
కాదేదీ కథకనర్హం-17
పురోగమనానికి పునాదిరాళ్ళు
-డి.కామేశ్వరి
“సారీ సునీతా, ఐయామ్ వెరీ సారీ . ఐయామ్ హెల్ప్ లెస్ …….కమిటీ మెంబర్లంతా తేల్చాక నేను ప్రతిసారీ కలుగజేసుకోడం బాగుండదు గదా….” ప్రిన్సి పాల్ జయలక్ష్మీ తేల్చి చెప్పేసింది. సునీత నిట్టూర్చి కుర్చీలోంచి లేచి నిలబడింది. నిజమే, ఎవరు ఎన్నాళ్ళు సహాయం చేస్తారు. ఆరేళ్ళ బట్టి ఎలాగో ట్రాన్స్ ఫర్ లేకుండా ప్రతిసారీ ఎవరినో పట్టుకుని బతిమిలాడి అపు చేయించుకుంటోంది. ‘సునీతా ప్రతీవాళ్ళకి ఏదో యిబ్బందులుంటాయి ఉద్యోగం అన్నాక. వున్న వూర్లోనే వుండాలంటే ఎలా కుదురుతుం ది. యిల్లు, మొగుడు, పిల్లలు , చదువులు యీ బాదరబందీలు మనందరికీ వున్నవే.” ఆవిడ ఉపన్యాసం వినే ఓపిక లేదు సునీతకి. “థాంక్స్ మేడమ్ . మీరేం చేస్తారులెండి. ఇదివరకు మీచేతులో వున్నది చేశారు” శుష్కహాసం చేసి కదిలింది సునీత. “రేపు ఫేర్ వెల్ పార్టీ అరేంజ్ చేసినట్లున్నారు. వుయ్ విల్ మీట్ దేర్.’ సునీత వాడిన మొహం చూసి ఓదారుస్తూన్నట్లంది. నీర్సంగా, దిగులుగా స్టాఫ్ రూమ్ లోకి అడుగు పెట్టిన సునీతని చూసి “ఏం అంటుంది ప్రిన్సి పాల్ —-ఆత్రుతగా అడిగింది ఎకనామిక్స్ లెక్చరర్ మాధవి. “ప్చ్…..లాభం లేదండి….ఆవిడ మాత్రం ఏం చేస్తుంది.” భూభారం మోస్తూన్నం త బరువుగా కుర్చీలో కూలబడింది సునీత. ‘అయితే ఏం చేస్తావు…..మీ ఆయననిక్క డ , నీవిక్కడ , మీ ఆయనేం అంటారు. రిజైనిస్తే వూరుకుంటారా……” తోటి లెక్చరర్లందరిలోకి మాధవి క్లోజ్ గా వుంటుంది సునీతతో. “ఏమో నాకంత అయోమయంగా వుంది మాధవీ. ఆలోచిస్తే మతిపోతుంది. చూస్తూ చూస్తూ వెయ్యి రూపాయలుద్యోగం మానలేను. నేనో చోట…..ఆయనో చోట, రెండు కాపురాలు” దిగులుగా అం ది.
“మీకేమిటండి సునీతగారూ…..యింజనీరు మొగుడుండగా హాయిగా యింట్లో తిని కూర్చోక యీ పాట్లెందుకండి” పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఉమా అంది. “నాలాంటి వాళ్ళంటే రోజు గడవక చేస్తాం …..నేనే మీ పొజీషన్ లో వుంటే హాయిగా యింట్లో పుస్తకాలు చదువుకుంటూ, పాటలు వింటూ ఎంజాయ్ చేసేదాన్ని .” అంది నవ్వుతూ. సునీత ఓ నవ్వు నవ్వింది. హాయిగా తింటూ చదువుకుంటూ ఆ సుఖమూ చూసింది. ఉద్యో గంలో బాధలూ చవిచూసింది. తను ఉద్యోగం ఎందుకు చేయాలను కుంటుందో ఎవరికి తెలుసు. ఎలా చెపితే అర్ధం అవుతుంది. ఇంజనీరు మొగుడు అని అందరికీ తెలుసు. కానీ యింట్లో పరిస్థితి ఎవరికి చెప్పుకుంటుంది. తనకి లేదా యింటి పట్టున వుండి యిల్లు, పిల్లలని చూసుకుంటూ వుండాలని . ఉదయం లేచింది మొదలు పరుగులు, రోజంతా నిలబడి పాఠం చెప్పడం , మళ్ళీ యింటికి వెళ్ళి చాకిరీ …..పిల్లలు , రోగాలు, ఏడ్పులు యీ బాధలన్నీ పడుతూ కూడా ఉద్యో గం ఎందుకు చేస్తుందోనని ఎవరూ ఎందుకు ఆలోచించరు. పెళ్ళి కానన్నాళ్ళు ఉద్యోగం చేసినా పెళ్ళవగానే తనూ హాయిగా యింటి పట్టున వుండి యిల్లు పిల్లలని చూసుకుంటూ వుండాలని ఆనందపడింది. కానీ పెళ్ళయాక….. సునీత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాక ఉద్యోగాల వేటలలో పడి ఒక ఏడాది ఖాళీగా వుంది. కనిపించిన పెళ్ళి కొడుకులందరినీ పెళ్ళి చూపులకి పిలిచాడు. ఏడాది దాటాక ఉద్యోగం వచ్చింది , కాని పెళ్ళికొడుకు కుదరలేదు. పెళ్ళి కుదరనందుకు సునీతేం బాధపడలేదు. ఒక విధంగా . ఉద్యోగం చెయ్యాలన్న తన కోరిక యిలా తీరబోతున్నందుకు ఆనందపడింది. యిన్నాళ్ళూ యింట్లో ఎప్పుడు ఏది అడిగినా యిది లేదు అది లేదు అన్న జవాబుతోనే గడిచిపోయింది. నచ్చిన చీర కొనుక్కోవాలన్నా ఓ సినిమాకి వెళ్ళాలన్నా , ఓ పుస్తకం కొనాలన్నా ఓ చెప్పుల జత కొనుక్కొవాలనిపించినా, ఒ హాండ్ బ్యాగు ముచ్చటగా కొనాలన్నా అన్నింటికి అవాంతరాలే – కోరికలు కోరికల్లాగే మిగిలిపోకుండా తన సంపాదనతో కొన్నాళ్ళన్నా ఎంజాయ్ చేయాలి. పెళ్ళయితే మళ్ళీ యిదే కధ అక్కడా అవుతుంది. యిల్లు, మొగుడు, పిల్లల మధ్య తన కోరికలెం తీరుతాయి. తండ్రి మరీ గుమస్తా కాకపోయినా ముగ్గు రాడపిల్లలు ఇద్దరు మగపిల్లలతో , కరువురోజుల్లో తిండికి లోటు లేకుండా బతికారు. కాని కావాలనుకున్నది ఏవి దొరికాయి? ఓ షిఫాను చీర మనసు తీరిందా…… మంచి అర్గండి చీర, స్నేహితురాళ్ళ చీరలు చూసి మనసు పడి అడిగిన కోరికలు ఏం తీర్చారు ఇంట్లో. చదువులు చెప్పించారు, అంతే చాలన్నట్టు తృప్తి పడాలి మరి…..ఐదుగురు పిల్లలకి అంతకంటే ఓ మధ్య తరగతి తండ్రి ఏం చేస్తాడు. అందుకే పెళ్లవక ముందు తనకోసం తను సంపాదించుకుని ఎంజాయ్ చెయ్యాలి. సునీత కోరిక అది. “ఇరవై రెండేళ్ళు వచ్చాయి. ఇన్నాళ్ళు చదువన్నా వు — యిప్పుడింక ఉద్యోగమా . ఏదో అప్పోసప్పో చేసి నిన్ను దాటిస్తే యింక ఆఖరివాడు మేము ఏదో మా పాట్లు మేం పడతాం ” అని తల్లి సణిగినా సునీత లెక్క చెయ్యలేదు. కూతురు పెళ్ళికి కట్నం అటుంచి పెళ్ళి కర్చులన్నా పదివేలు సమకూర్చలేని తండ్రి కొన్నాళ్ళు ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు వెనకేస్తే దాని పెళ్ళి దాని డబ్బుతోనన్నా చేయచ్చు ననుకున్న తండ్రి మౌనం వహించాడు. సునీత ఉద్యోగం చెయ్యాలన్న ఆరాటంలో ఎవరి ఉద్దేశాలు గ్రహించే ధోరణిలో లేదు. ఏడాది తరువాత కొత్తగా పెట్టిన ఉమెన్స్ కాలేజీలో ఉద్యోగం సంపాదించుకుంది. ఒ మూడు నెలలు నిజంగానే ఎంజాయ్ చేసింది. సునీత – మొదటి నెల జీతంలో షిఫాన్ చీర కొనుక్కుం ది. ఎప్పటినుంచో చదవాలనుకున్న పుస్తకాలు కొంది. మంచి చెప్పుల జత, లెక్చరరు హోదాకి సరిపోయే హాండు బ్యాగు వగైరాలు, అరడజను జాకట్లు కుట్టించుకుంది. తన మొదటి జీతంలో ఇంట్లో అందరికీ స్వీట్లు కొని తెచ్చింది. ఇంటిల్లి పాదిని వెంట బెట్టుకుని సినిమాకి తీసికెళ్ళి అట్నించి హోటలులో మంచి భోజనం పెట్టించింది. డబ్బు….డబ్బుకున్న విలువ సునీతకు ఆ నెలలోనే అర్ధం అయింది. ఓ ఏడాది రెండేళ్ళు ఉద్యోగం చేసి కాస్త డబ్బు దాచుకుని యింటికి కావలసిన ఫర్నీచర్ సామాన్లు కొనుక్కోవాలి. తండ్రి ఎలాగూ యివ్వ లేదు. తన సంపాదనలోనన్నా నాలుగూ అమర్చుకోవాలి. సునీత ఆలోచన ఆచరణలో పెట్టడం రెం డేళ్ళయినా సాధ్యం మాత్రం కాలేదు. మొదటి రెండు మూడు నెలలు తన చీరల సరదా, యింట్లో వాళ్ళకి బట్టలు కొనడంతో అయిపొయింది. సరదాలు, మోజులు తీరాయనిపిం చే సరికి చేతిలో డబ్బులు ఏమయిపోతున్నాయో తెలీకుండానే అయిపోయేవి. “ఎందుకే అలా డబ్బు తగలేస్తావు – కాస్త వెనకేసుకుంటే పెళ్ళి ఖర్చుకుంటుందే అనే తల్లే “ఒసే – బజారంట వస్తావు, వచ్చేటప్పుడు కాస్త కూరలు కొని తేవే” తో ఆరంభించి, రెండు మూడు నెలలు గడిచేసరికి నెలవారీ సామాన్లు సహితం కొనడం సునీత వంతయిపోయిం ది. “పాలవాడోచ్చి కూర్చున్నాడే ,మీ నాన్నగారికి డబ్బు జతకూడలేదుటే . కాస్త యియ్యి నాన్న తరువాత నీకిస్తారు.” ఆ తరువాత యివ్వడం అనేది వుండదని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. తన బస్సు చార్జీలు, మధ్యాహ్నం కాలేజీలో తాగే టీ ఖర్చు, నెలకో రెండు మూడు సినిమాలు, చిల్లర ఖర్చులు అంతా కలిసి నూరు రూపాయలు దాటదు. మిగతా ఆరొందలు ఎలా అయిపోతున్నాయో కూడా తెలియకుండా అయిపోయేవి. ‘అక్కా , ప్లీజ్ సినిమాకెడతానే పది రూపాయలీయవే ” – అని అడిగే తమ్ముడిని కాదనలేదు. వీధిలోకి “ఆపిల్స్ , అరటి పళ్ళోచ్చాయి కొనవే” అని గడుసుగా అడిగే తల్లి మొదట్లో డైరక్ట్ గా అడగడానికి మొహమాట పడి తల్లి చేత అడిగించే తండ్రి ఆర్నెల్లు గడిచేసరికి కూతురి ముందు చేయి చాపడానికి తండ్రికేం సిగ్గనిపించలేదు.
‘అమ్మా సునీతా ఎలట్రీసిటీ బిల్లు వచ్చిందమ్మా – ఆ పచారి దుకాణంలో డబ్బిచ్చేరా” అని ఇంటి బాధ్యత అంతా ఆమె మీదే నెమ్మదిగా పెట్టేసి తప్పించుకోడం మొదలు పెట్టాడు. ఓ ఆరేడు నెలలు సునీత కేంబాధ అనిపించలేదు. ఓ ఆడపిల్ల ఆయీ తను తండ్రికి ఎలా ఆసరాగా నిల్చుందోనని గర్వపడింది. “ఎవరికి పెడ్తున్నాను. నావాళ్ళే గా’ అని తృప్తిపడింది…..”అన్నయ్యలు ఎప్పుడన్నా ఓ నూరు రూపాయలన్నా పం పలేదు. మన సునీత చూడు అవసరానికి ఎలా ఆదుకుంటుదో – ఈ రోజుల్లో ఆడపిల్లలే నయమే” అనే తండ్రిని చూసి, పాపం యిన్నాళ్ళకి ఆయనకి కాస్త ఊపిరి పీల్చుకున్న ట్టుంది. ఎప్పుడూ ప్రతిదానికి వెతుక్కోవడమే యిన్నాళ్ళు ” అని జాలిపడింది.
ఒక ఏడాది గడిచి , ఉద్యోగం మోజు తీరాక యింట్లో తల్లి తండ్రి కాబులీ వాళ్ళలా కన్పించడం మొదలుపెట్టారు సునీతకి. యింట్లో ఆదుకుంటున్నాను అన్న గర్వం పోయి ఛీ……ఎంత సిగ్గు లేకుండా ఓ ఆడపిల్ల కష్టపడి డబ్బు తెస్తుంటే పీడించి తీసుకుం టున్నారు అని తల్లి తండ్రి మీద విముఖత బయలుదేరింది. ఉద్యోగానికి ముందు పెళ్ళి పెళ్ళి అని గోల పెట్టిన తల్లి కూతురికి పెళ్ళి కావాలన్న సంగతే మర్చిపోయినట్టు ఆ ప్రసక్తి ఎత్తక పోవడం చూస్తుంటే ఉక్రోషం వచ్చేది సునీతకి. అక్కలందరికి పురుళ్ళు పుణ్యాలు బారసారలు, ఏదో తను అప్పున్నట్టు తన డబ్బుతో ఖర్చు పెడ్తుంటే …..పెళ్ళి కాని కూతురుందన్న సంగతి మరిచి నా డబ్బుతో వాళ్లకి పురుళ్ళు పోస్తారు. ఛీ…..’ అనుకుంది. నిష్కర్షగా “నా డబ్బు యీయను” అని చెప్ప లేకపోయింది సునీత —— పాతికేళ్ళు వస్తున్నా పెళ్ళి కాకుండా వుండడం , తనతోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళ యి పిల్లలు పుట్టడం ….ఉద్యోగం చేసి నాలుగు సామాన్లు కొనుక్కోవాలన్న ముచ్చట కలగానే మిగిలిపోవడం ……. యిదంతా సునీతని ఓ రకం విరక్తిలో పడేశాయి. నేరకపోయి ఉద్యో గంలో చేరాను. లేకపోతే ఎలాగో అలా ఈపాటికి పెళ్ళి చేసేవారు. ఉద్యోగం చేసినందుకు తనకేం లాభం మిగిలింది. వీళ్ళందరికీ దోచి పెడ్తున్నాను. ఒక్కో నెల గడుస్తుంటే సునీత కి ఇల్లంటే నరకం , తల్లి తండ్రి అంటే బద్ద శత్రువుల్లా కనపడడం మొదలుపెట్టారు. కూతురు చిరాకులు పరాకులు, విసుర్లు, కసుర్లు ఈసడింపులు , ముభావం …ఏదీ తెలియనట్టే పట్టించుకోని తల్లిదండ్రులను చూసి ఏమి చెయ్యాలో, ఎలా చెప్పాలో తెలియక మరింత మూడీగా తయారయింది సునీత. ఆ సమయంలో సునీత మొర దేవుడాలకించినట్టు కాలేజీలో కొలీగ్ పెళ్ళికి విజయవాడ వెళ్ళింది. అ పెళ్ళిలో ఫ్రెండు కజిన్ బ్రదర్ ప్రభాకర్ సునీత పట్ల ఆకర్షితుడయ్యాడు. సునీత వివరాలు ఆరాతీసాడు. సునీత స్నేహితురాలు యిద్దరి మధ్య మధ్యవర్తి అయి పెళ్ళి మాటలు జరిపింది.
ప్రభాకర్ ఏదో కంపెనీలో యింజినీరుగా వున్నా డు. పదివేలు వందల జీతం . స్మార్ట్ గా వున్నాడు. సునీత చదువు ఉద్యోగం విని యింకా ఆకర్షితుడయ్యాడు ప్రభాకరం . యిద్దరూ మాట్లాడుకోడానికి వీలుగా ఏకాంతం కల్పించింది స్నేహితురాలు. తండ్రికి కట్న కానుకలు యిచ్చే శక్తి లేదంది సునీత. “ఫరవాలేదు మీరే నా కట్నం ” అన్నాడు ప్రభాకర్. సునీత తన కల యిన్నాళ్ళకి నిజం అయినందుకు ఆనంద పడిపోయిం ది. ప్రభాకర్ ఆమె కంటికి దేవుడిలా కన్పించాడు. తండ్రి లేడు తల్లి వుందని, ఓ పెళ్ళీడొచ్చిన చేల్లెలుందని ఇద్దరూ అన్నగారి దగ్గరుంటూన్నారని తన కుటుంబం విషయమంతా చెప్పాడు. అన్నింటికీ ఆనందంగా తలాడించింది సునీత. ఆ క్షణంలో తానెంతో అదృ ష్టవంతురాలు. ఆలశ్యం అయినా ప్రభాకర్ లాంటివాడు దొరికాడు అని మురిసిపోయింది . “ముందు మీరు వెళ్ళి మీ వాళ్ళకి చెప్పండి. లాంచనంగా మీ ఫాదర్ ని మీ అన్నయ్యని, అమ్మని పంపి కలిసి చెప్పమనండి. వాళ్ళు నా ఇష్టానికే వదిలేశారు నా పెళ్ళి . నా వైపు నుంచి నాకేం ప్రాబ్లమ్స్ లేవు” అన్నా డు ప్రభాకర్. తనవైపు నుంచి మాత్రం ఏముం టాయి. కట్నం లేకుండా ఇంజినీరు పెళ్ళికొడుకు వస్తుంటే యిష్టపడడానికి తనకేం వెర్రా తనవాళ్ళడ్డు పెట్టడానికి వాల్లకేం పిచ్చా అనుకుంది సునీత. అతనన్న మాటలకి తలాడించింది. ఆమెకి ఆ క్షణంలో ఏదో మైకంలో మాదిరి అన్నీ జరుగుతున్నట్టు బాహ్యస్మృతి పోయినట్టు అనిపించింది. పెళ్ళి నుంచి ఉరుకులు పరుగుల మీద వెళ్ళి నట్టే యిల్లు చేరింది. తీరా చేరాక తన పెళ్ళి కబురు తనే చెప్పుకోవాలంటే ఏదోలా అనిపించింది. నసుగుతూ అంతా వివరించింది తల్లికి సునీత. ఆవిడ ఆశ్చర్యంతో తెల్లపోతూ ‘అతను యింజనీరూ కట్నం లేకుండా చేసుకుంటానన్నడా అతనే అడిగిం చాడా చెల్లెలి చేత నిన్ను ” నమ్మశక్యం కానట్టు అడిగిందావిడ. “ఇంజనీరంటున్నావు కట్నం వద్దంటున్నాడంటావు. యిందులో ఏం మోసం లేదుగదా’ తండ్రి భోజనం చేసి సావకాశంగా వక్క పొడి నములుతూ మొహం అప్రసన్నంగా పెట్టాడు. సునీతకి చర్రున కోపం వచ్చింది. యిన్నాళ్ళకి తనంతట తను పెళ్ళి కొడుకుని కుదుర్చుకుని వస్తే యిలా మాట్లాడుతారేమిటి మొహాల్లో ఎక్క డా సంతోషం లేకపోగా వెధవ అనుమానాలు- ఛా…..ఇలాంటి తల్లితండ్రులుంటారా ఎవరికన్నా . ‘అమ్మా అతను నాకు నచ్చాడు. అతనికి నేను నచ్చాను- యిద్దరం పెళ్ళి చేసుకొదలిచాం . యీ విషయంలో యింకా వాదనలు అనవసరం . మీరు పెద్దవాళ్ళుగా నిలబడి పెళ్ళి జరిపిస్తే సరే, లేదంటే మేమే రిజిష్టర్ మ్యా రేజ్ చేసుకుంటాం . నిష్కర్షగా చెప్పింది సునీత. బిడియపడి సిగ్గుపడి చేతులారా ప్రభాకర్ లాంటివాడిని వదులుకుంటే తనకింక జన్మలో పెళ్ళి కాదు. తన బతుకు బాట ఎవరూ వేసేందుకు సిద్దంగా లేనప్పు డు తనే వేసుకోవాలి. తల్లి తండ్రి మొహమొహాలు చూసుకున్నారు. ఇద్దరి మొహాలు ముడుచుకున్నాయి. “సరే కట్నం లేకుండా చేసుకుంటానన్నప్పుడు బాగానే వుంది. అయినా పెళ్ళికి దానికీ కనీసం ఓ పది పదిహేను వేలన్నా కావద్దూ” తండ్రి నసుగుతూ సాగదీశాడు. ‘అది కూడా అతన్నే పెట్టుకోమందామా నాన్నా ” వ్యంగ్యంగా అంది సునీత. తిరస్కారంగా చూస్తూ. “కూతురికి ఓ పదివేలు ఖర్చు పెట్టె స్తోమత మాకు లేదని తేల్చారుగా నా పాట్లేవో నేను పడి పెళ్ళి చేసుకుంటాను మీరేం బాధపడకండి” విసురుగా అని లేచి వెళ్ళి పోయింది సునీత. ఎం త స్వార్ధం , సంపాదించే కూతురు పెళ్ళి అయితే మరి డబ్బు వుండదని యింతలా కన్న తల్లితండ్రులే ప్రవర్తిస్తారా…
“ఎక్కడో నాలుగైదు వేలన్నా పట్రండి లేకపోతే అది ఏమన్నా అనుకుంటుంది. పెళ్ళి ఖర్చు దాన్ని పెట్టుకోమని ఎలా అంటాం . ఏదో మీరే తంటాలు పడండి. లేకపోతే ఒక పిక్సిడ్ డిపాజిట్ తీయండి” తల్లి నెమ్మదిగా అంటోంది. “ఆ తీస్తా…..అది కాస్త ఖర్చుపెట్టి సునీత కాస్తా వెళ్ళిపోతే యిల్లెలా గడుస్తుందే” కోపంగా అన్నాడు తండ్రి. “బాగుందండీ, అయితే కూతురు పెళ్ళి చేయడం ఊరికి ఉపకారం ఏమిటి….. అయినా ఏదో అది నాలుగు రాళ్ళు వెనకేసుకుంటుంది అనుకున్నాం గాని యిలా హటాత్తుగా పెళ్ళి కుదురుతుందనుకున్నామా…..” వింటున్న సునీత మనసు వుడికిపోయింది. ఛీ యీ డబ్బు ఎంత పాపిష్టిది కన్న తల్లిదండ్రులు కూడా యింత స్వార్ధంగా ఆలోచింపచేసే యీ వెధవ డబ్బు . అసలు తను ఉద్యోగంలో చేరడం మొదటి పొరపాటు. పెళ్ళవగానే రిజైన్ యిచ్చి పారేసి హాయిగా యింటి పట్టున వుంటుంది. ప్రభాకర్ లాంటి మొగుడుండగా యిం కా యీ ఉద్యోగం ఎందుకు” సునీత నిశ్చయించేసుకుంది.
సునీత ఆలోచనలు, అంచనాలు అన్నీ మొదటిరాత్రే తారుమారు అయిపోయాయి. మొదటి రాత్రి మధురక్షణాల మధ్య సునీత ముంగురులు సవరిస్తూ “నువ్వు హైదరాబాదు ట్రాన్స్ ఫర్ కి ప్రయత్నిస్తున్నావా? ఎలాగైనా ప్రిన్సి పాల్ ని బతిమిలాడి ట్రాన్స్ ఫర్ అయ్యేట్టు చూడు. నీవొకచోట నేనొకచోట అయితే కష్టం ‘ అన్నాడు. సునీత అతని గుండెల్లో మొహం దాచుకుని “ట్రాన్స్ ఫర్ ఎందుకు, వెధవ ఉద్యోగం రిజైన్ చేస్తాను. నాకింకేం ఉద్యోగం చెయ్యాలని లేదు హాయిగా యింటి పట్టున వుండి మీ డ్యూటీ చేస్తాను.” అంది మురిపెంగా ముద్దులు గునుస్తూ. ప్రభాకర్ చకితుడైనట్టు చూశాడు. అప్రయత్నంగా అతని చెయ్యి సునీతని వదిలేసింది. “ఏమిటి ఉద్యోగం రిజైన్ చేస్తావా, మతిపోయిందేమిటి . ఓ ఎనిమిది వందలోచ్చే ఉద్యోగం వదులుకుంటావా , అలాంటి తెలివి తక్కువ పనులు చేయకు. కావాలంటే ట్రాన్స్ ఫర్ అయెంతవరకు ఓ నెలో రెండు నెలలో సెలవు పెట్టు.” ఆరాటంగా సలహా ఇచ్చాడు. “అబ్బ వద్దండి. నాకింక ఉద్యోగం చెయ్యాలని లేదు. ఉద్యోగం అంటే బోరు కొట్టేసింది. మీరుండగా నాకీ పాట్లేందుకు. పదహారు వందలతో ఇద్దరం హాయిగా వుండొచ్చు…” ప్రభాకర్ మొహం ముడుచుకుంది. “పదహారు వందలు….హైదరాబాదులో పదహారు వందలు నధిం గ్ నీవేదో ఉద్యోగం చేస్తావని ఏ ఎనిమిది వందలు వస్తాయని సంతోషిస్తుంటే ఉద్యోగం మానేస్తానం టావేమిటి…..నీవేదో ఉద్యోగం చేస్తున్న దానివని ఆశపడి!” –ప్రభాకర్ ఆగిపోయాడు సునీత మొహంలో రంగులు మారడం చూసి. ‘అం టే నా ఉద్యోగం చూసి ఆశపడి చేసుకున్నారా….అంటే కేవలం నా ఉద్యోగం కోసం నన్ను చేసుకున్నారన్న మాట ,…..” దెబ్బతిన్నట్టంది సునీత.
“సునీతా, బి ప్రాక్టికల్ . ఈ కరువురోజుల్లో ఒకరి సంపాదనతో బతకడం ఎంతో కష్టం . ఏదో తిండి కంటే గడిచి పోతుంది. యింట్లో ఏ వస్తువు అమర్చుకోవాలన్నా ఎన్నే ళ్ళు పడుతుందో తెలుసా? అలాంటప్పుడు భార్య ఉద్యోగం చేయ్యాలనుకోడం తప్పా ….నీ ఉద్యోగం చూసేగా పాతికవేలు కట్నం ఇస్తామని వచ్చినా వదులుకుని…..’ సునీత మొహం మాడిపోవడం చూసి, నోరు జారానని నాలిక కరచుకున్నా డు ప్రభాకర్. “గుడ్, వెరీ గుడ్ ఐడియా. నెలకి వెయ్యి రూపాయల చెప్పున యింకో పాతికేళ్ళకి ఎంతవుతుందో లెక్క కట్టుకుంటే అప్ట్రాల్ వెధవ పాతికవేలు ఎంత అని కట్నం లేకుండా చేసుకుని నన్నుద్దరించారన్నమాట.” సునీత ఎంత ప్రయత్నించినా ఆమె గొంతులో వ్యంగ్యం , హేళన దాగలేదు. ప్రభాకర్ మొహం ముడుచుకున్నా డు. మొదటి రాత్రి కావాలని కోరి పెళ్ళి చేసుకున్న భార్య భర్తల మధ్య మాటలు యివా? ప్రభాకర్ ని ఎంత ఉన్నంతగా ఊహించుకుంది. ఓ ఆదర్శ పురుషుడని మురిసిపోయింది . డబ్బు ….డబ్బు ….అటు తల్లితండ్రులకి, యిటు మొగుడికి అందరికీ కావాల్సింది డబ్బే! ఆడదంటే యిదివరకు వంటింటి మిషను, పిల్లల్ని కనే మిషనుగానూ భావించేవారు. యిప్పుడు వాటికి తోడు డబ్బు సంపాదించే యంత్రంగా మారిందన్న మాట! ఉద్యోగం చేసే ఆడదంటే మిషనులాగా యింట్లో చాకిరి అటు బయట చాకిరి మధ్య నలిగి యంత్రంగానే మారింది. సంపాదిస్తున్న తనకోసం తను ఏం ఎంజాయ్ చేస్తోంది. పెళ్ళి కాకముందు తల్లిదం డ్రులు, పెళ్ళయ్యాక మొగుడు యింకా ఆ తరువాత పిల్లలు. ప్రభాకర్ మొదటి రోజే యిలా మాట్లాడడం ఆమెకి ఎదురు చూడని దెబ్బ! ఆమె కలల సౌధం పునాదులతో సహా కదిలి పోయినట్లయింది. ప్రభాకర్ పోనీ తరువాత అని వుంటే — సునీ నిన్ను వదిలి వుండలేను యిక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకో అంటే పోనిద్దూ వెధవ ఉద్యోగం ఓ రెండు మూడు నెలలన్నా మనం ఎంజాయ్ చెయ్యాలి లీవు పడేయి” అంటే ఎంత బాగుండేది. ‘సునీతా నేను ఫ్రాంక్ గా మాట్లాడాను కాని నిజం అంత. మన మధ్యతరగతి సంసారాల్లో యిద్దరూ జాబ్ చేస్తే గాని రోజులు గడిచే స్థితి లేదు.” ప్రభాకర్ సానునయంగా ఏదో చెప్పబోయాడు. “ప్లీజ్ స్టాపిట్ నాకర్ధం అయింది. ఉద్యోగం మానను సరేనా మీకు కావాల్సింది అదేగా. ఉద్యోగం చేస్తాను సరేనా’ అంది. యింకా ప్రభాకర్ నోట ఏం వినడం యిష్టం లేక అప్పటికి ఆ ప్రసంగం ఆపేసింది సునీత.
***
తరువాత ఆరునెలల్లో ప్రభాకర్ గురించిన ఆమె అంచనాలన్నీ మరింత తల్లకిం దులయిపోయాయి. ఒక నెల ఎరన్ డ్ లీవు పెట్టి ప్రభాకర్ తో కల్సి హైదరాబాదు కాపురానికి వెళ్ళింది సునీత. అక్కడున్న నెల రోజులలో కొత్త భార్యతో సినిమాలు, షికార్లు తిరగాలన్న మోజు కంటే సునీత ఉద్యోగం కోసం ఆరాటం ఎక్కువయింది.
హైదరాబాదులో రెండు మూడు కాలేజీలకి అప్లీకేషన్లు పెట్టించాడు. ఇంకో కాలేజీలో ఎవరో తెల్సిన ఫ్రెండుంటే అతనితో సునీతని తీసికెళ్ళి ప్రిన్సిపాల్ కి చెప్పించాడు. నెల శలవు అయిపోయే వేళకి శలవు పొడిగించు అంటాడేమోనని ఆశించింది సునీత. సునీత శలవు యింకో నాలుగు రోజులుండగానే వెళ్ళి సునీతకి టిక్కెట్టు కొని తెచ్చేశాడు. సునీతకి యింకేం అనాలనిపించలేదు . రైలెక్కింది. ట్రాన్స ఫర్ కోసం అప్లికేషన్ ఫలించలేదు. “టరమ్ మధ్య లో ఎలా సమ్మ ర్ వెకేషన్ లో చూద్దాం ” అంది ప్రిన్సిపాల్ . అంటే ఆరునెలలు. ప్రభాకర్ శని ఆదివారాలల్లో వచ్చేవాడు భార్య అవసరం కోసం . “ఎందుకం డి ఈ పాట్లు మీరక్కడ, నేనిక్కడ. రిజైన్ యిచ్చి వచ్చేస్తాను. అంతగా కావాలనుకుంటే అక్కడే ఏదో చూసుకోవచ్చు” అంది. పెళ్ళయినా యింకా తల్లి తండ్రి దగ్గరే వుండాలంటే బిడియంగా వుంది సునీతకి. అంతేకాక పెళ్ళయిం దగ్గర నించి సునీత జీతం వచ్చే వేళకల్లా ప్రభాకర్ ఏదో ఖర్చు రెడీచేసి వుంచేవాడు. “సునీతా మా ఫ్రెండు మంచి సోఫా సెట్టు అమ్మేస్తుంటే ఆరువందలకి కొన్నాను. యీ నెల గ్రైండర్ కొనాలి. సునీతా ముందు రెండు మంచాలు పరుపులన్నా వద్దా నీకోసమేగా యిదంతా నీవు సుఖంగా వుండాలనేగా నా తాపత్రయం ” అంటూ ఇది కొంటా అది కొంటున్నా అని సునీత జీతం మొహమాటం అన్నా లేకుండా అడిగి తీసుకునేవాడు. పెళ్ళయిం దగ్గిర నుంచి యింట్లో డబ్బు యీయడం మానేసిందని తల్లిదండ్రులు మొహాలు ముడుచుకున్నారు. మూడు నాలుగు నెలలు గడించిం దగ్గర నించి ఏదో వంకతో సణగడం , సాధించడం ఆరంభించారు. తన తిండి ఖర్చన్నా యివ్వకుండా అలా వుండాలంటే సునీతకి ఎంతో బిడియంగా వుంది. ఆ యింట పుట్టి పెరిగినా పెళ్ళి కాగానే తనను పరాయిదాన్ని చేసి వూరికే యింట్లో పడి తిం టున్నట్టు తల్లి తండ్రి దెప్పుడు మాటలు, వాళ్ళ చూపులు భరించలేక సునీత ప్రాణం విసిగింది. దానికి తోడు సునీత నెల తప్పింది. మూడో నెల ఒకటే నీరసం . వాంతులు ఆ సమ్మ రైనా కూడా ట్రాన్స ఫర్ ఆయె సూచనలు కనపడకపోగానే విరక్తిగా ప్రభాకర్ ఏం అన్నాసరే యింక యిక్కడుండను అనుకుని రిజైన్ యిచ్చేసి హైదరాబాదు రైలేక్కే సిం ది. ఉద్యోగం మానేసి వచ్చిన సునీతని చూసిన ప్రభాకర్ మొహంలో మార్పు చూస్తుంటే తిరస్కారం , విరక్తితో సునీత విరిగింది. “నీకెంత ధైర్యం , ఉద్యోగాలు దొరక్క జనం ఏడుస్తుంటే ఎనిమిదొందల ఉద్యోగం వదిలి వచ్చేస్తావా నాతోటి చెప్పనన్నా చెప్పకుం డా మానేస్తావా? “ప్రభాకర్ ఎగిరిపడ్డాడు. అసలే నీర్సంగా వున్న సునీతకి చిర్రెత్తుకు వచ్చింది. “ఏమిటి మీ ఉద్దేశం . మీకు పెళ్ళాంకంటే నా ఉద్యోగమే ముఖ్యంలా వుంది. నేనుద్యోగం చెయ్యకపోతే నాకు తిండి పెట్టరా. పెళ్ళానికి తిండి పెట్టడం కూడా కష్టంగా వుంటే యీ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు. నేనేం మేడలు, కారులు, కావాలని ,మిమ్మ ల్ని వేధించానా అంత గతి లేకుండా నా ఉద్యోగం మీదే బతుకుతున్నట్టు ఎందుకలా మాట్లాడుతారు. మీకు ఉద్యోగం డబ్బు తప్ప మీకసలు ఓ భార్యుందని , దానికో మనసుం దన్న ఆలోచనే రాదా” సునీత కంఠం రుద్దమయి కన్నీళ్ళు బొటబొట జారాయి. ప్రభాకర్ మొహం ఎర్రపరచుకుని అక్క డ నించి వెళ్ళి పోయాడు. తరువాత ఒక ఏడాది సునీత పాట్లు దేముడికెరుక. ఒక రెండు మూడు నెలలు ఇన్ డైరెక్ట్ గా విసుర్లు, విసిరేవాడు. తరువాత దేప్పుళ్ళు , సణుగుళ్ళు , విసుర్లు కసుర్లు, తిట్లు. మొదట్లో ఏదన్నా మాట వచ్చేసరికల్లా “మా కొలీగ్ పెళ్ళాం చక్కా బ్యాంకిలో ఉద్యోగం , ఉద్యోగంలో చేరి ఐదేళ్ళ యిందో లేదో అప్పుడే ప్లాట్ కొన్నారు. స్కూటరు కొనుక్కోవాలనుకున్నాను నీవు నాలుగేళ్ళ బట్టి ఉద్యోగం చేస్తున్నావు నీ దగ్గిర డబ్బుంటుంది కదా అని కొనాలనుకున్నా ను. అసలు ఆ డబ్బంతా ఏమయినట్లు. ఆ సినిమాకి వెళ్ళాలంటే యిద్దరికీ ముప్పై రూపాయలవుతుంది. ఎక్కడి కేడతాం యీ జీతంతో యీ కరువు రోజుల్లో. అవును నీకు కర్టెన్లు కావాలి బాంబే డైయింగ్ దుప్పట్లు కావాలి. డన్ లప్ లు కావాల్సినదానివి ఉద్యోగం మానకపోవాల్సింది. “మా ఫ్రెండున్నాడు వాడి భార్య కాలేజీలో లెక్చరరు , వీడి డబ్బుతో యిల్లు గడిపి ఆవిడ జీతంతో నెలకో వస్తువు చొప్పున కొంటున్నారు. కొందరి అదృష్టం అది. ,మా చెల్లెలు పెళ్ళి కుదిరిందట నన్ను మూడు వేలు సర్దమన్నారు . ఎక్కడ నించి తెచ్చి యిస్తాను. పోనీ యిద్దరి జీతం వుంటే ఏ అప్పో తెచ్చి యిచ్చేవాడిని. లేదంటే నమ్ముతారా మీ ఆవిడ ఉద్యోగం చేసిన డబ్బెం లేదూ అంటారు.” ఇలా సమయం వచ్చినప్పుడల్లా పరోక్షంగా విసుర్లు విసిరేవాడు. సునీత విననట్లు మాట్లాడేది కాదు. ఏదన్నా జవాబిస్తే వాదన పెరిగి చిలికి చిలికి గాలివాన అయ్యేది.
***
ఇంకో రెండు నెలలు గడిచేసరికి పాలకి, కూరకి, పప్పుల దగ్గర నించి కూడా యింటి ఖర్చుకి డబ్బడిగితే ‘నీవడిగినప్పు డల్లా డబ్బియ్య డానికి నేనేం వేలు సంపాదించడం లేద”నేవాడు. “లీటరు పాలు చాలకపోతే కాఫీ మానేద్దాం యింక కొనే శక్తి నాకు లేదు.” డబ్బు అడగనంత సేపు మాములుగా వుండేవాడు. ఏ ఖర్చు కన్నా డబ్బడిగేసరికి ముఖకవళికలూ మారిపోయేవి. పెద్ద వాదన, రాద్దాంతం చేస్తే అడిగిన దానిలో సగం యిచ్చేవాడు. ప్రభాకర్ ధోరణి చూస్తె ఖర్చుకి పదిరూపాయలు అడగాలన్నా ప్రాణసం కటంగా తయారైంది సునీతకి. ఇంటి ఖర్చుకి డబ్బీయకుండా కాల్చుకు తింటే తనేక్కడి నించి తెచ్చి సంసారం నడపాలి. నాలుగైదు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ చేతిలో డబ్బాడుతూ వుండే సునీతకి ఐదు పదికి కూడా ప్రతిసారి అతని ముందు చెయ్యి చాపడం చిన్న తనంగా వుండేది. ప్రభాకర్ ధోరణి చూసాక ప్రాణం విసుగెత్తి “ఛా యింతకంటే ఆ ఉద్యో గమే నయం ఆ డబ్బు తెచ్చి యీయన మొఖాన కొడితే అయినా శాం తి వుంటుం దేమో కొంపలో” ననిపించేది సునీతకి. కాని అప్పటికి ఎనిమిదో నెల — ఈ పురుడు అది అయ్యాక ఏదో ఉద్యోగం చూసుకోవాలి అనుకుంది. సునీత బాబు పుట్టాక కన్పించిన అప్లికేషన్స్ పడేసింది. పిల్లాడు పుట్టాక మరింత ఖర్చులు పెరిగి ప్రభాకర్ పిసినారితనం మరింత పెరిగింది. పాలడబ్బా కొనాలన్నా …..’ఆవుపాలు అలవాటు చెయ్యి ముందు నిం చి అలవాటయితే అవే పడతాయి ——డబ్బాలు కొనలేను. ఆ, పాలు కావాలి బాబుకి, ఆ, నాకూ స్కూ టర్ కావాలి. సరదాలు నీకే కాదు, నాకూ వున్నాయి . అంత సరదాలుంటే ఉద్యోగం చేసి నీ పిల్లాడికి డ్రస్సు లే కొంటావో, బొమ్మ లే కొంటావో కొని సరదాలు తీర్చుకో! నా సరదాలు నీవు ఏం తీర్చవని నీ సరదాలు నే తీర్చాలి . బాబుమీద నాకూ వుంది ప్రేమ. ప్రేమలకి డబ్బు కావాలి’ పిల్లాడికి పాలడబ్బా కొనడం వూరికి ఉపకారంలా మాట్లాడే ప్రభాకర్ ని సునీత క్షమించలేక పోయింది. ఆరోజు ఇద్దరి మధ్య పెద్ద దెబ్బలాట అయిం ది. ఆ కోపంలో ప్రభాకర్ రెచ్చిపోయి ‘అట్టే మాట్లాడకు, పాతిక వేలోచ్చే కట్నం వదులు కుని నిన్ను పెళ్ళా డానంటే నీ అందం చూసనుకుంటున్నావా, నీవేం రంభవా ఊర్వ శివా ఛా ఆ పాతికవేలు కట్నం తీసుకుని బ్యాంకిలో ఫిక్సి డ్ తీసుకుంటే నెలకో రెండు వం దలన్నా వచ్చేవి అత్యాశకి పోయి నిన్ను చేసుకున్నాను” అనేశాడు. ప్రభాకర్ మాటలతో యింతలా హింసించగలడని , యీ మాటలతో అతని సంస్కారం ఎంతో అర్ధం అయిన సునీత యింకేం మాట్లాడలేదు. బాబు పుట్టిన ఐదు నెలలకి తీవ్ర ప్రయత్నాలు చేసి ఆఖరికి ఉమెన్స్ కాలేజీలో ఉద్యోగం సంపాదించుకుంది. అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి ఆతని ముందు పడేసింది. అది చూడగానే అతని కళ్ళల్లో వెలుగు, మొహంలో ఆనందం చూడగానే మనిషి డబ్బు కెంత బానిస అవుతాడో అర్ధం అయింది సునీతకి. ‘అమ్మ దొంగా నాకు చెప్పకుండా అప్లై చేసి తెచ్చుకున్నావా……సునీతా అమ్మని వెంటనే యిక్కడికి వచ్చేయమని టెలిగ్రాం యిస్తాను. బాబుకేం పరవాలేదు ఇంట్లో అమ్మ చూసుకుంటుంది. నీ వెళ్ళి ఎల్లుండి జాయిన్ అయిపో” మొదటి రాత్రి కూడా లేని సౌమ్య త అభిమానం ఆ గొంతులో చూసి ప్రభాకర్ పట్ల గౌరవం మరి కాస్త తగ్గింది. నెలజీతం తీసుకొచ్చి బస్సు చార్జీలు, టీ ఖర్చు మినహా అతని చేతికిచ్చేది. ఆ డబ్బు తనుంచుకుం టే జరిగే రాద్దాంతం తెలుసు. అతనితో వాదన పెట్టుకుని లాభం లేదని అర్ధమయ్యాక యింట్లో సుఖశాంతులుండాలంటే తను నోరు మూసుకుని వుండడం మినహా మరో గత్యం తరం లేదని సునీతకి అర్ధం అయింది. బాబు వెంట పాప ఏడాది గిర్రున తిరిగే సరికి పుట్టేసింది. ఇద్దరు చంటి పిల్లలతో, అత్తగారికి ఏదో పిల్లలని తను లేనప్పుడు చూడడం , మినహా వంట అది చేసే ఓపిక లేదు గనుక యింట్లో చాకిరి చేసి పిల్లల అవసరాలు చూసి కాలేజీకి పరుగెత్తి మళ్ళీ వచ్చి చాకిరి . గానుగెద్దు జీవితం ఆరేళ్ళ బట్టీ అలవాటు పడింది. యిప్పుడీ ట్రాన్స్ ఫర్….యిప్పుడేమి చెయ్యాలి. ఉద్యోగం మానతానంటే ప్రభాకర్ ఊరుకుంటాడా. పిల్లల్ని పెట్టుకుని తను యింకో కాపురం పెట్టాలా. అప్పుడు రెం డు కాపురాలతో డబ్బెం వుంటుంది. పిల్లలని యిక్కడ స్కూల్లో జాయిన్ చేసింది. ఆ వూళ్ళో మంచి స్కూల్స్ లేవు. పిల్లల చదువు ఏమతుంది. పిల్లల్ని యిక్కడ వదలి తను అక్క డ….అమ్మో. అది లాభం లేదు. ఆలోచనలో బుర్ర వేడేక్కిం ది.
***
‘ఆలోచిస్తుంటే మతి పోతోంది సునీతకి. ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఛా…ఛా….ఆడదాని బ్రతుకు రోజు రోజుకీ అధ్వాన్నమవుతుందనిపిస్తుంది . ఇదివరకటి ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు. హాయిగా తెచ్చి పడేసింది వండి పిల్లల్ని కంటూ ఏ బాధలూ అవమానాలు సమస్య లు లేకుండా అమాయకంగా బతికేవారు. ఆ నాడు కేవలం స్త్రీ వం టింటి కుందేలు. పిల్లల్ని కనే యంత్రం , కాని మనం ఏం సాధించాం . వాటితో పాటు డబ్బు కూడా సంపాదించే యంత్రంగా మారాము. ఆడది ఉద్యోగం చేయడం ఆత్మ స్తైర్యా నికి అని అనుకోడం మనల్ని మనం వంచించుకొడానికే. ఆడదాని ఉద్యోగం అవసరాలు తీర్చుకోడానికి. అదీ మగవాడి అవసరాలు. తను ఆడదాని భాద్యత పంచుకోక పోయినా బాధ్యత సగం మోపడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి పురుషుడు” ఉక్రోషంగా , కసిగా అంది సునీత. ‘అవును సునీతా, మనం ట్రానిట్ పీరియడ్ లో వున్నాం . ఇటు పాతకాలం ఆడదానిలా వుండలేక, విదేశీ వనితల మాదిరి పూర్తి స్వేచ్చా స్వాతంత్రయాలు లేక మధ్య దారిలో దారి తెలియక కొట్టుమిట్టు ఆడుతున్నాం . ఇదంతా స్త్రీ పురోగమనాకి నాంది అనుకుంటే మనం ఆ పురోగమనానికి పునాది రాళ్ళం . ఈ పునాదులు ఎండకి వానకి తడిసి, రాటకి పోటకి ఆగితే ఆ పునాది మీద భవంతి లేస్తుంది. ఈనాడు మనం వేసిన పునాది పై భవంతిలో తరువాతి తరం స్త్రీలు హాయిగా ఆనందంగా స్వేచ్చా వాయువులు పీలుస్తారని ఆనందిద్దాం . అంత కంటే మనం ఏం చెయ్యగలం .” మాధవి అంది. సునీత విప్పారిత నేత్రాలతో మాధవి వంక అభినందిస్తున్నట్టు చూసింది.
“కరక్ట్” ఎంత బాగా చెప్పింది మాధవి. ఒక మంచి పనికి అనేక త్యాగాలవసరం మన జాతి విముక్తికి గాంధి ఎంత త్యాగం చేయాల్సి వచ్చింది. స్త్రీ జాతి విముక్తికి, పురోగమనానికి మనం పునాది రాళ్ళం అయినా పరవాలేదు. తరువాత తరం స్త్రీ కోరుకున్న ఆత్మస్తైర్యం , స్వశక్తి వగైరాలు లభ్యమయితే….” అనుకుంది సునీత నిట్టురుస్తూ.
(వనిత మాస పత్రిక)
*****
( సశేషం)

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.