
విరిసిన సింధూరం
-కాయల నాగేంద్ర
ప్రకృతి ప్రశాంతంగా పవ్వళించింది. ఆకాశం పసిపాప హృదయంలా స్వచ్చంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. చంద్రుడు చల్లని వెన్నెలని జల్లుగా భూమి పైకి కురిపిస్తున్నాడు. అప్పుడప్పుడూ గాలి తెరలు తెరలుగా చల్లగా తాకుతోంది. ఆకాశంలో మేఘాలు దూది పింజల్లా వాయు వేగానికి పరుగులు పెడుతున్నాయి.
చక్కని పరిసరాలు, ఆనందకరమైన ప్రకృతి ఆకాశంలో మబ్బులతో దోబూచు లాడుతోంది జాబిల్లి.
డాబా మీద కూర్చుని ఆకాశంలోని తారల్ని లెక్కబెడుతూ ఆలోచిస్తున్నాడు విశ్వ. ఇంటి పనులు ముగించుకొని వెన్నెల చీర కట్టుకొని, జడలో మల్లెలు తురుముకొని వెన్నెల్లో మెరిసిపోతూ వచ్చిన అతని భార్య సింధూరను చూడగానే అతని గత జీవిత స్మృతులు స్మృతిపథంలో మెదిలాయి.
ఇంటర్ దాకా తన ఊరిలోనే చదివాడు విశ్వ. కొడుకు ఇష్టాన్ని కాదనలేక పై చదువులకోసం పట్నంలో చేర్పించాడు రామనాథం.
తనకు సింధూరతో పరిచయమవుతుందని కలలో కూడా ఊహించలేదు విశ్వ.
చిన్నతనంలోనే స్కూటర్ యాక్సిడెంట్ లో తన తల్లిదండ్రులను కోల్పోయి, ఉన్న ఊరు వదిలి తన మేనమామ దగ్గరకు చేరింది సింధూర. పుట్టిన తరువాత తల్లిదండ్రుల ప్రేమలో పదేళ్ళు పెరిగింది. ఆ తర్వాత మేనమామ దగ్గర చదువు కోవడం ప్రారంభించింది జీవితంలో చాలా అనుభవాల్ని ఆకళింపు చేసుకుంది.
తొలి యవ్వనంలో అడుగు పెట్టిన సింధూర, తొలిరేకులు విప్పిన తాజా రోజాలా ఉంటుంది. గులాబీరేకుల సౌకుమార్యం, జాజిపూల లావణ్యం కలబోసినట్టు ఉంటుం దామె. గుండ్రటి ముఖం, విశాలమైన కళ్ళు, చక్కని పలువరుస, తుమ్మెదలా నిగ నిగలాడే వంకీల జుట్టు, లేత గులాబీ రంగు శరీర ఛాయ. ముట్టుకుంటే మాసిపోతుం దేమో అన్నంత సుకుమారంగా వుంటుందామె. నెమ్మదిగా, మితంగా, స్థిమితంగా, తియ్యగా మాట్లాడుతుంది. ఆమె పెద్ద కళ్ళలో ఎప్పుడూ వినయం, విధేయత తొణికిస లాడుతూ ఉంటాయి.
విశ్వకు ఆమె పట్ల ఆరాధన పెరిగింది. ప్రతిరోజూ ఆమెకి మూగ చూపులతో విన్నపాలు చేసుకునేవాడు.
సింధూర అందానికి ముగ్ధుడైన విశ్వ ఆమెకు దగ్గరవుతూ, భవిష్యత్తును ఎంతో మధురంగా, మనోహరంగా ఊహించుకున్నాడు. ఆమెకు కూడా విశ్వ అంటే ఇష్టం కలగడంతో, వారి ప్రేమ మొగ్గ తొడిగి చిగురించింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
విశ్వ నమ్మకం, ఆశ ఫలించింది. సింధూర మనసు కరిగింది.
ఇద్దరి మధ్య పటిష్టమైన బంధం ఏర్పడింది.
పరీక్షలు అయిపోయాయి. మూడేళ్లు సరదాగా గడిచిపోయాయి.
“సింధూ! రేపు మా ఊరికి వెళ్లిపోతున్నాను”. విశ్వ చెప్పగానే ఆమె మొహంలో ఏదో విషాదరేఖ అలుముకుంది. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్ధం రాజ్యమేలింది.
“ఏం మాట్లాడవేం! ఆ మూగనోము ఏమిటి?” అడిగాడు విశ్వ.
“ ఏమని మాట్లాడను?” అందామె.
“ఇలా ఢీలా అవుతావెందుకు! మన ప్రేమ విషయం మా అమ్మానాన్నలతో మాట్లాడి పెళ్ళికి ఒప్పిస్తాను.” అన్నాడు విశ్వ.
“ఏమోనండీ మీ తల్లిదండ్రులు మన వివాహానికి ఒప్పుకుంటారా? నేను అమ్మా నాన్న లేని అనాధని కదా!” అంది దిగులుగా.
“మనిద్దరం మూడేళ్లుగా కలిసి చదువుకున్నాం. మనిద్దరి మధ్య మంచి స్నేహాన్ని మించి సన్నిహితత్వం ఏర్పడింది. నేనంటే ఏమిటో నీకు తెలియదా? ఎలాంటి పరిస్థితిలోనైనా నీకు అన్యాయం చేయను సింధూ! నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ కావాలి తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది. అందుకు సాక్ష్యం మనం పవిత్రంగా బావించే ఈ కుంకుమను నీ నుదుటున దిద్దుతున్నాను. ఇప్పటి నుంచి నువ్వు నా అర్థాంగివి”. అంటూ ఆమె తల పాపిట కుంకుమ పెట్టాడు విశ్వ,
అతని మాటలు ఆమె మనసుని కదలించింది. అతని ప్రేమానురాగాలకు ఆమె కళ్ళు వర్షించాయి. అప్పటివరకు మనసులోవున్న అనుమానాలన్నీ దూది పింజాల్లాగా ఎగిరిపోయాయి.
“నువ్వు నాకు కావాలి” అన్న విశ్వ మాటలు పదేపదే ఆమె మనసులో ప్రతిధ్వనించసాగాయి. ఆమె శరీరంలోని అణువణువూ అతని ప్రేమతో నిండి పోయింది.
క్షణం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
ఆమెకి వీడ్కోలు చెప్పి తన ఊరికి బయలుదేరాడు విశ్వ.
సింధూర జీవితం ఎన్నో విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఎప్పటికప్పుడు భయంకరమైన ఒంటరితనపు అగాధంలోకి పోవటం, అంతలోనే ఎవరో ఒక అమృతమూర్తి తనకు తారసపడి చేయూతనివ్వడం, ఆ చేతిని తాను ఆసరాగా చేసుకొని మరో అడుగు పైకి చేరుకోబోయే తరుణంలో మళ్ళీ తాను క్రిందికి జారిపోవడం జరుగుతోంది.
ఆమె గుండెల అంచున గూడు కట్టుకున్న బాధ వెచ్చని కన్నీటిగా కరిగి కళ్లల్లో నిలిచింది. ఆ కళ్ళు మూసుకుంటే, మూసిన గతం తలుపు తెరుచుకొని పాత జ్ఞాపకా లన్నీ హృదయపు వాకిట ముందు నిలబడుతున్నాయి.
కొన్ని జ్ఞాపకాలు ఆవేదనను కలిగిస్తే, మరికొన్ని ఆ ఆవేదనను మరపించి మనసుకు ఊరట కలిగిస్తున్నాయి.
***
రామనాధం స్నేహితుడు బంధుత్వం కలుపుకుందామని, ఆయన కూతుర్ని విశ్వకు ఇచ్చి పెళ్లి చేయాలని వచ్చాడు. ఇదే విషయం విశ్వకు చెబుతూ, “చదువు కున్న పిల్ల, సంప్రదాయం గల కుటుంబం. అంతేకాదు అందమైనదికూడా” అన్నాడు రామనాధం.
“ఈ సంబంధం నాకిష్టం లేదు నాన్నగారు” కొంచెం ధైర్యంగానే చెప్పాడు విశ్వ.
“ఏం! ఎందుకిష్టం లేదు బాగా ఆలోచించుకో, అతనికి మాటిచ్చాను నా నిర్ణయం మారదు” అన్నాడు.
తండ్రిది మొండిపట్టు తను అన్నదే కావాలనే రకం. సింధూర విషయం చెబితే ససేమిరా ఒప్పుకోడు. ఇప్పుడు ఏం చేయడం అని విశ్వ మనసు కలవరపడసాగింది.
“ఒరేయ్ విశ్వ! నాన్న చెప్పిన సంబంధం ఎందుకు ఒప్పుకోలేదు” విశ్వ తల్లి సుగుణమ్మ అడిగింది.
చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర చనువు ఎక్కువ అతనికి. సింధూరతో పరిచయం, ఆమెతో స్నేహం, ఆమెకు ఇచ్చిన మాట అన్నీ తల్లికి వివరించాడు.
“మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని గౌరవించే వ్యక్తి మీ నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో మీ పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటావు?” అంది సుగుణమ్మ.
“సింధూరకి గుణం ఉంది. రూపం ఉంది. చదువుంది. అంతేకాకుండా అన్ని విధాల ఆమె నాకు నచ్చింది. తల్లిదండ్రులు లేని ఆమెకు ఆసరాగా ఉందామను కుంటున్నాను అమ్మా! ఆమెను తప్ప మరొకర్ని పెళ్లాడలేను. ఎలాగైనా నాన్నను ఒప్పించు” అని తల్లిని ప్రాధేయపడ్డాడు.
విశ్వలో తీవ్రమైన మానసిక క్షోభ ఆరంభమైంది. ‘నాన్న నా బాధను ఎందుకు అర్థం చేసుకోడం లేదు. ఎప్పుడూ ఆయన మాటే నెగ్గాలనుకుంటే ఎలా? ఎన్ని కష్టాలు ఎదురైనాసరే సింధూరకు న్యాయం చేయాలి’ ఆలోచిస్తుంటే విశ్వ గుండె బరువెక్కి పోయింది.
ఆ రాత్రి భర్తతో ఈ విషయం చర్చించింది సుగుణమ్మ. రామనాధం చండ శాసనుడైయ్యాడు. నేను చూసిన అమ్మాయిని ఎలా చేసుకోడో చూస్తాను. నా స్నేహితుడు గొప్ప ఆస్తిపరుడు. మనం అడిగినంత కట్నం ఇస్తాడు. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది. ఇంతకన్నా ఎంకావాలి? రేపే వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకొని వస్తాను” అంటూ భార్య పైన మండిపడ్డాడు.
నేడు నాగరికత అంతరిక్షం వైపు దూసుకుపోతుంటే, కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకులను సమాజంలో కొనే వస్తువుగా మార్చేస్తున్నారు. కొడుకులను అమ్మకపు వస్తువుగా పెట్టి, కట్నం ఆశించే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో సిగ్గు పడాలి. వివాహం అనేది సామాజిక బంధం. వివాహ బంధం పటిష్టంగా ఉంటేనే సమాజం కూడా బాగుంటుందని గ్రహించాలి.
ఉదయాన్నే తన మిత్రుని ఇంటికి బయలుదేరాడు రామనాధం.
బస్సు దిగి రోడ్డుపై నడుస్తున్న రామనాధం మనసు నిండా ఆలోచనలు ముసురు కోవడం ప్రారంభించాయి. బస్సు వేగంగా ప్రయాణిస్తోంది. అతని ఆలోచనలు అంత కన్నా వేగంగా ప్రయాణిస్తున్నాయి. కొడుకును ఇంతవాడ్ని చేసినందుకు ఇప్పుడు తన మాటే కాదంటున్నాడు. పదేపదే కొడుకు ప్రవర్తన గుర్తుకొస్తోంది.
బస్సు దిగి ఆలోచిస్తూ నడుస్తున్న రామనాధం ఒక్కసారిగా రోడ్డుమీద కుప్పకూలి పోయాడు.
తనకు మెలుకువ వచ్చేసరికి ఆసుపత్రిలో బెడ్ పైన ఉన్నాడు.
“మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోడ్డుపై పడిపోయారు. సమయానికి ఈ అమ్మాయి చూసి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకురావడంతో మీరు బ్రతికి బైటపడ్డారు. అంతేకాదు మీ తలకు బలమైన గాయమై చాలా రక్తం పోవడంతో ఈ అమ్మాయే మీకు రక్తధానం చేసింది. ఈ అమ్మాయికి మీరెంతో ఋణపడి ఉంటారు” అని చెప్పాడు డాక్టర్.
ఆమెకు రెండు చేతులెత్తి కృతజ్ఞతగా నమస్కరిస్తూ కన్నీటి బొట్లు రాల్చాడు రామనాధం.
అదే సమయానికి విశ్వ, సుగుణమ్మలు అక్కడికి చేరుకున్నారు.
తండ్రి దగ్గరున్న సింధూరను చూసి “సింధూ! నువ్విక్కడ?” విశ్వ ఆడగ్గానే, “ఈ అమ్మాయి నీకు తెలుసా?” రామనాధం అడిగాడు.
“నేను ప్రేమించన అమ్మాయి ఈ అమ్మాయే నాన్న!” అని విశ్వ చెప్పగానే ఒక్క సారిగా షాక్ తిన్నవాడిలా అదిరిపడ్డాడు రామనాధం. ఇలాంటి బంగారు తల్లినా నేను తిరస్కరించిందని మనసులో తలచుకొని బాధపడ్డాడు. ఆ సమయంలో సింధూర తనను కాపాడటానికి వచ్చిన దేవతలా అనిపించింది. కొన్ని క్షణాలపాటు కళ్ళు మూసుకొని తన ఇష్టదైవాన్ని మనసారా స్మరించుకున్నాడు.
ఆమె సాంప్రదాయానికి ఇచ్చే గౌరవం, ఎదుటివారిని ఆదరించంచడం, అభిమానించడం, మాట తీరు, ప్రశాంతమైన చెదరని చిరునవ్వు రామనాధంకు బాగా నచ్చాయి. ఇన్ని సుగుణాలున్న సింధూరను ప్రేమించిన విశ్వ చాలా అదృష్టవంతు డనుకున్నాడు.
రామనాధంకు కనువిప్పు కలిగింది. జీవితపు విలువల్ని గ్రహించగలిగాడు. పిల్లల విషయంలో తనింక కలుగజేసుకోకూడదని గట్టి నిర్ణయానికొచ్చాడు. వారి పెళ్ళికి మనస్పూర్తిగా అంగీకరించాడు.
రామనాధంలో వచ్చిన మార్పుకు సింధూర కరిగిపోయింది. తన అదృష్టానికి తానే మురిసిపోయింది. అదృష్టం ఆలస్యంగా వచ్చినా తనను అభిమానించే మామగారు, అత్తగారు, భర్త లభించడం గొప్ప విషయం. ఇప్పుడు అంతా తనవారే! ఎంతమందికి లభిస్తుంది ఈ అదృష్టం.
సింధూర మురిసిపోయింది.
*****

కాయల నాగేంద్ర 1961 అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లా, రాజంపేటలో జన్మించారు. B.A వరకు చదివాను. హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ NFC లో ఉద్యోగం. 2021 లో పదవి విరమణ చేశాను. అదే సంస్థలో Independence Day award 2018 అందుకున్నాను. Safety day సందర్భంగా వ్యాసాలు, స్లోగన్స్ కు బహుమతులు వచ్చాయి. 1985లో ‘విశ్వసాహితి’ పక్షపత్రికలో ‘మారిన మనసు’ కధతో నా రచనావ్యాసంగం ప్రారంభమైంది. ‘విశ్వ’ మినీ నవల డా. సి. నారాయణ రెడ్ది గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. వివిధ పత్రికలలో ఇప్పటివరకూ ఇరవై కథలు, యాభై వరకు వ్యాసాలు, కొన్ని కవితలు, జోక్స్ ప్రచురింపబడ్డాయి. వీటిలో ‘శ్రావణ మేఘాలు’, ‘జీవిత గమ్యం’, ‘సంబంధం కుదిరింది’ కథలు బహుమతి పొందాయి.