
మనమే… మనలో మనమే
– రూపరుక్మిణి.కె
ఇంకా… అంటారానితనం వుందా!!!!
అంటాడో అమాయక జీవి!
ఇక్కడ వున్నదంతా
వెలివేతల్లోని
అంటరాని తనమే,
అస్పృశ్యతే,
కాదనలేని నిత్య సత్యమే,
అయినా..
ఏది ఏమైనా…
పుస్తకాల్లో వెలివేస్తాం.
బింకాలుపోతాం,
డాంబికాలు పలుకుతాం.
అంతా అటుమల్లగానే,
గారడి ఆట మొదలెట్టి
లో లోపల
ఈ అంటూ, ముట్టుని
మెదళ్ళలో కోట కట్టి పాలిస్తాం.
రంగు ఇంకో రంగుని
బుద్ది మరో బుద్దిని
అన్యాయం న్యాయాన్ని
అబద్దం నిజాన్ని
కులం ఇంకో కులాన్ని
వర్గం మరో వర్గాన్ని
మతం వేరొక మతాన్ని
ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని
హింస అహింసని
యుద్ధం శాంతిని
అంటరానితనంలో
వెలివేస్తూనే వున్నాయి.
మనిషిగా పుట్టి మానవత్వాన్నే అంటరానితనంగా నరనరాన నగిషీలు చెక్కుకున్నదీ సమాజం. (మనమే)
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
