
కాదేదీ కథకనర్హం-15
అమెరికన్ అల్లుడు
-డి.కామేశ్వరి
కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా వుంది.
ప్రతీక్ష ఎం.బి.బి.ఎస్. పరీక్షలయి వస్తుంది. మళ్ళీ యింటర్నల్ షిప్ మొదలయ్యే లోగా ఇండియా వెళ్ళి పెళ్ళి చేసి తీసుకు రావాలని ఆరాట పడ్తోంది. కూతురి పెళ్ళి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి.
ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో యింటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు అయన. కూతురికి యిరవై మూడు నిండుతున్నాయి. ఇప్పుడు గనక అవకపోతే మళ్ళీ మూడేళ్ళ వరకు హౌస్ సర్జన్సీ అయ్యేవరకు దానికి తీరికుండదు. అని ఆవిడ తొందరపడ్తుంది. ఇండియా నించి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాలలో కాత్యాయనికి రెండు మూడు బాగా నచ్చాయి. యిద్దరబ్బాయిలు డాక్టర్లు , ఒకడు ఇంజనీరు. కుటుంబాలు మంచివి. తమ హోదాకి సరిపోయినవి. అబ్బాయిలూ స్మార్ట్ గానే వున్నారు. ఈ మూడింటిలో కూతురి కి ఏది నచ్చితే అది చేసేయాలి. అని ఆవిడ ఉద్దేశం. తాము అమెరికన్ సిటిజన్స్ “కనక డాక్టరు చదివిన అబ్బాయిలు యిలాంటి సిటిజన్ షిప్ వున్న అమ్మాయిలని పెళ్ళాడి అమెరికా రావాలని ఆరాట పడ్తుంటారు గనక తన కూతురికి అనేక సంబంధా లు వచ్చాయి – ప్రతీక్ష అందగత్తె కాకపోయినా చక్కని కనుముక్కు తీరు, స్మార్ట్ అండ్ ఇంటిలిజెంట్ గర్ల్ – యిక్కడ డాక్టరు సీటు దొరికిందంటేనే ఆ సంగతి తెలుస్తుంది. తన కూతురి విషయంలో అబ్బాయిలకు తన కూతురు నచ్చడం కాదు తన కూతురు వాళ్ళకూ నచ్చాలి – ముందు తామిద్దరూ వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోను చెయ్యగానే భర్త, కొడుకు ప్రతీక్ష వచ్చేట్టు ఏర్పాటు చేసి ఇండియాకి టిక్కెట్టు కూడా బుక్ చేసేసింది కాత్యాయిని.
కూతురి శలవలకి రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది. ఇన్నాళ్ళూ కూతురెక్కడ ఏ అమెరికన్నో, యింకేవర్నన్నా చేసేసుకుంటుందేమో నన్న భయం కాత్యాయానికి వున్నా మెడిసన్ కాకుండా ఎలా చెయ్యడం అని ఆలోచిం చింది. చెప్పినా చదువు మధ్యలో కూతురు వప్పుకోదని తెల్సు గనక కూతురు అలాంటి పని యిప్పటివరకు చెయ్యనందుకు దేముడికి నమస్కారం పెట్టుకుంది ——- పిల్లలు అమెరికాలో పుట్టి, పెరిగినా వాళ్ళని ఇండియన్స్ గానే పెంచారు కాత్యాయనీ మూర్తీ —– యింట్లో తెలుగు మాట్లాడడం, వీలయినప్పుడల్లా పిల్లలని ఇండియా తీసికెళ్ళడం, తెలుగు పాటలు, తెలుసు సినిమా క్యాసెట్లు చూపడం, యింట్లో పూజలు, వ్రతాలు, పండుగలు, పట్టుచీరలు, తెలుగు పిండివంటలు అన్నీ చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకి చూపించారు — అయితే అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ బాష, ఆ దేశం, ఆ స్నేహితులు, ఆ ఇన్ ఫ్లూయన్స్ తప్పనిసరి అవుతుంది. గనక పిల్లలు బయట అమెరికన్స్ లాగ, యింట్లో ఇండియన్స్ లాగే ప్రవర్తించేవారు. కూతురికి పెళ్ళీడుకొచ్చాక తమ మాట కాదనదన్న ధైర్యంతోనే కూతురిని సంప్రదించకుండానే పెళ్ళి కొడుకుల వేట మొదలుపెట్టి, పెళ్ళిచూపుల వరకూ ఏర్పాటు చేసింది కాత్యాయని. తల్లి అందించిన ఫోటోలు చూసి, చెప్పింది విని ప్రతీక్ష తెల్ల పోయింది. తన వెనక, తనకు చెప్పకుండానే యిన్ని ప్రయత్నాలు చేసిన తల్లికి తన మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించి చెప్పేసింది. కూతురు అతి మాములుగా చెప్పిన మాట కాత్యాయనికి నెత్తిన పెద్ద బాంబు బద్దలయినంత షాకు, ఒక రకం అచేతన స్థితి కల్గింది. కళ్ళు పెద్దవి చేసి, మాటరాక అలా వుండిపోయింది. రెండు నిమిషాలు “ఏమిటి ….నీవు …..నీవు, ఆ మైక్ ని పెళ్ళాడుతావా —-వాడు …..వాడు …..అండర్ గ్రాడ్యూయేట్ , డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో పనిచేసే మైక్ ని పెళ్ళాడతావా …..’ నోట్లోంచి మాటలు పెగల్చుకుని అనగల్గింది ఆఖరికి.
“ఏమిటి మమ్మీ …..వాట్స్ రాంగ్ విత్ యూ” చాలా తేలిగ్గా అంది ప్రతీక్ష తల్లి వంక చూసి. “నేనేదో అంతరిక్షానికి వెడతానన్నంత షాక్ అయ్యావు ….మైక్ ని పెళ్ళాడుతానంటే, అతనేదో మనిషి కాదు అన్నంత బెంబేలు పడ్తున్నావు…..వాట్స్ రాంగ్ విత్ హిమ్….”.
కాత్యాయని మొఖం కోపంతో ఎర్రబడిపోయింది. మాట వణికింది. “వాట్స్ రాంగా! యింకా అడుగుతున్నావా…..వాడు…..వాడు…..అతను ఇంత చదివి….చదువు సంధ్య లేని, ఓ కొట్లో లెక్కలు రాసేవాడిని …..ఆప్ట్రరాల్ వారానికో వందో రెండు వందల డాలర్లు సంపాదించే వాడిని చేసుకుంటానంటూ యింకా వాట్స్ రాంగ్ అంటావా….. మనం ఇండియన్స్ అతను అమెరికన్ అన్నది అటుంచి, అన్నీ వుండి…..ఓ చదువు సంధ్య లేనివాడిని చేసుకుంటావా ….’ కోపంతో మాటలు తడబడ్డాయి.
“ఏమిటి మమ్మీ ….మైక్ ఇంజనీరింగులు, డాక్టరేట్ లు చదవకపోవచ్చు — హీయిజ్ పిన్ ఎడ్యూకేటేడ్ , కల్చర్డ్ పెర్సన్, సమ్ హౌ ఐ లైక్ హిమ్ …..గోళ్ళు ట్రిమ్ చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అంది ప్రతీక్ష.
తరువాత కాత్యాయని ఎంత గొడవ చెయ్యాలో అంత చేసింది. నెత్తి నోరు కొట్టు కుంది. “నీకిదేం ఖర్మ, రాత అంటూ బెంబేలు ఎత్తిపోయింది…..మంచిగా చెప్పింది—— అరిచింది—–తిట్టింది . ముందేందుకు చెప్పకుండా దాచావు అని ఎగిరింది. “ఏదో నీ ఫ్రెండు సుజాన్ అన్నయ్య చిన్నతనం నించి అంతా ఫ్రెండ్స్ , కల్సి తిరుగు తున్నారు అనుకున్నాం గాని, నీవింత పనిచేస్తావా, ఆ పనికిమాలిన వాడిని కట్టుకుని ఏం సుఖపడ్తావే, అమెరికన్ అయినా పోనీ చదువు ఉద్యోగం వున్నవాడైతే పోనీ అనుకునేవాళ్ళం, మన స్టేటస్ ఏమిటి, వాడు మా అల్లుడవుతే తల ఎలా ఎత్తుకు తిరగగలమే…..పోనీ మా సంగతి అలా వుంచు’, నీవెలా బతుకుతావే …….. ఇన్నాళ్ళు యీ విషయం దాచి మమ్మల్నిలా మోసం చేస్తావా , ఎన్నాళ్ళ నించే యిదంతా జరుగు తుంది …..” ఆగకుండా అరించింది కాత్యాయని. తల్లి అరిచినంత సేపూ వూరుకుంది .
“మమ్మీ –నీవెంత అరిచినా నా నిర్ణయం మారదు —– నాకు మైక్ అంటే చిన్నప్పట్నించి యిష్టం . అతను అట్టే చదువుకోకపోవచ్చు —–కాని అతనంత వెల్ మేనర్డ్ మగాడ్ని నేనింతవరకు చూడలేదు ——వాళ్ళు మనంత గొప్పవాళ్ళు కాక పోవచ్చు ——కాని సంస్కారం గౌరవ మర్యాదలున్న కుటుంబం. అతను నేనంటే ప్రాణం యిస్తాడు. అతనట్టే సంపాదించలేడు నిజమే, కాని డాక్టరునయి నే సంపాదిస్తాను కనక మా సంసారానికేం లోటుండదు. ఇన్నాళ్ళు మీకెందుకు చెప్పలే దంటే నా మెడిసన్ అయ్యాక గాని పెళ్లి చేసుకోం, మీరెలాగూ అంగీకరించరు. అప్పుడు నాకు ఆర్ధిక స్వాతంత్య్రం వుంటుంది కనక పరవాలేదని ఆలోచించాను. నీవు నాకు సంబంధాలు చూస్తున్నట్టు చెప్పి వుంటే అపుడే వద్దని చెప్పేదాన్ని అంచేత నన్ను బ్లేమ్ చేయకు” అని చెప్పదలచింది అయిపోయినట్టు అక్కడి నించి వెళ్ళిపోయింది ప్రతీక్ష. రాత్రి భర్త చేత చెప్పించింది. తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు —- ఆఖరికి కూతురి అబీష్టానికి తల ఒగ్గక తప్పలేదు ఆ తల్లి తండ్రికి.
***
ప్రతీక్ష పెళ్ళయి ఆరేళ్ళు అయింది. నాలుగేళ్ళ కూతురు, రెండేళ్ళ కొడుకు- పిల్లలిద్దరు తండ్రి రంగుతో, పోలికలతో చాలా అందంగా వుంటారు. మనవలంటే ప్రాణం కాత్యాయనికి. ప్రతీక్ష డాక్టరయి రెండు చేతులతో సంపాదిస్తుంది. బోస్టన్ లో నాలుగు బెడ్ రూముల ఇల్లు కింద బేస్ మెంట్, గార్డెను, రెండు కార్లు, స్వేమ్మింగ్ ఫూల్, దేనికీ లోటు లేదు ప్రతీక్షకి —–కూతురు కాపురం చూసి యిప్పుడు కాత్యాయనికి ఏ బాధ లేదు.
మొదట ఓ రెండు మూడేళ్ళు కాత్యాయనికి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులో పడి పెళ్ళి చేసుకున్నారు గానీ , వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారు, కూతురు తనకంటే తక్కువ చదువు, సంపాదన వున్న మొగుడితో సర్దుకుంటుందా అన్న అనుమానం వుండేది ……… ఓ తల్లిగా కూతురు సంసారం చక్కగా వుండాలని వున్న అంతరాంత రాలలో ఎక్కడో మైక్ తో విడిపోయి మంచివాడ్ని పెళ్ళి చేసుకుంటే బాగానే వుంటుంది. ఈ రోజుల్లో డైవోర్సులు , అందులో అమెరికాలో యివన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ వుండేది అల్లుండంటే వున్న చిన్న చూపువల్ల.
కాని రోజులు గడుస్తున్న కొద్ది మైక్ మంచితనం, సంస్కారం, ప్రతీక్ష పట్ల అతని ప్రేమ…..ప్రతీక్ష ఆస్పత్రి పనులలో సతమతమవుతుంటే మగవాడ్ని అన్న అహంకారం లేకుండా యిల్లంతా తనే చక్క పెట్టుకుంటూ, వంట దగ్గర నుంచి అన్ని తానే చూస్తూ ప్రతీక్షని పువ్వుల్లో పెట్టి పూజించడం చూసి ఆశ్చర్యంతో పాటు మనసు లో అభినందించ కుండా వుండలేకపోయింది. మొదట్లో చిన్న ప్లాట్ లో వుండేవారు. తాము ఏది యిస్తానన్నా మర్యాదగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ళ సంపాదనతో అమర్చుకుని, నాలుగేళ్లలో మంచి ఇల్లు, కార్లు అన్ని అమర్చుకున్న వాళ్ళని అభినందించుకుంది కాత్యాయని. పిల్లలు పుట్టుకోచ్చాక మైక్ పగలంతా పిల్లలని ఏ ఆడవాళ్ళు చూసుకోనంత చక్కగా చూసేవాడు. పిల్లలకోసం బేబి సిటింగ్ చేయడానికి ఉద్యోగం మానేశాడు. ఆ యింట్లో ప్రతీక్ష మగాడిలా సంపాదిస్తుంటే అతను ఇల్లు నడిపేవాడు. ప్రతీక్ష రాత్రి యింటికి వచ్చేవరకు డిన్నరు కూడా తినకుండా ఎదురు చూసేవాడు. అలా అని ప్రతీక్ష భర్తని తక్కువ చేయడం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం , లోకువగా చూడడం, కాత్యాయని ఎప్పుడూ చూడలేదు. ఉదయం లేచి బ్రేక్ ఫాస్ట్ రెడి చేసి, పిల్లలకి కావల్సినవి తయారు చేసి ఫ్రిజ్ లో పెట్టి వెళ్ళేది ప్రతీక్ష — రాత్రి యింటికి వచ్చాక పిల్లలని చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య అండర్ స్టాండింగ్, అన్యోన్యత చూసి – ఓసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగబ్బాయినో చేసుకుంటే యింతలా మగాడినన్న యిగో లేకుండా, ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకి సాయపడే వాడా అనిపించింది. బట్టలు యిస్త్రీ, దగ్గిర నించి, ప్లంబింగ్, కార్పెంటరీ , గార్డెనింగ్ దగ్గర నించి అన్నీ చేసే మైక్ ని చూసి నప్పుడల్లా అదే అనిపించేది కాత్యాయనికి. కూతురికి పురుడు పోయడానికి రావడం పేరుకి మాత్రమే. మిగతాదంతా తనవి కూడా కూర్చోపెట్టి అల్లుడు చేస్తుంటే ఓ మూడేళ్ళలోనే కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకుని మైక్ ని మనస్పూర్తిగా గౌరవించడం , అభిమానించడం నేర్చుకుంది.
***
ప్రతి ఏడు సమ్మర్ లో ఒక నెల కూతురింట్లో వుండడం అలవాటు కాత్యాయనికి. మూర్తికి – మనవలతో గడపడం కోసం డాక్టరు మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చే వాడు.
“మమ్మీ- ఇవాళ మా హాస్పిటల్ కి ఓ బర్న్ కేసు వచ్చింది. ఆ అమ్మాయి ఇండియన్, మన తెలుగు పిల్లే – పాపం ముప్పై ఏళ్ళు లేవు. సుయిసైడ్ కమిట్ చేసింది. రాత్రి డిన్నరు టేబిల్ దగ్గిర అంది ప్రతీక్ష . “అయ్యో, ఎవరమ్మాయి , ఎందుకలా చేసింది యిక్కడెం చేస్తుంది , పెళ్ళయిందా ?’ ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని.
“పెళ్ళి కాక పోవడం ఏమిటి? యిద్దరు పిల్లలు కూడాను. ఆ మొగుడు ఆ రాస్కెల్ ఆమె చావుకి కారణం. అమ్మాయి డాక్టరేట. భర్తతో పడక , ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది.”
“డాక్టరయివుండి మొగుడితో పడకపోతే డైవర్సు తీసుకోకుండా చావడం ఏమిటి – పిచ్చి పిల్లలా వుంది. అమెరికాలో వుండి, చదువుండి కూడా యిలా చెయ్యడం ఏమిటి?”
“ఏం చేస్తుంది మమ్మీ – పెళ్ళయిందగ్గర నుంచి కాల్చుకు తినేవాడట. అమెరికా లో వున్న అమలాపురంలో వున్న చాందసుడిలా బిహేవ్ చేస్తూ అడుగడుగునా మగ అహంకారం చూపిస్తూ, తనకంటే ఆమె మంచి ఉద్యోగం, సంపాదన ఎక్కువ అన్న మగ ఇగోతో అనుక్షణం అనుమానాలతో ప్రాణాలు తీసేవాడట. వాడితో మాట్లాడావు, వీడితో నవ్వావు అంటూ యింట్లో చాకిరి అంతా ఆమె చెయ్యాలని నానా రకాలుగా పెట్టె హింసని భరించింది. ఆఖరికి ప్రాణం విసిగి డైవోర్స్ తీసుకుంటానంటే పిల్లలని యివ్వనని , డైవోర్స్ యివ్వనని భయపెడితే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది – డైయింగ్ డిక్లరేషన్ యిచ్చింది చచ్చిపోతూ – వెధవకి జైలు ఖాయం .”
“ఎవరా దరిద్రుడు — మన తెలుగు వాడంటున్నావు. మనకు తెలిసినవాళ్ళా?”
ప్రతీక్ష నవ్వింది. ‘ఎవడో కాదు మమ్మీ. నీకు అల్లుడు కావాల్సినవాడు. నా అదృష్టం కొద్ది వాడి పాలపడకుండా తప్పించుకున్నాను. నీవు అపురూపంగా నా కోసం ఎంచిన డాక్టరు పెళ్ళికొడుకు — వాడ్ని చూడగానే అన్పించింది ఎక్కడో చూసినట్టు, వివరాలు తెలిశాక “మైగాడ్ అనుకున్నాను.”
కాత్యాయని మొహం తెల్లపడింది. కలవరంగా కూతురి వంక చూసింది తల్లి పాలిపోయిన మొహం చూసి ప్రతీక్ష నవ్వుతూ – “ఏమిటి మమ్మీ అలా అయిపోయావు. నీ కూతురు సూసైడ్ చేసుకుందన్నట్టూ – వాడు నీ అల్లుడు కాదుగా, అల్లుడు కాబోయి తప్పిపోయాడు -“
“అసలు నన్నడుగుతే మన ఇండియాలో ప్రతి అబ్బాయినీ ఓ ఏడాది రెండేళ్ళు అమెరికా పంపాలంటాను. ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకుని, వండుకుని తిని “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అంటే అర్ధం అయి ఆ “మేల్ ఇగో” చావాలంటే ప్రతి అబ్బాయినీ ఇక్కడ ట్రైనింగ్ కి అన్నట్లు పంపాలి. అడ మగ సమానం అన్నది అర్ధం కావాలంటే యిక్కడోచ్చి వుండాలి. మన కుర్రాళ్ళకి ఉద్యోగా నికి ముందు ఓ ఏడాది మిలట్రీ ట్రైనింగ్ , పెళ్ళికి ముందు అమెరికా ట్రైనింగ్ యిప్పిస్తే గాని యీ మగాడి జులుంలు, ఇగోలు వదలవు – యీ విషయంలో మనం అమెరికన్స్ ని చూసి ఎంతన్నా నేర్చుకోవాలి ” ప్రతీక్ష అంటున్న మాటలకి అప్రయత్నంగానే తల ఆడించింది కాత్యాయని.
(అంధ్ర జ్యోతి న్యుజర్సీ పోటీ బహుమతి కధ 1993)
*****
( సశేషం)

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.