
ఓదార్పు ఘడియలు
(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– ఎన్. లహరి
ఎవరు
తెరచాపగా మారుతారు?
కన్నీటి సంద్రపు
ఉప్పు నీటి సుడుల్లో
గింగిరాలు తిరుగుతున్న బాధలు
ఉప్పెనలా చుట్టుముడుతుంటే
ఆనంద భాష్పాలు శూన్యం!
నిర్లిప్తతలో ఊగిసలాడుతున్న నావ ఇది
కాలంతో పోటీ పడలేక
ముడిసరుకులేని కాలభ్రంశానికి
ఆగిపోతుందేమో ఈ జీవనచక్రం
ఎక్కడో
చిన్న అనుమానపు చూపు
ఆడపిల్లగా
అమాయకమైన ఓ బేలచూపు
అభద్రతా భావం
నన్ను కృంగదీసి నిలదీస్తుంటే..
అన్నీ ప్రశ్నల పరంపరలే!
కొమ్మల్లో చిక్కుకున్న పక్షి పిల్లను
రెమ్మలు విరిగిన కొమ్మను
నన్నిలా వదిలేయ్
అమ్మనయ్యాక
వృద్ధాశ్రమానికి మాత్రం
అమ్మేయకూ..!
*****

ఎన్. లహరి, MCA చేశారు. జన్మస్థలం దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా , తెలంగాణ.
అభిరుచులు:
కవితలు, కథలు మరియు సమీక్షలు రాయడం, డాన్స్ మరియు యోగ చేయడం, బాాడ్మంటన్, కేరమ్స్ మరియు చెస్ ఆడటం.
రచనలు:
మినీకధలు: 70 కి పైగా..
కవితలు: 200 కు పైగా..
సమీక్షలు: 20
నేను రాసిన కవిత్వాలతో కూడిన “అక్షర నేత్రాలు” కవితా సంపుటిని శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్, హైదరాబాద్ వారు తమ స్వంత నిధులతో ముద్రించి, గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిచే ఆవిష్కరింప చేశారు.
స్కూల్ దశలో రాసిన కథలు మరియు కవితలకి అనేక బహుమతులు గెలుచుకున్నాను.
సుమారు 300 నానీలతో మరొక సంపుటి త్వరలో ఆవిష్కరణకు రానున్నది.
ప్రేరణ:
కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, మాజీ వైస్ ఛాన్సలర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నానీల సృష్టికర్త అయిన మా పెద్దనాన్న డా. ఎన్. గోపి గారి రచనలు చదివి సాహిత్యం మీద ఎంతో అభిరుచిని పెంచుకున్నాను.
