గానుగ యంత్రం – కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)

                                                  ఇంగ్లీషు అనువాదం: కేహ్రీ సింగ్ మధుకర్

తెలుగు సేత: వారాల ఆనంద్

గానుగ యంత్రం గర గరలాడుతూ పని చేస్తుంది
ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా నడుస్తుంది
గుండ్రంగా నెలలూ ఏడాదులూ లెక్కించకుండా
జీవితకాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది
మెడలో గంటలు గణగణ మంటాయి
కంభాన్ని లాగుతూ విత్తనాల్ని నలగ్గొట్టుతూ నూనె తీస్తుంది

కొరడాని గట్టిగా ఝలిపించినప్పుడు
దేహం గాయాల పాలవుతుంది
కాంతి రెప్పలు మూతబడతాయి
మెదడు మొద్దుబారిపోతుంది
అయినా అది అన్ని కాలాల్లోనూ నడుస్తుంది
వేగాన్ని పెంచమంటూ చిన్నాపెద్దా
తిట్టే తిట్లను భరించడం తప్ప
నిస్సహాయ చట్రానికి బందీ అయిన దానికి
వేరే దారి లేదు

వేలకొద్ది మైళ్ళు నడుస్తుంది
అయినా వున్నచోటే వుంటుంది
వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు
ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్రా లేదు

ఒకరు రాత్రీ పగలూ కష్టపడితే
మరొకరు ఆనందం పొందుతాడు
ఒకరు చెమటోడిస్తే
మరొకడు లబ్ది పొందుతాడు

అంతేకాదా
ఒకరిది దుఖమయితే నూనె మరొకరిది
ఈ ప్రపంచమే ఒక గానుగ యంత్రం
అది అట్లాగే నడుస్తుంది
మనిషిని ఎద్దులా మార్చేసి
మట్టి పొరల్లో కూర్చేశారు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.