
“నెచ్చెలి”మాట
సెలవులు
-డా|| కె.గీత
భూమికో వైపు
బడులకు సెలవులిచ్చేవేళ
మరోవైపు
బడులు తెరిచే వేళ
ఏదైనా
సందడే సందడి
గెంతుకుంటూనో
తుళ్లుకుంటూనో
ఏడ్చుకుంటూనో
నీలుక్కుంటూనో
అసలు
పిల్లలకి
ఏది
ఇష్టం!?
ఏది
కష్టం?!
అడిగామా
ఎప్పుడైనా
అన్నీ
మన
ఇష్టాలే
కాక మరేవిటండీ-
మనకి
నచ్చిన
ఊళ్లకి తిప్పడాలూ
పెళ్ళిళ్ళకి సింగారాలూ
గొప్పలకి షాపింగులూ
సినిమాలూ
షికార్లూ
ఇంకా మాట్లాడితే
సెలవుల్లోనూ
కోచింగులూ
తోమడాలూ
అసలు
పిల్లల్ని
అడిగామా?
మీరు మరీనూ-
పిల్లల్ని అడిగేదేవిటి?
పిల్లలకి
ఏం
తెలుసు
దిక్కుమాలిన
సెల్ ఫోను
పుచ్చుక్కూర్చుంటారు!
పనికిమాలిన
వీడియో గేములాడతారు!
పాడు ఐ- పాడ్లుచ్చుకుని
వేళ్లాడుతారు!
అలాగా!
ఓ
చందమామ పుస్తకమా!
ఓ
ఆరుబయటి వెన్నెలా!
ఓ
తెల్లారుఝాము నీహారికా!
ఏం
తెలుసు
ఇప్పటి పిల్లలకి!
అసలు తెలిసే
అవకాశం
ఏది?!
సెల్ ఫోనులూ
వీడియో గేములూ
ఐ- పాడులూ
మనమిచ్చినవేగా
కొన్ని
ముద్దుకి
కొన్ని
స్టేటస్ సింబల్ కి
కొన్ని
అ(న)వసరార్థమూ
మీరూరుకోండి
ఎప్పటికప్పుడు
ట్రెండుని ఫాలో అవ్వాలి-
అసలు
పిల్లల
ఇష్టకష్టాలు
అడిగేదేవిటి?
అష్టకష్టాలు
పెట్టయినా
బాగా
డబ్బు
సంపాయిదించే
యంత్రాల్ని
చెయ్యాలి
మనలాంటి
తల్లిదండ్రుల్ని
తయారుచెయ్యాలి!
అసలు
సెలవులంటే…
చెరువుగట్టు
చింతచెట్టు
…..
అయ్యోరామా
ఏకాలంలో
ఉన్నారండీ
అవన్నీ
ఇంకా ఉండి ఉంటే కదా!
మనసుల్లోనూ-
మస్తకాల్లోనూ –
అసలు
సెలవులంటే
మనకు
నచ్చేవి చెయ్యడమే!
పిల్లలతో ఏం పని?!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
మే, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: వసుంధర
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: సోది (కథ) – సమ్మెట ఉమాదేవి
ఇరువురికీ అభినందనలు!
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

డా.గీత గారి సెలవుల కవిత చాలా బాగుంది. మా బాల్యంలో శెలవులిస్తే ఆరుబయట మైదానంలో, పచ్చగడ్డిమీద పరుగులు పెడుతూ, నన్ను అందుకోమంటూ పరుగులాటలు, దాగుడుమూతలూ, కోతీకొమ్మచ్చి ఆటలు, ఆడపిల్లలు తొక్కుడు బిళ్లాటలు, చింతగింజాటలు, వైకుంఠపాళీ లాంటివి ఎన్నో ఆడుకునేవాళ్లం. అమ్మ మంచినీళ్ల కోసం కాలువ కెడుతుంటే, నేనూ వస్తానంటూ చిన్న చిన్న బిందెలు చంకనెత్తుకుని పరుగులు తీసేవాళ్లం. ఇప్పుడన్నీ ఇండోర్ గేమ్స్ మాత్రమే. సెల్ ఫోన్లూ, ఐ పాడ్లూ ఉంటే అన్నం, నిద్రం అవసరముండదు. మానసిక వికాసం నేటి తరపు పిల్లల్లోనే ఉందంటారు. అప్పటి పిల్లలుకంటే ఇప్పటితరం పిల్లలకే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందంటారు. నిజమే నాలెడ్జ్ ఉండచ్చు గానీ, ఆ తెలివితేటలూ, విజ్నానం వెర్రితలలు వేసేటట్లు ఉండకూడదు. నాలెడ్జ్ ను తగిన రీతిలో ఉపయోగించుకుంటేనే, సమాజానికీ, ముఖ్యంగా నేటితరం పిల్లలకు ఎంతో ఉపయోగిస్తుంది. పక్కదారి తొక్కకుండా ఉండడానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి.
“పిల్లల ఇష్ట కష్టాలు
అడిగే దేమిటి?
అష్టకష్టాలు పెట్టి
చదివించి
బాగా డబ్బు
సంపాదించే
యంత్రాలను చేయడమే !”
పిల్లల్లో ఊహాశక్తిని వారిలో దాగున్న సృజన శక్తులను
అణచివేసే పిల్లల పెంపకం… ఎవరు మార్చాలి ఆ తల్లితండ్రులను …?!!
మీ సంపాద కీయం “ సెలవులు” .- నిజం..సెల్ ఫోన్లు, ఐ పాడ్లలో ,వీడియో గేముల్లో మునిగిపోయి “సెలవుల “ను ఆస్వాదించే ఈ తరం పిల్లలు ..।🤔😌