
ఏఐ ఏజి రాధ
(నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)
-రామలక్ష్మి జొన్నలగడ్డ
మనిషిలో మనీ ఉండొచ్చు, షి ఉండొచ్చు- కానీ మనిషి అంటే మగాడు. కేవలం మగాడు.
మనిషిలో షి ఉండొచ్చు. కానీ మహిళ మనిషి కాదు. మనిషి అంటే కేవలం మగాడు.
అంటే ఈ భూమ్మీద ఉంటున్నది మనుషులూ, మహిళలూ! వీళ్లతో స్టోన్ ఏజి దాటి, మరెన్నో ఏజిలను అధిగమిస్తూ ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) ఏజిలోకొచ్చాం. ఏ ఏజి తరచి చూసినా- నారీజాతి చరిత్ర సమస్తం పురుషార్థ పరాయణత్వం! మగవారినుద్దేశించి, ‘మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె’ అని వాపోవని మహిళా మణుల్ని వేళ్లపై లెక్కించొచ్చునేమో!
మరి మహిళలు రాజ్యాలు ఏలుతున్నారు. రాకెట్లు తోలుతున్నారు. ముందుండి సైన్యాన్ని నడిపిస్తున్నారు. ప్రపంచస్థాయి సియీఓలుగా వెలుగుతున్నారు. ఐతే- ‘అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరుల నెదిరించినంత’ మాత్రాన మహిళాలోకం నిద్ర లేచినట్లేనా- అన్న ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నమౌతోందంటే- ఎదుగుదలలో వివిధ దశల్లో వారెదుర్కునే సమస్యలు వారి ఆడతనంతో ముడిపడి ఉండడమొక కారణం.
ఆ సమస్యల్లో అత్యాచారం అతిఘోరమైనది. అది మన సమాజాన్ని ఇప్పటికీ, ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం’గా కొనసాగిస్తోంది. దానికి స్పందించడంలో మనమిప్పటికీ భీష్మాద్రోణాది పురుషోత్తముల అసహాయతని ప్రదర్శిస్తున్నాం.
నిజానికది అసహాయత కాదు, ఉపేక్ష. ఆ ఉపేక్ష నుండి మనుషులే కాదు, మహిళలూ బయటపడాలి.
ఇదీ ఏఐ ఏజి యువతి రాధ ఆశయం. ఇంకా చెప్పాలంటే ఇదే రాధ ఆశయం.
రాధలో ఈ ఆశయం ఎప్పుడు, ఎలా పుట్టిందో గ్రహించాలంటే- ఆమెని అంతకు ముందు ఏజిలనించీ గమనించాలి.
టీనేజిలో రాధ
పదహారో ఏడు నడుస్తుండగా, పదోతరగతి ఫైనల్ పరీక్షలో చివరిది రాసింది రాధ. అన్ని పరీక్షల్లాగే ఇదీ బాగా రాశానన్న తృప్తితో హాల్లోంచి బయటికొచ్చింది. ఆ సెంటర్లోనే ఆమె క్లాస్‌మేట్సు మరికొందరు పరీక్షలు వ్రాశారు.
అందరికీ ఈరోజు ఎవరి సెలబ్రేషన్ ప్రోగ్రామ్సు వారికున్నాయి. అందుకని అంతా నిన్ననే వీడ్కోళ్లు చెప్పేసుకున్నారు. నేడు పరీక్షవగానే ఇక ఎవరి దారి వారిది. పరీక్షా భవనం చుట్టూ ఉన్న మైదానంలో నాలుగైదు చెట్లున్నాయి. రాధ ఓ చెట్టు నీడకి చేరింది. తనని పిక్ చేస్కుందుకు రావాల్సిన బావ మాధవ్‌కోసం ఎదురుచూస్తుంటే, పక్కనుంచి, “హాయ్ రాధా!” అన్నాడు క్లాస్‌మేట్ కోటి.
ఆమె గమనించ లేదు కానీ, పరీక్షవగానే అతడామెను అనుసరించి వచ్చాడు. రాధ అతణ్ణి చూసి, “హాయ్ కోటీ?” అంది ప్రశ్నార్థకంగా.
***
‘నీకో మాట చెప్పాలి!’ అన్నాడు కోటి.
క్లాసులో అబ్బాయిల జాగాలో మూడో వరుస బెంచీలో కూర్చుంటాడు కోటి. పొడుగ్గా, నాజూగ్గా, తెల్లగా ఉంటాడు. క్లాసు టాపర్సులో ఒకడు. బిడియస్థుడే కానీ, క్లాసులో అప్పుడప్పుడు రాధని ఓరగా చూస్తుంటాడు. అది రాధకి తెలుసు. ఐతే ఎప్పుడైనా పలకరించుకున్నా వాళ్ల మధ్య ఆ ప్రస్తావన రాలేదు.
“నాన్న ఉద్యోగం మారాడు. నాల్రోజుల్లో ముంబై వెళ్లిపోతున్నాం. మళ్లీ కలుస్తామో లేదో!” అన్నాడు కోటి దిగులుగా.
“ఔను. నేటితో స్కూలు చాప్టరు క్లోజు. కాలేజిలో మళ్లీ కొత్త స్నేహాలు” ఆరిందాలా అంది రాధ.
“కానీ పాత స్నేహాల్ని వదులుకోడం నరకం కదా!” అన్నాడు కోటి.
“నరకమా, మరీ అంత పెద్ద మాట వాడేశావేంటి?” అంది రాధ ఆశ్చర్యంగా.
“ఎందుకంటే- ఐ లవ్యూ” అన్నాడు కోటి చటుక్కున. టీ20 క్రికెట్లో టార్గెట్ సెట్ చెయ్యడానికి ఇంక ఒక్క బంతే మిగిలున్నప్పుడు సిక్సర్ కోసం ప్రయత్నించే బ్యాట్స్‌మన్ ఆత్రం ఉందా గొంతులో!
రాధ ఉలిక్కిపడింది. ఇంతవరకూ ఆమెకెవరూ ఐ లవ్యూ చెప్పలేదు. చెబుతా రన్న ఆలోచనే ఆమెకు రాలేదు. అందులోనూ కోటి లాంటి గుడ్‌బాయ్ నుంచి.
“వ్హాట్?” అందామె వినకూడనిదేదో విన్నట్లు.
“రాధా, ఐ లవ్యూ! డూ యూ లవ్‌మీ” అన్నాడు కోటి.
క్షణంలో తేరుకుంది రాధ, “సారీ ఐ డోంట్ లవ్యూ!” అంది.
“ఎందుకని?”
“ప్రస్తుతానికి నా టార్గెట్ చదువు. ఆ తర్వాత ఉద్యోగం. తర్వాత కొన్నేళ్లు ఐ వాంట్ టుబి ఎ ఫ్రీబర్డ్! నా ఫ్యూచర్ ప్లాన్సులో ఎక్కడా లవ్ అన్నది లేదు” అంది రాధ.
“పోనీ, నీ ప్లాన్సులోకి లవ్ వచ్చినప్పుడు నన్ను కన్సిడర్ చేస్తావా?” అన్నాడు కోటి.
“సారీ!” అంది రాధ. ఇంకా ఏమైనా అనేదేమో కానీ, అప్పటికి మాధవ్ వచ్చేశాడు ఆమెను పిక్ చేసుకుందుకు.
ఏమనుకున్నాడో కోటి అక్కణ్ణించి వెంటనే తప్పుకున్నాడు.
“ఎవడు వాడు?” అడిగాడు మాధవ్ అనుమానంగా.
“క్లాస్‌మేటు. బై చెప్పడానికొచ్చి, ఐ లవ్యూ అన్నాడు. సారీ అన్నాను” యథా లాపంగా నవ్వింది రాధ.
“ఇంకా టెంతు పూర్తికాలేదు. అప్పుడే లవ్వా? సాచి లెంపకాయ కొట్టాల్సింది” అన్నాడు మాధవ్ చిరాగ్గా.
“మాటకి మాటే కదా జవాబు! మధ్యలో చేతికెందుకూ పని!” అంది రాధ మామూలుగా.
***
“పోనీ- ఆ మాటే ఛెళ్లుమనేలా చెప్పొచ్చుగా. సింపులుగా సారీ అంటే సాఫ్ట్‌కార్నరుందనుకుంటాడు” అన్నాడు మాధవ్.
“అవునేమో, ఫ్యూచర్లో ఛాన్సుంటే తనని కన్సిడర్ చెయ్యమని కూడా అన్నాడు” మళ్లీ నవ్వింది రాధ.
“అన్నాడా, మరి నువ్వు వెంటనే చెప్పలేదా, ఇప్పటికే నన్ను ప్రేమిస్తున్నానని!” అసహనంగా అన్నాడు మాధవ్.
“నీ డిగ్రీకింకా ఏడాదుంది. నిన్నెలా లవ్ చేస్తాను?” అంది రాధ ఎగతాళిగా.
“చెయ్యాలి. నేను నీ బావని. పుట్టగానే నువ్వు నాకు పెళ్లానివైపోయావ్!” అధికార దర్పంతో అన్నాడు మాధవ్.
“ఏంటి బావా? నువ్వు మాట్లాడుతున్నది పెళ్లి గురించా? లవ్ గురించి కాదా?” అంది రాధ.
తెల్లబోయాడు మాధవ్, “ఏం, రెండూ ఒకటి కావా?” అన్నాడు నెమ్మదిగా.
“ఏమో, నా అనుభవాల్నిబట్టి రెండూ వేరనుకున్నాను” అంది రాధ తన అనుభవాల్ని తల్చుకుంటూ.
టీనేజి ముందు రాధ
రాధ తాత బాపయ్యకు ఇద్దరన్నలూ, ఓ తమ్ముడూ. ఇద్దరు కొడుకుల తర్వాత- ఆరోగ్యరీత్యా బాపయ్య భార్య పంకజానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషనయింది. ఆయనకు గానీ, సోదరులకుగానీ ఆడపిల్లలు లేరు. కూతురుండాలని మనసుపడి బాపయ్య దంపతులు సుజాత అనే దూరపు బధువులమ్మాయిని దత్తత చేసుకుని, పెంచి పెద్దచేసి, సరైన జోడు చూసి వైభవంగా వివాహం జరిపించి కన్యాదాన ఫలితం దక్కించుకున్నారు.
బాపయ్య పెద్దకొడుకు రఘుపతికి ఒక్కగానొక్క కొడుకు. రెండోవాడు జానకిరాంకి కూడా ముందు కొడుకే! తర్వాత ఆరేళ్లకి పుట్టిన అమ్మాయే రాధ!
రాధ పుట్టగానే ఇంట్లో మహాలక్ష్మి వెలసిందని అంతా మురిసిపోయారు. మహా వైభవంగా బారసాల చేశారు. ఆరుగురు దేవతలు, ఏడుగురు పెద్దల పేర్లు కలిపి చేంతాడంత పేరును పేని, చిట్టచివర రాధని ముడేశారు. చివరికి చివర్నున్న రాధే ఆమెకు వ్యవహారనామమైంది.
ఊహ తెలిసినప్పట్నించీ రాధకి ఎన్నో విషయాల్లో ఎన్నో సందేహాలు. ఒక్క దానికీ సమాధానం దొరకలేదు సరికదా, ఎదుగుతున్నకొద్దీ వాటి సంఖ్య అలా అలా పెరుగుతోంది.
మొదటి సందేహం పేరు గురించే! తనని మా ఇంటి మహాలక్ష్మి అన్నవాళ్లు- లక్ష్మి అనే పేరెట్టొచ్చుగా- మధ్య ఈ రాధ ఎక్కణ్ణించొచ్చింది, ఎందుకొచ్చింది? పోనీ అంటే ఇంట్లో దేవుడి గదిలో రాధది ఫొటో కానీ, విగ్రహం కానీ లేదు. చుట్టుపక్కల తెలిసిన గుళ్లలోనూ రాధకి స్థానం లేదు. ఆ స్థానం లక్ష్మికీ, పార్వతికీ- వాళ్ల అంశలతో పుట్టిన ఇతర అమ్మవార్లకీ ఉంది. ఆ రాధలో లక్ష్మి అంశ ఉందో లేదో కానీ- ఆమె పురాణస్త్రీ. ఐతే ప్రాచుర్యం పొందిన రామాయణ, భారత, భాగవతాల్లో ఆ పాత్ర అస్పష్టం. వేరే పురాణాలు కొన్ని ఆమెని శ్రీకృష్ణపరమాత్మకు ప్రియురాలిగా, ప్రేమమూర్తిగా ఆవిష్కరించాయి. ప్రేమే దైవం అనుకుంటే ఆమె దేవతామూర్తి. కానీ మన సమాజం ప్రేమలో దైవాన్ని చూస్తుందా?
***
ఇక్కడ ప్రేమకి గౌరవ స్థానముందా? రాధ ప్రేమకు గౌరవం దక్కిందంటే కారణం- ఆ ప్రేమ పరమాత్మకి అంకితమైంది కాబట్టి!
అసలు ప్రేమంటే ఏమిటని మన రాధ చాలాసార్లు మథనపడింది.
ఇంట్లోవాళ్లు రాధని ప్రేమిస్తున్నామంటారు. ఆమెపై ఈగ వాలనివ్వరు. ఆమె కోరిందిస్తారు. ఆమెను మురిపిస్తూనే- నువ్వు ఆడపిల్లవు సుమా అని అనుక్షణం గుర్తు చేసే నియమాలు విన్పిస్తారు. ఆ ప్రకారం ఆమె విరగబడి నవ్వకూడదు. గట్టిగా మాట్లాడకూడదు. సంప్రదాయం పాటించాలి. సంస్కారం అలవర్చుకోవాలి. అబ్బాయిల్ని రాసుకుపూసుకు తిరక్కూడదు. చనువిస్తే అబ్బాయిలు ప్రేమ అంటారుట. ప్రేమ మంచిదే కానీ అమ్మాయిలకైతే అది మనసులో ఉంటుందిట. అబ్బాయిల ప్రేమ పెదాలకి చివర్నుండి చెప్పగానే రాలిపోతుందిట. అందుకే అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించకూడదు. కానీ పెళ్లి చేసుకోవచ్చు.
ప్రేమ, పెళ్లి వేరన్న అభిప్రాయం అలా చిన్నప్పుడే కలిగింది రాధకి.
ఐతే ఆమెకి మింగుడుపడనిదేంటంటే- ఉన్న నియమాలన్నీ అమ్మాయిలకి మాత్రమే! అబ్బాయిలకి లేవు.
పోనీ- అబ్బాయి ఆ ఇంటికి వంశోద్ధారకుడు కదా అనుకుంటే, అమ్మాయి ఆ ఇంటి మహాలక్ష్మి కదా! మరి వంశోద్ధారకుడెక్కువా? మహాలక్ష్మి ఎక్కువా?
అమ్మాయికి బంగారం కొంటారు. ఖరీదైన బట్టలు కొంటారు. ఏ శుభకార్యంలోనైనా ప్రధానపాత్ర వారిదే!
అప్పటికీ ఓసారి ఆమె బామ్మ పంకజంతో, “-ఆడపిల్లుంటే ఆ అందమే వేరంటా రు కదా- నియమాలన్నీ ఆడపిల్లకే పెట్టి తన మనసుని కష్టపెట్టడం న్యాయమా?” అని నిలదీసింది. ఆమె ముచ్చటపడింది తప్పితే- నియమాల్ని సడలించలేదు.
ఎక్కడైనా బావ కానీ వంగతోట వద్ద కాదని సామెత. ఆడపిల్ల ఎక్కడైనా అధికం కానీ, నియమాలవద్ద కాదన్న మాట!
అప్పుడే స్ఫురించింది రాధకి- ‘మనిషి అంటే మగాడే కానీ మగువ కాదు. తరతరా లుగా కొనసాగుతున్న ఈ తీరుకి కొమ్ము కాస్తున్నది కొమ్ములు తిరిగిన మగాళ్లు కారు. కొమ్ముల్లేని కొమ్మలే’ అని.
‘నేను ఆ కొమ్మల్లో ఒకతెను కాకూడదు’ అని కూడా అప్పుడే అనుకుంది రాధ. ‘అందుకు ముందు కావాల్సింది స్వేచ్ఛ. అది ఒకరిచ్చేది కాదు. సాధించాలి. అందుకు పెద్ద చదువులు చదవాలి. పేరు తెచ్చుకోవాలి. నా కాళ్లమీద నేను నిలబడాలి. సెంటిమెంట్సుకి లొంగకూడదు’ అన్న నిర్ణయమూ అప్పుడే ఆమెలో దృఢమైంది.
‘ఇంట్లో అంతా నన్ను ప్రేమిస్తున్నామంటారు. కానీ నా మనసెరిగేందుకు ప్రయత్నించరు. తమ చర్యలు నన్ను నొప్పిస్తున్నా పట్టించుకోరు. వారి మాట విన్నంతవరకే వారికి నాపై ప్రేమ!’ అనుకున్న ఆమెకు ప్రేమపట్ల నిరసనభావం కలిగింది. ఆ భావనే- క్లాస్‌మేట్ కోటికి- ఠక్కున నో చెప్పేలా చేసింది. మాధవ్‌తో- ప్రేమ, పెళ్లి వేరనేలా చేసింది.
***
మాధవ్ సుజాత కొడుకు. రాధకంటే నాలుగేళ్లు పెద్ద. రాధ పుట్టగానే ఆమెనతడికి భార్యగా నిర్ణయించేశారు పెద్దలు.
వాళ్లిద్దరూ కలిసిమెలిసి సఖ్యంగా ఉంటే, దాన్నే ప్రేమ అంటూ మురిసిపోతు న్నారు పెద్దలు.
బలవంతుల నిర్ణయాల్ని ఆమోదించాల్సిన అసహాయతనే- మన సమాజం ప్రేమగా గుర్తించినట్లు తోచింది రాధకి. ఆ అసహాయత నుంచి బయటపడ్డమే ఆమె జీవితధ్యేయం. పైకి చెప్పకపోయినా ఆమె కోటినీ, మాధవ్‌నీ ఒకే రాటకు కట్టేసి- టీనేజి అంచుల్లో అడుగెట్టింది.
టీనేజి అంచుల్లో రాధ
రాధకి సంగీతమంటే ఇష్టం. చక్కని గొంతు ఉన్నదని ఇంట్లోవాళ్లూ ప్రోత్సహించి ఆమెను చిన్నప్పుడే మ్యూజిక్ స్కూల్లో చేర్పించారు. ఇంటర్లో చేరేక చదువుపట్ల శ్రద్ధని సడలించకుండానే, తన సంగీతానికీ మెరుగులు దిద్దుకుందామె.
మ్యూజిక్ స్కూల్లో ఆమెకు పరిచయమయ్యాడు ప్రదోష్ అనే యువకుడు. తరచుగా టివిల్లో ప్రోగ్రాములిస్తాడు. ఒకటి రెండు సినిమాల్లో కూడా పాడాడు. బయట కొన్ని బాండ్సుకి పని చేస్తున్నాడు. చిన్న సైజు సెలబ్రిటీ అనుకోవచ్చు.
“మంచి గొంతు. శ్రుతి తప్పని గానం. నాతో గొంతు కలుపుతానంటే, నీకు మా బాండులో అవకాశమిప్పిస్తాను” అంటూ ఆమెను ఆశ పెట్టాడు. రాధ ఇంట్లో చెప్పింది. వాళ్లు సరేనని మాధవ్‌ని తోడుగా వెళ్లమన్నారు.
“తోడు నేనుండగా, మరొకరెందుకు? మా రిహార్సల్సుకి బయటివాళ్లని రానివ్వరు” అన్నాడు ప్రదోష్.
ఇంట్లోవాళ్ల తోడు లేకుండా రిహార్సల్సుకి పంపడానికి ఇంట్లో ఒప్పుకోలేదు. అలా రాధకి ఆ అవకాశం పోయింది.
“మీవాళ్లు ఏ ఏజిలో ఉన్నారు? ఒకప్పుడు సింగర్సు వళ్లంతా కప్పుకుని తెరచా టున కూర్చుని పాడేవారు. నేడు సింగర్సు డ్రెస్సింగులో, మేకప్పులో ఐటం గాళ్సుని మించిపోతున్నారు. ప్రస్తుతం ఏ ప్రొఫెషనుకైనా గ్లామరు ముఖ్యం. మీ వాళ్లని ఎదిరించకపోతే, నువ్వెప్పటికీ సింగరువి కాలేవు” అని మందలించాడు ప్రదోష్.
“ప్రస్తుతం నేను మావాళ్లచాటు మనిషిని. సమయమొస్తే తప్పక ఎదిరిస్తాను” అని రాధ అతణ్ణి దూరం పెట్టింది. ఐతే ప్రదోష్ ఆమెను వదల్లేదు, “ఫీల్డులో ఎంటరవడానికి ఇదే మంచి సమయం. నువ్వు మీవాళ్లని ఎదిరించలేకపోతే ఇంకో ఉపాయముంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మ్యూజిక్ ఫీల్డులో రాణించడానికి నీకు పూర్తి స్వేచ్ఛ నిస్తాను. అప్పుడు మీ పెద్దవాళ్లు కూడా అభ్యంతరపెట్టలేరు” అని ఆమెకు ప్రపోజ్ చేశాడు.
“నేనింకా మైనర్ని” అంది రాధ అతడికి బదులుగా.
“దాందేముంది? ఈలోగా మనం ప్రేమించుకుందాం” అన్నాడు ప్రదోష్. ప్రేమ అన్న పదాన్నతడు ఎంత యథాలాపంగా అన్నాడంటే- ఆ పదం అబ్బాయిల పెదాల చివర ఉంటుందన్న బామ్మ మాట ఠక్కున గుర్తొచ్చిందామెకు.
“నాక్కావాల్సింది స్వేచ్ఛ. ఇప్పుడు శ్రద్ధగా చదివితే అది నాకు నేనుగానే సంపాదించుకోగలను. ఎవరో ఇస్తే వచ్చే స్వేచ్ఛ నా ఆత్మాభిమానానికి సరిపడదు” అంది రాధ అతణ్ణి వదుల్చుకుందుకు.
***
ప్రదోష్‌కి ఆమె కొరుకుడు పడలేదు. వాళ్ల పరిచయం అలా కట్టయింది.
తర్వాత రాధ ఇంటర్ ప్యాసై బీటెక్‌లో చేరింది. అప్పటికి మాధవ్ జీవితంలో ఊహించని మార్పొచ్చింది. వారసత్వంగా అతడికొచ్చిన పల్లెటూరి బంజరు భూమి ధరలకు ఉన్నట్లుండి రెక్కలొచ్చి, ఉన్నపళంగా కోటీశ్వరుడైపోయాడతడు.
“మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు చదువాపెయ్. గృహిణివై గృహాన్ని నాకు స్వర్గసీమ చెయ్యి. కూర్చుని తిన్నా తరగని ఆస్తిని మనమిద్దరం ఎంజాయ్ చేద్దాం” అన్నాడతడు రాధతో.
మాధవ్ ప్రపోజల్ ఇంట్లోవాళ్లకీ నచ్చింది. కానీ ఈ ఏజి రాధ తన ఆశయాల్ని అటకెక్కించి వంటింటి కుందేలౌతుందా?
మధ్యలో చదువాపితే ఉరేసుకు చస్తానని రాధ బెదిరించేసరికి, ఇంట్లోవాళ్లకి అప్పటికి ఒప్పుకోక తప్పలేదు.
టీనేజి తర్వాత రాధ
రాధ ఇంజనీరయింది. ఉద్యోగంలో చేరింది. అప్పుడు మాధవ్ మళ్లీ పెళ్లి ప్రసక్తి తెచ్చాడు.
“కనీసం రెండేళ్లు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి. తర్వాతే పెళ్లి” అంది రాధ దృఢంగా.
మాధవ్ ఇంట్లో పెద్ద రభస చేశాడు. పెద్దలు కూడా రాధని మందలించారు.
“పెళ్లికి తను సిద్ధమైతే చాలా? నేను సిద్ధపడొద్దా?” అంది రాధ. దానిమీద ఇంట్లో పెద్ద గొడవైంది. కోపం పట్టలేక రాధని ఇల్లొదిలి పొమ్మని బెదిరించాడు బాపయ్య.
రాధ అదరలేదు, బెదరలేదు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నదానిలా తను వేరే ఇంట్లో పేయింగ్ గెస్టుగా చేరింది. అప్పుడు పెద్దలే దిగివచ్చి వెనక్కి రమ్మంటే, “నాకిష్టమైనట్లు నేను బ్రతకడానికీ ఏర్పాటు అవసరం. ఇన్నాళ్లూ పంజరంలో చిలకని. ఇప్పుడు ఎగిరే పావురాన్ని” అని బదులిచ్చింది.
‘పంజరంలో చిలకకి రక్షణ ఉంటుంది. ఎగిరే పావురానికి వేటగాళ్ల బెడద ఉంటుంది’- ఆ విషయం ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి పెద్దలు కొన్ని వృథా ప్రయత్నాలు చేశారు.
“అందుకే నేనంటాను. మహిళ మనిషి కాదని. మనిషి అంటే కేవలం మగాడు. ఈ రక్షణ, బెడదల సమస్య- మనుషులకి అంటే అబ్బాయిలకి లేదు. అమ్మాయిలకి మాత్రమే! మీరు నన్ను అమ్మాయిలా చూస్తున్నారు. కానీ నేను మనిషిని కావాలని అనుకుంటున్నాను” అని వాళ్లకు ఖచ్చితంగా చెప్పేసిందామె.
అలా రాధ మనిషి జీవితం మొదలెట్టి ఏడాది గడిచింది. ఇప్పుడామె ఉద్యోగం చేస్తూనే, మ్యూజిక్ షోల్లో సింగరుగా తన్ను తాను ప్రమోట్ చేసుకుంటోంది. ఆ షోల్లో పొట్టి దుస్తులు ధరిస్తోంది. పాడే పాటలకి రెండర్థాలున్నా నవ్వుతూ అభినయిస్తోంది. పత్రికలకి ఫొటో ఇంటర్వ్యూలిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె విడియోలు వైరల్ ఔతున్నాయి. సెలబ్రిటీగా జనంలో ఆమెకు గుర్తింపు లభించింది.
మాధవ్ ఒకరోజామెను కలుసుకుని, “మనింటి పరువు ముంచేస్తున్నావ్” అని ఆక్రోశించాడు.
***
ఇలాంటి విమర్శలకి ఎప్పుడో అతీతురాలైంది రాధ. “ఎలాగట?” అంది రాధ ఎగతాళిగా.
అప్పుడు మాధవ్ రాధాకృష్ణుల లీలల్ని మనసారా స్మరించిన జయదేవుణ్ణి మించిన ప్రతిభతో, ఆమె లీలల్ని విశదంగా అభివర్ణించాడు. ఎటొచ్చీ జయదేవుడిది పరవశం. మాధవ్‌ది ఉక్రోషం. రాధ పరమశాంతంగా అతడు చెప్పింది విన్నది. “ఇన్ని చెప్పావు. నామీద గాసిప్సు కూడా ఏమైనా ఉంటే చెప్పు. నీ ఊహలు కాదుసుమా! ఆధారాలుండాలి” అంది. అది సవాలులా ఉంది.
“నీ దిగజారుడికి నీ షోలు చాలవా, ఇంకా గాసిప్సు కూడా కావాలా?” అన్నాడతడు.
“అనడం కాదు. నా షోలు ఎందుకు దిగజారుడో చెప్పాలి. ఎందుకంటే వాటికి సెన్సారు అభ్యంతరాల్లేవు. అవి నా అరెస్టుకి దారితియ్యలేదు. నేను మన ప్రజా నాయకుల్లా ఇతరుల్ని దారుణంగా కించపర్చే మాటలనలేదు. గూండాగిరీ, దాదాగిరీ చెయ్యలేదు. చట్టం పరిధికి లోబడి నిర్వహించబడుతున్న సంస్థల్లో ప్రదర్శనలి స్తున్నాను. సెలబ్రిటీనయ్యేంతగా జనం మెప్పు పొందాను. ఇందులో నా తప్పేమిటి? నేరమేమిటి?” అంది రాధ.
మాధవ్ వద్ద సమాధానం లేదు. ఆమెను మాటలతో గెలవలేనని గ్రహించాడు. ‘రాధ రూటు మార్చాలంటే ఇక బ్రహ్మాస్తం ప్రయోగించక తప్పదు’ అనుకుని, “ఇప్పటికి నా కళ్లు తెరుచుకున్నాయి. నువ్వు సెలబ్రిటీవి. ఈ స్థాయి చేరుకుందుకు నువ్వు చేసిన కృషి అర్థమౌతోంది. నిన్ను మా ఇంటికి పిలిచి సెలబ్రిటీగా సన్మానించాల నుంది” అన్నాడు.
రాధకు మాధవ్ పట్ల విముఖత ఉందేమో తప్ప, అపనమ్మకం లేదు. అందుకే అతడి ఆహ్వానాన్ని మన్నించింది.
మాధవ్ ఇంట్లో ఆమెకు చక్కని విందు ఏర్పాటైంది. విందులో చిట్టచివర ఇచ్చిన ఫలరసంలో మత్తుమందున్న విషయం రాధకి తెలియదు. రాధ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మరో వ్యక్తి మాధవ్ మాత్రమే!
రాధకి స్పృహ వచ్చేసరికి ఏం జరిగిందో అర్థమైంది. “ఎందుకిలాంటి దారుణానికి దిగజారావ్?” అనడిగిందామె.
“నువ్వంటే ఇష్టం, ప్రేమ, నమ్మకం- అన్నీ ఉన్నాయి. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నానాటికీ దిగజారుతున్నావు. నీ అధఃపాతాన్ని ఆపేందుకు నాకు తోచిన దారి ఇది” అన్నాడతడు.
“ఇప్పుడు నీకేమనిపిస్తోంది? దిగజారుడు, అధఃపాతం నీవా, నావా?” అంది రాధ నిశ్చలంగా.
మాధవ్ తడుముకోలేదు, “ముమ్మాటికీ నీదే! ఎందుకంటే మన సంప్రదాయంలో ఆడదానికి ముఖ్యం శీలమొక్కటే. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటేనే, ఆ శీలం నీకు దక్కుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుందుకు సిద్ధంగా ఉన్నాను. శీలం దక్కించు కుంటావో, పోగొట్టుకున్నదానిగా మిగిలిపోతావో నీ చేతుల్లో ఉంది” అన్నాడామెతో.
రాధ అదోలా చూసిందతణ్ణి. ఆమె ముఖం చూస్తే. అప్సెట్టైనట్లు లేదు. దుఃఖిస్తు న్నట్లు లేదు.
***
అక్కణ్ణించి తిన్నగా తనవాళ్ల ఇంటికెళ్లిందామె. జరిగింది తల్లికీ, బామ్మకీ చెప్పింది. వాళ్లు మిగతావాళ్లకి చెప్పారు అప్పుడు వాళ్ల స్పందన ఏమిటన్నది- ఊహాతీతమేంకాదు. అదే జరిగి, బాపయ్య రాధకి కౌన్సిలింగిచ్చే బాధ్యతని పంకజానికి అప్పగించాడు.
“ఏంచేద్దామనుకుంటున్నావిప్పుడు?” అంది పంకజం. అది ప్రశ్న కాదు. కింకర్తవ్యతా విమూఢురాలై ఉన్న మనవరాలు- తనేం చెప్పినా వినే అసహాయదశలో ఉన్నదన్న నమ్మకంతో అన్న మాట!
“బావమీద కంప్లయింటివ్వడానికి పోలీస్ స్టేషనుకి వెడుతున్నాను” అంది రాధ తాపీగా.
అంతే! రాధపై అత్యాచారం జరిగిన వార్త విన్నప్పుడు కూడా రాని స్పందన ఆమెలో అప్పుడు కలిగింది. “జరిగింది బయట పడితే- అటూ ఇటూ రెండు కుటుంబాల పరువూ మంటకలిసిపోతుందని నాన్నా, తాతయ్యా కృంగిపోతారు. ఇక నీకు జీవితమంతా చీకటేనని ఆడవాళ్లం మేం తల్లడిల్లిపోతాం” అంది పంకజం.
“నా మ్యూజిక్ షోలు అసభ్యమన్నాడు బావ. అవి ప్రజావేదికలపై జరిగాయి. చట్టవిరుద్ధమని ఎవరూ అనలేదు. మరి బావ చర్య రహస్యంగా జరిగింది. చట్టవిరుద్ధ మని నేనంటాను. కాదేమో పోలీసులే తేల్చడం సబబు కదా!” అంది రాధ,
“వాణ్ణి పెళ్లి చేసుకోవే, సమస్య శాంతియుతంగా పరిష్కారమౌతుంది” అంది పంకజం.
“ఇదివరకైతే ఏమో కానీ, ఇప్పుడు బావ శీలం చెడింది. అలాంటివాణ్ణి నేనెలా పెళ్లి చేసుకుంటాను?” అంది రాధ.
అన్ని పదుల జీవితంలో- మగాడికి శీలముంటుందనీ, అది పోయే అవకాశముం దనీ- విన్న సందర్భం ఒక్కటి కూడా లేదు పంకజానికి. అందుకే ఆమె తెల్లబోయింది. తేరుకున్నాక, “పోనీ వాడి శీలం పోయిందే అనుకుందాం. ఆ కారణం చెప్పి, వాణ్ణి కాదనే అర్హత నీకుందా? శీలం నీదీ పోయింది కాబట్టి దొందూ దొందే!” అంది పంకజం వళ్లు మండి.
“నా శీలం పోవడమా? నేనేమైనా ఇష్టపడి వెళ్లానా అక్కడికి? బావది దిగ’జారుడు’. నాది యాక్సిడెంటు” అంది రాధ.
తర్వాతేమయిందీ అన్నది ఈ కథకి ముఖ్యం కాదు. మనిషి అంటే మగాడు మాత్రమే కాదు, మహిళ కూడా అని మన సమాజం గ్రహించడానికి ఏఐ ఏజి సరి పోతుందా, ఇంకా ఎన్నో ఏజిలు ముందుకెళ్లాలా అని ఆలోచించేవారిని సవాలుచేస్తూ- మగాడు మగువపై అత్యాచారం చేస్తే, శీలం పోగొట్టుకున్నదెవరూ- అనడుగుతోంది ఏఐ ఏజి రాధ.
ఐతే ఆమె సాటి మగువల్నించే కాదు, ఎవర్నించీ సమాధానానికి ఎదురు చూడదు. చూస్తే ఆమెది ఏఐ ఏజి కాదు….
*****

మావారు డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు ప్రభావంతో కథారచనకు పూనుకున్నాను. మేమిద్దరం కలిసి వ్రాసినప్పుడు ‘వసుంధర’ మా కలం పేరు. ఎక్కువగా కలిసే వ్రాస్తుంటాం. మావారి జోక్యమున్న ప్రతి కథలోనూ ఎక్కడో అక్కడ కొన్ని సాంఘిక, రాజకీయ సంఘటనల పరమైన చురకలుంటాయి. అలా వద్దని నేననుకున్నప్పుడు వచ్చినవే కేవలం నా పేరుతో వచ్చిన కథలు. సంఖ్యలో తక్కువైనా- వాటిలోనూ చాలావరకూ పోటీల్లో బహుమతులు గెల్చుకోవడం నాకు లభిస్తున్న ప్రోత్సాహం.