మళ్ళీ చూస్తానా చిరు చినుకుల తాకిడికి పరవశించి
తాండవం చేసిన ఆ మట్టి రేణువుల ఆనందాన్ని!
చినుకును ఆలింగనం చేసుకున్న ఆ మాగాణిలో రేగిన సుగంధాన్ని!
పూల వెల్లువై మురిసిపోతూ సిగ్గు పడుతూ
మెల్లమెల్లగా నేల రాలుతున్న ఆ చినుకులుతో
కరచాలనం చేసి వెళ్లివిరిసిన ఆ సూర్య కిరణాలు స్పృశించిన హరివిల్లును!
మళ్ళీ చూస్తానా రహదారికి ఇరువైపులా
నిటారు చెట్టుల చిటారు కొమ్మలకు వేలాడుతూ
సొగసైన పక్షులు నిర్మించిన ప్రేమ సౌధాలను!
ఉత్పత్తికై దూరాలని దగ్గర చేస్తూ వలస వచ్చి
సేద తీరుతూ కేరింతలు కొడుతున్న ఆ వలస పక్షి సేనలను!
మనస్సుకి హాయిని పంచే అద్భుత క్షణాలను!
మళ్ళీ చూడాలని లేదు దప్పికతో దారులు తప్పి
దాహం తీరక దివాలాతీసిన ఆ వన మృగాలను!
తలలు తెగిన తరువులను, కార్చిచ్చుల్లో సజీవ
దహనమై ఆర్తనాదాలు పెట్టిన ఆ జీవాలను!
మళ్ళీ చూడాలని లేదు ఆవేశంతో విరుచుకు పడి
మృగం వలె ప్రాణాలను, మానాలను హరిస్తున్న
మానవ మృగాలను!
జాలి దయ లేకుండా జంతువులస్థాయిని మించి
దిగజారి కల్లోలాలు సృష్టిస్తున్న జ్ఞానం లేని మానవులను!
మళ్ళీ చూడాలని వుంది మానవత్వం వెళ్లివిరిసిన మనుషుల్ని
కపటం, కుతంత్రం విడిచి ఆప్యాయంగా హత్తుకున్న మానవత్వాన్ని!
ఒంటరి అయిన తల్లితండ్రులకు ప్రేమను పంచిన పిల్లల్ని!
ఒత్తిడికి దూరం చేసి పిల్లల్ని గుండెకు హత్తుకున్న తల్లితండ్రుల్ని!
మళ్ళీ చూస్తానా వాన చినుకుల సవ్వడికి ఆనంద
తాండవం చేస్తూ పులకించిన ఆ రైతన్న సంతోషాన్ని!
తన వాన ప్రేయసి రాక కోసం భగ్న ప్రేమికుడై రేయి పగలు కళ్ళల్లో
ఒత్తులేసుకొని ఎదురుచూస్తూ అలమటిస్తున్న ఆ అన్నదాత
కొరకు ఆ మేఘం తెచ్చే చినుకు సందేశాన్ని!
విసిగి వేసారిపోయాను దారుణాలను చూసి, ఆర్తనాదాలు చూసి!
ఏమి చెయ్యగలను ఏమీ చేయలేను నిరాశతో కుమిలిపోతున్నాను.
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న మాట ప్రేరణతో
నేనే చేయాలి మళ్ళీ మార్పు రావాలని నడుం బిగించాను!
మళ్ళీ చూస్తాను అన్నదాత మోములో ఆ ఆనందాన్ని
వజ్ర సంకల్పం చేసి ఎడారిలా మారిన ఆ నేలలో చినుకు
కురిపించేలా ఆ చినుకు ఆత్మీయ బంధువైన ఓ మొక్కను నాటి!
మళ్ళీ చూస్తాను మానవత్వంతో వెలుగొందుతున్న మనిషిని
దీక్షా కంకణం కట్టి మనుషుల్లో నిద్రపోతున్న మానవీయతను తట్టి లేపి
ఉన్నతమైన జన్మ మనదంటూ ఉన్నతంగా ఆలోచన చేయి అంటూ!