
రామచంద్రోపాఖ్యానం
-దామరాజు విశాలాక్షి
“మాఘమాసం మధ్యాహ్నం ఎండ ముంగిళ్ళలో పడి ముచ్చట గొలుపుతోంది.
ఆ రోజు సివిల్ ఇంజనీర్, రియలెస్టేట్ లో మంచి పేరు పొందిన , కాంట్రాక్టర్ రామచంద్ర గృహప్రవేశం. ఆ గృహప్రవేశానికి ఎందరెందరో పెద్దలు వచ్చారు.
ఊరంతా కార్లతో నిండి పోయింది . వస్తున్న వారి వేషభాషలు , వారి నగ నట్రా చూసి విస్తు పోతున్నారు ఆ ఊరి జనాలు .. రామచంద్ర వస్తున్న వారికి ఘన స్వాగతం పల్కుతూ ఏర్పాట్లు చేసాడు ..
రామచంద్ర ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి విక్రమ్ వచ్చారు, కారు దిగుతునే , రామ చంద్రా! ముందు నాన్నగారిని చూద్దాం పద అన్నాడు .
తండ్రి వద్దకు మంత్రి విక్రమ్ ను తీసుకెళ్ళాడు రామచంద్ర. మాష్టారిని చూడగానే పాదాభివందనం చేసాడు విక్రమ్. ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారు ఆదినారాయణ మాష్టారు.
ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న నీవు, నా దగ్గరకు వచ్చావు అంటే చాలా సంతోషం గా ఉంది నాయనా ! ఆనందంగా అన్నారు మాష్టారు.
“ నేను ఈరోజు ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, అది మీరు పెట్టిన అక్షర బిక్ష. మీరు నేర్పిన విలువలు, అమ్మగారు పెట్టిన అన్నప్రసాదం వలననే. కదా మాష్టారూ ?.
అందుకే, ఈరోజు నేను ఇంత వాడినయ్యాను. అంతా మీ ప్రోత్సాహమే అని మాష్టారిపక్కనే కూర్చున్నాడు విక్రమ్. తనతో వచ్చిన మంది మార్బలం అందరినీ భోజనాలు చేసి రమ్మని పంపి, మాష్టారితో మాట్లాడుతూ కూర్చున్నాడు విక్రం.
“ఏంటి, మాష్టారూ! కొడుకంత పెద్ద భవంతి కట్టుకుని, మిమ్మల్ని ఈ పాత ఇంట్లో ఉండ మన్నాడా ? అంటూ, ప్రశ్నార్థకంగా రామచంద్ర వైపు చూసాడు విక్రమ్ ”.
ఆదినారాయణ మాష్టారు కంగారుపడుతూ, అయ్యో ! అదేం లేదు నాయనా!
నాకు ఈ ఇంట్లో అన్ని విధాలా, హాయిగా ఉంటుంది అందుకే నేనిప్పుడే ఇక్కడికి వచ్చాను .
అయినా. నీకు తెలుసు. నేను పెరిగిన ఈ ఇల్లు నాకు ప్రాణం. నా ప్రాణం పోయే వరకూ వదలను. అబ్బాయి నా కోసం, ఆ ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించి అక్కడే ఉండమని అంటున్నారు.
నాకు ఇష్టం లేదు. ఎందుకంటే। ఇక్కడ ఉన్న హాయి , నాకు ఇంకెక్కడా ఉండదు అన్నారు.
“మంత్రి విక్రమ్, మాష్టారికి, అతని భార్యకు నమస్కరించి , ఈ రోజు మనుమడి పుట్టిన రోజని తను వెల్తేగాని మనుమడు భోజనం చేయడని చెప్తూ , అమ్మగారి చేతి కాఫీ తాగి , మాష్టారు భార్యా వద్దన్నా వినకుండా, పట్టువస్త్రాలు, ఫలాలు అందించి , బయల్దేరాడు మంత్రి విక్రమ్ ” .
వెల్తూ ,వెల్తూ , రామచంద్రను పక్కకు తీసుకెళ్లి విక్రం అన్నాడు .
రామచంద్రా! నీకు ఒక శకుని మామ ఉన్నాడు కదా? జాగ్రత్త! నీవు ఇంతవరకు బాగానే ఉన్నావు.
మా మాష్టారు కొడుకుగా మంచి విలువలు పాటిస్తున్నావు. నిజాయితీగా బతుకు తున్నావు కాబట్టి, నేను నీకు గౌరవం ఇస్తున్నాను. ఈ రోజు నీ ఆహ్వానం నెపం పెట్టుకుని, నేను మాష్టారిని చూడటానికి వచ్చాను. నీవు నా స్నేహితునివి , నీకోసం కూడా వచ్చానులే .
“ నేను మాష్టారు నేర్పిన విలువలు, నా జీవితంలో విడువను”. నువ్వు అలాగే బ్రతుకు తున్నావు . కాబట్టి , నాకు నువ్వంటే గౌరవం. ఒక మాట. మీ మామ, ఇంకా! మీ ఇంటి ఆడవారి సిఫార్సులు కొన్ని విషయాల్లో, నా వరకూ వస్తున్నాయి అవి నీకు తెలియనివని నాకు తెలుసులే. .నేను ఎవరి ప్రలోభాలకు లొంగను. నీవు కూడా లొంగిపోకు. నేనీ మధ్య మన ఊరి వారి ద్వారా, కొన్ని కొత్త కొత్త విషయాలు విన్నాను నేను అన్నానని ఏమీ అనుకోకు.. మాష్టారిని , అమ్మగారిని బాగా చూసుకో. నేను నీకు చెప్పేంత వాడిని కాను. నా స్నేహితుడవని చెప్పాను. నీ ఇంటికి మరొక్కసారి వచ్చి భోంచేస్తాను. పనుంది అంటూ, రామచంద్ర భుజం తట్టి, వెళ్లి పోయాడు విక్రమ్ .
రామచంద్ర ముఖము ” కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా “ పాలిపోయింది. అవమానంతో రగిలిపోయాడు . అతని గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. భార్య దగ్గర వాటిని బద్దలు కొడదామని, కొత్తగా కట్టిన ఇంటికి వచ్చాడు.
“ రామచంద్ర చాలా నెమ్మదస్తుడు. మంచివాడు. మర్యాదస్తుడు నిజాయతీ పరుడు”.
రామచంద్ర భార్య అరవింద అందగత్తె, అహంకారి. ఆంగ్లభాషా మాధ్యమంలో పట్టభద్రురాలు .
సివిల్ ఇంజనీరింగ్ చదివి, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రామచంద్రను, అరవింద తండ్రి కాంట్రాక్ట్ అప్పలనరసయ్య, ఏరి కోరి అల్లుడుగా చేసుకొన్నాడు .
పెళ్లయిన ఆరు నెలలు తిరగకముందే,.అమ్మాయి పల్లెటూర్లో ఉండలేదని , పట్నంలో ఇల్లు కట్టించి , అక్కడ కాపురం పెట్టించాడు. ప్రైవేటు ఉద్యోగాలు ఎందుకని తన పలుకుబడితో కాంట్రాక్టులు ఇప్పించాడు.
“ రామచంద్ర తండ్రి మంచికి మారుపేరైన ఆదినారాయణ మాష్టారు”
ఆ దంపతులు పిల్లలను పద్ధతిగా పెంచారు. వారి అబ్బాయిగా, రామచంద్ర నిజాయితీతో కాంట్రాక్టులు చేసి, మంచి పేరు తెచ్చుకున్నాడు.
మామ, భార్య ఎంత ఒత్తిడి చేసినా నిజాయతీని విడువడు. తను చేయవలసినది నిర్భయంగా చేస్తాడు. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు..కష్టం విలువ తెలిసిన మనిషి…
పనివాళ్లకు అతడంటే భయం , భక్తి రెండూ ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ముట్టచెప్తాడు. కార్మికులను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు
రామచంద్ర భార్య అరవిందకు మాత్రం. పల్లెటూరు అంటే చిన్నచూపు. పని వాళ్ళు అంటే చులకన భావం..తను ఆగర్భ శ్రీమంతురాలనని మిడిసి పడుతుంది . అనుక్షణం దర్పం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.“అత్తవారిని పల్లెటూరి వాళ్ళు కల్చర్ తెలియని వాళ్ళని, , భర్త తరపు బంధువులను చులకన చేస్తూ అతిశయం ఒలక బోస్తుంది. పల్లెటూరికి రావడానికి నచ్చదు.
ఇప్పుడు ఈ ఇల్లు కూడా, తన కొడుకు కావాలని పట్టుబట్టడం వలన తప్పనిసరై ఒప్పుకున్నానంటుంది.
“అగ్రికల్చర్ ఎమ్. ఎస్సీ చేసిన కొడుకు , ఫారిన్ వెళ్లి ఎమ్మెస్ చేసి, అక్కడే ఉండి పై చదువులు చదువుకో, లేదా ఉద్యోగం చేయు అంటే వినకుండా, పల్లెటూర్లో ఇల్లు కట్టమన్నా డు.
అమెరికా పోయి ఉండమని గోల పెట్టింది అరవింద. కొడుకు ఒప్పుకోలేదు.
సేంద్రియ వ్యవసాయం చేస్తాను. అని పట్టుబట్టాడు. అరవింద కొడుకుపై ప్రేమతో తప్పనిసరై సరేనంది…
రామచంద్ర మంచితనం చూసి, అతని వాళ్లు , పని వాళ్ళు అందరూ. ఆమె అధికార దర్పాన్ని భరిస్తారు. అదే, అలుసుగా భావించి ఆమె అందరికీ చులకన చేస్తుంది.
దానికి తోడు” అగ్నికి ఆజ్యం పోసినట్టు” ఆమె తల్లి. అన్నిటికీ అరవిందను వెనకేసుకు వస్తూ ఉంటుంది. తండ్రికి ఆమె పుట్టింది మొదలు కలిసొచ్చిందిని అందుకే ఆమె అంటే గారాబం..
“మంత్రి వెళ్ళాక మండుతున్న సూర్యునిలా గృహప్రవేశం జరిగిన ఇంటికి వచ్చాడు”.
రామచంద్ర. తన తమ్ముడు, మరదలు, మేనత్త కొడుకు, బాబాయ్ కొడుకు , బంధువుల పిల్లలు , దగ్గరుండి వడ్డనలు, మర్యాదలు చేస్తున్నారు. మరదలు, పిన్ని కూతురు , అత్తయ్య పిల్లలు, అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు.“ . మీ అక్కయ్య ఏదమ్మా? అంటూ తమ్ముడి భార్య మరదల్ని అడిగాడు రామచంద్ర .
“అక్కయ్య, లోపలే ఉంది బావా! అంది అమ్మాయి..ఆ అమ్మాయి ఫిజిక్స్ లో, పీహెచ్డీ చేసి, లెక్చరర్ గా చేస్తోంది . చాలా సింపుల్ గా ఉంటుంది. మర్యాద మన్నన గల చక్కని పిల్ల. అరవిందకు ఆ అమ్మాయి అంటే పడదు.. ఆ అమ్మాయి తల్లి దండ్రులు శుద్ధ పల్లెటూరు వాళ్లు . ఏదో పుస్తకాలు బట్టీపట్టి చదువుకుంది. గాని, నాలా ఇంగ్లీష్ మాట్లాడ గలదా? సొసైటీలో మింగి ల్ కాగలదా? అని , తోటి కోడలై నా ఆ అమ్మాయిని కూడా హేళన చేస్తుంది. ఆ అమ్మాయి రామచంద్ర తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకుంటుంది. రామచంద్రకు ఆ అమ్మాయి అంటే చాలా అభిమానం.
మీ భోజనాలు అయ్యాయా అమ్మా? అనుమానంగా అడిగాడు.
రామచంద్ర. లేదు బావా! ఇంకా మన బంధువులు, కొంత మంది ఉన్నారు. వాళ్ళ అందరి భోజనాలు అయ్యాక , మేము తింటాంలెండి . అంది ఆ అమ్మాయి . మీ అక్కయ్య ? అనుమానంగా అడిగాడు రామచంద్ర వాళ్ల ఫ్రెండ్స్ కు కంపెనీ ఇవ్వడం కోసం అక్కయ్య భోజనం చేసింది. వాళ్ల వాళ్ళందరూ భోజనాలు అయిపోయాయి… మేము బాగానే మర్యాదలు చేశాం అంది. అతను ఏమనుకుంటాడోనని భయంతో .. మరి అబ్బాయి ఎక్కడ? కోపంగా అన్నాడు రామచంద్ర.
అత్తయ్యకు, మామయ్యకు భోజనం పట్టుకుని మన పాత ఇంటికి వెళ్ళాడు అంది.
మీరు బోంచేయండి అనిన ఆ అమ్మాయితో, మీరు కూడా తినండి, నేను ఆఖరులో తింటాను. నాకోసం చూడొద్దు, అని విసురుగా లోపలికి వచ్చాడు రామచంద్ర.
పెద్ద హాల్ లో సోఫాలో కూర్చుని ఉన్నారు అరవింద, ఆమె తరపు బంధువులు.
తన తరపు దూరపు బంధువులలో కొందరే అక్కడే ఉన్నారు.
60 ఏళ్లు పైబడిన రామచంద్ర మేనత్త, పినతల్లి వంటి , మరి కొందరు స్త్రీలు దూరంగా కార్పెట్ పై కూర్చుని ముత్తయిదువులకు తాంబూలాలు అన్నీ సిద్ధం చేస్తున్నారు.
కవర్లో పెట్టి గిఫ్ట్ ప్యాకెట్లు సర్దుతున్నారు .
రామచంద్ర భార్య సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చునుంది , ఆమె ఎదురుగా టీపాయ్ మీద ఉన్న పెద్ద ఆల్బమ్స్ ఉన్నాయి. అవి తీసి, అక్కడ ఉన్న అందరికీ చూపెడుతూ గొప్పలు చెబుతోంది….
“చిన్నప్పుడు మా మమ్మీ ,డాడీలతో ఊటీ, కొడైకెనాల్ , బెంగళూరు, మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, కాశ్మీర్ టూర్లు వెళ్ళిన ఫోటోలు అని. చూపెడుతోంది. తన తల్లి అందం.. తన వాళ్ల గొప్పలు చెప్తోంది. ప్రస్తుతం అమెరికలోనున్న తమ్ముడు మరదలు , ఆస్ట్రేలియాలో మరిది చెల్లెలు, ఇంగ్లాండ్లో ఉన్న కూతురు, అల్లుడు గురించి, వాళ్లు వచ్చినప్పుడు ఎలా తామంతా ఎలా ఎంజాయ్ చేశారనేది వర్ణిస్తోంది.
తను విదేశాలు వెళ్ళినప్పుడు ఎలా గడిపింది, అక్కడ ఎలాంటి డ్రెస్సులు వేసుకునేది చెబుతోంది. అలసిపోయినప్పుడు డ్రింక్ తాగుతూ గర్వంగా అంది. వీరి అదృష్టం బాగుంది..నాలాంటి అందగత్తె, ఐశ్వర్య వంతురాలు, ఈ ఇంటి కోడలైంది. లేకపోతే। ఇదిగో చూడండి, పాలరాతి శిల్పం లాంటి మా అమ్మ,, పవర్ ఫుల్ మేన్ మా నాన్న, పేడ పిసుక్కునే వీరి కాళ్లు కడిగి కన్యాదానం ఇస్తారా? రాత అంతే. అసలు అందమంటే ! మా అమ్మది దర్పంగా అంది అరవింద….
“అంతవరకూ వెనుక నిలబడి విన్న రామచంద్ర, ఇక భరించలేకపోయాడు.
అవును, అందం అంటే మీ అమ్మ ది, అహంకారం అంటే నీది . వ్యంగ్యంగా అన్నాడు” ..
ఒక్కసారి వెనుదిరిగి చూసి , అరే! మీరెప్పుడు వచ్చారు ? భోజనం చేసారా ?అంది అరవింద. నేను నీలా కాదులే. అయినా! ఇది ఎవరి గృహప్రవేశం? ఆమె చేతిలో లో ఆల్బమ్ తీసుకుని విసురుగా, టేబుల్ మీద పెట్టి, కోపంగా అడిగాడు రామచంద్ర…
అదేమీ, గమనించకుండా! మినిస్టర్ వాళ్ళు వెళ్లిపోయారా ? క్యాటరింగ్ అద్భుతంగా చేశారు. అరేంజ్మెంట్స్ బాగున్నాయి అని అందరూ అంటున్నారు. ఫంక్షన్ చాలా బాగా అయింది కదా?
మా డాడీ మంచి కేటరింగ్ పెట్టారు అంది అరవింద. తన సహజ ధోరణిలో……
అవును, అందుకే ,ఇంటి యజమానురాలు సుష్టుగా ముందు తినేసి, అత్తగారిని, మామగారిని ,చుట్టాలను , పట్టించుకోకుండా, తీరిగ్గా కూర్చుని పుక్కిట పురాణాలు చెప్తున్నదని అనుకుంటున్నారంతా అన్నాడు. అక్కసుగా అన్నాడు రామచంద్ర .
మరి మీరేం చేస్తున్నారు ? విసురుగా అంటూ, అయినా । ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారు.. అందుకే కదా బోల్డ్ మందిని పెట్టారు . వాళ్ళు చూసుకుంటారు లెండి నిర్లక్ష్యంగా అంది అరవింద .
నేను నీలాగ సంస్కార హీనుడను కాదు కదా। తల్లిని తండ్రిని , అందరినీ వదిలేసి నా పొట్ట నింపుకోవడానికి విసురుగా అన్నాడు రామచంద్ర……
అయినా! మీ అమ్మా ,నాన్న చిన్నపిల్లలా? దగ్గరుండి తినిపించడానికి? పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్లకి కంపెనీ ఇచ్చి, వారితో తినకపోతే । ఏం బాగుంటుంది?మీరంటే పల్లెటూరు గబ్బిలాలు. మీకు పద్ధతులు తెలియవు అరిచింది అరవింద..
అవును, నీ పద్ధతులు చాలా గొప్పవి! . “ఆత్మస్తుతి పరనింద, అహంకారం, ఆర్భాటాలు”..
ఇవి నాకు తెలియదు మరి, వ్యంగ్యంగా అని, ఆత్మీయంగా అభిమానంగా అందరితో కలిసి ఉండడమే మాకు తెలుసు. అది మా పద్ధతి. కోపంగా అన్నాడు రామచంద్ర .
శాంతమూర్తి రామచంద్ర ఈరోజు వేడిగా- వాడీగా అస్త్రాలు సంధిస్తున్నారు.
అరవింద అహం దెబ్బతిన్నది .. బంధువుల మధ్య. ఎప్పుడూ మాట్లాడని భర్త, , అలా మాట్లాడేసరికి తట్టుకోలేక పోతోంది ..
మీరున్నారుగా ?ఆ మేళంతో కలిసి భోజనం చేయండి.
అయినా। “ ఏ గూటి పక్షులు ఆ గూటి పలుకే పలుకుతాయి” వెటకారంగా అంది అరవింద..
“రామచంద్ర కూడా అదే తీవ్ర స్వరంతో అన్నాడు.
తమ స్వంత గృహప్రవేశం కాకపోయినా, అంతలా శ్రమ పడుతున్న నా వాళ్ళందరినీ చూడు.
అవి ఏ గూటి పక్షులో తెలుస్తుంది … అవి కేవలం ఆత్మీయత , అనుబంధం కోరుకునే పక్షులు.
”మీది ధనానుబంధం. వాళ్లది ఋణానుబంధం “ అన్నాడు కోపంగా రామచంద్ర
మీకు ఈ ఊరు వస్తే, సొంత ఊరు అని గొంతు పెరుగుతూ ఉంటుంది. అందుకే। ఈ ఊర్లో ఇల్లు కట్టడం వద్దు అన్నాను., నా కొడుకు వినలేదు. ఆవేశంతో ఊగిపోతూ, ఈయన ఇలాగే మాట్లాడుతారు. ఈయనను పట్టించుకునే వారు ఎవరు?
మీరు చూడండి. పంతంగా అంది అరవింద..ఆల్బమ్లుచేత్తో తీసుకుని, రెచ్చిపోతూ…..
బిత్తరపోయి చూస్తున్న వారిని కూర్చోమంది దర్పంగా అరవింద .…
ఇంకో ఆల్బం. తీసి, మా అమ్మ మొన్న యూరప్ టూర్ వెళ్లి దిగిన ఫోటోలు చూడండి.
60 ఏళ్లు దాటిన మా అమ్మ ఎంత అందంగా, హుందాగా ఉందో! అంది ఎర్రబడిన ముఖంతో. అరవింద ..
తన ఆనందం కోసం, తన సౌఖ్యం కోసం, లక్షలు గుమ్మరించి, టూర్ వెళ్లి. ఫోటోలు దిగడం, అందం కాదు. సంస్కారంతో కూడిన సత్ ప్రవర్తన గలవారిదే అసలైన అందం విసురుగా అన్నాడు రామచంద్ర.
అవును మరి, మా అమ్మది అందం కాదు, పేడ పిసుక్కునే మీ అమ్మది అందం అంటే! వెటకారంగా అంది అరవింద.
వెటకారమైనా నిజమే చెప్పావు.. నిజంగా అందమంటే మా అమ్మదే.. తన స్వార్థం చూసుకోకుండా, ఎదుటి వారి కష్టాన్ని గుర్తించి, వారి ఆకలి తీరుస్తూ ,,ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా చలించిపోయే మానవతా మూర్తి మా అమ్మ. ఆమెదే అందం ..నిజమైన అందం విలువ నీకేం తెలుసు? మదర్ తెరిసా, డొక్కా సీతమ్మ లాంటి పుణ్య మూర్తులది అన్నాడు ఆవేశంగా రామచంద్ర…
ఓహో। మీ అమ్మ డొక్కా సీతమ్మ…మీ నాన్న వీరేశలింగం పంతులు. నువ్వు మరి? హేళనగా అంది అరవింద.. పోతే , పోనీ। నీ జన్మకి ఈసారైనా నిజం చెప్పావు . మా అమ్మా నాన్న , నిజంగా అలాంటి వాళ్లే। నేనే నీ పాలబడి వారి పేరు పాడు చేస్తున్నాను. .ఇందాక మినిస్టర్ గారు అదేమాట అన్నారు.
మీ లాంటి స్వార్ధపరుల ఇంట్లో అడుగు పెట్టిన నేను, ఉత్తముడిని అవుతానా ?
మా అమ్మ అందం గురించి హేళనగా మాట్లాడావు కదా! .
ఆమె మీ లాగ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి, కోటింగులు కొట్టించుకునే అందగత్తె కాదు మా అమ్మ .
ఆమెది సహజ సౌందర్యం. సౌజన్య స్వభావం అన్నాడు
“ అదేంటి? కాలిన మచ్చలతో, కర్రలా ఉండి, కష్టపడి పని చేసి, చేసి, చేతులు కాయలు కాసి, జుట్టు కూడా తలనీలాలుగా అర్పించి చూడడానికి అత్యంత సాధారణం గా ఉండే వాళ్ళమ్మ ! అందగత్తె అంటాడేంటి? అనుకున్నారు. అక్కడున్న కొందరు .
అరవింద తల్లి, ఒంటినిండానగలతో, ఖరీదైన పట్టుచీరతో, చాలా ఫ్యాషన్ గా, దర్జాగా ఉంటుంది కదా!, అను కున్నారు కొందరు .
ఆశ్చర్యంగా చూస్తున్న అక్కడున్న వారితో. మీ అందరికీ ఇప్పుడే చూపెడతాను. ఏది నిజమైన అందమో? మీకే తెలుస్తుంది ! అని వడివడిగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు రామచంద్ర .
కోపం మనుషులను వివశులను చేస్తుంటే, రామచంద్ర ,అరవింద విజ్ఞత మరచిపోయారు*…
అరవింద అరుస్తోంది. అక్కడ ఉంటే చచ్చినట్లు పడి ఉంటాడు. ఈ మట్టి ఎక్కేసరికి రెచ్చిపోతున్నాడు. మీకు తెలుసు కదా? మా అమ్మతో వాళ్ళ అమ్మకు పోలిక ఏమిటి? కనీసం మా ఇంటి పనిమనిషికి ఉన్న అందం కూడా ఆమెకు లేదు. మా కాలిగోరుకు కూడా పోలిక లేదని మీకు తెలియదా? అంది ఆయాశపడుతూ…” అరవింద మనిషి ఎంత అందంగా ఉంటుందో, అరిచిందంటే అంత వికృతంగా ఉంటుంది “.
అసలు ఎప్పుడు లేనిది ఈరోజు రామచంద్రకు ఇంత కోపం రావడానికి కారణం ఏమిటి అనుకున్నారు? అక్కడున్న వారు.
గబగబా ఇంట్లో ప్రవేశించి, తండ్రి అల్మరాలో దాచిన పాత ఆల్బమ్స్ తీసి దులుపుతూ చూస్తున్న రామచంద్రను చూసి ఆశ్చర్యపోయారు తల్లి తండ్రి.
ఏం ,నాయనా! భోజనం అయిందా ?చుట్టాలు పక్కాలు అందరి భోజనాలు అయిపోయాయా? మనవడు తీసుకొచ్చి, మాకు దగ్గరుండి పసిపిల్లలకు తినిపించి నట్లు తినిపించి వెళ్ళాడు రా! అంటున్న, తల్లి మాటలు పట్టించుకోకుండా! పాత ఆల్బమ్ తీసి , గట్టిగా దుమ్ము దులిపి. ఆల్బమ్ పట్టుకుని , ఏమైందిరా! అంటున్న తల్లి , తండ్రి మాట వినిపించుకోకుండా, వడివడిగా వెళ్ళిపోయాడు ..
అదేమిటి, ఏమైందివీడికి ?ఎప్పుడూ లేనిది, వాడు అంత కోపంగా ఉన్నాడు ఏమిటి?
వాడికి కోపం రాదు కదా? నేను అంత వేగంగా నడవలేను. నువ్వు వెళ్లి చూసి రా! అని భార్యకు చెప్పారు. ఆదినారాయణ మాష్టారు.
ఆందోళనతో కొడుకు వెనక వచ్చిన ఆదిలక్ష్మి , కోడలి మాటలు గుర్తుకు వచ్చి వరండాలోనే ఆగిపోయారు.
“ గృహ ప్రవేశానికి పెద్ద పెద్దవాళ్లు వస్తారు. మీరిద్దరూ కొడుకు ఇల్లు అని, ముందు గదిలో కూర్చుండి పోవద్దు , కోడలి హెచ్చెరిక మనసులో పెట్టుకుని, కొడుకుకి తెలిస్తే గొడవలవుతాయని,
“సత్యనారాయణ వ్రతం కాగానే, కొడుకు, కోడలు, మనుమడిని ఆశ్వీరదించి, ప్రసాదం తీసుకొని,, నాకు ఎందుకో నీరసంగా ఉంది ఈ గందరగోళంలో ప్రశాంతంగా ఉండదు. పదండి అంటున్న తనను ఆపి , ఒక్క క్షణం ముఖంలోనికి చూసి పద అన్నారు రామచంద్ర తండ్రి…
ఏమైందమ్మా ? డాక్టర్ని పిలవనా? గృహప్రవేశం జరుగుతూ ఉంటే అక్కడ ఎందుకు మీరు? అంటున్న కొడుకుతో, మన ఇంట్లోనే ఉంటాం నాన్నా ! పర్వాలేదు . నాన్న అక్కడయితే విశ్రాంతిగా పడుకుంటారు. నువ్వు కార్యక్రమాలు సంగతి చూడు , అని వచ్చారు తామిద్దరూ.
ఆలోచనలో నున్న ఆదిలక్ష్మి. కొడుకు కేకలకు ఉలిక్కి పడింది …
మా అమ్మ నాన్న ఈ ఇంట్లో, ఇక్కడెందుకు లేరు? ఈరోజు కూడా అక్కడెందుకు న్నారు?
మినిష్టరుగారు ఎందుకు అలా అడిగారు? నువ్వు వారికి ఏమి రాయబారాలు పంపుతున్నావ్?
మన ఇంటి వ్యవహారాలు మినిస్టర్ గారు వరకు తెలుస్తున్నాయి? నాకెందుకు తెలియడం లేదు?
అరిచాడు రామచంద్ర..
ఆ మినిష్టరు చేసిన ఉపకారం లేదుగాని, చాడీలు చెప్పాడా? మీ వాళ్లే చెప్పి ఉంటారు .
ఆ పాతింట్లో మట్టి ఇంట్లో . కర్ర గోడలు , చెక్కతో స్లాబుల, ఆ ఇంట్లో 60 ఏళ్ళు ఉండ లేదా, మీవాళ్ళు?
ఈ ఒక్క రోజూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు మీరు , ఏదో మూలన ఎవరికంటా పడకుండా మూల గదిలో ఉండండి, అంటే అక్కడికెళ్లిపోవాలా? పరువు తియ్యాలా?
మీ అమ్మ,నాన్న మీకు చాడీలు చెప్పి పంపించారా ? ఆ మినిస్టర్ కూడా మీ నాన్న స్టూడెంట్ కదా!
అందుకే ఓవరాక్షన్ చేసి ఉంటాడు. అతడేదో పెద్ద మహానుభావుడులా ఫోజు కొడుతూ ఉంటాడు. అయినా మీ అమ్మా,నాన్న ఎక్కడికి పోయారు ? పాత ఇంట్లోనే ఉన్నారు కదా ? విసురుగా అంది అరవింద.
“చీ !దుష్టు రాలా ! ఇదా నీ అసలైన అందం .? అరువు తెచ్చుకున్న అందాలు ఇలాగే ఉంటాయి. మా అమ్మ అసలు ఏమీ చెప్పలేదు. మినిస్టర్ గారు అడిగినా నాన్న నోరెత్తలేదు .,
నాకు నీ దుర్బుద్ధి తెలియలేదు. పదిమంది ముందు పరువు తీసావు కదే, దుర్మార్గురాలా!
నీ కోటింగు అందానికి మా ఆమ్మ సరిపోలేదా ? అసలు మన వలననే కదా! మా అమ్మ అలా అయిపోయింది ..కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు రామచంద్ర…
నేను పరువు తీయడమేంటి ? నీ లేకి బుద్ధులు చూపెట్టి , నువ్వే ఫంక్షన్ పాడుచేసి, మా పరువు తీస్తున్నావ్ ఆవేశంగా అరిచింది అరవింద. మనిషి కాస్త సర్దుకుని మళ్ళీ అన్నాడు రామచంద్ర.
“అయినా ! ఆ ఇంటికి 100 ఏళ్ళు .చెక్కుచెదరలేదు. అది దేవాలయం అందులో దేవతలున్నారు .. నీ లాంటి దెయ్యం ఉన్నచోట ఆ దేవతలు ఉండకూడదు …
మీ నాన్న కట్టిన శ్లాబులు కట్టి సంవత్సరం అవ్వక ముందు కూలిపోతున్నాయి కదా!
ఇప్పుడే , మినిస్టర్ గారు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు… కావాలంటే మీ నాన్నని పిలిచి అడుగు.
మా నాన్న మొహం చూసి ఊరుకున్నాడు గాని, లేదంటే ఈపాటికి మీ నాన్నను కృష్ణ జన్మస్థానానికి పంపించి ఉండేవాడు. నువ్వు మరీ మిడిసి పడకు. మా ఇంటి గురించి మాట్లాడుతున్నావు.
“అయినా! మట్టి ఇంట్లో ఉండబట్టి మాకు మానవత్వం ఉంది., మాయమర్మం లేని గుణం ఉంది. కట్టెల గోడల మధ్య నివసించ బట్టి కరుణ దయ జాలి ఉన్నాయి., చెక్క శ్లాబుల కింద పెరగబట్టి , సభ్యత, సంస్కారం, మాకు వంటబట్టాయి”.అంత అందమైన ఇళ్లల్లో పెరిగిన నీకు ఏం వచ్చింది? అహంకారం తప్ప. అరిచాడు రామచంద్ర..
“ అతనితో నీకేంటమ్మా! వాళ్ళ అమ్మ అందంగా లేదు అన్నావని, అతనికి ఆక్రోశం .
అరవింద తల్లి అనసూయ, అతి భారీ కాయాన్ని అతి కష్టంగా కదుపుతూ , అక్కడికొచ్చి నిలబడి అంది”.. “ మా అమ్మ అందంగా లేకపోవడం ఏంటి ?
అసలు మీకు అందమంటే తెలుసా ? మీరు పెద్ద అందగత్తె అనుకుంటున్నారా? మా అమ్మ కాలిగోటికి సరిపోలవు మీ అందాలు విసురుగా కూర్చుని తను తెచ్చిన పాత ఆల్బం తెరిచాడు రామచంద్ర . అరవింద అదిరిపడి లేచింది.
“అక్కడున్న అందరితో అన్నాడు…చూడండి అమ్మా! మా అమ్మ అందం.
మా అమ్మ ఇంత కన్నా అందంగా ఉండేది. పాదాల వరకూ జుట్టుతో పార్వతీ దేవిలా ఉండేది ..
ఇదుగో ఈ ఫోటోలు చూడండి” కాకపోతే ,
“పాదాల వరకు ఉన్న జుత్తుని, ప్రమాదం నుండి మనవడిని, అంటే నా కొడుకు ని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ తిరుపతి దేవునికి తలనీలాలుగా సమర్పించింది ”
చలిమంట కాచుకుంటున్న మా పనిమనిషి కూతురు, పసిపిల్ల మంటల్లో చిక్కుకుంది., ఆ పిల్లని కాపాడడం కోసం, మంటలు ఆర్పడం కోసం తన చేతులు కాల్చుకుని మచ్చలు తెచ్చుకుంది”…
“నాన్నకు కిడ్నీ ప్రాబ్లం వస్తే కిడ్నీ దానం చేస్తే తనకు చర్మ సమస్యలు వచ్చాయి”..
అంత వరకు ఎందుకు ?” ఈ రాక్షసి నేను కారు ప్రమాదం నుండి తప్పించు కున్నందుకు మహానందంతో స్వామికి పొర్లుదండాలు పెట్టింది. నాకోసం అడుగడుగు దండాలు పెట్టి ఆపద మొక్కులు తీర్చు కున్నది మా అమ్మ” ….“ ఉపవాసాలు చేసి ఒంటి పొద్దులు చేసి, అందరూ బాగుండాలని,. తన ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా అహర్నిశలు అందరికోసం ఆలోచిస్తుంది. అమ్మ. ఇంకా మా కోసం పాటుపడుతున్నది
***
మీకు తెలుసా? మేము ఇల్లు కట్టిన ఈ స్థలం, అమ్మకు వాళ్ళ నాన్న, పసుపు కుంకుమ కింద ఇచ్చిన స్థలం. నాన్నమ్మా! నేను ఇక్కడ ఇల్లు కట్టించుకుంటాను అంటే, మనవడికి అంటే నా కొడుక్కి ఇచ్చేసింది. తనకు తన కుటుంబం బాగోవాలనే ఒక్క తపన తప్ప ఎలాంటి వ్యామోహాలు లేవు.
నా తమ్ముడు మరదలు కూడా ! ఈవిడలాంటి కుత్సిత బుద్ధిలేని వాళ్ళు కాబట్టి , అన్న కొడుకు అయినా, తన కొడుకై నా ఒకటే అనే భావనతో, ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు.
ఇదిగో ! మా అత్తయ్య ఇక్కడే ఉంది. కావలిస్తే, అడగండి. అమ్మ ,అత్తయ్య ఇద్దరు అక్కాచెల్లెళ్లులా ఉంటారు. అమ్మ ఆటు అత్తింటి వారితో, ఇటు పుట్టింటి వారితో, ఒకేలా ఉంటుంది..
మా అమ్మకు ఇంతకంటే ఏమి అందం కావాలి? మీరే చెప్పండి .
ఒకప్పుడు మా అమ్మ ఎంత ఆరోగ్యంగా, అందంగా కలకలలాడుతూ ఉండేదో చూడండి అని, కన్నీళ్ళ పర్యంతం అవుతూ ఆల్బమ్ తిరగేస్తూ అన్నాడు రామచంద్ర ,
ఏది నిజమైన అందం?“ దీని అందం వల్ల ఎవరికి ప్రయోజనం?
మా అమ్మది మానసిక సౌందర్యం. సహజ సౌందర్యం, స్థిరంగా దృఢంగా చెప్పి లేచి నిలబడ్డాడు.
ఎన్నడూ లేనిది , అందరిముందూ అనవలసిన నాలుగూ అన్నాడు రామచంద్ర.”.
నాయనా,! రామచంద్రా ! చుట్టాలందరూ ఉన్నారు. తప్పు నాయనా! ఏదైనా ఉంటే, తర్వాత మాట్లాడుకోండి. పెద్దదాన్ని చెప్తున్నాను నా మాట విను. అంటున్న మేనత్తతో.
తప్పక వింటాను అత్తా.! చిన్నప్పుడు బట్టి , మీరందరూ చెప్పిన మంచి విని , విని, ఇన్నాళ్లు మౌనంగా వీళ్ళ ఆగడాలన్నీ సహించాను. నా సహనాన్ని చేతకాని తనం కింద తీసుకొని, నా వాళ్ళ ని ఇంకా అవమానిస్తుంటే నేను భరించలేను అత్తా!
“ఈరోజు నువ్వు అంత పెద్ద ఇల్లు కట్టించుకుని, మీ అమ్మా నాన్నలను ఆ పాత ఇంట్లోనే అలా పడి ఉండమన్నావా? అనిన మినిస్టర్ గారి మాటకు, పరువు మొత్తం అక్కడేపోయింది.” ఇంతకన్నా ఏంకావాలత్తా?
దీనికి అత్తంటే గౌరవం లేదు. మామ అంటే లక్ష్యం లేదు, తనకి బుద్ధి చెప్పి సరిదిద్దే పెద్దలు కూడా లేరు.
మా పరువు పోక ఏమవుతుంది? అని ఆవేశంతో ఊగిపోతున్న రామచంద్ర మాటలు విని ఆశ్చర్యపోయాడు అరవింద తండ్రి అప్పల నరసయ్య.
అంత వరకూ పక్క గదిలో నిలబడి నక్కివింటున్న అరవింద తండ్రి అప్పలనరసయ్య , మనసులో మినిస్టర్ గా రడీగిన మాటకు అల్లుడికి కోపం వచ్చింది అనుకున్నాడు .
కనీసం కొన్ని గంటలసేపైనా అత్తను , మామను ఇంట్లో ఉండ నీయని కూతురి మీద, ఆమెకు వత్తాసు పలుకుతున్న తన భార్య మీద కూడా కోపం వచ్చింది..
అల్లుడు శ్రీరామచంద్రుడే . “రాకూడని రామునికే కోపం వచ్చింది మంచిది కాదు అనుకున్నాడు”.. దానికి తోడు ఈ రోజే ఇక్కడికి వచ్చిన మినిస్టర్ విక్రమ్ , వార్నింగ్ ఇచ్చి వెళ్లారు .
అతని మాటలు తలుచుకున్నాడు అరవింద తండ్రి అప్పల నరసయ్య.
మీ అల్లుడు మంచితనం బట్టి ,,వాళ్ళ నాన్నగారి పై ఉన్న గౌరవం బట్టి, నిన్ను ఆ కాంట్రాక్టులో కొనసాగనిస్తున్నాను..ఇదే లాస్ట్ వార్నింగ్ ..మొన్న కడుతున్న స్కూల్ పడిపోయినప్పు డే నిన్ను జైల్లో పెట్టించ వలసింది, సబ్ కాంట్రాక్టర్ మీదకు నెపం నెట్టేసి, వాళ్లను వీళ్లను మధ్యలో ఇరికించి, తెలివిగా తప్పించుకున్నావు , “రామచంద్ర ముఖ్యంగా మాష్టారి ముఖం చూసి నేను అందులో కల్పించు కోలేదు. నేనే పూనుకుంటే ఈ సారికి నువ్వు జైల్లో ఉందువు . నీ కూతురు , మా ఆవిడకు, నాకు , స్నేహితుల ద్వారా రాయబారాలు పంపుతుందా? ఇలాంటివి మానుకోమని చెప్పు..మీ వల్ల నేను కూడా మాటపడ్డాను..
ఈ సారి ఇలా జరిగితే మొత్తం అన్నికాంట్రాక్టులూ క్యాన్సిల్ చేసి పడేస్తాను. ప్రస్తుతం నీకు కొత్త కాంట్రాక్టులు ఇవ్వలేను. మీ అల్లుడు వెనకాల ఉండి జాగ్రత్తగా ఆ పనులు చేసుకో అని చీవాట్లు పెట్టాడు*
తన కూతురు, భార్య, లేనిపోని గొడవలు పెట్టి, అల్లుడితో సంబంధాలు పాడు చేసుకుంటే !
ఈ మాత్రం పరపతి కూడా తనకు మిగలదు. అనుకుని హడావడిగా హాలులోనికి వచ్చాడు అప్పలనరసయ్య….
అప్పటికే అరవింద రామచంద్ర పై రెచ్చిపోతోంది …
“నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడేవారు ఎవరు లేరు ఇక్కడ. నీవేం చేసు కుంటావో చేసుకో. మినిస్టర్ ఎవడు మధ్యలో చెప్పడానికి ? నేను పట్నం వెళ్ళిపోతాను ..నా కొడుకుతో ఉంటాను.
అక్కడే ఉంటాను. నా కొడుకుని కూడా ఇక్కడ ఉండనివ్వను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నువ్వు ఈ ఊర్లో ఊరేగు. ఇన్ని మాటలు పడుతూ ఈ ఊర్లో ఉండాల్సిన ఖర్మ నాకు లేదు అని అరుస్తోంది అరవింద .
నీకేం కర్మమే! వీళ్ళ చేత ఇన్ని మాటలు పడడానికి.. పద పద అని రెచ్చ గోడుతోంది అరవింద తల్లి… “ పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది అరవింద” ..
“ నాయనమ్మ అలా వరండాలో నిలబడిపోవడం చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి . అక్కడ నిలబడిపోయిన, అరవింద కొడుకు అవినాష్ లోపలికి వచ్చి, ఆవేశంగా అన్నాడు.
“అమ్మా ! ఇప్పటికే మొత్తం పరువు తీసావు . ఇక ఆపు నీకు తెలియదు…..
నేను మా తాత గారి కోరిక తీర్చడం కోసం మాత్రమే, నాకు ఇష్టం కాబట్తి , అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చేశాను ..
నేను ఇక ఈ ఊరు వదిలి పట్నం రాను. నీ బెదిరింపులకు నాన్న భయం పడతారేమో ? నేను కాదు” … నాన్న మనసు మార్చుకొని నీ వెనుక వస్తాడేమో? నేను రాను..నాన్నమ్మ, తాతల మీద ఏడవకు. వాళ్లు నన్ను ఇక్కడికి రమ్మని చెప్ప లేదు. నేను చిన్నవాడిని కాదు ..ఎవరో చెప్తే వినడానికి”
నాకు ఈ ఊరు వాతావరణం చాలా ఇష్టం. ఆడంబరంతో కూడిన నీ సమాజంలో ఇక నేను ఉండలేను ..నా కిక్కడే బాగుంది . ఇంతకీ! నిన్ను ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టించమన్నానో , నీకు అర్దమైందా?
హాయిగా ఆత్మీయులైన వీళ్ళందరి మధ్యనే ఉంటూ, సేంద్రియ వ్యవసాయం చేయించుకుంటూ, పదిమందికి ఉపయోగపడుతూ, ప్రయోజనకరంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాను.
ఈ ఇల్లు కట్టి నాకు బహుమతిగా ఇస్తానంటే అందుకే కాదనలేదు. నువ్వు నాయనమ్మ నుండి స్థలం కలిసి వస్తుందని ఆలోచించావు గాని ఈ విధంగా ఆలోచించ లేదు అన్నాడు అవినాష్ .
అవాక్కయి పోయింది అరవింద.
అరవింద తండ్రి అప్పలనరసయ్య అన్నాడు. శభాష్, రా!మనవడా!
తండ్రికి తగ్గ కొడుకువి… అలాగే చెయ్యు..,
అమ్ములూ ! డాడీ ఎందుకు అన్నారో అని ఆలోచించు.
”తెగే వరకూ లాగకు.”. ఆవేశం తగ్గించుకో. అహంకారం చంపుకో..
నేనన్నానని బాధపడకు .ఆడపిల్ల అత్తింట ఉంటేనే అందం. నువ్వేం చిన్న పిల్లవి కావు…. మీ అమ్మకి చర్మ సౌందర్యం మీద శ్రద్ద్గ తప్ప, పిల్లల్ని పద్ధతిగా పెంచడం తెలియదు .
అందు వలన నువ్వు ఇలా తయారయ్యావు”
.. నేనూ మీ అమ్మ , మీ అన్న దగ్గరకి అమెరికా వెళ్ళి, కొన్నాళ్జ్ళుండి వస్తాం .
నీ ఇష్టం వచ్చినచోట నువ్వుండు. నేనే ఇంకా ఏ కొడుకు దగ్గర ఉండడం? ఎలా జీవితం గడపడం ? అని ఆలోచిస్తున్నాను?
నా కొడుకులు మీ ఆయన అంత ఉత్తమంగా ఆలోచించరు. వాళ్లది నా పోలిక మరి.
నీవు ఏడాదికి ఒకసారి ఎప్పుడో వస్తే , పసుపు కుంకం పెట్టి, ఓ పట్టు చీర పెట్టి పంపగలను.
కానీ ! పంతాలకు పోయి , నా పరువు తీస్తానంటే ఊరుకోను.
అని భార్య తో, ఒళ్ళు పెంచావు గాని, పిల్లని ఎలా పెంచాలో తెలియ లేదు నీకు. ముందు ఆ బ్యాగులు పట్టుకుని నడువు. మన ఇంటికి మనం పోదాం. దాని సంగతి అది చూసుకుంటుంది అన్నాడు అప్పలనరసయ్య .”..
మీ ఇంటికి రావలసిన కర్మం నాకేంటి? నాకు ఇల్లు , వాకలి లేదనుకుంటున్నావా ?
నేను ఇంక మీ ఇంటికి రాను. అని తండ్రి మీద అరిచి, అందరూ ఒక్కసారి, ఎదురు తిరిగేసరికి అయోమయంలో పడి, ఆరున్నొక్క రాగం అందుకుంది అరవింద..
రామచంద్రతో అంది . స్థానబలం అని తెగ రెచ్చిపోతున్నారు మీరు..
పోనీలెండి. మీరే ఈ సామ్రాజ్యాన్ని ఏలుకోండి. పోయి నేనే, ఎందులోనో పడి చస్తాను అంది ఆఖరి అస్త్రం సంధిస్తూ”..
రామచంద్ర నిదానంగా ..అరవిందా! మన పెళ్ళయినది మొదలు, ఇలా నువ్వు బెదిరిస్తుంటే, బెదిరిపోయి , పరువుపోతుందని ఇంత వరకూ భరిస్తూ వచ్చాను….నాలో సహనం చచ్చిపోయింది..
నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో అన్నాడు . …
“ తన భార్య ఎంత వరకూ రాకపోవడంతో, అతి కష్టం పై , కర్ర సాయంతో , ఏమి జరిగిందో నన్న ఆతృతలో, ఆయాసపడుతూ వచ్చిన ఆదినారాయణగారు ,,,,
వరండాలో కూలబడి వాదనలన్నీ విన్నారు ..భార్య సాయంతో లోపలికి వచ్చి, అక్కడ సోఫాలో కూలబడి పోయారు … ఆశ్చర్యపోతున్న అందరినీ చూసి నాకేం పరవాలేదు .
రామా ! నా మాట మీద గౌరవముంటే నువ్విక్కడి నుండి బయిటకు వెళ్ళు అన్నారు.
అరవిందతో, అమ్మా యీ ! నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. ఈ యింటి లక్ష్మీదేవివి. ఇలా మాట్లాడొచ్చా?
నీ జాతకం అందమైంది. నీవు అందమైన దానివి, అందుకే కోరి , నా కొడుక్కి చేసుకున్నాం.. .
చిల్లి గవ్వయినా ఏనాడైనా మీ నుండి ఆశించలేదు ..మీ నాన్న ఇక్కడే ఉన్నారు అడుగు ..
ఈ ఇంటి మహలక్ష్మివి నువ్వు. ఎక్కడికి వెళ్తావు ?
నిన్ను నా ప్రాణమున్నంతవరకు యింటి గడపదాటి అడుగు బయిట పెట్ట నివ్వను ..
శుభమా అని ,ఇంటి గృహప్రవేశం చేసుకొని , తప్పుడు మాటలు మాట్లాడొచ్చా ? అంతవరకూ ఎందుకు?
నీ వలనే ఏకంగా ఏడాది బట్టి, ఎటూ కదలకుండా పడున్న నేను, సాయం లేనిదీ నడవలేని నేను, ఏమైపోయిందో నన్న ఆతృతతో , అక్కడి నుండి ఇక్కడికి, అలా నడిచి వచ్చేసాను ..
నువ్వు ఈ ఇంట అడుగుపెట్టాక అన్నీ శుభాలే జరిగాయి . నువ్వు ఉండమన్నా, నే నీ యింట్లోఉండను. నువ్వేం చేసావ్? నీతో వాదన లెందుకు? అనునయంగా అన్నారు ఆదినారాయణ మాష్టారు ….
అమ్మని బాధ పెడతావా ? తప్పు కాదూ? బావగారూ , మీరు అమ్మాయితో ఇలాంట ప్పుడు అలా మాట్లాడుతారా? అని మనమడిని, అప్పలనరసయ్యను మందలించారు మాష్టారు ..
“కళ్ళనీళ్ళు పెట్టుకొని, క్షమించండి . మీరు ఎంత మంచి మనుషులు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, నా వల్ల తప్పయింది మామయ్య గారూ !. మన్నించండి అంది ఏడుస్తూ అరవింద.
అదీ ! బావగారంటే! అందుకే మినిస్టర్ లే కాదు, పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆదినారాయణ మాష్టారు అని గౌరవిస్తారు”., అందరికీ ఆరాధ్య దైవం అన్నాడు ఆనందంగా అప్పల నరసయ్య…
“ఇల్లు అన్నాక, ఇలాంటివన్నీ సహజమేనమ్మా.” ఇంటింటికి ఉంది మంటి పొయ్యి మా ఇంట్లో ఉంది మరో పొయ్యి” , అని సర్దుకుపోతేనే సంసారాలు సాగుతాయి అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా , ఆప్యాయత అనురాగాలు ఉండి, అందరం కలిసిమెలిసి ఉంటేనే ఆనందం.
ఇక ఎవరి పని వాళ్లు చూసుకోండమ్మ. ! భోజనాలు చేయని వాళ్ళు చేయండి , అందరినీ చూస్తూ అన్నారు ఆదినారాయణ మాష్టారు..
తాతా ! నిజంగా మీరు శ్రీమన్నారాయణుడే . ఇలాంటి ప్రళయాన్ని కూడా ఇప్పుడే , ఇక్కడికి ఇక్కడే! అంతం చేసేసారు అన్నాడు మనవడు అవినాష్ .
“ఇల్లన్నాక గొడవలూ ,పెళ్ళన్నాక గొప్పలూ ఉంటునే ఉంటాయి “..లే రా1 మనుమడా. అయినా,
నువ్వు కూడా అమ్మని అలాబెదిరించవచ్చా? అని మందలించి….
అరవిందా! వెళ్ళమ్మా వెళ్లి, ముఖం కడుక్కుని వచ్చి , నీ చేత్తో నాకు చల్లని మజ్జిగనియ్యు తల్లీ! అన్నారు కోడలిని చూస్తూ .. సరే ! మామయ్యా అని నడిచింది అరవింద.
లోపలికి వెళుతున్న అరవింద, అరవడం వల్ల, చెమటలు పట్టిన మొహాన్ని మాటి మాటికీ తుడుచుకోవడం వలన, ముఖం మీద క్రీములు, పౌడరు కరిగిపోయి, ప్యాచులు పడి , జుట్టు చెదిరిపోయి, దుస్తులు చెదిరిపోయి, వికారంగా కనిపించింది.
దానికి తోడు అరుపులు, ఎదుట మనిషి గురించి ఆవిడ నిర్లక్ష్యం, నిరాదరణ చూసి, అక్కడున్నవారు ఆశ్చర్యపోయి జారుకున్నారు.
ఇదా దీని అసలు అందం? ఇదంతా అందం అనుకున్నాం. .అందమైన మనసు లేక పోయాక, ఎంత అందంగా ఉంటేనేం ? ఐశ్వర్యం ఉంటేనేం? అనుకుని , ఆదినారాయణ మాష్టారికి నమస్కరించి మెల్లగా అక్కడి నుండి జారుకున్నారు బంధువులు.
అస్లు ముందే మీరిక్కడుంటే గొడవలే రావుకదా అనిన మనవడితే ,
అసలు నువ్వు ఇక్కడ ఇల్లు కట్టమనకపోతే గొడవలే రావు ,అనిన తాత గారి మాటలకు పకపకా నవ్వాడు అవినాష్ …..
*****

చిన్న పల్లెలో పుట్టిపెరిగి స్వశక్తితో గురువులు నేర్పని విద్య, స్వయంకృషితో నేర్చుకుని ,ఆ కుగ్రామంలో మొదట డిగ్రీ, పీ జి చేసిన ఆడపిల్లను నేనే ..నలభై ఏళ్ళుఉపాధ్యాయవృత్తి నిర్వహించాను …. సువిశాలమైన ఈసాహితీ క్షేత్రంలోనావంటూ కొన్ని విత్తులు నాటుకోవాలని, నిత్యం సేద్యంచేస్తూ ఉన్నాను..
“పిల్లల కోసం 25 పైగా నాటికలు రాసి వాటిని మా పాఠశాల పిల్లలచే పాతికేళ్లు ప్రదర్శింప చేశాను” ..వివిధ సంస్థలచే ఉత్తమ ఉపాధ్యాయునిగా, సన్మానాలు సత్కారాలు పొందాను.