
అనుసృజన
అద్దం
మూలం: సిల్వీయ ప్లెత్
అనుసృజన: ఆర్ శాంతసుందరి
నాది వెండి రూపం
నిజాన్ని చూపిస్తాను
ముందస్తు అభిప్రాయాలు లేవు నాకు
నాకు కనిపించే వాటన్నిటినీ మింగేస్తాను
ఉన్నవి ఉన్నట్టుగానే –
రాగద్వేషాల మంచు తెర కప్పదు నన్ను
కాని హృదయం లేని పాషాణాన్ని కాను
నిజం చెప్పానంతే –
చతుర్భుజాల పసి దేవత కంటిని నేను
ఎదురుగా ఉన్న గోడని చూస్తూ
ధ్యానం చేస్తూ ఉంటాను ఎప్పుడూ –
గులాబీ రంగుతో మచ్చలున్న ఆ గోడని
ఎంతో కాలంగా చూస్తుండటంతో
నా హృదయంలో భాగం అనిపిస్తుంది అది
ముఖాలూ చీకట్లూ మమ్మల్ని మళ్ళీ మళ్ళీ విడదీయటంతో
అది మినుకు మినుకు మంటుంది.
ఇప్పుడు నేనొక సరోవరాన్ని
ఒక స్త్రీ నాపై వంగి
తన అసలు రూపాన్ని నా లోతుల్లో వెతుక్కుంటూ ఉంటుంది
వెనక్కి తిరిగి అబద్ధాలకోరులు
కొవ్వొత్తినో చందమామనో ఆశ్రయిస్తుంది ఆమె –
నాకామె వీపు కనిపిస్తుంది
అచ్చంగా దాన్నే ప్రతిబింబిస్తాను
ఆమె తన కన్నీళ్ళని
కంపిస్తున్న చేతులతో
నాకు బహూకరిస్తుంది –
ఆమెకి నేను ఎంతో ముఖ్యం
నా కోసం వస్తూ పోతూ ఉంటుంది
ప్రతి ఉదయం చీకట్లని పారదోలేది ఆమె ముఖమే
నాలో ఒక కన్నెపిల్లని ముంచివేసింది
నాలోంచే ఒక ముసలామె
రోజులు గడిచేకొద్దీ ఆమె వైపుకి లేస్తూంటుంది
భయంకరమైన చేపలా.
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
