
జీవిత చదరంగం
(నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)
-అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
తళతళ మెరుస్తున్న స్కూటర్ని తనివితీరా మరొక్కసారి చూసుకుని జేబురుమాల్ తీసి సున్నితంగా వ్యూ మిర్రర్ తుడిచి స్టాండ్ తీసి స్టార్ట్ చేసి రెండు సార్లు హారన్ మోగించాడు శరత్. ఆ రోజు శరత్ కొత్త స్కూటర్ మీద మొదటిసారి బయలుదేరబోతు న్నాడు.
శ్రావణి ఇంటిలోంచి కాలు బయటికి పెట్టబోయి, చటుక్కున ఆగిపోయింది. ఒక్కసారి భూమి కంపించినట్టు , నేల చీలుకుపోతున్నట్టుగా, ఇంటి కప్పు పెళ్ళలు పెళ్ళలుగా కూలి మీద పడుతున్నట్లుగా-ఆమె మెలికలు తిరిగింది. పొద్దుట నుంచీ సన్నగా మొదలైన బాధ పొత్తికడుపులో మరీ ఎక్కువై , ఒక్కసారి వికృతరూపం దాల్చి, కొండచిలువ కదిలి నట్టయి, కడుపు చీల్చుకుని ఏదో బయటకొస్తున్నట్లనిపించింది. బాధతో ఒళ్ళంతా చెమట ముద్దవడమే కాకుండా వెచ్చగా బట్టలన్నీ భళ్ళున తడిసి పోయాయి..
“ అమ్మా” …అంటూ పెద్దకేక పెట్టి అక్కడే కూలబడపోయి తలుపు సాయంతో నిలదొక్కు కుంది. వెనుక నుండి తలుపేసుకోవడానికి వచ్చిన అత్తగారు చటుక్కున పట్టుకుని,
“ ఏమమ్మాయ్; ఏమైంది?”: అంది కంగారుగా.-అంతలో ఆమె పరిస్థితి గ్రహించి’ అదేమిటంటూ ’ మెల్లగా పొదివి పట్టుకుని లోపలికి నడిపించుకు వచ్చింది. ఈ హడావిడి
చూసి శరత్ స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు.
***
శ్రావణి హాస్పిటల్ బెడ్ మీద నీరసంగా పడుకుని ఆలోచిస్తోంది. ఆమెకి బ్లీడింగ్ అవుతున్నా , బాధ తగ్గింది. గర్భం పోయినట్టేనని లేడీడాక్టర్ ధృవపరిచింది. ఆ విధంగా డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని , దీనికి లీవ్ లెటర్ జతచేసి , పంపించింది. అబార్షన్ కిచ్చే ఆరువారాల స్పెషల్ లీవ్ కోసం. శాంతి ఎప్పుడొచ్చి ఆఫీస్ విశేషాలు చెబుతుందా అని వీది వైపు చూస్తూ పడుకుంది. రకరకాల ఆలోచనలు మనసులో సాగుతున్నాయి. జీతం డ్రా చేశారా?
తను శాంతికి పేఆథరైజేషన్ లెటర్ ఇచ్చింది. కనుక ఆమె తప్పకుండా ఆ డబ్బు ఇవ్వడానికి వస్తుంది. శ్రావణి నీరసంగా కళ్ళు మూసుకుంది. కళ్ళ ముందు ఏవేవో సంభాషణలు.
రంగనాధ్, హరనాథ్, రామారావులు ఒక్కొక్కసారి వాళ్ళు విసిరే కుళ్ళు కామెంట్లు గుర్తుకొచ్చి బాధగా నవ్వుకుంది. ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళ మీద విసరడానికి విమర్శలు కురిపించడానికి అందరూ సిద్ధంగానే ముందు వరసలో ఉంటారు.” ఆడవాళ్ళతో పుట్టినా బాగుండేది. హాయిగా నెలల తరబడి సెలవు , మీద ఫుల్ జీతం తీసుకుంటూ ఇంటిలో విశ్రాంతి తీసుకోవచ్చు.” ఆఫీసులో మెటర్నిటీ లీవ్ పెట్టినా , గర్భస్రావమై స్పెషల్ లీవ్ మీద ఎవరు వెళ్ళినా ఎవరో ఒకరు ఈ కామెంట్ చేయక మానరు.
శ్రావణికి ఎప్పుడు పట్టిందో బాగా నిద్ర పట్టేసింది. ఎనిమిదిగంటలు దాటుతుండగా
శ్రావణి తల్లి పార్వతమ్మ అన్నం కారేజి తీసుకొచ్చింది. తల్లిని చూడగానే శ్రావణికి
ఎక్కడిదో దుఃఖం ఒక్రసారి పొంగుకొచ్చింది. పార్వతమ్మ కూతురిని పొదివి పట్టుకొని
“:ఏం లేదు. ఏముందిందులో? అంత బాధ పడాల్సింది ఏమీ లేదు.-పోతే పోయిందిలే”
అంటూ ఓదార్చింది.
“ నువ్వెప్పుడొస్తావా అని చూస్తున్నాను” అంది కళ్ళ నీళ్ళతో శ్రావణి.” రాత్రి ఫోన్ వచ్చింది. ప్రొద్దున బయలుదేరే సరికి ఈ టైమయ్యింది.”అంటూ సముదాయించింది.”
***
శ్రావణి ఎం.కామ్.ఎకనామిక్స్ చేసింది. అందులో గోల్డ్ మెడలిస్ట్. కాంపిటేటివ్ టెస్ట్లో
పాసయ్యి ఇంటర్వ్యూలో కూడా నెగ్గి ఉద్యోగం తెచ్చుకుంది. అందుకో ఇప్పుడు శ్రావణి
బంగారు బాతు కాబట్టే, శరత్ ఆర్థిక వ్యూహాలను తట్టుకుని , అతని పెళ్ళి కూతుళ్ళ
ఎంపికలో నెగ్గుకొచ్చి అతని అర్దాంగి అయ్యింది.
శాంతి వస్తూనే “ సారీ, శ్రావణి; నిన్న రాలేకపోయాను. మా చిన్నోడికి కొంచెం ఫీవర్ తగిలింది. మధ్యాహ్నం మరీ ఎక్కువైందని ఫోన్ వస్తే వెళ్ళిపోయాను. అయినా శరత్ వచ్చి నీ సాలరీ తీసుకెళ్ళారు కదాని, ఈ రోజు రావచ్చులే అనుకున్నా “ అంది. సైలెన్సర్ కు అమర్చిన పిస్తోల్ గుండు నిశ్శబ్దంగా గుండెలో దూరినట్లయ్యింది శ్రావణికి. పైకి వినిపించక పోయినంతమాత్రాన బుల్లెట్ తక్కువ బాధేం పెట్టదు. శాంతి రాలేక పోయినందులకు ఏమీ బాధ లేదు. కానీ జీతం తీసుకున్న శరత్ కనీసం రాత్రయినా ఒక్కసారి ఆసుపత్రికి వచ్చి తనకు కనబడలేదనే విపరీతమైన బాధ గుండె అంతా నిండిపోయింది.” ఎప్పుడెళ్ళిపోతున్నావ్” అడిగింది శాంతి.” ఈరోజు సాయంత్రం-
అంటే మరో గంటలో”. ‘అయితే సర్లే గానీ, నేను నెళ్ళాళ్ళు సెలవు పెట్టాను.’ ‘ అబ్బా,
ఎందుకే?’.’ మా అన్నయ్య రమ్మనమని ఒకటే గొడవ. ఊరెళ్ళి చాలా కాలమైంది.’” హాయిగా వెళ్ళవే”.’ ఇదిగో నీ పేస్లిప్.” -) మరి నే వస్తానింక” -శాంతి వెళ్ళిపోయాక, విచిత్రమైన అవమానంతో కూడిన గుబులు శ్రావణి మనసంతా కమ్ముకుంది.
***
“ ఏమిటీ? ప్రతీదానికి రాద్దాంతం చేస్తావు? ఏం నీ జీతం నేవెళ్ళ్ళి తీసుకుంటే తప్పా? నీకేమైనా పరువుపోయిందా? అన్నాడు శరత్ కోపంగా.
“నాకొక్క మాట చెప్పాలి కదా,”
“ ఇప్పుడు చెబుతున్నాను కదా;
“ ఏమిటీ? ఇఫుడా? నేనడిగాక, ఇంత టెన్షన్ పడ్డాక “ అంది చిరాకుగా.
“ భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం understanding ఉండకపోతే కష్టం” అన్నాడు.
“ నేనూ అదే అంటున్నాను” అంది ఉద్రేకంగా.
శరత్ మరేం మాట్లాడలేదు.. ఆరోజు తల్లిని బండి మీద దింపి, లోపలికి రాకుండానే వెళ్ళిపోయి , ఇఫుడేవో కహానీలు చెబుతున్నాడని శ్రావణికి ఉక్రోషంగా, కోపంగా ఉంది.
పరిస్థితి గ్రహించి పార్వతి కూతురిని మందలించింది.’ అతనికేదో పనుందని, మళ్ళీ లోపలికి వస్తే ఆలస్యమవుతుందని వెళ్ళాడే. ఇప్పుడేమైందని నీ గొడవ ‘అంటూఅల్లుడ్నే
సమర్థించింది.
***
లీవు పూర్తవగానే శ్రావణి ఆఫీసు కెళ్ళడం మొదలు పెట్టింది. ఆఫీసు టైమ్ అయ్యాక కూడా పని చేస్తోంది. తన సెక్షన్ లో వర్క్ పెండింగ్ ఉందని. ఆ రోజు ఒళ్ళు భారంగా ఎలాగో అనిపిస్తుంటే లెక్కలు చూసుకుంది.-పీరియడ్స్ రాలేదని గ్రహించి ఎందుకా అని ఆలోచనలో పడింది. అత్తగారితో అదే మాట అంది.” ఆ…మొన్నటిదాకా రక్తం పోయింది కదా; కొన్నాళ్ళు ఆగుతుంది. భయం లేదులే “ అందామె. నిజమే కదా అని ఊరుకుంది. రెండు నెలలు దాటిపోతుంటే ఒంట్లో భారం ఆమెకు అనుమానం వచ్చి లేడీడాక్టర్ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ ప్రెగ్నెంట్టను నిర్ధారణ చేసి మందులు రాసిచ్చింది.” మూడో నెల వచ్చిందంటారా?” అనడిగింది.” లేదమ్మా; ఎడ్వాన్స్ ఐదు నెలలు దాటాయి.” అదెలా? నాకు మూడు నెలల క్రితం అబార్షనైంది.” “ నో..ఇట్స్ నాట్ కరెక్ట్” అంటూ మందు చీటీ చేతిలో పెట్టి , ఇక వెళ్ళచ్చు అంటూ చేతితో సంజ్ఞ చేసింది. స్కూటర్ వెనుక కూర్చుని శరత్ తో నెమ్మదిగా చెప్పింది.
“ పోన్లే ఇప్పుడు నీ కొచ్చిన కష్టమేమిటీ”? అన్నాడు శరత్.” ఏం లేదనుకోండి.-అప్పుడు చూసింది డా.రమ. ఆమె లండన్ వెళ్ళే హడావుడిలో ఉన్నారు. రెండు సార్లు ట్రై చేసినా దొరకలేదు.’ నెమ్మదిగా బదులిచ్చింది శ్రావణి.
“ ఇఫుడు నీ ప్రాబ్లెమ్ ఏంటో అర్థం కావడం లేదు.” అన్నాడు శరత్ మెల్లగా వెనక్కి తిరిగి విసుగ్గా. అతనికి తొందరగా విసుగు .విసుగు పెరిగిన కొద్దీ కంఠం పెద్దదవడం లక్షణాలు.
వెంటనే శ్రావణి సర్దుకుని “ నో ప్రాబ్లం “ అంది. నాలుగు రోజులు తరువాత డా.సరస్వతిగారి దగ్గరకు వెళ్ళింది. వీళ్ళు వెళ్ళే సరికి ఆవిడ ఆరామ్ గా ఉంది. శ్రావణికి పూర్వ పరిచయం ఉండటం వల్ల చనువుగా పలకరించింది ఆమె శ్రావణిని పరీక్షచేసి, అయిదో నెల దాటిందని అక్టోబర్ రెండుకు డెలివరీ డేట్ ఇచ్చింది. అసలు జరిగిన కథ చెప్పింది.
“ ఓ అదా, ఒక్కొక్క సారలా జరుగుతుంటుంది. Implantation-అంటే Fertilised egg
గర్భసంచిలో ఒక ప్రక్కగా ఒక ప్రదేశానికి చేరి ఉండిపోతుంది. అప్పుడు కొందరికి బాగా
రక్తస్రావం అవుతుంది. దాన్ని post abortal breedingగా పొరబడితే ఇలాంటి అను
మానమే వస్తుంది. కానీ అప్పుడు పిండం ఏం కాదు. క్రమంగా పిండం పెరిగి పెద్దదై బిడ్డ
పుట్టవచ్చు.-అదే జరిగింది” అందావిడ. ఆ సరస్వతి గారు మంచి అనుభవశాలి. వైద్యం
లో ఎంత అనుభవముందో, అడిగిన వారికి అన్నీ వివరంగా చెప్పే ఉత్సాహం, ఓర్పు కూడా ఉన్నాయి.
సెప్టెంబర్ పదినుంచి మెటర్నటీ లీవ్ అప్లై చేసింది. ప్రస్తుతం శ్రావణి పుట్టబోయే పాపాయి కోసం ఎదురు చూడటం తప్ప వేరే వ్యాపకం ఏమీ లేదు.
***
ఆరోజు పాపకి బారసాల. ఇరువైపులా బంధువులతో ఇల్లంతా శోభాయమానంగా కళకళలాడుతోంది. పాపకి ప్రణీత అని పేరు పెట్టారు. అత్తగారింట్లో తనకు పెట్టిన బట్టలు తన హోదాకు సరిగ్గా ఉన్నాయో లేదోనని రహస్యంగా చూసుకుంటున్నాడు శరత్. అందరూ భోజనాలయ్యాక కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పోస్ట్‌మెన్ వచ్చి శ్రావణి పేరున ఒక రిజిస్టర్ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఒక్కక్షణం వాతావరణం నిశ్శబ్దమైంది. ఆఫీసు నుంచి వచ్చింది ఏమై ఉంటుందా అని శ్రావణి ఐదునెలల క్రితం దొంగ సర్టిఫికెట్ పెట్టి అబార్షన్ అనే వంకతో ఆరువారాలు
ప్రత్యేక లీవ్ తీసుకున్నారని, ఇది డిపార్టుమెంటును మోసం చెయ్యడం కనుక, మీ
సంజాయిషీ అడుగుతూ షోకాజ్ నోటీసు వచ్చింది అది.
ఇంటిలోని పండుగ వాతావరణం గంభీరమై, విషాదంగా మారిపోయింది. అసలు జరిగిన విషయం పూర్తిగా తెలుసుకున్న పరంధామయ్య ఆందోళన పడి పోయాడు. శరత్ అయోమయంలో పడిపోయాడు. శ్రావణికి ఒక్క క్షణం మెదడంతా స్థభించిపోయినట్ల యింది. పరంధామయ్య రంగంలోకి దిగాడు. కూతురి ఉద్యోగం నిలపడానికి కంకణం కట్టుకున్నాడు. తెలియక జరిగిన పొరపాటని ఎంత చెప్పినా పై అధికారులు వినలేదు. డాక్టర్ దగ్గర మీకా విషయం బయటపడినప్పుడు , అదే విషయం డిపార్ట్మెంట్ కి తెలియ బరచి, మీ ప్రత్యేక సెలవును మరో సెలవుగా మార్పించుకోవాలి కదా-అది ఉద్యోగి కనీస బాధ్యత. ఆ బాధ్యతని విస్మరించి. సంస్థని మోసం చేద్దామని చూసినందుకు ఉద్యోగం లోంచి తీసివేయక తప్పదన్నారు.
ఆఫీసులో కొందరు అధికారులు, సెక్షన్ హెడ్ కలిసి కేసు బాగా పక్‌డ్భందీగా నడిపించి నందువల్ల, పరంధామయ్య ఎంత ప్రయత్నించినా లొంగలేదు. శ్రావణిని ఉద్యోగంలోంచి తీసివేస్తున్నట్టు ఆర్డర్ వచ్చేసింది. ఆ రోజు శరత్ వచ్చి శ్రావణి మీద చాలా కోపంగా, ఉద్రేకంగా మాట్లాడాడు.” ఉద్యోగం చేస్తున్నావని పెద్ద ఫోజ్. రూల్స్ తెలీవు. రెగ్యులేషన్స్ తెలీవు. ఆడవాళ్ళనేమైనా అంటే మాత్రం పౌరుషం పొడుచు కొస్తుంది.” అంటూ ఏవేవో లెక్చర్ ఇచ్చాడు.” నేనా విషయం ఎంతో ఆందోళన చెందాను. మీకు గుర్తుందా? అంది శ్రావణి.
“ ఏం లాభం? వ్యంగంగా అన్నాడు శరత్.
“ నేను డా.సరస్వతి గారి దగ్గర కెళ్ళేవరకూ తెలీదు. ఆఫీసుకు విషయం తెలియ పరచాలని తోచలేదు.” అదే అడుగుతున్నాను. ఆమాత్రం తెలీదా?” “ అవును. నాకు తెలీదు. మీరు చెప్పొచ్చు కదా; మీకు రూల్స్-రెగ్యులేషన్స్ బాగా తెలుసుగా” అంది శ్రావణి.
“ ఆహా, నాకింక పనిలేదా-ఇలాంటి చిన్నవిషయం కూడా చెప్పాలా?”।
“ ఏం, ఇదేమంత చిన్న విషయం కాదే- నా ఉద్యోగానికి ముప్పు తెచ్చిన విషయం.”
“ నాకేం తెలుసు. నువ్వేం చెప్పుకున్నావో నీ ఆఫీసులో -ఏమడిగినా నీ విషయంలో
కల్పించుకున్నట్లుగా ఉంటుందని……”
“ మీకు జరిగింది జరిగినట్లుగా చెబుతూనే ఉన్నాను. మీరు నన్ను గైడ్ చెయ్యచ్చు కదా; నాకు నెలలు తేడా వచ్చినప్పుడు మీకు చెప్పలేదా?”
“ ఏమో; నాకేం గుర్తు. నాకు నీ ముట్టు లెక్కలు గుర్తు పెట్టుకోవడమే తప్ప వేరే పన్లేదునుకున్నావా.”
ఒక్కసారిగా శ్రావణిలో కోపం తారాస్థాయి నందుకుంది. ఇంతవరకూ తన భర్తలో నీచగుణాలు చూసినా , గ్రహించినా ఇంతటి నీచమైన మాటలు మాట్లాడగలడని ఊహించలేదు. ఆమెలో సహనం నశించింది.
“ అవును. నా ముట్టు నెలల లెక్కలు లెక్కపెట్టడానికి మీకెక్కడ గుర్తు.? నాజీతం డబ్బులు మాత్రం లెక్కలు కట్టి జేబులో వేసుకోవడానికి కుదురుతుంది గానీ” అంది శ్రావణి.
వెంటనే శ్రావణి చెంప చెళ్ళుమంది. మరో దెబ్బ పడేదే కానీ—- శ్రావణి అతని చెయ్యి గట్టిగా పట్టుకుని “ మరొక దెబ్బ నా వంటిమీద పడిందో జాగ్రత్త అంటూ ఒక చేతికర్ర పట్టుకుంది. పరంధామయ్య కూతురిని చిన్నగా మందలించి అల్లుడ్ని అక్కడ నుంచి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. మామగారు సముదాయించేసరికి మరీ రెచ్చిపోయి ఎరుపెక్కిన మొహంతో పెద్ద పెద్దగా అరవసాగాడు శరత్. కూతురి ఉద్యోగం పోయినందుకు బాధ పడాలో, అల్లుడిలా అరుస్తున్నందుకు బాధపడాలో
పరంధామయ్యకు అర్థం కాలేదు.
“ ఇదిగో వినండి. ఇప్పుడే చెబుతున్నాను. ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలని ఏరీకోరీ చేసుకున్నాను నా కండిషన్లలో ఒకటి-ఇఫుడు ఉద్యోగం పోగొట్టుకుని కూర్చుంది.
దానికి నా బాధ్యత లేదు. ఉద్యోగం కనక లేకపోతే మీ అమ్మాయికి నాకూ ఎటువంటి
సంబంధం లేదు. ఉండదు.” అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు శరత్.
“ అదేమిటలా మాట్లాడుతున్నావు శరత్, సమస్యలొచ్చినప్పుడే , స్థిమితంగా ఆలోచించుకోవాలి. పరిష్కరించుకోవాలి. అంతేగానీ….” అతని మాట పూర్తి కాకుండానే శరత్ అందుకున్నాడు.” అవన్నీ నాకనవసరం. ఎలా పరిష్కారించుకుంటారో, ఏం చేస్తారో-మళ్ళీ ఉద్యోగం వేయిస్తారో నాకు తెలీదు. ఆ ఉద్యోగం మళ్ళీ వేయించలేకపోతే మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంచుకోండి “ అన్నాడు విసురుగా.
పరంధామయ్యకు కోపం నశాళానికి వచ్చింది. అతని జీవితానుభవం అతని కోపాన్ని మింగేసింది. ఇది కూతురి ఉద్యోగ సమస్యగా కాకుండా ఆమె సంసార జీవన సమస్యగా మలుపు తిరగడం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తోంది. శ్రావణి మాత్రం స్థబ్దుగా , రాయిలా ఉండిపోయింది. ఆమె శరత్ వైపు చూసిన చూపులో ఏ భావము ఉందో చెప్పడం కష్టం. అది కోపమా, అసహ్యమా ; జీవితసత్యాన్ని గ్రహించిన తెరపితనమో ఏమో; కానీ కళ్ళు చెమ్మగిల్ల లేదు. ఆమె కసలు ఏడుపు రాలేదు.
***
అంతవరకూ రంగురంగుల బట్టలు కట్టిన రబ్బరు బొమ్మలాగా పెరిగిన శ్రావణి
ఒక్కసారి రక్తమాంసములు గల మనిషిగా , ఆలోచనగల అమ్మాయిగా, ఇష్టా ఇష్టాలు గల స్త్రీలా కళ్ళు తెరిచింది. చిన్నప్పటి నుంచి తల్లి చెప్పినట్లుగా వినడం, తల్లి
ఆలోచనలతో నడవడం మాత్రమే తెలుసు. తానుగా ఏదీ ఆలోచించలేదు. అలా ఆలో
చించాల్సిన అవసరమూ రాలేదు. కట్టూ,బొట్టూ, నగలు,ఫ్యాషన్,బంధువులు, మిత్రులు
అన్నీ అమ్మ చెప్పినట్టుగానే జరిగిపోయేవి. చదువు—సబ్జెక్ట్స్, పరీక్షలు, మార్కులు, ఫస్ట్
క్లాస్ లు, గోల్డ్ మెడల్స్, కాంపిటీటివ్ టెస్టులు, ఇంటర్వ్యూలు, ఇవన్నీ నాన్నచెప్పినట్టుగా
జరిగిపోయాయి. తన సాటివారితో తను ఎక్కువగా ఉండాలని అర్థం చేసుకుంది. ఏ లోటూ లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువు పూర్తి చేసింది. ఆ తరువాత కాలేజీలో చేరే
సరికి అందమైన బట్టలు, అంతస్తులు,హోదాలు అర్థమయ్యాయి. బి.కామ్.చివరి సంవత్సరంలో ఉండగా పెళ్ళిప్రయత్నాలు సాగుతుండేవి. శ్రావణికవి అత్యంత సహజంగా అనిపించేవి.
“:ఇదిగో ఇలా ఉంటే నీకు పెళ్ళి కాదు” అంటే మరునాటి నుంచి శ్రావణి ఆ తప్పు దిద్దుకుని ప్రవర్తించేది. ఎలా అంటే తనకి పెళ్ళి బాగా అవుతుందంటే అలాగే ఉండేం దుకు ప్రయత్నించేది. ఈ రోజుల్లో చదువు ఒక్కటే చాలదు. ఉద్యోగం కూడా ఉంటేనే మంచి సంబంధం వస్తుంది “ అన్నవెంటనే పట్టు వదలకుండా ఉద్యోగం సంపాదించు కుంది. జీతం బ్యాంకులో వేసుకుని కట్నం కూడబెట్టుకుంది. భర్త అంటే ఎత్తుగా, అందంగా, ; చదువు, ఉద్యోగం, హోదా, కట్నం, కానుకలు, లాంఛనాలు….వగైరాలే అని ఆలోచించింది.
కానీ, మనిషి , అతనిలోని భావాలు, అతని ఆలోచనా ధోరణి , సమభావం , ప్రేమ , ఇలాంటివెప్పుడూ ఆలోచించలేదు. పిల్లవాడు మంచివాడు, బుద్ధిమంతుడు, అని అందరూ సర్టిఫై చేయడం వింది.” మంచి” అంటే ఏమిటీ? బుద్దిమంతుడు అంటే ఎలా వుంటాడు? అనేది శ్రావణి ఎప్పుడూ ఆలోచించలేదు. తల్లిదండ్రుల ఎంపికలో శరత్ సహజమైన , అన్ని అర్హతలు గల పెళ్ళికొడుకు. ఇప్పుడు శ్రావణికి మొగుడు. అసలు శ్రావణి తనకేం కావాలో తనకే తెలీని స్థితిలో ఉంది. అదే తెలిస్తే ఆ కావలసిన దానికోసం అతని దగ్గర వెతికేది. శ్రావణి కిప్పుడిప్పుడే తను కోల్పోయిన వ్యక్తిత్వం అర్థమవు తోంది. అలా అర్థమవడం మొదలుపెట్టగా, విపరీతమైన అసంతృప్తి ఆమె మనసుని కాల్చిపోరే స్తోంది.
పరంధామయ్య కూతురు విషయంలో తన ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆఫీసు విషయములు అన్నీ సేకరించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో కొందరాడ వాళ్ళ మీద కేవలం ఈర్ష్యాసూయాల కొద్దీ , ఈ కేస్ భూతద్దంలో చూపెట్టి, ఎలిబీ సృష్టించారు.” ఓ ఐదువందలు పడేస్తే డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చే ఈ రోజుల్లో , ఇదేమంత కష్టం కాదని శ్రావణి
డిపార్ట్మెంట్ ను మోసం చేసి , సెలవు వాడుకుందని నిరూపించారు.
అవన్నీ తిరగతోడించి, ఒప్పించి డా.సరస్వతి గారితో డీటైల్డ్ గా గైనిక్ రిపోర్టు రాయించి , తన పీజీ తెలివితేటలతో కోర్ట్ లో కేస్ శ్రావణితో వేయించాడు. పరంధామయ్య హైకోర్టు అడ్వకేట్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అసలు లాయర్లకి నోట్స్ ప్రిపేర్ చేసి , సెక్షన్లతో సహితం రాసి ఇచ్చేది వీళ్ళే. పీజీ అంటే ప్లీడరు గుమాస్తా.
డా.సరస్వతిగారిచ్చిన రిపోర్ట్ బ్రహ్మాస్త్రంలాగా పనిచేసింది. కోర్టు Gm, section head లకు
నోటీసులు ఇచ్చి , సమన్లు ఇష్యూ చేసింది. వాళ్ళు కోర్టు కు హాజర్ కాకుండా వాయిదాల
మీద వాయిదాలు తీసుకోవడం మొదలెట్టారు. కోర్టు ధిక్కారం చర్యక్రింద వాళ్ళకి అరెస్టు
వారంట్ ఇచ్చింది. ఈ దెబ్బకి వాళ్ళు కోర్టుకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకున్నారు. జరిగిన
తప్పును కూడా ఒప్పుకున్నారు. కోర్టు శ్రావణిని ఉద్యోగంలో చేర్చుకొమ్మని చెప్పింది. పరంధామయ్య లాంటి వ్యవహారం తెలిసిన మనిషికే ఏడాది సమయం పట్టింది. శ్రావణికి
ఏడాది జీతం ముట్టింది. మరియు కోర్టు కయిన ఖర్చులు ఏభైవేలు ఆ ఇద్దరి నుంచి
వసూలు చేయమంది.
ఇంక ఈ ఏడాదిలోనూ శ్రావణిని చూడటానికి శరత్ మూడుసార్లు వచ్చాడు. ఇద్దరిమధ్యా పొడిపొడిగా మాటలే. అతను రమ్మనమని అడగలేదు. ఆమె వస్తానని ఆశపడి అడగలేదు.
ఆ రోజు పరంధామయ్య ఆనందంతో ఆటోలోంచి దూకినంత వేగంగా దిగి చకచకా ఇంటిలోకి పరుగెత్తాడు.”శ్రావణి; అమ్మా, శ్రావణీ: ఇలా రా తల్లీ;” అంటూ అతని గొంతు ఆవేశం, ఆనందం కలగలిపి గుడిలో గంటలా మోగింది. పార్వతి లోపల నుంచి హడావుడి గా వచ్చింది.
‘ పార్వతీ, మన కష్టాలు గట్టెక్కాయి. ఇదిగో కోర్ట్ ఆర్డర్. ఈ లెటర్ ఆఫీసు వాళ్ళిచ్చిన జాయినింగ్ లెటర్.” అన్నాడు. లోపల గదిలో పుస్తకం చదువుకుంటున్న శ్రావణి పరుగు పరుగున హాల్లోకి వచ్చింది.” ఇదిగో నమ్మా జాయినింగ్ లెటర్” ఆమె ఆత్రుతగా అందు కుంది.- కళ్ళలోంచి చివ్వున చిమ్మిన నీటివల్ల ఏం కనిపించలేదు.” రేపు జాయిన్ అవుదువు గానీ-రేపు మంచి రోజు కూడా “.’ అలాగే నాన్నా” అంది శ్రావణి. ఆమె గొంతు ఒణికింది. దుఃఖంతో పూడుకు పోయింది. ఆ తల్లిదండ్రులామె బాధనర్థం చేసుకుని, నిట్టూర్చారు.
***
ఇంట్లోకి అడుగుపెట్టిన అల్లుడి(గిల్లుడి)కి ఎంతో మర్యాద చేసింది అత్తగారు పార్వతి. గౌరవంగా ఆహ్వానించి. ఉత్సాహంగా కబుర్లు చెబుతున్నాడు శరత్. అప్పుడే శ్రావణి వచ్చింది.
“ శ్రావీ, ఎల్లుండి మంచిరోజట. అమ్మ చెప్పింది. మనింటి కెళదాము.” అన్నాడు శరత్. పరంధామయ్య ముఖంలో ఏదో తృప్తి, పార్వతి ముఖంలో ఒకరకమైన సంతృప్తి- “ నేనురాను” అంది శ్రావణి. ఆ కంఠంలో కోపం, ఉద్రేకం లేవు. ధృడనిశ్చయం ఖంగుమని
మ్రోగింది. పరంధామయ్య, పార్వతి ఒక్కక్షణం జంకారు. శరత్ ముఖం వివర్ణమైంది.
“ అదేమిటమ్మా..” అని ఇంకా ఏదో చెప్పబోయిన తండ్రి మాటలకు అడ్డు వచ్చి “ నాన్నా;
అదంతే. నా ఉద్యోగం నాకిప్పించ్చి బతుకుతెరువు నిచ్చారు. మీ ఋణం జన్మలో తీర్చు
కోలేను. కానీ ఈ మొగుడితో కాపురం చెయ్యమని మాత్రం చెప్పకండి.”-
“ శ్రావణి…” తల్లి ఏదో చెప్పబోయింది. శరత్ ఒక వెర్రినవ్వు లాంటిది నవ్వాడు. దొంగతనంచేస్తూ పట్టుబడ్డ వాడు కప్పిపుచ్చుకునే ధోరణిలా……. “ ఏదో నేను ఆవేశంలో అన్నమాటలు పట్టించుకున్నట్లుంది. భార్యాభర్తలన్నాక ………..”
“ స్టాప్ ఇట్. ఇంక చాలు. మరేం మాట్లాడకండి. నేనీ జన్మలో మీదగ్గరకు రాను. మీతో
కలిసి జీవించటం కల్ల.—-“
“ ఏమనుకుంటున్నావో………”
నేనేమనుకున్నా మీ కనవసరం. విడాకులకి ప్రయత్నించుకోండి.- కాదంటే నేనే చేస్తాను”. మరింక ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు శ్రావణి. విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.
“ ఈ జీవన చదరంగంలో ఎవరికి ఎవరూ
సొంతమూ;
ఎంతవరకీ బంధం; తాళి కట్టిన మగడు,।
కడుపున పుట్టిన బిడ్డలు,;
అంతా ఆర్థిక బంధాలే
అంతా ఆర్థిక సంబంధాలే.
*****

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యముగారు సాంఘిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక మరియు ఆధ్యాత్మిక రచనలు, వ్యాసాలు, కవితలు, కథలు, నవలలు రచించారు. వీరి రచనలు తెలుగువెలుగు, జాగృతి,ఆంధ్రభూమి, శ్రీవెంకటేశం, ప్రజాడైరీ, నెలవంక-నెమలీక, సాహితీకిరణం,హిందూధర్మం, సహరి, సినీవాలీ, మన తెలుగు కథలు.కామ్, దేశభక్తిసాహిత్య ‘ఈ’ పత్రిక, తెలుగుసొగసు, తెలుగుఇజమ్ మరియు అంతర్జాల పత్రికలులో ప్రచురించబడ్డాయి. ‘కలహంస’ అని – నెలవంక- నెమలీక.
‘సాహిత్య విక్రమార్క’ అని – దేశభక్తి సాహిత్య ‘ఈ’ పత్రికల నుండి ప్రశింసించబడ్డారు. ఇంటర్మీడియట్ వరకూ మెదక్ లో, ఉన్నత విధ్య హైదరాబాద్ లోను అభ్యసించారు. ప్రైవేట్ సర్వీసులో 36ఏళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.