యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-4
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
వీసా-2
యూకే వీసా వచ్చిన తరువాత మరో నెల్లాళ్ళకి ఫ్రాన్సు వీసా కోసం శాన్ఫ్రాన్సిస్కోలో వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ అప్పాయింటుమెంటు దొరికింది. అక్కణ్ణించి మరో 25 రోజుల్లో మాకు ఈ యూరపు వీసా స్టాంపింగయ్యి పాసుపోర్టులు మాచేతికందాలి.
“ఇక చేసేదేముంది కనుక! ఆశావహంగా ముందుకు సాగడం తప్ప.” అనుకుని ముందడుగు వేసాం.
ఇక వీసా అప్లికేషను సమయంలోనే టూరుకి తప్పనిసరిగా కొనాల్సిన హెల్తు ఇన్సూరెన్సు వివరాలు ఉంటాయి. వీసా రాగానే కొందామని దీనిని వాయిదా వేసాం.
ఇక టూరిజం సైటులో అప్పటికి కేవలం బేసిక్ ప్యాకేజీ మాత్రమే బుక్ చేసేం. అక్కణ్ణించి మరో నెలరోజుల్లో మా ప్రయాణం. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ వెళ్తున్న ఊళ్ళల్లోనూ, ఆ చుట్టుపక్కలా మేం చూడాలనుకున్న ప్రదేశాలకి సంబంధించిన లోకల్ టూర్లు బుక్ చేసుకోవాలంటే రేట్లు రోజురోజుకీ పెరిగిపోతుంటాయి. ఎలాగూ వీసా రాకపోతే డబ్బు వాపసు వచ్చే ఇన్సూరెన్సు ఉంది కాబట్టి, అప్పటికే రీసెర్చ్ చేసుకుని తయారు చేసుకున్న లిస్టు ప్రకారం ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీల్లో లోకల్ టూర్లు బుక్ చేసేం.
ఈ టూర్లు కాకుండా, హెల్తు ఇన్సూరెన్సు వగైరా అన్నిటితో కలిపి మరో మూణ్ణాలుగువేలు అదనంగా అయ్యింది. అంటే దాదాపుగా అప్పటికి పదకొండువేలా అయిదువందల డాలర్లయ్యింది మా ముగ్గురికీ.
మొత్తానికి యూరప్ వీసా అప్పాయింటుమెంటు రోజున శాన్ఫ్రాన్సిస్కోకి అప్పాయింటుమెంటు సమయానికి అరగంట ముందే వెళ్లేం. దగ్గర్లో ముప్ఫై డాలర్లు చెల్లించి కారు పార్కు చేసాం. కాస్త నడిచి వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ అడ్రసు కోసం వెతకడం మొదలుపెడితే అసలు బిల్డింగు కనుక్కోవడమే కష్టమైంది. మాక్కావాల్సిన బిల్డింగుకి అటుపక్క, ఇటుపక్క బిల్డింగు నంబర్లు ఉన్నాయి కానీ అసలు బిల్డింగు నంబరు కనిపించలేదు. దారిన పోయే వాళ్లనడిగితే వాళ్లూ తెలియదన్నారు. మొత్తానికి కాస్సేపటికి ఆ డోరు నంబరు ఉన్న బిల్డింగు రెండు పెద్ద బిల్డింగుల మధ్యలో ఉన్న అతిచిన్న అద్దాల డోరని అర్థమయ్యింది.
ఆ సన్నని అద్దాల తలుపు తెరిచి ఉందో, మూసి లేదో తెలియకుండా బిడాయించి ఉంది. సందేహంగా తలుపు గట్టిగా తోస్తే తెరిచే ఉంది. హమ్మయ్య అనుకుని లోనికడుగుపెడ్తే సందులాంటి లాబీలో చిన్న డెస్కు ముందు ఓ గార్డు కూచుని ఉన్నాడు. మా అప్పాయింటుమెంటు చూసి అయిదవ అంతస్తుకి వెళ్లమని లిఫ్టు చూపించాడు. లిఫ్టుతో పాటూ చిన్న కారిడార్ మాత్రం ఉందంతే. ఇక పైకి వెళ్లి చూద్దుము కదా! అక్కడ కూడా అదే పరిస్థితి. అయిదో అంతస్తులో వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ ఆఫీసు లాబీలో చిన్న డెస్కు దగ్గిర ఓ అమ్మాయి కూచుని ఉంది.
ఆమె మా అప్పాయింటుమెంటు సమయం చూసి అక్కడ కూచునేందుకు స్థలం లేదు కాబట్టి మా అప్పాయింటుమెంటుకి సరిగ్గా పావుగంట ముందు మాత్రమే రమ్మని కిందికి పంపేసింది మమ్మల్ని.
ఆ రోజు శాన్ఫ్రాన్సిస్కోలో బయట ఎముకలు కొరికే చలిగా ఉంది. బయటెక్కడా తిరగడం చాలా కష్టం.
తప్పక కిందికి వచ్చి పక్క వీథిలో కాఫీ దుకాణానికి వెళ్ళేం. మేమిద్దరం కాఫీలు కొనుక్కుని, సిరికి ఐసుక్రీము కొనిబెట్టి అరగంట అక్కడ గడిపాం. మొత్తానికి దాదాపుగా అన్న సమయానికి మళ్ళీ వెనక్కి వచ్చాము. అయినా అయిదు నిముషాలు మిగిలి పోయింది. లోపల అందరికీ స్థలం లేకపోవడంతో సత్యని, సిరిని లాబీ లోపలికి వెళ్ళమని, నేను అక్కడే బిల్డింగు ముందు చలిలో నిలబడి, మాలాగే వెతుక్కుంటున్న వాళ్ళకి వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ ఆఫీసు అడ్రసు చెప్పసాగేను.
ఇక సమయానికి పైకి వెళ్ళగానే రిసెప్షనిస్టు ఈ సారి టోకెను ఇచ్చి వెంటనే లోపలికి పంపింది. ఆఫీసు ఒక చిన్న గదిలో ఉంది. అక్కడే ఫ్రాన్సుకి ఒక కౌంటరు, ఇటలీకి ఒక కౌంటరు అంటూ మూణ్ణాలుగు దేశాలకి వరుసగా కౌంటర్లున్నాయి.
అరగంట వేచి చూసేక ఫ్రాన్సు కౌంటరు నించి మా వంతు రానే వచ్చింది.
కౌంటరులో ఉన్నతను అయిదే అయిదు నిమిషాల్లో మా అప్లికేషన్లు అటూ ఇటూ తిప్పి “మీరు ఫ్రాన్సులో ఉండేది మూడు రాత్రుళ్ళు, ఇటలీలో ఉండేది నాలుగు రాత్రుళ్ళు అయినప్పుడు, పారిస్ వీసాకి అప్లై చేసారేవిటి? అన్నాడు.
ఒకళ్ళ మొహాలొకళ్ళం చూసుకున్నాం మేం. అప్పుడర్థమైంది తప్పు ఎక్కడ చేసేమో!
టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు మొత్తం తొమ్మిది రోజులలో అటూ, ఇటూ రెండ్రోజులు ప్రయాణంపోగా ఒక్కొక్క చోటా రెండ్రోజులు మాత్రమే పూర్తిగా లెక్కలోకి వస్తున్నాయి. అందువల్ల అంత దూరం వెళ్లడమన్నది పేరుకే గానీ ఏదీ సరిగా చూసేందుకు లేదు. అందుకని చివరి నిమిషంలో మొత్తం ప్రయాణాన్ని పన్నెండు రోజులకి మార్చాం. అంటే ప్రయాణం పోగా లండనులో నాలుగు రోజులు, పారిస్ లో మూడు రోజులు, రోమ్ లో మూడు రోజులు మా ప్లాన్. అయితే రోము నించి మా ఫ్లైటు చివరి రోజు రాత్రి కాకుండా ఆ మర్నాడు తెల్లారగట్ల ఉండడం వల్ల హోటలు నాలుగు రాత్రుళ్ళకి బుక్ అయ్యింది.
సత్య “అయ్యో! ఇలా చేసేమేమిట్రా అన్నాడు” అక్కడే.
కౌంటరులోని అతనికి నేను “ప్రయాణం మర్నాడు పొద్దున్న కావడం వల్ల… అంటూ” ఏదో సర్ది చెప్పబోతే
అతను తల అడ్డంగా ఊపి “మీకున్నవి రెండే ఆప్షన్లు. ఒకటి ఇటలీ వీసాకి మరో అప్లికేషను పెట్టుకోవడం, లేదా ఫ్రాన్సులో మూడు రోజులకి బదులు నాలుగు రోజులకి హోటలు బుక్ చేసుకుని తెచ్చి చూపించడం” అన్నాడు.
అప్పటికప్పుడు ఏం చెయ్యాలో తోచక పోయినా, ఆ రోజుకారోజు వీసా అప్లికేషను ప్రాసెస్ పూర్తి చెయ్యకపోతే మాకు ఇక ప్రయాణం మొత్తం వాయిదా పడే పరిస్థితి తప్పదని మాత్రం అర్థం అయ్యింది.
నేను చప్పున తేరుకుని “సరే, హోటలు బుకింగునే మారుస్తాం. మా ట్రావెల్ ఏజంటు వాళ్ల కస్టమరు సర్వీసుతో మాట్లాడి తెస్తాం” అన్నాను.
“మరి ఇవేళ్టి మీ అప్పాయింటుమెంటు వాయిదా వేసుకుంటారా?” అని అడిగేడు అతను.
నేను ధైర్యంగా “ లేదు, లేదు. మరో గంటా, రెండు గంటల్లో వస్తాం. మీ ఆఫీసు ఎప్పటి వరకు తెరిచి ఉంటుందీవేళ? అన్నాను.
“మధ్యాహ్నం మూడు గంటల్లోపల రండి, లేకపోతే వాయిదా వేసుకోండి” అన్నాడు.
అప్పటికి పదకొండున్నర అయ్యింది. ఏదో ధైర్యంగా అక్కడ చెప్పేసేను కానీ, అసలిదంతా కొన్ని గంటల్లో ఎలా పూర్తి చెయ్యాలో అర్థం కాలేదు.
*****
(సశేషం)