
https://youtu.be/b-pks4g6-Qc?si=1EN5OQo26b88gds2https://youtu.be/dDTyA-UN3r0?si=5UE3YfxNQ6lEgcuLhttps://youtu.be/hjXEbLewfQw?si=xCh-Fbr0oVb9No7e
రాగసౌరభాలు-18
(శ్రీ రాగం)
-వాణి నల్లాన్ చక్రవర్తి
ప్రియమైన హితులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. శ్రీ కృష్ణ జయంతి, వినాయక చతుర్థి వంటి పండుగలు ఘనంగా జరుపుకున్నాము కదా! ఈ పవిత్రమైన మాసంలో శ్రీకరమైన, శుభప్రదమైన శ్రీరాగం విశేషాలు తెలుసుకుందాము. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా! ఒకే ఒక తెలుగు అక్షరం కలిగిన ఏకైక రాగం శ్రీరాగం. అంతేకాక ఘనరాగ పంచగుచ్చములోని ఆఖరి రాగము.
శ్రీరాగము 22వ మేళకర్త ఖరహారప్రియ రాగ జన్యము. ఉపాంగ రాగము. ఈ రాగము ఆరోహణ అవరోహణలు క్రింది విధంగా ఉన్నాయి.
“ స రి మ ప ని సా”
“ స ని ప మ రి గ రి స”
కొన్నిసార్లు అవరోహణలో దైవతం కలుపుకొని “స ని ప ద ని ప మ రి గ రి స ” అని పాడటం కద్దు. ముఖ్యంగా రాగం ఆపే సమయంలో ఈ ప్రయోగం కనిపిస్తుంది. త్యాగరాజస్వామి ఈ ప్రయోగాన్ని వాడలేదు.
ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమ్ , చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి దైవతం, కైశికి నిషాదములు. ఆరోహణలో గాంధార దైవతములు వర్జములు. అవరోహణలో గాంధారము, కొన్ని సందర్బమలలో దైవతము ఉంటాయి. ఇది ఔడవ షాడవ వక్ర రాగము. కొందరు ఈ రాగాన్ని అసంపూర్ణ మేళకర్త రాగంగా భావిస్తారు.
ఈ రాగం పురాతనమైనది. ఈ రాగాన్ని కనిపెట్టి పాడుకున్న సమయంలో మంగళకరంగా తోచటం వలన శ్రీరాగం అని నామకారణం చేసినట్టు భావన. అందువలన కచ్చేరి చివరలో మంగళాంతకంగా పాడటం కద్దు.
ఈ రాగం కరుణ, శాంత రసాలను అద్భుతంగా పోషిస్తుంది. పవిత్రమైన, శుభకరమైన రాగం. సాయంసమయ రాగం. తానం పాడటానికి, ప్రత్యేకించి వీణపై వాయించటానికి అనువైన అద్భుత రాగం. ఈ రాగానికి దగ్గరి రాగాలు మధ్యమావతి, మణిరంగు. ఇవి కూడా ఖరహారప్రియ రాగ జన్యాలు. అంతేకాక మూడింటికి ఆరోహణ ఒకటే.
త్యాగరాజా స్వామి రచించిన పంచరత్న కీర్తన. “ఎందరో మహానుభావులు” శ్రీరాగంలో అద్భుతమైన, రాజసమైన కీర్తన. ఈ కీర్తన రచనకు దారితీసిన సందర్భం ఒకటి ఉంది. అదేమిటో చూద్దాము. ఆ రోజుల్లో గోవిందా మారార్ అనే గొప్ప సంగీత పాండిత్యము కలిగిన పండితుడు ఉండేవాడు. ఆయన రాగం తానం పల్లవిలో పల్లవిని ఆరు కాలాలలో అలవోకగా పాడగలిగిన విశేష ప్రజ్ఞ కలిగి ఉండేవాడు. ఆయన ప్రజ్ఞా పాటవాలను ప్రత్యక్షంగా వీక్షించిన త్యాగయ్య గారు ముగ్ద్హులైనారట.వెంటనే “ఎందరో మహానుభావులు అందరికీ వందనములు” అనే కీర్తన రచించారట.
త్యాగరాజ స్వామి 5 ఘన రాగాలలో పంచరత్న కీర్తనలురచించారు. ఈ మధ్య మా అన్నయ్య, నవతరం వాగ్గె్యకారుడు, శ్రీ నల్లాన్ చక్రవర్తి మూర్తి ఈ 5 ఘన రాగాల లో పద వర్ణాలు రచించటం నాకెంతో గర్వకారణం.
ఇపుడు శ్రీరాగంలో కొన్ని ప్రసిద్ధ రచనలు పరికిద్దాము.
|
శాస్త్రీయ సంగీతము |
||||
|
1 |
గీతం |
మీనాక్షి |
ధ్రువతాళం |
శ్రీపూర్వీకులుగారు |
|
2 |
పంచరత్నం |
ఎందరో |
ఆది తాళం |
శ్రీత్యాగయ్యగారు |
|
3 |
కీర్తన |
నామకసుమములు |
ఆది తాళం |
శ్రీత్యాగయ్యగారు |
|
4 |
గీతం |
శ్రీ వరలక్ష్మి |
రూపకతాళం |
శ్రీదీక్షితర్గారు |
|
5 |
గీతం |
శ్రీకమలాంబికా |
ఆది తాళం |
శ్రీదీక్షితర్గారు |
|
6 |
గీతం |
కరుణజూడు |
ఆది తాళం |
శ్రీశ్యామా శాస్త్రిగారు |
|
అన్నమాచార్య కీర్తనలు |
||
|
1 |
ఓ పవనాత్మజ |
ఆది తాళం |
|
2 |
దినము ద్వాదశి |
ఆది తాళం |
|
3 |
పిడికిట తలంబ్రాల |
ఆది తాళం |
|
లలిత సంగీతం |
|||
|
1 |
అంజలిదే మానవోత్తమ |
శ్రీమతి రజనిగారు |
శ్రీపాలగుమ్మివిశ్వనాధం |
|
2 |
చిన్నారి తండ్రి |
శ్రీహరే రామ మూర్తిగారు |
శ్రీN.C మూర్తి గారు |
|
సినిమా సంగీతం |
|||
|
1 |
శ్రీరస్తు శుభమస్తు |
పెళ్లిపుస్తకం |
బాలుగారు, సుశీలగారు |
|
2 |
జో లాలి |
ధర్మదాత |
ఘంటసాలగారు |
|
3 |
ఆకాశం దించాల |
భక్త కన్నప్ప |
రామకృష్ణగారు |
|
4 |
గోరింట పూసింది |
గోరింటాకు |
సుశీలగారు |
ఇవండీ శుభప్రదమైన, మంగళకరమైన ఘనరాగం శ్రీరాగం విశేషాలు. ఈ నెలతో ఘనరాగ పంచ గుచ్చములోని ఐదు రాగాలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల మరొక అందమైన రాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.
*****

నా పేరు వాణీ నల్లాన్ చక్రవర్తి. నేను 2015 లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేశాను. నా వృత్తి బ్యాంకు ఉద్యోగమైనా, నా ప్రవృత్తి సంగీతం, సాహిత్యం. ఆ రెండు నా రెండు కళ్లలా భావిస్తాను. సంగీతం పట్ల నాకు ఉన్న అభిరుచి వలన నేను నేర్చిన సంగీతాన్ని అభిరుచి కలిగిన దేశ విదేశాలలో ఉన్న విద్యార్ధినీవిద్యార్థులకు నేర్పిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నాను. రేడియో, టీవీ లలో కళాకారిణిగా అనేక సంగీత సాహిత్య కార్యక్రమాలలో పాలు పంచుకున్నాను. వ్యాఖ్యాత్రిగా కూడా అనేక కార్యక్రమాలలో పాలు పంచుకోవటం నాకిష్టమైన హాబీ. సంగీత సాహిత్యాలపై ఉన్న అనురక్తితో 2021 లో “Vani nallan chakravarthi” పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలెట్టి 10 వీడియోలు 16 ఆడియో కథలు పంచుకున్నాను.

శ్రీరాగ విశేష వివరణ సొంపుగా ఉన్నది.
శ్రీరాగం అనేకసార్లు కేవలం వినికిడి జ్ఞ్ఞానం గల నావంటివారికి అప్పుడప్పుడు మధ్యమావతి లాగ అనిపిస్తుంది. గాత్రంలో వచ్చే స్వరాలలో ‘గ ‘ వినబడితే అది శ్రీరాగం అని తెలిసేది.
ఇప్పటిదాకా ‘ఆకాశం దించాలా…’ అన్న పాట మధ్యమావతి రాగంలో ఉందనుకునేవాడిని. మీరు చెప్పిన తరువాత తేడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు అండి మూర్తి గారు 🙏🙏
ఈ నెల 2,3 తప్పులు దొర్లినందుకు క్షన్తవ్యురాలిని 🙏🙏