పిల్ల తాబేళ్ళ కోరిక

-కందేపి రాణి ప్రసాద్

          సముద్రంలో ఉండే తాబేళ్ళు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఒడ్డున ఉన్న ఇసుకలో తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇసుకలో తమ గుడ్లను పెట్టి వెళతాయి. గుడ్లు పగిలి పిల్లలైన తరువాత పిల్ల తాబేళ్ళు మరల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తాబేళ్ళు ఇసుక లోపలకు తవ్వి గుడ్లను పెట్టటం వలన కొన్ని పిల్లలు ఇసుకలో నుంచి బయటకు రాలేక చనిపోతుంటాయి. మరి కొన్ని మెల్లగా నడుస్తూ మనుష్యుల కాళ్ళ కింద పడి చనిపోతుంటాయి. ఇంకొన్ని ఇసుక నుంచి బయటకు వచ్చే లోపలే ఊపిరాడక చనిపోతాయి. పాపం తాబేళ్ళు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటాయి.

          ఒక తాబేలుకు రెండు పిల్లలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా తన వెంట తిప్పు కుంటూ జాగ్రత్తలు చెబుతుంది. ఇసుకలో నడిచేటప్పుడు మనుష్యులు ఎవరూ లేకుండా చూసుకొమని చెబుతుంది. పిల్లలు సరేనని తలూపాయి. సముద్రపు నీళ్ళలో ఆడుకోవటం పిల్లలకు చాలా సరదాగా ఉంటుంది. నీళ్ళలో ఈదుతూ ఒక దాన్నోకటి ఆట పట్టించుకుంటూ ఉంటాయి. అలాగే ఒడ్డున ఉన్న ఇసుకలో నడిచినా చాలా కష్టమే. ఇసుకను చల్లుకుంటూ ఆటలాడతాయి.

          ఒక రోజు తాబేలు పిల్లకు ఒక అనుమానం వచ్చింది. పక్కనున్న అన్నతో తన అనుమానం చెప్పింది ” మనం పక్షుల్లా ఎగర గలమా”. అప్పుడు రెండో తాబేలు పిల్ల అన్నది ” మనం ఆకాశంలో ఎగరలేము. ఇప్పుడే చాలా నిదానంగా నడుస్తున్నాము – ఎగరగలిగే శక్తి మనకి ఉందని అనిపించటం లేదు”.

          అలా కాదు అన్నా ! మనం సముద్రంలో ఉన్నపుడు నీళ్ళలో ఈదుతున్నాము కదా ! అంటే ఈదటం వచ్చు. అలాగే నేలపై ఉన్నపుడు ఇసుకలో నడుస్తున్నాం కదా! అంటే నడవటమూ వచ్చు. మరి ఎగరటం ఎందుకు రాదు మనం ప్రయత్నించలేదు కాబట్టి ఎగరలేదు ” అన్నది మొదటి తాబేలు పిల్ల.

          “సరే! మనం అమ్మను అడుగుదాం! ఎగరచ్చా లేదా అనే విషయం అమ్మ చెబుతుంది” అన్నది రెండో తాబేలు పిల్ల. అంతలో తల్లి ఇంట్లోకి వస్తూ కనిపించింది. వెంటనే రెండు తాబేలు పిల్లలూ అమ్మ దగ్గరకు పరిగెత్తాయి. “అమ్మా! అమ్మా! మేం కూడా పక్షుల్లా ఆకాశంలో ఎగురుతాం. చూపించవా ఎలాగో ఎగరడం” అని మురిపెంగా అడిగాయి. అమ్మ పిల్లలిద్దర్నీ ముద్దు పెట్టుకుంటూ “ఆకాశంలో పక్షులు మాత్రమే ఎగురుతాయి. మన తాబేళ్ళు ఎగరవు. తాబేళ్ళు కేవలం నీళ్ళలోనూ, నేల మీదా మాత్రమే జీవించగలవు” అని అమ్మ చెప్తూ ఉండగానే ‘ఆగమ్మా’ అంటూ పిల్లలు అరిచాయి.

          ” ఏమైంది ! ఎందుకు అలా అరుస్తున్నారు”  ముద్దుగా విసుక్కుంది తల్లి. “ఇప్పుడు నువ్వన్నావే నేల మీదా నీళ్ళలోనూ మనం జీవించగలమని. మరి ఆకాశంలో ఎందుకు ఎగరలేము అన్నదే మా అనుమానం” అని పిల్లలు అడిగాయి.

          “నేల మీదా నీళ్ళలోనూ మనకు జీవించే అదృష్టం లభించింది. అలాగని ఆకాశంలో ఎగరాలంటే కుదరదు. పూర్వం మన తాబేలు ఒకటి పక్షులతో పాటు ఎగరాలని ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అత్యాశలకు పోకుండా లభించిన దానితో తృప్తిగా జీవించాలి. అలా ఉంటే అపాయాలు మన జోలికి రావు” అన్నది తల్లి.

          “ఎందుకమ్మా ! పక్షులు ఏమైనా ప్రతేక్యకమా ! అవి ఎగరగలిగినపుడు మేము ఎందుకు ఎగరలేము? సరిగా చెప్పమ్మా ” అని పిల్లలు విసుగ్గా అడిగాయి తమకెందుకు ఎగరడం రాదు అన్న పంతంతో అమ్మను అడుగుతున్నారు.

          తల్లి నవ్వుతూ చెప్తున్నది. ప్రతిదానికీ పంతం పనికి రాదు. విషయం అర్ధం చేసుకోవాలి. పక్షుల రెక్కల్లో గాలి గదులు ఉంటాయి. వాటి వలనే అవి పైకి ఎగర గలుగుతాయి. ఇంకా పక్షులు బరువు తక్కువగా ఉండటం వలన తేలికగా పైకి ఎగురుతాయి. తాబేలు శరీరం అందుకు అనువుగా ఉండదు.  కాబట్టి మనకు అనువుగా ఉండే చోటు జీవించాలి “.

          అమ్మా అమ్మా అలా కాదు!  పక్షుల గురించి నీకేమి తెలుసో చెప్పుమ్మా! వివరాలు చెప్పమ్మా! అంటూ పిల్లలు రెండూ అమ్మ పక్కకు చేరి కూర్చున్నాయి.

          ” సరే చెపుతాను వినండి! పక్షి శరీరం తేలికగా ఉంటుందని చెప్పాను కదా! కానీ వీటి అస్థిపంజరం పక్షి ఎగరడానికి, కిందికి వాలడానికి అనువుగా ఉంటుంది. గాలికి వంగిపోయేలా కాక బలంగా కూడా ఉంటుంది. పక్షికి చాలా పేర్లున్నాయి తెలుసా! అంటూ అమ్మ అడిగింది. 

          ఆ చెప్పు అమ్మా! ఎందుకు చాలా పేర్లున్నాయి. ఏమేమి పేర్లున్నాయి. చెప్పు చెప్పు అంటూ అమ్మను తోందర పెట్టాయి తాబేలు పిల్లలు.

          “ఉండండి! అలా తొందర పడతారేమి? చెపుతున్నాను కదా! ఖగము, పిట్ట, విహంగం, గువ్వ, విహాయసం అని రక రకాల పేర్లున్నాయి. పక్షుల్లో చేతిలో ఇమిడేంత చిన్నవి ఉన్నాయి. చాలా పెద్ద పక్షులూ ఉన్నాయి. డేగలు రాబందులు చాలా పెద్దగా ఉటాయి. పెద్ద పక్షులు ఆకాశంలో చాలా ఎత్తువరకు ఎగర గలుగుతాయి. ఆరు అడుగుల ఎత్తు కలిగిన పక్షులు కూడా ఉన్నాయి” అన్నది అమ్మ.

          “అమ్మో అంత పెద్ద పక్షులు ఉంటాయా అమ్మా” అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాయి తాబేలు పిల్లలు.

          “అవునమ్మా! మరి పక్షులు ఎన్నిరకాలు ఉన్నాయి అనుకుంటున్నారు. పది వేల రకాల జాతులున్నాయి తెలుసా! పక్షుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా! ‘ఆర్నితాలజీ’ అని పిలుస్తారు” అంటూ చెప్తూ ఆగింది తల్లి తాబేలు.

          చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా! పక్షుల్లో ఇన్ని రకాలు ఉన్నాయని తెలియదమ్మా! రోజూ కనిపించే కాకి, పావురం, పిచ్చుకలు మాత్రమే తెలుసు మాకు. పక్షులన్నీ ఆకాశంలోనే ఎగురుతాయి కదమ్మా  అంటూ తాబేలు పిల్లలు ఉత్సుకతతో అడిగాయి.

          పక్షుల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని పక్షలు నీటీ మీద నివసిస్తాయి. వాటిని సిటీ పక్షులు అంటారు. అలాగే కొన్ని పక్షులు ఒక్కొ కాలంలో ఒక్కో ప్రాంతంలో ఉంటాయి. వాటికి అనువైన ప్రాంతాల కోసం వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వస్తాయి. వాటిని వలస పక్షలు అంటారు. కొన్ని పక్షులు కేవలం రాత్రి పూట మాత్రమే తిరుగుతూ ఉంటాయి. వీటిని నిశాచర పక్షులు అంటారు. ఇలా అవి నివసించే ప్రాంతాలను బట్టి ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఎన్నో విషయాలు చెపుతూ ఆగింది అమ్మ.

          “అమ్మా! పక్షులకు చాలా చరిత్ర ఉన్నది. పక్షులు చాలా గొప్పవి. ఆకాశంలో తిరుగుతూ ఎన్నో ప్రాంతాలు తిరుగుతాయి. పిల్లలు మనకంటే బలం గొప్పది అన్న మాట ” ఉన్నాయి తాబేలు.

          “పక్షులు గొప్పవే కానీ తాబేళ్ళు తక్కువని కాదు. సృష్టిలోని దేని ప్రత్యేకత దానిదే. అందుకని అందరూ సమానమే. అందరూ కలసి మెలసి ఉంటే ఆనందంగా ఉంటాం. ఒకరికి కష్టం వచ్చినపుడు మరొకరు సహాయం చేయాలి” అంటూ తల్లి తాబేలు పిల్లలకు మంచి మాటలు చెప్పింది.

          తాబేలు పిల్లలు చక్కగా తల్లి చెప్పిన మాటలన్ని విన్నాయి. “అమ్మా మాకివాళ పక్షుల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుం దన్న విషయం నిజమేనమ్మా. అంతేకాదు శక్తికి మించి ఎగరాలనే కోరికలు కొరకూడ దని కూడా తెలిసిందమ్మా” అని తాబేలు పిల్లలు అమ్మకు చెప్పాయి.

          “అవునమ్మా! పిల్లలకు తెలియని విషయాలను తెలియ జెప్పేది తల్లి దండ్రులే నమ్మా. అందుకే మీకీ విషయాలనీ నేనీరోజు చెప్పాను. మీరు చక్కగా అర్థం చేసుకు న్నారు. నాకంతే చాలు” అని తాబేలు తన పిల్లలను ముద్దుపెట్టుకున్నది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.