
అడవిలో అపార్టుమెంట్లు
-కందేపి రాణి ప్రసాద్
మన మహారాజు సింహం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరిని గుహ దగ్గర నున్న మైదానం వద్దకు రమ్మన్నారు అంటూ.. కాకి అందరికీ వినబడేలా గట్టిగా అరుస్తూ చెపుతోంది. ‘‘అబ్బా ఈ కాకి ఎంత కర్ణ కఠోరంగా అరుస్తుంది” అంటూ, బోరియలో నుంచి హడావిడిగా బయటికి వచ్చిన కుందేలు తన రెండు చెవులు మూసుకుంటూ అన్నది.
‘‘కాకితో కబురు పంపిన మేము రాకపోదుమా’’ అనే సామెత ఉన్నట్లుగా మహారాజు గారు కాకితోనే కబురు పంపించారు భలే ఉన్నది’’. అంటూ అక్కడే చిటారు కొమ్మల నుంచి ఆకులు తింటున్న జిరాఫీ అన్నది. కాకి గోలకు చెట్ల మీదున్న పక్షులు, బోరియ ల్లోని జంతువులు, గుహల్లోని జంతువులు అన్నీ బయటకు వచ్చాయి. ‘ ఏమిటో విషయం ! ఎందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు’ అని జంతువులన్నీ మాట్లాడుకో సాగాయి. “అయిన అక్కడకు వెళ్ళితే తెలుస్తుంది కదా అంటూ, మళ్ళీ జంతువులన్నీ పనిలో పడ్డాయి. సాయంత్రం సమావేశానికి వెళ్ళడానికి తమ పనులను గబగబా చేసుకోవడం ప్రారంభించాయి.
సాయంత్రం అవుతూ ఉండగానే, జంతువులన్నీ ఒక్కొక్కటిగా మైదానం దగ్గరకు రావడం ఆరంభించాయి. ఆ మైదానం చదునుగా విశాలంగా ఉంటుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. కొన్ని పెద్ద జంతువులు ఆ రాళ్ళ మీద కూర్చుం టాయి. దగ్గరలో ఉన్న చెట్ల మీద పక్షులన్నీ వాలి ఉన్నాయి. జంతువులన్నీ సింహం రాక కోసం ఎదురు చూసున్నాయి.
అందరూ చూస్తూ ఉండగానే సింహం గుహలో నుంచి బయటకు వచ్చింది. మైదానం దగ్గరకు వచ్చి, బాగా ఎత్తుగా ఉన్న బండరాయి మీద కూర్చుంది. జంతువు లన్నీ లేచి నిలబడి మృగరాజుకు అభివాదం చేశాయి. అందరిని కూర్చోమని సైగ చేసింది. సింహం గొంతు సరిచేసుకుని చెప్పటం మొదలు పెట్టింది.‘‘ నేను ఒక విషయం గురించి చర్చించటానికి మిమ్మల్నిఅందరిని పిలిచాను. ప్రస్తుతం మన అడవి విస్తీర్ణం తగ్గిపోతున్నది, మానవులు అడవుల్లోకి దూసుకు వచ్చి చెట్లను కొట్టేస్తు న్నారు – ఫలితంగా మన జంతువులకు ఖాళీ సరిపోవటం లేదు. నిలవ నీడ లేక జంతువులు అల్లాడి పోతున్నాయి.ఈ పరిస్థితిని సమీక్షిద్దామనే మిమ్మల్ని అందరినీ పిలిచాను” అంటూ సింహం కొద్దిగా ఆగింది.
‘‘అవును మహారాజా! మాకు తినడానికి ఆకులే దొరకడం లేదు. ఆకలికి మాడి పోతున్నాం అన్నది జిరాఫీ బాధగా!. “మాకు గూడు కట్టుకోవడానికి చెట్లే ఉండడం లేదు. పెద్ద పెద్ద చెట్లన్నీ కొట్టేస్తున్నారు. మేము మా పిల్లలు రోడ్డు మీదికొచ్చాం, చాలా బాధలు పడుతున్నాం” అంటూ రామచిలుకలు, కాకులు, గోరింకలు మొరపెట్టు కున్నాయి.
‘‘ మహారాజా చెట్లను కొట్టేయడమే కాదు. కొండలను పిండి చేస్తున్నారు. మేము నివాసం ఉండడానికి గుహలు కూడా ఉండడం లేదు. వర్షం వస్తే తడిచిపోతున్నాం. నిలవ నీడ లేదు. ఎండలకు మలమలా మాడిపోతున్నాం” అంటూ పులులు, క్షీరదాలు మొరపెట్టుకున్నాయి.
‘‘పెద్ద పెద్ద చెట్లు ఉండటం లేదు కొట్టేస్తున్నారు. మేము తేనెపట్లు ఎక్కడ పెట్టుకోవాలి. ఊళ్ళలోకి వెళ్ళితే తేనె కోసం మమ్మల్ని చంపేస్తారు.” అని తేనెటీగలు చెపుతుంటే ఎలుగుబంట్లు వచ్చి రోజు ఫిర్యాదు చేశాయి. ఈ తేనెటీగలు తేనెను సేకరించి, తేనె పట్లు పెట్టకపోతే, మాకు ఆహారం ఎలా వస్తుంది మహారాజా” అంటూ వాపోయాయి.
ఏనుగులు ముందుకొచ్చి, ‘‘మన అడవిలో మనకు రక్షణ లేకుండా చేస్తున్న మానవులను వదిలి పెట్టకూడదు. ఊళ్ళలోకి వెళ్ళి వారి నివాసాలను నేల మట్టం చేయాలి. అప్పుడే వారికి బుద్ది వస్తుంది.’’ అని ఆవేశంలో మాట్లాడాయి.
‘‘అందుకే మేం వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి, కోడిపిల్లల్ని, బాతు పిల్లల్ని ఎత్తుకొచ్చెస్తు న్నాం.’’ అని నక్కలు, తోడేళ్ళు చెబుతుంటే, మనుషుల ఇళ్ళలోని మొక్కల్ని చెట్లని, వస్తువులని చిందరవందర చేసేసి వస్తున్నామంటూ కోతులు సంతోషంగా చెప్పాయి.
“సరే ఆపండి మీ వాగుడు-అది కాదు కావలసింది. మన అడవి తగ్గిపోతోంది. కాబట్టి, మన నివాస స్థలాలు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి ఏమైన పరిష్కార మార్గం సూచించగలరా’’ ఆలోచించండి అంటూ, సింహం జంతువులను ఉద్దేశించి మాట్లాడింది.
చాలా సేపు జంతువులు ఏమి మాట్లాడడం లేదు. అన్ని జంతువులు దీర్ఘాలోచ నలో మునిగిపోయాయి. ఎన్నోరకాలుగా మనసులో ఆలోచించుకున్నాక, పులి ముందుకు వచ్చి ఇలా చెప్పింది.
‘‘మన అడవిలోకి మానవులకు ప్రవేశం లేదని చెబుదాం. అప్పుడూ మానవుడు అడవులు కొట్టివేయలేడు కదా!.‘‘
‘‘అలా చెప్పిన మానవులు వింటారా!, అలా వినే వాళ్ళయితే, ఇలా మన నివాసాలను నాశనం చేయరు. మొత్తం భూ ప్రపంచం అంతా అప్పగించిన వాళ్ళకు చాలదు.”అంటూ కోపంతో చిందులు తొక్కుతూ ఎలుగు బంటి అన్నది.
” అయితే ఒక పని చేద్దాం!. అడవిలోకి ప్రవేశించిన మనుషులను భయపెడదాం. చంపేస్తామని బెదిరిద్దాం. అప్పుడు దారికి వస్తారు.” అంటూ మొసలి నీళ్ళలో నుంచి తల బయటపెట్టి చెప్పింది.
అమ్మో ! మనుషులతో పెట్టుకున్నా, రాక్షసులతో పెట్టుకున్నా ఒకటే. మన ప్రాణాలు తీస్తారు తప్ప, వాళ్ళ అలవాటు మానుకోరు. నేను వాళ్ళతో ఎక్కువ సేపు తిరుగుతాను కదా! నాకు తెలుసు వారి మనసత్వమేమిటో’’ అని గుర్రాలు భయపడు తూ చెప్పాయి. గుర్రాల మీద స్వారీ చేస్తూ, మనుషులు కొట్టే దెబ్బలు వాటికి గుర్తున్నాయి. అది తలచుకుని ఈ మాటలు అన్నాయి.
‘‘మానవులు క్రూరులు. ఇంతకు ముందు ఒక బాంబును తిండి పదార్థమని నమ్మించి, కడుపుతో ఉన్న ఏనుగుకు తినిపించి చంపేశారు. వారి జోలికి పోవద్దు.” ఒక వృద్ధ ఏనుగు పూర్వ సంఘటనను గుర్తు చేసుకుంటూ అన్నది.
“నిజమేగానీ ఎన్ని రోజులు ఇలా భరించాలి. మన అడవినంతా ఆక్రమించుకునే దాకా చూస్తూ ఉండాలా?” అని యువ జంతువులు పోరాటానికి సిద్ధమయ్యాయి.
ఒక గోమాత ముందుకొచ్చి మహారాజా! నేనొక ఉపాయం చెబుతాను. నేను మానవుల మధ్యనే మసలుతాను కదా!. వాళ్ళకు కూడా స్థలం సరిపోక సమస్యలు వచ్చాయి. జనాభా పెరిగారు కానీ, స్థలం పెరగలేదు. కాబట్టి వాళ్ళు అపార్టుమెంటులు కట్టుకుంటున్నారు. అంటే ఒక ఇంటి మీద మరొక ఇల్లు. అలా ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు కట్టుకుంటే స్థలం ఆదా అవుతుందని ప్లాన్ చేశారు. దీని వల్ల ఇరవై, ముప్పై అంతస్తులు కట్టుకొని నివసిస్తున్నారు. ఒకరికి సరిపోయే స్థలంలో ఇరవై, ముప్పై కుటుంబాలు ఆనందంగా నివసిస్తున్నారు” అన్నది.
“సరే వాళ్ళెలా కట్టుకుంటే మనకెందుకు. వాళ్ళ గురించి ఎందుకు చెపుతు న్నావు. వాళ్ళగురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.’’ అంటూ, జింకలు వచ్చి కోపంగా ఉన్నాయి.
“ఆగండి మిత్రమా!, నేను చెప్పేది పూర్తిగా వినండి. వారిలాగే మనం కూడా ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది. మనం కూడా గూడు మీద గూడు కట్టుకుంటే చాలా మంది కాపురం ఉండవచ్చు కదా!. మానవులు చేసిన పనిని అడవిలో కూడా పాటిస్తే బాగుంటుంది కదా!.’’ అని జింకలతో చెప్పిన గోమాత, మహారాజు సింహం వైపు తిరిగి ఇలా అన్నది.
“మహారాజా! ఇది సరైన నిర్ణయం అని నేను అనడం లేదు. నాకు తోచిన పరిష్కారం సూచించాను. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.” అని గోమాత నమస్కరిస్తూ చెప్పింది.
దీనికి సింహం “సరే దీనికి గాను ఒక కమిటీ వేస్తున్నాను. ఈ అపార్టుమెంట్ల వల్ల ఉపయోగాలు, నష్టాలు ఏమిటో బాగా పరిశోధన చేసి చెప్పండి. దానిని బట్టి మనం ఆచరిద్దాం. సరే ఈ రోజుకు ఈ సమావేశం ముగిసింది. ఇక ఇళ్ళకు వెళ్ళిండి” అని చెప్పింది.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.