
అతని ప్రియురాలు
-డా||కె.గీత
అతని మీద ప్రేమని
కళ్ళకి కుట్టుకుని
ఏళ్ల తరబడి బతుకు అఖాతాన్ని
ఈదుతూనే ఉన్నాను
అది మామూలు ప్రేమ కాదు
అతని కుటుంబపు
నిప్పుల గుండంలో
వాళ్ళ మాటల చేతల
కత్తుల బోనులో
నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ-
చస్తున్నా మొర్రో అంటే
చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ
భరించలేను బాబోయ్ అంటే
పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ
అయినా
సిగ్గూ శరం లేకుండా
ఆత్మాభిమానాన్ని
చిలక్కొయ్యకి ఉరితాడేసి బిగించి
కూపస్థ మండూకాన్నై కొట్టుకుంటూనే ఉన్నాను
ఏ మూసలో పోస్తే ఆ పాత్రనై
ఒదిగి మెదిగి
చలనం కాగలిగినా అచలనమై
ప్రయత్నం కూలబడ్డ అప్రయత్నభారానికి
ఇంకా ఇంకా కూరుకుపోతూనే ఉన్నాను
అయినా అన్నీ ముసుగు చాటున దాచిపెట్టి
అతనికి నా మీదున్న ప్రేమ
తుమ్మెదలు హొయలుపోయే
పూలవనమ్మీంచి వీచే తెమ్మెరని
తళత్తళ్లాడే కెరటాల్ని ముద్దాడి
పుప్పొడై తాకే నును వెచ్చని కిరణాలని
అతను
కన్నీటి నిప్పు రవ్వల్ని బుద్భుదంగా
తుడిచివేసే సఖుడని
రక్తమోడే విరిగిన కాళ్ళని ప్రేమతో
భుజానమోసే చెలికాడని
అతనే సత్యమూ జీవమూ మార్గమని
గొప్పలు పోయాను
అతనితో జీవించడమంటే
నిత్యం
సూది ముళ్ల కవాతే
ఓసారి
ఝంఝామారుతమై
విరుచుకు పడితే
మరోసారి
కుంభవృష్టిగా ముంచెత్తుతాడు
అయినా
అతని మీద ప్రేమతో
సప్త సముద్రాలు దాటగలనని
కష్టపడి సాధించుకున్న జీవనాధారాన్ని
తృణప్రాయంగా వదిలెయ్యగలనని
నాకే తెలియనంత పిచ్చి ప్రేమ
అతనికోసం
ఏటికెదురీదైనా
ఏడిపించిన వాళ్ళనీ
ప్రేమగా చూసే ప్రేమ
అతనికోసం
ఏ మూలకైనా
పరుగెత్తుకెళ్లి
సమస్యల్ని చిటికెలో
మాయం చెయ్యగలిగే ప్రేమ
నాన్నే ప్రాణమనే
పిల్లా జెల్లా
అతనికి
బహుమతులిచ్చి
ఓటికుండ బతుక్కి
‘నిండుప్రేమ’ని ప్రేమగా పేరుపెట్టుకుని
అదృశ్య శిలువను ఈడ్చుకెళ్తున్నా
ధీమా ప్రదర్శనల్లో లోలోపల జోకర్నైనా
పైకి గంభీరంగా నవ్వుతూ నవ్విస్తూ
మరీచిక జీవనరంగమ్మీద
యవనికనై గమనిస్తూ
అతని చిటికెన వేలందుకుని
అనుదినమూ నడిచే
అతని ప్రియురాల్ని మరి!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

ఒక సాధారణ స్త్రీ తనను తాను కోల్పోతున్నా పట్టించుకోకుండా తన భర్త చూపించని ప్రేమను కూడా తానే ఊహించుకుంటూ భ్రమలో బ్రతుకు ఈడుస్తున్న దృశ్యం మీ కవితలో ఆవిష్కరించారు. చాలా దయనీయ కావ్యమది. టచింగ్ పోయెమ్
ప్రేమకు ఇద్దరు బద్దులై ఉండాల్సిందే..కానీ అది స్త్రీ కి మాత్రమే అన్న ధోరణి మారని ఈ లోకం తీరును .. స్త్రీ అంతరంగ వేదనను తెలిపిన కవిత
అతని కుటుంబపు నిప్పుల గుండంలో వాళ్ళ మాటల చేతల కత్తుల బోనులో నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ-
చస్తున్నా మొర్రో అంటే చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ భరించలేను బాబోయ్ అంటే
పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ …
ప్రేమించి పెళ్లాడి ఒక సారి వివాహ బంధంలో ఇరుక్కున్నాక కష్టనష్టాలను భరిస్తూ కొనసాగ వలసిందే. చాలా మంచి భావయుక్తమైన కవిత “అతని ప్రియురాలు” కవయత్రి -డా||కె.గీత గారికి అభినందనలు.
తుమ్మెదలు హొయలుపోయే
పూలవనమ్మీంచి వీచే తెమ్మెరని
తళత్తళ్లాడే కెరటాల్ని ముద్దాడి
పుప్పొడై తాకే నును వెచ్చని కిరణాలని… ఎంతో భావుకతతో కూడిన కవితా పంక్తులు.
జీవన సహచరి అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించిన కవిత.
హరి వెంకట రమణ
ఓటికుండ బతుక్కి నిండు ప్రేమగా పేరు పెట్టుకోవడమంటే బలిపశువులా మారడమే
ఇది పాత తరం మాట.ఇప్పుడైతే ఫటాఫట్…ధనాధన్…Your children and my children are quarrelling with our children.
ప్రేమకు కావాల్సింది, ప్రేమను మోయాల్సింది ఇద్దరు. కానీ ఒక్కరే దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ ఒక్కరు అనుభవించే వ్యథ ఎందరి జీవితాలలో నిత్యం జరిగేదే. అలాగే ఎదుటి వారి ప్రేమలేమికి ఏవో రంగులద్ది ఆత్మవంచన చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయాన్నే కవిత రూపం లో చక్కగా రాశారు గీత గారు. అభినందనలు