు!
అన్నింటా మీ ముందు!
మాపాదాలు రాటుదేలాయి
ఏ ముళ్ళు అడ్డుపడవు
కదం తొక్కుకుంటూ
మున్ముందుకు పోతాం!
కదనరంగంలో దూకుతం
అపుడూ ముళ్ళబాటలన్ని
పూ బాటలవుతాయి.
*****

కొత్తపల్లి.అజయ్ కవి, రచయిత
