
నీ కనుపాపను నేనై
(నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-వేలూరి ప్రమీలాశర్మ
ఆటో దిగి ఆశ్రమం గేటు వైపుకి రెండు అడుగులు వేసిన స్వాతి… ఒక్క క్షణం ఆగి పైన బోర్డు మీద రాసి ఉన్న అక్షరాలు మరోసారి చదువుకుంది.
“సునందా మానసిక వికలాంగుల సంరక్షణాలయం” గుండ్రని అక్షరాలతో పొందికగా రాసి ఉన్న ఆశ్రమం బోర్డుకి రెండు వైపులా… అపురూపంగా బిడ్డను పొదివి పట్టుకున్న మాతృమూర్తి చిత్రం ఒకవైపూ, నీడ నిస్తున్న మహావృక్షం మరొకవైపూ చిత్రించి ఉన్నాయి. ఆశ్రమంలోకి అడుగు పెడుతుంటే స్వాతి గుండె వేగంగా కొట్టు కోవడం మొదలుపెట్టింది. నిండా పచ్చని మొక్కలతో మనసుకి ఆహ్లాదం కలిగించేలా ఉన్న ఆ వాతావరణం… స్వాతి మనసుకి మాత్రం ప్రశాంతత నివ్వడం లేదు.
“ఇక్కడ దీపూ క్షేమంగా ఉండగలదా? గడపదాటి బయటకు రావడం తెలియని పసి మనసున్న నా చిట్టితల్లి ఇక్కడెలా ఉండగలదు? మనసులో ఆందోళన కలిగినా వ్యక్తం చేయడానికి భాష తెలియని దురదృష్టవంతురాలు. ఇన్నాళ్లూ నా చెయ్యి పట్టుకునే తిరిగిన నా బంగారు తల్లి… నన్ను వదిలి దూరంగా ఉండగలదా?’ గజిబిజి ఆలోచనలతో మెదడంతా మొద్దుబారిపోతుంటే… కర్తవ్యం గుర్తొచ్చి, కన్నీళ్లు తుడుచుకుని ముందుకి అడుగు వేసింది స్వాతి.
“చెప్పండి మేడం! ఇక్కడ ఎవరినైనా చేర్చాలనుకుంటున్నారా?” లోనికి అడుగు పెట్టగానే ఆప్యాయంగా తనను పలకరించిన పెద్దావిడను చూసి నమస్కరించింది స్వాతి.
అక్కడక్కడా నెరిసిన జుట్టు… ఆమె వయసు అరవైకి దగ్గరగా ఉండొచ్చని చెబు తోంది. నేత చీర కట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉన్న ఆమెను చూశాక, స్వాతిలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయి కొంచెం ధైర్యంగా అనిపించడంతో ఆమె దగ్గరకు వెళ్లి నుంచుంది. గొంతు తడారిపోయి మాట బయటకు రాక ఇబ్బంది పడుతున్న స్వాతి చేతికి మంచినీళ్ల గ్లాసు అందించి, కొంచెం స్థిమిత పడమన్నట్టు భుజం తట్టి ధైర్యం చెప్పిన ఆమెను చూశాక స్వాతి మెల్లగా మామూలు స్థితికి రాగలిగింది.
“నా పేరు స్వాతి. మా అమ్మాయి… మా అ మ్మా యి దీపూ… మెంటల్లీ ఛాలెంజెడ్. తనకి ఇరవై మూడేళ్లు వచ్చాయన్నమాటే గానీ, ఐదేళ్ల పసిదానిలా ప్రవర్తిస్తుంది. ఇరవై నాలుగ్గంటలూ నా బిడ్డను అంటిపెట్టుకునే ఉండాల్సి రావడం వల్ల ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన నేను ఇంటికే పరిమితమైపోయాను. లేకలేక కలిగిన బిడ్డ ఇలా మానసిక వికలాంగురాలిగా పుట్టడం… మా అంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఉండరు” చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది స్వాతి.
“బాధపడకండి. ఇలాంటి బిడ్డల్ని కన్న తల్లుల పరిస్థితిని నేనర్థం చేసుకోగలను. నా మాటలు మీకు ఊరటనివ్వవని నాకు తెలుసు. మీరు ఏ సహాయం కోసం ఇక్కడికి వచ్చారో చెబితే, మీ బిడ్డపట్ల మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలమో వివరిస్తాను. ఇక్కడ స్పీచ్ థెరపిస్టులు ఉన్నారు, వాళ్లంతట వాళ్ళు చిన్నచిన్న పనులు చేసుకో గలిగేలా ట్రైనింగ్ ఇచ్చే స్పెషల్ ఎడ్యుకేటర్లూ ఉన్నారు. ఆరోగ్య నిపుణుల సంరక్షణలో ఉంచాలనుకుంటే వారూ అందుబాటులో ఉన్నారు. ముందు మీ వివరాలూ, మీ అమ్మాయి వయసూ అన్నీ ఈ రిజిస్టర్ లో రాయండి. ఇక్కడ అంతా ఆడవాళ్లే ఉంటారు. మీరు కోరుకున్నంత కాలం నిశ్చింతగా మీ బిడ్డని ఇక్కడ వదిలి వెళ్ళొచ్చు.” అన్న పద్మిని మాటలు స్వాతికి ఊరటనిచ్చాయి. ఒక్క క్షణం ఆగి తాను చెప్పాలనుకున్నది చెప్పడం మొదలుపెట్టింది.
“మా అమ్మాయి పుట్టినప్పుడే తన కంటి చూపు నిలకడగా లేకపోవడం గమనించాం. ఓ కన్ను గుడ్డు పైకి రెప్ప లోనికి పెట్టి చూస్తుంది. వినికిడి ఉన్నా నోరు తెరిచి మాట్లాడేం దుకు మెదడు నుంచి సంకేతాలు అందకపోవడంతో మూగదానిలా మిగిలిపోయింది. చూడడానికి బంగారు బొమ్మలా ఉండే నా చిట్టి తల్లికి మనసు మాత్రం ఎదగలేదు. తనకి ఏం కావాలో అడగడం తెలియదు. అనుక్షణం నేను కనిపెట్టుకునే ఉండాల్సివస్తోంది. స్నానం చేయించడం… బట్టలు మార్చడం… తల దువ్వడం అన్నీ అన్నీ నేనే చేస్తాను. జావ కాచి పట్టిస్తే తాగడమే తప్ప… అన్నం నమిలి తినలేదు. రెండు మూడు గంటల కొకసారి లిక్విడ్స్ ఇస్తుంటాను. గంటకోసారి వాష్ రూమ్ కి తీసుకెళ్లి కూర్చో పెడతాను. ఇంకా పసిబిడ్డలాగే ఉండిపోయింది. నెలసరి వచ్చేది కూడా తనకి తెలియదు. నేనే బట్టలు మార్చి శుభ్రం చేస్తుంటాను.” చెబుతున్న స్వాతి కళ్ళలోంచి కారిన కన్నీటితో ఆకాశ నీలం రంగులోని ఆమె చీర కొంతమేర తడిసి నల్లని మబ్బు వర్ణంలోకి మారింది. వర్షించిన మేఘం తేలిక పడగలదేమో కానీ… కన్నీటి భారం దించుకుంటున్నా ఆమె మనసు మాత్రం తేలిక పడలేకపోతోంది.
“అయ్యో! బాధపడకండి స్వాతీ! ఇక్కడ ఇలాంటి పిల్లలు ఎందరో ఉన్నారు. ఇలాంటి బిడ్డల్ని కన్న తల్లులందరి పరిస్థితీ ఇలాగే ఉంది. కానీ మీ అమ్మాయి వయసు ఇరవై మూడు సంవత్సరాలు అంటున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానను కోకపోతే ఒక మాట అడగొచ్చా?” అనునయంగా స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకుని, సోఫాలో ఆమె పక్కనే కూర్చుంటూ అడిగింది పద్మిని.
“నా బిడ్డ గురించి ఏదీ దాచకుండా అన్నీ మీకు వివరంగా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే అడగండి.” కళ్ళు తుడుచుకుని పద్మిని మొహంలోకి చూసింది స్వాతి.
“మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకి నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి సరైన అవగాహన ఉండదు. అందువల్ల రజస్వల అయిన కొంతకాలానికి గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేయిస్తుంటారు. మరి మీ అమ్మాయికి…?”
“లేదండి! నా బంగారుతల్లికి ఆ సమయంలో కూడా అన్నీ నేనే చూసుకుంటాను. ఇంజక్షన్ చేయించాలంటేనే ఇల్లంతా పరుగులు పెట్టేస్తుంది. అలాంటిది ఆపరేషన్ అంటే తట్టుకోలేదు. ఇంతకాలం దగ్గరుండి అన్నీ నేనే చేశాను. కానీ ఇప్పుడు… ఎనభై నాలుగేళ్ల మా అత్తగారు మంచం పట్టారు. ఆవిడకి అన్నీ చేస్తూ దీపూని చూసుకోవడం కష్టమైపోతోంది. మావారు ఒక్కరే సంతానం కావడం వల్ల అత్తగారు మా దగ్గరే ఉంటు న్నారు. కేర్ టేకర్లను పెట్టుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అటు ఆవిడనీ, ఇటు దీపూని ఇద్దరినీ నేనే చూసుకోవాల్సిరావడం…” స్వాతి గొంతులో బాధ స్పష్టంగా కనబడు తోంది.
“అయితే మీ బిడ్డని కొంతకాలం మా ఆశ్రమంలో చేర్చడం మంచిదనిపించి ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. సరే! తప్పకుండా చేర్చుకుంటాం కానీ… నెలనెలా ఆమె కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించాలి కాబట్టి…”
“అర్థం చేసుకోగలను. అందుకే చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు వెచ్చించ డానికి మేము సిద్ధంగానే ఉన్నాము. ఇక్కడున్న మానసిక వికలాంగుల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏమీ అర్థం చేసుకోలేని వైకల్యం నిజంగా వారికి శాపమే. వీరితో పోలిస్తే నా బిడ్డ కొంచెం మెరుగ్గానే ఉంది. చెబితే కొన్ని అర్థం చేసుకోగలదు. కదలకుండా ఒకచోట కూర్చోమంటే బుద్ధిగా కాసేపు కూర్చుంటుంది. ఎటొచ్చీ నలుగురి మధ్యలోకీ రావాలంటే మాత్రం చాలా భయపడుతుంది.”
“వర్రీ అవ్వకండి. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితం అయిపోవడం వల్ల ఆమెలో భయం, బెరుకు ఉండడం సహజం. కాస్త మనుషుల మధ్యలోకి వస్తే… తొందరలోనే అందరితోనూ కలిసిపోగలుగుతుంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి.” ధైర్యం చెప్పింది పద్మిని.
ఆశ్రమంలో చేర్చుకోవడానికి అవసరమైన ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కాగితాలపై సంతకం చేసి, మరో నాలుగు రోజుల్లో బిడ్డను తీసుకుని వస్తానని చెప్పి బయలుదేరింది స్వాతి.
***
దీపూని ఆశ్రమంలో వదిలిన ఈ ఆరు నెలల్లో పది రోజులకు ఒకసారి వచ్చి బిడ్డను కలవడానికి అనుమతినిచ్చారు ఆశ్రమం వారు. మొదట్లో నెలరోజులపాటు ఆశ్రమం వాతావరణానికి అలవాటు పడటానికి దీపూ చాలా ఇబ్బంది పడింది. మెల్లమెల్లగా పద్మినిలో తన తల్లి స్వాతిని చూసుకుంటూ ఆమె దగ్గరే ఎక్కువసేపు ఉంటూ గడుపు కునేది. తన బిడ్డను చూడడానికి ఆశ్రమానికి వచ్చిన ప్రతిసారీ, తిరిగి వెళ్లే సమయంలో బిడ్డను పట్టుకుని గట్టిగా ఏడ్చి భారమంతా తీర్చుకునేది స్వాతి. పుత్తడి బొమ్మలా ఉండే దీపూ… వసివాడిన పువ్వులా దిగాలుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయేది. దీపూ కళ్ళల్లో కనబడే బెరుకుకు తనకు తెలిసిన అర్థాలు వెతుక్కుని ఆమెకు జాగ్రత్తలు చెబుతుండేది. తనను వదిలి తల్లి వెళ్ళిన వైపే చూస్తూ ఆ రోజంతా ఆశ్రమం లోపలికి వెళ్లడానికి దీపూ ఇష్టపడేది కాదని పద్మిని చెబితే విని మరింత దుఃఖానికి గురయ్యేది స్వాతి.
అప్పుడప్పుడూ పద్మిని తన బిడ్డకు ఆహారం తినిపిస్తూ, బట్టలు నిండుగా తొడుగు తూ, అందంగా అలంకరిస్తున్న వీడియోలు తీసి స్వాతికి పంపిస్తూ ఉండడంతో స్వాతి మనసు కాస్త తేలిక పడింది. ఓ రోజు పద్మిని నుంచి వచ్చిన ఫోన్ రిసీవ్ చేసుకున్నాక స్వాతి స్థిమితంగా ఉండలేకపోయింది. దీపూకి నెలసరి సరిగ్గా రావడంలేదని… దాదాపు మూడు నెలలు అవుతున్నా రాకపోవడంతో అప్పుడప్పుడూ తిండి సరిగ్గా తినకుండా, ఎక్కువ సమయం నిద్రపోవడంలోనే గడుపుతోందని పద్మిని చెప్పిన మాటలకు స్వాతిలో ఆందోళన హెచ్చింది.
సరిగ్గా అదే సమయంలో స్వాతి అత్తగారి ఆరోగ్యం మరింత క్షీణించింది. స్వాతికి ఇల్లు వదిలి బయటకు కదలలేని పరిస్థితి. ఆఖరి దశలో ఉన్న అత్త గారిని చూడడానికి వచ్చే బంధువులతో ఊపిరి తీసుకునే ఖాళీ లేకుండా సతమతమయ్యేది. ప్రతినెలా దీపూని చూడడానికి వెళ్లే స్వాతి… ఆ నెల వెళ్లలేకపోయింది.
దీపూకి జ్వరంగా ఉందని, వాంతులు అవుతున్నాయని ఆశ్రమ నిర్వాహకురాలు పద్మిని దగ్గర నుంచి ఫోన్ రావడంతో అఘమేఘాల మీద పరిగెత్తుకుని ఆశ్రమం చేరింది స్వాతి. సరిగ్గా ఆశ్రమం ముందు ఆటో దిగి, డబ్బులు చెల్లిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవడం తో చేతిలోకి తీసుకుంది.
“మన దీపూని ఉంచిన ఆశ్రమంలో ఏదో జరిగిందని టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూపిస్తు న్నారు స్వాతీ! అక్కడున్న మానసిక వికలాంగులైన ఆ పిల్లలపై ఎవరో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలూ, వాటికి ఆధారాలూ బలంగా ఉన్నాయంటూ టీవీలో న్యూస్ వస్తోంది. నువ్వు వెంటనే బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళు… నేను కూడా అటే వస్తున్నా ను.” గబగబా నాలుగు ముక్కలు చెప్పి ఫోన్ పెట్టేసాడు స్వాతి భర్త.
ఒక్కసారిగా నెత్తి మీద పిడుగు పడినట్లయ్యి ఆమె కాళ్ళ కింద భూమి కనిపించినట్ట య్యింది. తల తిరుగుతుంటే ఆసరా కోసం ఆశ్రమం గేటు ముందున్న చెట్టుని పట్టు కుంది. గ్రీష్మ తాపానికి పండిన ఆకులు తలవాల్చి నేలరాలిపోగా… మోడువారిన కొమ్మల మధ్య నుంచి సూర్యకిరణాలు నేరుగా ఆమె కళ్ళలో సూటిగా తాకాయి. చుట్టూ ఒక్కసారిగా అంధకారం అలముకున్నట్లయ్యి… కింద చతికిలపడిపోయింది. పోలీస్ హారన్ తో వచ్చిన జీపు గేటు ముందు ఆగింది. అందులోంచి దిగిన నలుగురు పోలీసులు గబగబా ఆశ్రమంలోనికి దారి తీశారు. టకటక లాడిస్తూ కదిలిస్తున్న వారి బూట్ల చప్పుడికి ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఒక్కసారిగా నిస్తత్తువ ఆవరించి నా… ఓపిక తెచ్చుకుని గబగబా ఆశ్రమం లోపలికి నడిచింది స్వాతి. పోలీసుల కంటే ముందుగా వచ్చి వాలిన మీడియా వాళ్ళు లోనికి వెళ్ళనివ్వకుండా అక్కడ గుమిగూడి ఉన్నారు. వారిని తప్పించుకుంటూ ఆశ్రమం లోపలికి వెళ్ళింది స్వాతి.
ఆశ్రమంలోని మానసిక వికలాంగులైన ఆ పిల్లలందరూ భయంతో ఒకరినొకరు పట్టుకుని కట్టకట్టుకుని ఓ మూలగా కూర్చుండిపోయారు. ఆశ్రమ నిర్వాహకురాలు పద్మిని ఎదురుగా కనబడలేదు. స్వాతి కళ్ళు దీపూ కోసం వెతుకుతున్నాయి. అక్కడున్న పిల్లల్లో దీపూ కనపడక వేదనతో ఆమె మనసు కృంగిపోతుంటే… ఆశ్రమం లోపలి గదుల వైపు దారితీసింది స్వాతి. అక్కడ పని చేసే ఒకరిద్దరి సాయంతో దీపూని ఉంచిన గదికి చేరింది. లోపల మంచం మీద దుప్పటి ముసుగు వేసుకుని కాళ్లు దగ్గరగా ముడుచుకుని నిద్రపోతున్న దీపూని చూసి కాస్త స్థిమితపడింది. దగ్గరగా వెళ్లి మంచం మీద కూర్చుని బిడ్డని తడిమి తడిమి చూసుకుని లేవదీసి గుండెలకు హత్తుకుంది. తల్లి స్పర్శలోని ఆలంబన దీపూకి ఊరటనిచ్చింది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంటే… కళ్ళల్లోంచి వెద జల్లుతున్న ఆవిర్లకు కమిలిన కలువ రేకుల్లా మారిన దీపూ కనురెప్పలపై ముద్దాడి ఆమె తలపై చేతులు వేసి, బిడ్డను దగ్గరకు తీసుకుని గుండెల్లో పొదువుకుంది స్వాతి.
గది బయట మనుషుల అలజడిని గమనించిన దీపూ భయంతో వణికిపోసాగింది. తల్లిని గట్టిగా కరుచుకుపోయింది. ఆశ్రమం నలుమూలలా వెతుకుతున్న పోలీసులు… పెరటివైపు వెళ్లినట్లు కాలి బూట్ల శబ్దం వినిపిస్తుంటే అక్కడున్న వారిని “ఏం జరిగింది?” అని అడిగింది స్వాతి. ఒకామె చేత్తో వెనుక వైపుకు చూపించింది.
వంటగది నుంచి వెనుక వైపుకి నేలపై రక్తం చారికలు కట్టి ఉంది. పది అడుగుల దూరంలో మెడ భాగం అడ్డంగా నరకబడిన ఓ నలభై ఏళ్ల వ్యక్తి… అతను ధరించిన తెల్ల చొక్కా మొత్తం రక్తంతో ఎర్రగా మారిపోయి విగతజీవిగా పడున్నాడు. అతడికి నాలుగు అడుగుల దూరంలో అపర కాళిలా ఆవేశంతో ఎగసిపడుతున్న పద్మిని నేలపై కూర్చుని ఉంది. ఆమె పక్కనే కాయగూరలు కోసే కత్తిపీట రక్తంతో తడిసి ఉంది. ఒక లేడీ కానిస్టే బుల్ వచ్చి పద్మిని చేతులకు సంకెళ్లు తగిలించింది. ఒక నేరస్తురాలిలా ఆశ్రమంలో ఆమెను నడిపించి తీసుకొస్తుంటే… అందరూ ఆమెకు శాల్యూట్ చేస్తున్నట్టు గౌరవంగా దారిచ్చి పక్కకు తప్పుకుంటున్నారు. నిబ్బరంగా ఉన్న ఆమె కళ్ళు చమర్చలేదు.
దీపూని పట్టుకుని గోడ వారగా నిల్చున్న స్వాతి వైపు చూసి… “నీ బిడ్డకి ఏమీ జరగలేదు, క్షేమంగానే ఉంది” అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది పద్మిని. ఆ సమయంలో కూడా తన మనసులోని ఆందోళనను అర్థం చేసుకున్న ఆమెకు చేతులెత్తి దణ్ణం పెట్టింది స్వాతి.
హత్య చేయబడిన వ్యక్తి ఆశ్రమానికి తరచూ వచ్చే వార్డు కౌన్సిల్ మెంబర్ అనీ… ఆశ్రమ నిర్వహణా బాధ్యతల్లో పాలుపంచుకుంటున్న ముసుగులో అక్కడి మానసిక వికలాంగులైన బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనీ… అది సహించలేని పద్మిని రాక్షస సంహారం చేసిన అపర కాళికలా మారిందని ఆశ్రమంలో పనిచేసే వారి ద్వారా తెలుసుకుని నివ్వెరపోయింది స్వాతి.
దీపూని తమ ఇంటికి తీసుకు వెళ్లిన స్వాతి, భర్త సూచన మేరకు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్ళింది.
“తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవడం వల్ల తమ భయాన్ని బయటకు వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో డిప్రెషన్ లో ఉన్న ఆడపిల్లలకు నెలసరి ఆలస్యం కావచ్చునని… దీపూ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఉందని” డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది స్వాతి.
*****

వేలూరి ప్రమీలాశర్మ అను నేను విశాఖ వాసిని. తెలుగు సాహిత్యం పై మక్కువతో 2004 లో ఆకాశవాణికి ధారావాహికలు, నాటికలు, కథానికలూ ఇవ్వడం ప్రారంభించి, దాదాపు 7 సంవత్సరాలు ఆకాశవాణి రచయిత్రిగా 36 రచనలు చేసాను. వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా, ఆకాశవాణి అనౌన్సర్ గా పని చేసిన నేను, కొంత విరామం తరువాత తిరిగి 2020 నుంచీ వివిధ పత్రికలకు కథలు రాయడం మొదలుపెట్టాను. ఇంతవరకు 100 కు పైగా కథలు పత్రికలలో ప్రచురితమవ్వగా కొన్ని పోటీలలో బహుమతులకు, మరికొన్ని సాధారణ ప్రచురణకు ఎంపికైనవి.