రాగసౌరభాలు-16

(గౌళ రాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

ప్రియ మిత్రులకు నమస్తే. మనం ఇప్పటివరకు ఘన రాగాలలో మూడు రాగాల గురించి తెలుసుకున్నాము. అవి నాట, ఆరభి, వరాళి.  ఇంకా గౌళ, శ్రీ రాగాల గురించిన వివరాలు తెలుసుకోవాలి. అందులో భాగంగా ఈ నెల గౌళ రాగ విశేషాలతో మీ ముందుకి వచ్చాను. మరి అవేమిటో తెలుసుసుకుందామా?

ఈ గౌళ రాగం తూర్పు బెంగాల్ ప్రాంతంలోని గౌళ దేశంలో ఆవిర్భవించిందని ఒక కథనం. గౌళ అంటే గోకాపరుల మధ్య పుట్టిందని మరొక ఊహ. ఏది ఏమైనా గౌళ రాగం అతి ప్రాచీనమైనదిగా సంగీత రత్నాకరం, సంగీత మకరందం, సంగీత సమయసారం వంటి గ్రంథాలలో పేర్కొనబడినది.

ఈ రాగం 15వ మేళకర్త మాయామాళవ గౌళ రాగ జన్యము. ఈ రాగం ఆరోహణ అవరోహణలు క్రింది విధంగా ఉన్నాయి.

స రి మ ప ని సా

స ని ప మ రి గ మ రి సా

ఇందులోని స్వరాలు షడ్జమ్, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదములు. ఈ రాగంలో రిషభమును ఏక శృతి  రిషభం, గౌళ రిషభంగా పిలుస్తారు. ఆరోహణలో గాంధార దైవతములు, అవరోహణలో దైవతము వర్జములు, వక్రము కూడా. అందువలన ఇది ఔడవ షాడవ వక్ర రాగం.  ఉపాంగ రాగము, వర్జ రాగము, వక్ర రాగము.

ఘన రాగం అంటే పెద్ద రాగం అని అర్థం కాదు. ఘనము అంటే కొట్టటం అని అర్థం. దీనినే ఆహతము అని అంటారు. “రిరి పప రిరి మమ” అనే జంట స్వరాలలో రెండవ అక్షరాన్ని కొట్టి లేదా నొక్కి పాడుతారు. ఇదే ఆహత గమకము. “స నిని దద పప” అని పాడినపుడు ఎందుకు కొట్టాలి. దీనినే ప్రత్యాహతము అని అంటారు. ఈ ఘనరాగాలు ఆహత ప్రత్యాహత గమకాలకు అనుకూలము. అందువల్లనే వీటిని ఘన రాగాలుగా నిర్ణయించారట.

ఈ గౌళ రాగం మంగళకరమైనది. అందువలన కచే్రీలలో  మొదటి భాగంలోనే పాడుతారు. ఇది విస్తారమైన రాగ ఆలాపనకు అనువైనది కాదు.

ఈ రాగంలోని దుడుకుగల అనే త్యాగరాజా కీర్తన ఎంతో విశిష్టమైన, విలక్షణమైన పంచరత్న కీర్తన. ఈ రాగానికి ఉన్న విశిష్టమైన, కష్టతరమైన స్వభావము వలన లలిత సంగీతములోనూ, సినిమా సంగీతములోనూ ఎక్కడా కనపడదు.

ఇప్పుడు కొన్ని శాస్త్రీయ సంగీత రచనలు తెలుసుకుందాము.

  1. గీతం సకల సురాసుర               రూపక                                 పూర్వీకులు
  2. వర్ణం చెలిమికోరి                        ఆది                                    వీణ కుప్పయ్యరు
  3. కృతి దుడుకుగల                       ఆది                                   త్యాగయ్య
  4. కృతి శ్రీ మహాగణపతి                త్రిపుట                              దీక్షితర్
  5. కృతి త్యాగరాజ పాలయ            ఆది                                  దీక్షితర్
  6. కృతి ప్రణమామ్యాహం              చాపు                                 వాసుదేవాచార్

ఇవేనండి గౌళ రాగ విశేషాలు. వచ్చే నెల శ్రీ రాగ విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.

*****

Please follow and like us:

2 thoughts on “రాగసౌరభాలు- 17 (గౌళ రాగం)”

  1. ధన్యవాదాలు మూర్తి గారు.

  2. కర్ణాటక సంగీతంలో రాగాల గురించి ఎక్కడా దొరకని విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము.

    వచ్చే నెల శ్రీరాగం అని ఎలాగూ కొంత కాలం క్రితమే తెలిసిపోయింది. ఇంకా మీరేమేమి రాగాల గురించి ఏమేమి విశేషాలు అని చెబుతారో కుతూహలంగా ఎదురుచూస్తూ ఉంటాము. వీలైనంతగా, అశేషంగా ఈ శీర్షికను కొనసాగించండి.

Leave a Reply to వాణి నల్లాన్ చక్రవర్తి Cancel reply

Your email address will not be published.