కాకి బంగారం

-కందేపి రాణి ప్రసాద్

          గ్రామ శివారులో ఒక అడవి ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఊడలు దింపుకుని ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తు న్నాయి. ఈ మర్రి చెట్లకు ప్రక్కనే ఒక పెద్ద చెరువు, మైదానం ఉన్నాయి. దూరంగా కొండలు కనిపిస్తూ, ప్రకృతి ఆహ్లాదం తాండవిస్తుంది. అందమైన అడవి అంటే సరియైన నిర్వచనంలా కనిపిస్తున్నది.
 
          ఒక పెద్ద మర్రి చెట్టు మీద కాకి తన పిల్లలతో కాపురం ఉంటున్నది. కాకి పిల్లలు కొంచెం పెద్దవి అయ్యాయి. చిన్న చిన్న ఎత్తులు ఎగురుతున్నాయి. ఆహారం కోసం దూరం వెళ్ళాల్సిన ప్రాంతాలకు మాత్రం తల్లి వెళ్ళి తెచ్చి పెడుతున్నది. ప్రక్కనున్న చెట్ల మీదున్న స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటున్నాయి. కాకి పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంగానే అనుభవిస్తున్నాయి.
 
          ఒక రోజు కాకి పిల్లలు దగ్గరగా ఉన్న గ్రామం వెళ్ళాలని అనుకున్నాయి. సరదాగా అన్నీ కలిసి గ్రామం వరకు వెళ్ళాయి. కానీ గ్రామం లోపలికి వెళ్ళలేదు. చుట్టు ప్రక్కల అంతా తిరిగి వచ్చేయాలని అనుకున్నాయి. రాళ్ళగుట్ట ప్రక్కగా ఏదో చిన్నగా మెరుస్తూ కనిపించింది. ఒక కాకి కిందికి వంగి చూసింది. ఎర్ర రాయితో ఉన్న బంగారు రంగులో మెరుస్తున్న ముక్కు పోగు అది.
 
          కాకి గబుక్కున వంగి దానిని ముక్కున కరుచుకున్నది. మిగతా పిల్లలు దీని వంకే చూస్తున్నారు. ఏమిటది అని ప్రశ్నిస్తున్నారు. కాకి పిల్ల ఏమి వినకుండా రయ్యుమని ముందుకు పరుగెత్తింది. దాని వెనకే మిగతా కాకి పిల్లలు బయల్దేరి వెళ్ళాయి.
 
          ముక్కు పోగును తీసుకున్న కాకి పిల్ల గబగబా తన ఇంట్లోకి దూరింది. గూటి లోపల దాచి పెట్టింది. అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తోంది. ఇలా మెరిసేదాన్ని మెరిసేవాన్ని కాకి పిల్ల ఎప్పుడూ చూడలేదు. అందుకే చాలా ఆతృతగా ఉన్నది.
 
          సాయంత్రం అమ్మ అల్లంత దూరాన ఉండగానే కాకి పిల్ల ఎదురెళ్ళింది. తల్లి కాకి “ఏమైందని”అడిగింది. తల్లిని గబగబా లోపలికి లాక్కోచ్చి కూర్చో బెట్టింది. తను తెచ్చిన ముక్కు పోగును బయటకు తీసి, అమ్మకు చూపించింది. ఇది ఏమిటని
అడిగింది.
 
          దానికి,  తల్లి కాకి ” ఇది మనుషులు ముక్కుకు పెట్టుకునే పుడక అమ్మా! నీకెక్కడ దొరికింది ” అని అడిగింది. అమ్మా నాకు ఊరి దగ్గరున్న రాళ్ళ గుట్ట దగ్గర దొరికింది. బంగారమంటే ఇదేనా అమ్మా! అని కాకి పిల్ల అన్నది.
 
          మనుషులకు బంగారమంటే చాలా మక్కువ. పసిడి రంగులో మెరుస్తూ, అత్యద్భుత ఆకర్షణ కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెవులకు, ముక్కులకు, చేతులకు, మెడలోకి వేసుకుంటారు.
 
          చాలా ఆభరణాలు తయారు చేయించుకుని పెళ్ళిళ్ళలో పెట్టుకుంటారు. బంగారాన్ని చూడాలంటే వాళ్ళ పెళ్ళిళ్ళకు వెళ్ళాల్సిందే. నేను ఇంతకు ముందు గ్రామంలో ఉండేటప్పుడు చాలా చూశాను. పప్పన్నం, నెయ్యి రెండింటిని కలుపుకుని తింటారు. అది చాలా దొరుకుతుంది.” పెళ్ళిలోని పప్పన్నం గుర్తుకు తెచ్చుకుంటూ, తల్లి కాకి ఆనందంగా చెప్పింది.
 
          “అమ్మా బంగారం మనుషుల దగ్గరే ఉంటుందా?, మన జంతువుల దగ్గర ఉండదా!, మనం కూడా ఆభరణాలు చేయించుకుందాం. నాకు ముక్కు, చెవులు కుట్టించు. లోలాకులు, పోగులు పెట్టుకుంటాను. బాగుంటుంది” అంటూ గారంగా అడిగింది.
 
          తల్లి కాకి, తన కూతుర్ని దగ్గరకు తీసుకుని,”ఆడపిల్లవి అనిపించావు. ఈ బంగారు ఆభరణాలు మనకెందుకు తల్లీ. బంగారాన్ని పెట్టుకున్నందుకు మనుషులకే ఎన్నో ఆపదలు వస్తున్నాయి. ఈ అడవిలో ప్రశాంతంగా ఉన్నాం. ఈ నగల జోలికి వెళ్తే, ప్రమాదాల బారిన పడతాం ” అంటూ చెప్పింది.
 
          “అమ్మా!” వాళ్ళకి బంగారం ఎక్కడ నుంచి వస్తుంది. వాళ్ళకెలా దొరుకుతుంది. మనకెందుకు దొరకడం లేదు చెప్పు అని తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగు తున్న పిల్ల కాకిని చూసి, తల్లి ముచ్చట పడింది.
 
          ’’ చూడు నాన్న‘‘ ఈ బంగారం గనులలో దొరుకుతుంది. ఇదోక లోహం. చాలా ఖరీదైనది తెలుసా!. అందుకే నగలు చేయించుకుంటారు. ఇళ్ళలో డబ్బు కన్నా జాగ్రత్తగా దాచుకుంటారు. ఈ బంగారాన్ని ఆయుర్వేద వైద్యంలో కూడా వాడతారు అత్యంత పలుచని రేకులంగా తయారుచేసి వాటిని లేహ్యాలలో పెట్టి తినిపించేవారు.” అంటూ ఇంకా చెప్పబోతూ ఉండగానే పిల్ల కాకి ఆపింది. ఏమిటన్నట్లు చూసింది తల్లి కాకి.
          అసలు గనులు అంటే ఏమిటమ్మా అని అన్నది. అందుకు సమాధానంగా తల్లి కాకి ఇలా చెప్పింది. “భూమి లోపల చాలా లోతుల్లో అనేక లోహాలు ఉంటాయి. ఇనుము, రాగి, వెండి, ఇత్తడి, బంగారం వంటివన్నీ లోహాలే. ఇవన్నీ భూమి లోపలే దొరుకుతాయి. ఈ విషయం తెలుసుకున్న మానవుడు తన తెలివితేటలతో భూమి లోపలికి త్రవ్వి బంగారాన్ని, వజ్రాల్ని కనుగొని తెచ్చుకుంటున్నాడు. బంగారాన్ని త్రవ్వే గనుల్లో ’’కోలారు‘‘ గనులు ప్రసిద్ధి చెందాయి.‘‘ అని చెబుతూ, ఆయాసంతో కాసేపు ఆగింది తల్లి కాకి.
 
          పిల్ల కాకి చాలా ఆశ్చర్యంగా వింటున్నది. తల్లికి ఇవన్నీ విషయాలు ఎలా తెలుసు, ఎప్పుడూ చెప్పలేదే అని వింతగా చూస్తున్నది. పిల్ల మనసులోని భావాన్ని కనిపెట్టినట్లుగా తల్లి కాకి ఇలా చెప్పింది.- మన పాత గూడు ఒక కాలేజీలో ఉన్న చెట్టు మీదనే ఉన్నది. అక్కడ రోజు మాస్టార్లు పిల్లలకు పాఠాలు చెప్తుంటే వినేదాన్ని. అక్కడున్న కాలేజీ పిల్లల గోల భరించలేక ఇక్కడ గూడు కట్టుకున్నాం”.
 
          అవునా అమ్మా, ’’నేనెప్పుడూ చూడలేదుకదా!. ఇంకా బంగారం గురించి చెప్పవా‘‘ అని గోముగా అడిగింది పిల్ల కాకి. దానికి తల్లి కాకి సంబరపడుతూ, “నువ్వింత ముచ్చటగా అడుగుతుంటే ఎందుకు చెప్పను విను! అన్ని విషయాలు చెబుతాను. ముందుగా దానికి ఎన్ని పేర్లున్నాయో చెబుతాను’’ అన్నది.
 
          ’’పసిడి, కనకం, స్వర్ణం, హేమం, పుత్తడి, సువర్ణం, వీరణ్యం’’ అంటూ రకరకాల పేర్లున్నాయి. బంగారం చాలా విలువైనది కాబట్టే ఇళ్ళలో మనుషులు తమ పిల్లల్ని ‘బంగారం’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎవరిలోనైనా చెప్పేటపుడు కూడా “మా అబ్బాయి మేలిమి బంగారం ” అని గొప్పగా చెప్పుకుంటారు. అని తల్లి కాకి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే, పిల్ల కాకి ఆదుర్దా ఆపుకోలేక అమ్మా… అమ్మా ‘‘మేలిమి బంగారం’’ అంటే ఏమిటి అని అడిగింది.
 
          ‘‘బంగారంతో మరే లోహమూ కలవకుండా ఉంటే దానిని మేలిమి బంగారు అంటారు. అంటే నా కొడుకు చాలా స్వచ్ఛమైన వాడు! ఎలాంటి మచ్చలు లేవు’’ అని చెప్పడానికి ఇలా చెబుతారు. నువ్వు కూడా నా మేలిమి బంగారానివే అమ్మా అని తల్లి కాకి తన పిల్లతో చెప్పింది.
 
          ‘‘అమ్మా! మేలిమి బంగారంలో వేరే లోహం ఎందుకు కలుపుతారు?, స్వచ్ఛంగా ఉంచవచ్చుకదా! అని పిల్ల కాకి అనగానే తల్లి కాకి ఇలా అన్నది. “మేలిమి బంగారంలో రాగి అనే లోహాన్ని కలిపితేనే ఆభరణాలు తయారు చేస్తారు. వేరే లోహం కలపకపోతే నగలు తయారు చేయడానికి కుదరదు. అందుకే స్వర్ణకారులు, రాగిని కలిపి అందమైన నగలు తయారు చేస్తుంటారు.’’
 
          అమ్మా నాక్కూడా ముక్కు పోగు పెట్టమ్మా, ఇందురు నేను తెచ్చకున్నాను కదా! అని పిల్ల కాకి మురిపెంగా అన్నది. దానికి, తల్లి కాకి నవ్వుతూ… ‘‘అది బంగారం కాదమ్మా!, కాకి బంగారం. మనుషులు బంగారం ధరలు ఎక్కువయ్యేసరికి, ఇలా నకిలీ నగలు పెట్టుకుంటున్నారు. నకిలీ నగలను తక్కువ నాణ్యత గల నగలను ‘‘కాకి బంగారం’’ అంటారు ‘అది మీకొద్దమ్మా” అన్నది.
 
          ‘‘నకిలీ వస్తువుకు మన పేరు ఎందుకు పెట్టారు నేనొప్పుకోను” అన్నది పిల్ల కాకి రోషంగా. ‘‘సరేలేమ్మా ‘కాకి’ అని మన పేరు పెట్టినంత మాత్రాన మనకేమి మచ్చరాదు లే’’ అని పిల్లకు నవ్వుతూ సర్ది చెప్పింది తల్లి కాకి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.