తుఫాన్

(నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-పారుపల్లి అజయ్ కుమార్

సిరిమువ్వ

************

రైలు నెమ్మదిగా కదులుతోంది. ఆకాశం అంతా కారు మేఘాలు దట్టంగా అలుముకుని వున్నాయి. తూర్పుదిశ నుండి గాలులు వేగంగా వీస్తున్నాయి. చలి అనిపించి కిటికీ అద్దాన్ని క్రిందికి దించాను.
రెండు రోజుల క్రితమే టీవీలో, పేపర్ లో తుఫాను హెచ్చరిక వచ్చింది. ఉదయం నుండి అడపాదడపా చిరుజల్లులు పడుతూనే వున్నాయి. చిన్న చిన్న చినుకులుగా కురుస్తున్న వాన పెద్దదవడం  మూసివున్న కిటికీలో నుండి కనపడుతున్నది.

బయటి వాతావరణంలాగే నా మనసులో కూడా ఆలోచనల మేఘాలు ముసురుకున్నాయి. ఏదో తెలియని గందరగోళం నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు. బయటి వాతావరణంలోని  తుఫాను లాగానే  నా హృదయంలో కూడా  భీకరమైన తుఫాను సుడులు తిరుగుతూ నన్ను అతలాకుతలం చేస్తున్నది. జరిగిన సంఘటన నన్ను అణువణువునా దహించి వేస్తున్నది. యిలా ఎందుకు జరిగిందో అర్థం కావటంలేదు. చనిపోవాలని వుంది. కానీ  ధైర్యం చేయలేక పోయాను. మనసులో చెలరేగుతున్న అలజడి నన్ను ఊపిరి సలుపుకోనీయడం లేదు. నా జీవితంలో ఇంకెన్ని తుఫానులను ఎదుర్కోవాలి? సంతోషకరమైన జీవితం ప్రక్కనే విషాదకర జీవితాన్ని ఎందుకు రాశాడు ఆ దేవుడు నా నుదిటిపై?

అభీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? నిన్ను తప్పించుకోవాలని ఇలా వచ్చేశాను. ప్రియాతి ప్రియమైన నిన్ను కోల్పోతున్నాననే భయం నన్ను నిలువనీయడం లేదు. నిన్ను మరచిపోవడం నా తరమా?

అభి పరిచయం తాలూకు జ్ఞాపకాల వరద నన్ను ముంచెత్తింది.

ఎంసెట్ లో వచ్చిన రాంకుతో పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది. మొదటిరోజు కొద్దిగా భయం భయంగానే కాలేజీకి వెళ్ళాను.

కాలేజీ గేటు దాటి లోపలికి నాలుగు అడుగులు వేయగానే పదిమంది అమ్మాయిలు నాకు ఎదురుగా  వచ్చారు. వారిని చూడగానే బిక్కముఖం వేసుకుని నిలుచుండి పోయాను.

“అమ్మడూ! తమరి నామధేయం?” వారిలో ఒకామె అడిగింది.

సమాధానం చెప్పటానికి నా నోరు పెగల్లేదు.
“నిన్నే అడిగేది. చెవుడా నీకు?” మరో అమ్మాయి గద్దింపుగా అంది.

నాకు కంగారు ఎక్కువయింది.
“సి…సి…”అంటూ మాట తడబడింది.

“సీమ చింతకాయ పచ్చడి…”
ఎవరో అన్నారు.

“నత్తి కూడా వున్నట్లుంది అమ్మడికి.”
మరొకరు పలికారు.

పదిమంది గొల్లున నవ్వారు.
కళ్ళల్లోకి నీరు ఉబికి రాబోతున్నాయి. నా కన్నీరు వారి కంట పడకుండా తల వంచుకుని నిలుచున్నాను.

“రమ్యా, ఏం చేస్తున్నారు మీరిక్కడ? మళ్ళీ రాగింగ్ మొదలుపెట్టారా?”  అనే మాటలు వినిపించి తలెత్తి అటు చూశాను.

నవమన్మథుడా! అతిసుందరుడా! అనిపించేలా వున్న ఆరడుగుల అందగాడు మేమున్న వైపు వస్తున్నాడు.

“అబ్బే… అదేం లేదు అభీ. పేరు అడిగి పరిచయం చేసుకుంటున్నాం. అంతే…” రమ్య అనే అమ్మాయి అతన్ని చూస్తూ అంది.

“ఏం పేరు?” దగ్గరికి వచ్చాక రమ్యను అడిగాడు.

“మేం అడిగాము. తను ఇంకా చెప్పనే లేదు. ఇంతలోనే నువ్వొచ్చావు.” ఒకమ్మాయి దీర్ఘం తీసింది.

“మిస్, నాపేరు అభిమన్యు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ను. మీకు అభ్యతరం లేకపోతే మీపేరు తెలుసుకోవచ్చా?” నా వైపు చూస్తూ అభ్యర్ధనగా అడిగాడు అతను.

ఎంతో పొలైట్ గా అతను అడగటం చూసి ముచ్చటేసింది నాకు. బెరుకు తగ్గించుకుని “సిరిమువ్వ” అన్నాను.

“వావ్! వాట్ ఎ లవ్ లీ నేమ్… చాలా బాగుంది. నైస్ టూ మీట్ యూ” అని  ప్రశంసలు కురిపిస్తూ కుడిచేయి ముందుకు చాచాడు. అప్రయత్నంగానే అతనితో కరచాలనం చేశాను. అతని చేతి స్పర్శ నాలో ఏదో పులకింతను కలిగించింది. “పేరు చెప్పిందిగా. ఇక వెళ్ళండి మీ క్లాసుకు.” అమ్మాయిల గుంపును ఉద్దేశించి అన్నాడతను. వాళ్ళు మూతి ముడుచుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయారు.

“బై సిరీ… మళ్ళీ కలుద్దాం.” అంటూ ఓ చిరునవ్వు విసిరి అతను వెళ్ళిపోయాడు.

ఏం మాట్లాడాలో తెలియక వెళుతున్న  అతన్ని అలానే చూస్తుండిపోయాను. ‘శ్రీ రాఘవుడా! ప్రియ మాధవుడా! ఎవరే ఇతగాడు?’  అనుకున్నాను మనసులో. అతన్ని  చూసిన తొలిసారి ఎదలో ఏదో తెలియని గిలిగింత, ఒకింత కలవరపాటు కలిగింది.

ఏ ముహూర్తాన నేను అభిని చూశానో గానీ, అతని రూపు నా మదిలో శాశ్వతంగా నిలిచిపోయింది. అభిని కలవాలని, అతనితో మాట్లాడాలని మనసు ఉవ్విళ్ళూరేది.

రోజులు గడుస్తున్న కొద్దీ అభితో పరిచయం మెల్ల మెల్లగా పెరగసాగింది. మొదట్లో చిరునవ్వుల పలకరింపులు, కొద్ది రోజుల తరువాత కాసేపు కబుర్లు, తరువాత్తరువాత కబుర్లతో పాటు కుదిరితే కాంటిన్ లో  కాఫీలు సేవించటం… సంవత్సరకాలం చాలా త్వరగా గడిచిపోయినట్లనించింది. అభి సరదాగా మాట్లాడుతుంటే ఎంతకాలమైనా అలా వింటూ వుండిపోవాలనిపించేది. అభి కూడా నన్ను ఇష్టపడుతున్నాడనిపిస్తోంది. అది కేవలం నా ఊహనా? నిజమా? అనే సంగ్దిధం నన్ను వెంటాడేది కొంతకాలం పాటు.

ఆ సంవత్సరం జరిగిన కాంపస్ ఇంటర్వ్యూ లలో, రెండు పేరున్న సాఫ్ట్ వేర్ కంపెనీలు అభిని సెలెక్ట్ చేసుకున్నాయి. అభి కాలేజ్ వదిలి వెళ్ళిపోతాడని అనుకుంటేనే మనసులో చెప్పలేని బాధ సుడులు తిరుగుతున్నట్లనిపించింది. నా బాధ తెలుసుకున్న వాడిలా అభి తిరిగి అదే కాలేజీలో పీజీలో చేరాడు. ఇంతకు ముందులా తరుచుగా కనపడక పోయినా వారానికి ఒకటి రెండుసార్లు కాంటీన్ లో కలుసుకునే వాళ్ళం. ఒకసారి మాటల మద్యలో నా కుటుంబ వివరాలు అడిగాడు.

“అభీ, మా అమ్మా, నాన్నలది ప్రేమ వివాహం. ఇద్దరి కులాలు వేరు వేరు. ఇరువైపులా పెద్దలు ఒప్పుకోక పోవడంతో వారందరినీ కాదని మా అమ్మా, నాన్నలు పెళ్ళి చేసుకున్నారు. వారికి నేను ఒక్కత్తినే కూతురుని. అమ్మా, నాన్న, నేను ఎంతో సంతోషంగా వుండేవాళ్ళం. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు నా పుట్టిన రోజుకు డైమండ్ నెక్లెస్ కొనాలని అమ్మా, నాన్న షాపింగ్ కు వెళుతూ నన్నూ రమ్మన్నారు. నాకు తెల్లవారి పరీక్ష వుందని రానని చెప్పాను. వాళ్ళని కూడా వెళ్ళవద్దని చెప్పాను. ఆ రోజు వాతావరణం అస్సలు బాగోలేదు. జోరున వాన పడుతున్నది. తుఫాను ప్రభావం తీవ్రంగా వుందని  టీవీ వార్తల్లో చెప్పారు. ఆ విషయాన్ని వారికి చెప్పినా ‘ఎంతసేపు! వెంటనే వచ్చేస్తామని ‘ చెప్పి వెళ్ళారు.

రాత్రంతా కురిసిన వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి  చెరువుకు వరద నీరు వెల్లువలా వచ్చి చేరింది. నిండుకుండలా మారిన  చెరువుకు హఠాత్తుగా గండిపడి చెరువులోని నీరంతా ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచివేసింది. షాపింగ్ ముగించుకుని వస్తున్న అమ్మా, నాన్నలు ఆ వరదలో కొట్టుకుపోయారు. ఆ రోజు ఆ తుఫానులో ఎంత గాలించినా వారి జాడ కానరాలేదు.

రెండు రోజుల తరువాత వారి శవాలు పది కిలోమీటర్ల దూరంలో బురదలో కూరుకుపోయి కనిపించాయి. ఆ సమయంలో కూడా అమ్మా, నాన్నల బంధువులు ఎవరూ నా దగ్గరకు రాలేదు. నాన్న ఆఫీసులో అందరితో ఎంతో స్నేహంగా వుండేవాడు. నాన్న స్నేహితులలో కొంతమంది ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసారు. నాన్న స్నేహితులే పూనుకుని నాన్న సంపాదించిన ఆస్తులు, డబ్బులు ఎక్కడెక్కడ వున్నాయి అని ఆరాతీసి వాటిని భద్రంగా నా పేరున బ్యాంకులో జమచేసారు. ఆఫీసు నుండి నాన్నకు రావలసిన డబ్బులు, పెన్షన్ మొదలైన విషయాలన్నీ వారే చూసిపెట్టారు. నా ఆలనా, పాలనా చూడటానికి లక్ష్మి అక్కను కుదిర్చారు. చిన్నతనంలోనే పెళ్ళి జరిగి భర్తను కోల్పోయిన స్త్రీ ఆమె. ఎవరూ లేని నాకు లక్ష్మి అక్క తోడూ నీడగా నిలిచింది. నేను క్రమక్రమంగా అమ్మా, నాన్నలు పోయిన దుఃఖం నుండి కోలుకుని చదువుపై దృష్టిపెట్టాను. ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ రాసి ఇక్కడ సీటు సంపాదించాను. ఇక్కడ నీ పరిచయ భాగ్యం కలిగింది. నీ పరిచయం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. నీ స్నేహం నాకు ఎంతో అపురూపం. ఎవరూ లేని నా జీవితంలో నువ్వు ఆమని లా ప్రవేశించావు. నీతోనే నా జీవితం అనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. కాదు కాదు మనసారా ఆరాధిస్తున్నాను. నా చేయి అందుకుని నాకు జీవితాంతం తోడుగా వుండగలవా అభీ?”

బేలగా అడిగాను.

నాకు తెలియకుండానే నా కళ్ళు కన్నీటితో తడిసిపోయాయి. అభి తన మృదువైన చేతులతో నా కన్నీటిని తుడుస్తూ “సిరీ, నీకు ఎవరూ లేరని అనవద్దు. నీకు నేనున్నాను. రేపు నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మా నాన్నగారిని పరిచయం చేస్తాను. మా నాన్నను చూస్తే నువ్వు తప్పకుండా అతన్ని నీ ఆత్మీయుడిగా భావిస్తావు. మేమిద్దరం వున్న నీవు ఎవరూ లేనిదానివి కావు. ఇంకెప్పుడూ అలా మాట్లాడవద్దు.” ఆప్యాయంగా అన్నాడు.

అన్నట్టుగానే మరునాడు అభి నన్ను తన యింటికి తీసుకెళ్ళాడు. అభి నాన్నగారు భరద్వాజ గారు నన్ను సాదరంగా ఆహ్వానించారు. పరిచయాలు ముగిశాక, కాసేపు పిచ్చాపాటి మాటలు జరిగాయి. కాఫీ కలుపుకొస్తానని భరద్వాజ గారు లేచారు. నేను వెంటనే లేచి “కిచెన్ ఎక్కడో చెప్పండి అంకుల్. నేను కలుపుకొస్తాను.” అన్నాను.

కిచెన్ ను చూపిస్తూ “అంకుల్ అని కాదమ్మా. నోరారా తెలుగులో మామయ్యా అని పిలువు.” అన్నారు.

నేను నవ్వుతూ “అలాగే మామయ్యా.” అని కిచెన్ లోకి వెళ్ళి కాఫీ కలిపి మూడు కప్పుల్లో పోసి తీసుకొచ్చాను. కాఫీ త్రాగుతూ “చాలా బాగుందమ్మా.” అని మనఃపూర్తిగా అన్నారు.
భరద్వాజ గారు నాతో ఎంతో ఆప్యాయంగా “అభి చెప్పాడమ్మా నీ వివరాలు అన్నీ. నీకు ఎవరూ లేరనే బాధ వద్దు. నేనూ, అభి వున్నాం. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఈ ఇంటికి రావచ్చు. ఈ ఇల్లు పరాయి ఇల్లు అనుకోవద్దు. ఇది నీ ఇల్లే అనుకో.” అన్నారు.

అది మొదలు అభి ఇంటికి నేను తరుచుగా వెళ్ళేదాన్ని. ఆదివారం వెళ్తే వంట నేనే చేసి అభికి, మామయ్యకు వడ్డించేదాన్ని. భోజనాలు అయ్యాక ముగ్గురం కలిసి సరదాగా కార్డ్స్ గానీ, క్యారమ్స్ గానీ ఆడేవాళ్ళం. సాయంత్రం పార్కుకో, సినిమాకో వెళ్ళేవాళ్ళం. హోటల్ లో డిన్నర్ చేశాక అభి నన్ను మా యింటి దగ్గర దింపి వెళ్ళేవాడు.

నా చదువు పూర్తి అయ్యాకే పెళ్ళి చేసుకోవాలని నేను, అభి అనుకున్నాం. అదే విషయాన్ని మామయ్యకు కూడా చెప్పాం. అభి సాయంతో లక్ష్మి అక్కను ఒప్పించి ఆమెకు మళ్ళీ పెళ్ళి చేశాము.
భర్తతో కలసి లక్ష్మి అక్క వెళ్ళి పోయింది. మామయ్య నన్ను తమ ఇంటికి వచ్చి ఉండమన్నాడు. కానీ పెళ్ళి అయ్యేదాకా విడిగానే ఉంటానని చెప్పాను. పీజీ చేశాక అభికి మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది. నా ఇంజనీరింగ్ పూర్తికాగానే అభికి, నాకు నిశ్చితార్థం జరిగింది.  కంపెనీ తరుఫున ఆరునెలల శిక్షణకు జర్మనీ వెళ్ళడానికి అభికి ఛాన్స్ వచ్చింది. అభి వెళ్లనని అన్నా నేనూ, మామయ్య అభిని ఒప్పించి పంపించాము. అభి జర్మనీ నుండి వచ్చాకే పెళ్ళి అని అనుకున్నాం. రోజూ అభి నాతో, మామయ్యతో ఫోన్ లో మాట్లాడేవాడు. నేను రెండురోజులకోసారి మామయ్యను చూసి వచ్చేదాన్ని.

ఈరోజు ఉదయం నుంచి ఆకాశంలో మబ్బులుపట్టి విడిపోతున్నాయి. అప్పుడప్పుడు వానచినుకులు పలకరించి వెళుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు తుఫాను హెచ్చరిక జారీ చేశారు. తుఫాను అని తలుచుకుంటేనే మనసంతా గుబులు గుబులుగా వుంది.  ఏ పనీ చేయబుద్ది కావడం లేదు. మామయ్య దగ్గరకు వెళ్దామని బయలుదేరి, మళ్ళీ వర్షం పెద్దది అయితే ఇబ్బంది అని ఆగిపోయాను. గాలి విసురు ఎక్కువయింది. తలుపులన్నీ బిగించి లోపలే వుండిపోయాను. సాయంత్రం కాకముందే చీకట్లు అలుముకున్నాయి. ముందు జాగ్రత్తగా కరెంట్ తీసేసారు.  తలుపు చప్పుడు వినిపించింది. తలుపు తెరిచే సరికి ఎదురుగా….

ధడేల్ మనే పెద్ద చప్పుడుతో ఉలికి పాటుతో ఆలోచనల ప్రవాహం నుండి బయటకు వచ్చాను. ఏమి జరుగుతుందో నేను గ్రహించేలోపు, సీటు మీద నుండి క్రిందికి పడిపోయాను. నా కుడి కాలు మీద ఎవరో పడ్డారు. నా ముఖం మీద ఏదో బ్యాగ్ పడింది. దాన్ని ప్రక్కకు తోసాను. కుడి కాలు బాగా నొప్పిగా వుంది. అరుపులు, కేకలతో భోగీ దద్దరిల్లింది. ఒక్కసారిగా బోగీ ఓ పక్కకు ఒరిగినట్లు  గుర్తించాను. ఓ భయంకరమైన శబ్ధంతో ట్రైన్ పట్టాలు మీదనుంచి పక్కకు తొలగి ఆగిపోయింది. నేను ఓ మూలకు  విసిరి వేయబడ్డాను. నా తల ఏదో ఇనుపరాడ్ కు కొట్టుకుంది. ఏం జరుగుతున్నదో తెలియని అయోమయ స్థితిలో స్పృహ కోల్పోయాను.

***

జ్యోత్స్న :
***********
నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. ఒక్క క్షణం నేను ఎక్కడున్నానో నాకు అర్ధం కాలేదు. తలంతా దిమ్ముగా వుంది. కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ చుట్టూ చూశాను. ఏదో హాస్పిటల్ లా వుంది. నర్సులు, డాక్టర్లు హడావుడిగా తిరుగుతూ కనిపించారు. బయట వర్షం పడుతున్న చప్పుడు వినిపిస్తున్నది.

అప్పుడు గుర్తొచ్చింది. నేను ప్రయాణిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. షాక్ తో స్పృహ తప్పాను. మళ్ళీ ఇప్పుడే కళ్ళు తెరవడం. నేను కళ్ళు తెరిచి చూడటం గమనించి ఒక డాక్టర్ నా దగ్గరకు వచ్చి…

“మీ పేరు?”  అని అడిగాడు.

“జ్యోత్స్న.” చెప్పాను.

“వెరీ గుడ్…మీ వివరాలు చెప్పగలరా?

నా వివరాలన్నీ చెప్పాను.

“మీ వంట్లో ఎలా వుంది ఇప్పుడు?”

“తల కొద్దిగా దిమ్ముగా వుంది.”

“ఆల్ రైట్. మీకు ప్రమాదంలో పెద్దగా దెబ్బలు తగలలేదు. షాక్ తో స్పృహ కోల్పోయారు. అంతే. రేపు మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు. మీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెపితే వాళ్లకు తెలియచేస్తాం.” అన్నాడు డాక్టర్.

“వద్దు డాక్టర్. మా అమ్మ హార్ట్ పేషంట్. నాకు ప్రమాదం జరిగిందన్న విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. నేను ఎదురుగా కనపడి  అప్పుడు విషయం చెపితే ఏం కాకపోవచ్చు.” అన్నాను.

“సరే. సిస్టర్ వచ్చి ఇంజక్షన్, మందులు ఇస్తుంది. రెస్ట్ తీసుకోండి.” అని డాక్టర్ పక్క బెడ్ దగ్గరకు వెళ్ళాడు.

నేను బెడ్ మీద లేచి కూర్చుని చుట్టూ వున్న అందరినీ చూడసాగాను. దూరంగా వున్న బెడ్ మీద పడుకుని వున్న ఆమెను చూస్తూనే ఉలిక్కిపడ్డాను. తలకు కట్టుకట్టి వుంది. నెమ్మదిగా బెడ్ దిగి ఆమె దగ్గరకు వెళ్ళాను. చూస్తునే గుర్తుపట్టాను. ఆమె సిరిమువ్వ. ఇంజనీరింగ్ కాలేజీలో నా జూనియర్.

“డాక్టర్, ఈమెకు ఏమైంది?” డాక్టర్ ను అడిగాను.

“తలకు బాగా దెబ్బ తగిలింది. ఇంకా స్పృహ రాలేదు. ఈమె మీకు తెలుసా?” డాక్టర్ అడిగాడు.

“తెలుసు డాక్టర్. కాలేజీలో నా జూనియర్.”

“ఈమెకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఈమెది కొంచెం సీరియస్ కేసులా అనిపిస్తోంది. ఇది చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే. ఇక్కడికి దగ్గరలో  రైలు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని తాత్కాలికంగా యిక్కడ వుంచడం జరిగింది. ఎక్కువ కాలం వీళ్ళను ఇక్కడ వుంచడం కుదరదు. గాయపడిన వారి వివరాలను కనుక్కొని వారి రక్త సంబంధీకులనో, బంధువులనో పిలిపించి వారికి అప్పగించడం జరుగుతున్నది. ఇప్పటికే ప్రమాదం విషయం తెలిసి చాలా మంది బంధువులు వచ్చేసారు. ఈమె మీకు తెలుసు అంటున్నారు కదా. ఏమనుకోకుండా ఈమె బంధువులకు ఫోన్ చేసి చెప్పండి.” అని పక్క బెడ్ దగ్గరకు వెళ్ళాడు.

నేను మెల్లగా ఆసుపత్రి వరండాలోకి నడిచి వెళ్ళి అక్కడున్న బెంచీమీద కూర్చున్నాను. వరండా రేకుల షెడ్డు మీద పడుతున్న వాన చినుకుల సవ్వడి గమ్మత్తుగా వినిపిస్తున్నది. సిరిమువ్వ ఇక్కడ కనపడటం వింతగా వుంది. సిరిమువ్వ తల్లితండ్రులు చనిపోయారని తెలుసు. సిరి మువ్వ గురించి అభిమన్యుకు ఫోన్ చేసి చెప్పాలి. అభి గుర్తుకు రాగానే మనసులో ఏదో తెలియని బాధ కదలాడింది.

అభి ఇంజనీరింగ్ లో నా క్లాస్ మేట్. అతన్ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా నేను అతని  ప్రేమలో పడి పోయాను. మూడు సంవత్సరాలపాటు అతని ప్రేమకోసం అర్రులు చాచాను. కానీ లాభం లేకపోయింది. అభి నాతో ఎంతో సరదాగా మాట్లాడేవాడు. ఎంతో స్నేహంగా వుండేవాడు. జోక్స్ చెప్పి నవ్వించే వాడు. గ్రూప్ డిస్కషన్స్, సెమినార్ ప్రెజెంటేషన్ లో ఎంతో హెల్ప్ చేసేవాడు. చదువులో గైడ్ చేసేవాడు. అంతవరకే. అభి నన్ను కేవలం ఒక స్నేహితురాలిగానే చూశాడు. ఎన్నోసార్లు ఇండైరెక్ట్ గా నా ఇష్టాన్ని, నా ప్రేమను అతని ముందు వ్యక్తపరిచాను. కానీ అభి స్నేహ పరిధిని దాటి ముందుకు రాలేదు. మేము ఫైనల్ ఇయర్ లో వుండగా సిరిమువ్వ  కాలేజీలో చేరింది. వారిద్దరి మధ్య పరిచయం ఎప్పుడు, ఎలా అయిందో తెలియదు గానీ అభి ఆమెను అభిమానించడం మొదలయింది. కాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయినా, అభి కేవలం సిరిమువ్వ కోసమే అదే కాలేజీలో పీజీ జాయిన్ అయ్యాడు. అభి నావాడు కాలేదు అన్న బాధ తప్ప, నాకు సిరిమువ్వ మీద ఎప్పుడూ కోపం రాలేదు. నాకు ప్రాప్తం లేదు అనుకుని కాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన జాబ్ కోసం బెంగుళూరు వెళ్ళిపోయాను. తరువాత అభిని కలవడం జరగలేదు. వేరే ఫ్రెండ్స్ ద్వారా అప్పుడప్పుడూ అతని కబుర్లు మాత్రం తెలిసేవి. కొంత కాలం తరువాత నేను మా అమ్మకోసం బెంగుళూరులో జాబ్ మానేసి వైజాగ్ లో ఒక కంపెనీలో చేరాను. నా స్నేహితులు వేరే ఊర్లకు వెళ్లిపోవడంతో సంవత్సరకాలం నుండి అతని వివరాలు కూడా ఏమీ తెలియలేదు.

సిరిమువ్వ, అభి పెళ్ళి చేసుకున్నారో, లేదో తెలియదు. నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. నా సామాను, నా బాగ్,  నా మొబైల్ అన్నీ ప్రమాదంలో పోయాయి. ఏం చేయాలో అర్థంకాలేదు. అదే విషయాన్ని డాక్టర్ తో చెప్పాను.

“పోయిన సామాను దొరకదు. దాని మీద ఆశ వదులుకోండి. పోలీసులను, హెల్ప్ లైన్ వారిని కలవండి. వారు మిమ్ములను మీ ఇంటికి చేరుస్తారు.” అన్నాడు డాక్టర్.

నేను ఎలాగైనా ఇంటికి చేరుకోగలను. సిరిమువ్వను ఆ పరిస్థితిలో అక్కడ వదిలి వెళ్ళాలనిపించ లేదు.

“మరి సిరిమువ్వ…” సందేహంగా అడిగాను.

“సిరిమువ్వ ఎవరు?” తెల్లబోతూ అడిగాడు డాక్టర్. నేను సమాధానం చెప్పకుండా బెడ్ మీద స్పృహ లేకుండా పడివున్న సిరిమువ్వను చూపించాను.

నేను నా మెడలో వున్న చైన్ ను ఒక సిస్టర్ సాయంతో ఆ వూళ్లో అమ్మి డబ్బులు సంపాదించాను. డాక్టర్ కు, పోలీసులకు నా ఇంటి అడ్రస్, ఆఫీసు అడ్రస్ చెప్పాను. వారు ఫోన్ లు చేసి నేను చెప్పిన వివరాలు కరక్టే అని నిర్ధారణకు వచ్చి సిరిమువ్వను నాకు అప్పగించటానికి ఒప్పుకున్నారు. ఒక కారు మాట్లాడుకుని స్పృహలో లేని సిరిమువ్వను తీసుకుని నేను విశాఖ పట్టణం బయలుదేరాను.

ఇంటికి చేరగానే అమ్మకు సిరిమువ్వ గురించి చెప్పాను. “మంచి పని చేసావు చిన్నూ. మనం ఒకరికి మంచి చేస్తే దేవుడు కూడా సంతోషించి మన జీవితాలను కూడా మంచిగా నడిపిస్తాడు.” అని అమ్మ మనఃపూర్తిగా నన్ను మెచ్చుకుంది.

సిరిమువ్వను ఒక మంచి హాస్పిటల్ లో చేర్పించాను. ప్రమాదం జరిగినప్పుడు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ రిపోర్ట్స్ హాస్పిటల్ డాక్టర్ కు చూపించాను. రకరకాల పరీక్షలు చేసారు. రైలు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడడంతో షాక్ తో  కోమాలోకి వెళ్లిందని డాక్టర్లు చెప్పారు.

నా మొబైల్ నెంబర్ ను బ్లాక్ చేయించి, కొత్త మొబైల్ కొని అదే నెంబర్ సిమ్ వేయించాను. అభి నెంబర్ కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ రావడం లేదు. అభి సెల్ నెంబర్ మారి వుండొచ్చు అని కొంతమంది స్నేహితులకు అభి వివరాలు తెలిస్తే చెప్పమని మెసేజ్ పెట్టాను.

సిరిమువ్వని కోమా నుండి బయటకు తీసుకు రావడానికి వైద్యులు చాలా ప్రయత్నాలు చేసారు. ఎట్టకేలకు వైద్యులు నాలుగు నెలల తరువాత ఆమెను కోమా నుండి బయట పడేలా చేసారు. అయితే సిరి మువ్వ ఎవరినీ గుర్తించే స్థితిలో లేదు. తను గతం మర్చిపోయింది.

“ఇది కామన్ గా చాలా మందిలో జరిగేదే. కోమాలోకి వెళ్లిన వారు గతం మర్చిపోతారు. మరికొంత మంది మాట్లాడటం  కూడా మర్చిపోతారు. తను మాట్లాడగలుగుతుంటుంది. ఇది కొంతవరకు బెటర్. కొన్ని థెరపీల ద్వారా గతం గుర్తుకు వచ్చేలా చేస్తాము. మీరేమీ కంగారు పడకండి.” అని డాక్టరు ధైర్యం చెప్పాడు.

తను ప్రెగ్నెంట్ అన్న విషయం డాక్టర్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్య పోయాను. సిరిమువ్వ మెడలో తాళి గానీ, కాలి వేలికి మెట్టెలు గానీ ఏమీ లేవు. తనకు పెళ్ళి అయిందో, లేదో తెలియదు. నేను రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి హైదారాబాద్ వెళ్ళాను. అభి ఇంటికి వెళ్ళాను. అభి నాన్నగారు చనిపోయారని, అభి ఇల్లు తాళం వేసుకుని ఎటో వెళ్ళి పోయాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్పారు. అతని ఫోన్ నెంబర్ కూడా వారి దగ్గర లేదు. ఇక చేసేదేమీలేక అభి వస్తే నాకు కబురు చేయమని నా ఫోన్ నెంబర్  చుట్టుప్రక్కల వాళ్లకు యిచ్చి వైజాగ్ తిరిగి వచ్చేశాను.  మరో నాలుగు నెలలు గడచినా అభి గురించిన సమాచారం ఏమీ తెలియలేదు.

సిరిమువ్వకు ప్రసవం రోజులు దగ్గర పడ్డాయి. ఒకరోజు ఆసుపత్రిలో సిరిమువ్వ నన్ను చూసి ఒక్కసారిగా “జోత్స్నా” అని పిలిచింది. నేను “సిరీ” అంటూ తన చేయి పట్టుకున్నాను. డాక్టర్ వచ్చి తనను పరీక్ష చేసి, తన కుటుంబ వివరాలు అడిగితే అన్నీ చక్కగా చెప్పింది.

నేను “అభీ ఎక్కడున్నాడు? అతని ఫోన్ నెంబర్ తెలుసా నీకు” అని అడిగేసరికి సిరి ముఖం నల్లబడింది. నేను రైలు ప్రమాదం జరిగిన దగ్గరినుండి విషయాలన్నీ చెప్పాను.

“అభికి, నీకు పెళ్ళి అయిందా?  అభి హైదారాబాద్ లో లేడు. ఎక్కడున్నాడో నీకు తెలుసా? నువ్వు ఇప్పుడు ప్రిగ్నెంట్ వు. ఒకటి రెండు రోజుల్లో నీకు పాపో, బాబో పుడతారు.” అనేసరికి సిరి ఒక్కసారిగా విలపించ సాగింది. ఎంతో సేపు బుజ్జగించాక ఏడుపు మానింది.

“ఏం జరిగిందో చెప్పు సిరీ” అని అడిగాను.

ఏం జరిగిందో చెప్పటానికి సిరి ముందు ఇష్టపడలేదు. నేను తరచి తరచి అడిగాక సిరి నోరు విప్పింది.

అది విన్న నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇంతలో నా సెల్ మోగింది. ఫోన్ ఆన్ చేసాను.

***

అభిమన్యు :
*************
ఆకాశం అంతా దట్టమైన మేఘాలు అలుముకుని వున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే  ఉంది. గాలులు కూడా వేగంగా వీస్తున్నాయి. నా మనసు లాగే ఇల్లంతా చీకటి చీకటిగా వుంది. తీసివున్న తలుపులో నుండి వాన జల్లు లోపలికి పడుతున్నది. వాన జల్లులలో తడిసి ముద్దవుతున్నా, నా గుండెలో రేగే మంటలు ఆరటం లేదు. ఒకటి కాదు, రెండు కాదు… గత తొమ్మిది నెలల నుండి మధనపడుతూనే వున్నాను. నేను ఇక్కడ లేని సమయంలో ఏం జరిగిందో నాకర్ధం కావటం లేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. నేను ట్రైనింగ్ నిమిత్తం జర్మనీ వెళ్ళినప్పుడు ఏదో జరిగింది. అది ఏమిటో తెలియటం లేదు. ఇంకో ఇరవై రోజుల్లో ట్రైనింగ్ ముగుస్తుందని నాన్నను, సిరిని చూడవచ్చని సంతోషపడే సమయంలో  ఫ్యామిలీ డాక్టర్ గారు ఫోన్ చేసి ”నాన్నగారికి సీరియస్ గా వుంది.
హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. నిన్ను కలవరిస్తున్నారు. వెంటనే రా అభీ.” అని చెప్పారు. నేను ఆదుర్దాగా వెంటనే బయలుదేరి వచ్చేశాను. హాస్పిటల్ బెడ్ మీద నాన్న లేరు.  ఐస్ బాక్స్ లో నాన్న డెడ్ బాడీ  వుంది.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నన్ను డాక్టర్ తన పర్సనల్ రూంలోకి తీసుకెళ్ళాడు. “అభీ, మీ నాన్నగారికి హార్ట్ ఎటాక్ అని అందరికీ చెప్పాను. అలా నమ్మించాను. కానీ మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలియదు.” అని డాక్టర్ చెపుతుంటే నేను నమ్మలేక పోయాను.

“లేదు డాక్టర్ మీరు పొరపడుతున్నారు. నాన్నగారికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు అసలు ఏమీ లేవు. తాను చాలా ధైర్యవంతుడు. ఎట్టి విషమ పరిస్థితులలోనూ అలా చేయడు.” అన్నాను ఏడుస్తూ.

డాక్టర్ అటూఇటూ చూస్తూ ఒక కాగితాన్ని నా చేతిలో వుంచాడు.

‘నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందుకే చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.’ అని ఆ కాగితంలో రాసివుంది. అది నాన్న చేతిరాతే.

“మీ నాన్న చొక్కజేబులో వుంది ఈ కాగితం. ఎవరూ చూడకముందే తీసి దాచాను. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్న విషయం నీకూ, నాకు తప్ప మూడో కంటికి తెలియదు. ఇక నీ ఇష్టం.” అని డాక్టర్  గదిలో నుండి వెళ్ళిపోయాడు.

నేను వస్తున్న దుఃఖాన్ని దిగమింగి సిరికి ఫోన్ చేశాను. ఫోన్ ఔట్ ఆఫ్ ఆర్థర్ అని వచ్చింది. ఎన్ని సార్లు చేసినా అదే సమాధానం. సిరి ఫోన్ కు ఏమయిందో అనుకుని, ఒక ఫ్రెండ్ ను సిరి ఇంటికి పంపించాను. అతను చూసి వచ్చి ఇంటికి తాళం వేసి వుంది అని చెప్పాడు. నాన్న అంత్యక్రియలు పూర్తికాగానే నేనే స్వయంగా సిరి ఇంటికి వెళ్ళాను. తాళం కప్ప దర్శనమిచ్చింది.

“సిరిమువ్వ ఎక్కడికి వెళ్ళింది?” అని పక్క ఇంటి వారిని అడిగాను.

“మీ పేరు అభిమన్యు కదూ. మీరు వస్తే ఇవ్వమని ఈ కవరు ఇచ్చింది. ఎక్కడికి వెళ్లిందో మాకు తెలియదు.” అంటూ ఒక కవరు నాకు ఇచ్చారు. కవరు చింపి లోపల వున్న కాగితం మడత విప్పాను.

‘అభీ, నీకన్నా అందగాడు, కోటీశ్వరుడు అయిన సమవర్తి నాకు పరిచయం అయ్యాడు. నాకు అతనితోనే జీవితం పంచుకోవాలని రాసిపెట్టి వుంది. నేను అతనితో వెళ్ళిపోతున్నాను. ఇక నీకు కనపడను. నన్ను మరచిపోయి మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకో!’
– నీది కాని సిరిమువ్వ.

అది చదవగానే నాకు మతిపోయింది. పిచ్చివాడిలా అయిపోయాను. సిరి అలా చేస్తుందంటే నమ్మలేకపోయాను. నాన్న చనిపోయాడు. సిరి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నాన్న జ్ఞాపకాలు, సిరి జ్ఞాపకాలు నీడల్లా వెంటాడుతుంటే ఇల్లు వదిలి మనఃశాంతి కోసం దేశం అంతా తిరిగాను. ఎక్కడా మనసు ప్రశాంతత పొందలేదు. తిరిగి తిరిగి, అలసి సొలసి ఇంటికి వచ్చాను. ఇన్ని రోజులైనా నా మనసులో ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు.

“అభీ” అన్న పిలుపు వినబడి ఆలోచనల నుండి తేరుకుని తలెత్తి చూశాను. ఎదురుగా జ్యోత్న్స కనిపించింది.

“అభీ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు. తొమ్మిది నెలల నుండి నీకోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా?” అంది జ్యోత్న్స.

నేను విస్మయంగా చూశాను. “నా కోసం  వెతుకుతున్నావా? ఎందుకు?” అన్నాను.

“సిరి గురించి చెప్పటానికి.”

“సిరి గురించా? ఏం చెపుతావు? మనసారా ప్రేమించిన సిరి నన్ను కాదని ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నన్ను ఇలా ఒంటరిని చేసి తను వెళ్ళిపోయిందని తెలుసా నీకు?” ఆవేశంగా అన్నాను.

“అభీ, సిరి నిన్ను ఒంటరిని చేయలేదు. తనే ఒంటరి అయింది. నా అనుకున్న వారే నాగుపాములా మారి కాటేస్తే, ఆ సంగతి నీకు చెప్పలేక నీ నుండి దూరంగా పారిపోయింది.”

జ్యోత్న్స మాటలు నాకు అర్థం కాలేదు. “అసలు ఏం జరిగిందో చెప్పు?” పెద్దగా అరిచాను.

“సిరి ఒక మగవాడి కామానికి బలిపశువై పోయింది.”

“ఎవడు వాడు?” నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
“………….”

జ్యోత్న్స చెప్పింది వినగానే జ్యోత్న్స రెండు చెంపలు చెళ్లుమనిపించాను.
“యూ స్కౌండ్రల్ ! ఎంత ధైర్యం అలా అనటానికి. నిన్ను… నిన్నూ…” అంటూ జ్యోత్న్సను విసురుగా తోసివేసాను.

జ్యోత్న్స వెళ్ళి సోఫా ప్రక్కనే వున్న అద్దాల బీరువా మీద పడిపోయింది. బీరువా అద్దం భళ్ళున పగిలి బీరువాలో పేర్చిన పుస్తకాలు క్రిందపడిపోయాయి. ఆ పుస్తకాల్లో వున్న ఎర్రటి డైరీ తెరుచుకుని దానిలో మడత పెట్టి  వున్న కాగితం బయటపడింది. ఆ డైరీ నాన్నది. అప్రయత్నంగానే క్రిందికి వంగి ఆ కాగితం అందుకుని మడతలు విప్పాను.

అభీ,
తుఫాను వార్తలను టీవీలో విని సిరి ఒంటరిగా వుంది,  తనని ఇంటికి తీసుకొద్దామని సిరి దగ్గరకు వెళ్ళాను. కారు దిగి లోపలికి వెళ్ళేలోపునే ముద్దగా తడిసిపోయాను. ఇంట్లో కరెంట్ లేదు. సిరి
తుడుచుకోవడానికి టవల్ తెచ్చింది. ఆ కటిక చీకటిలో టవల్ కోసం ముందుకు అడుగేసిన నేను టీపాయ్ తగిలి ముందుకు పడబోయాను. సిరి నన్ను కింద పడకుండా పట్టుకుంది. పట్టు కోసం నేను సిరిని గట్టిగా వాటేసుకున్నాను. నా చేయి సిరి శరీరంలోని మృదువైన భాగాన్ని తాకింది. ఆ స్పర్శ నాలో గిలిగింతలు రేపింది. ఆ చలి వాతావరణం, ఆ చీకటి, ఎవరూ లేని ఏకాంతం నన్ను నేను మరిచేలా చేసింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నన్ను నేను సమర్ధించుకోవటానికే చెప్పినట్లు వుంటుంది. మీ అమ్మ చనిపోయిన దగ్గరి నుండి ఎంతో నిగ్రహంతో వున్న నాలో ఆ క్షణంలో కామపిశాచి ప్రవేశించిందేమో…నన్ను నేను నిగ్రహించుకోలేక పోయాను. దారుణం జరిగిపోయింది. నన్ను క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు. నీకూ, సిరికి చాలా ద్రోహం చేసాను. చేసిన పాపం చెపితే పోతుందంటారు. కానీ ఇది పోయే పాపం కాదు. బ్రతికినంత కాలం నన్ను చిత్రవధ చేస్తూనే వుంటుంది. ఈ చిత్రవధను భరించే శక్తి నాలో లేదు. అందుకే నేను ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను.
బై ఫర్ ఎవర్ అభీ.
… భరద్వాజ.’

అది చదువుతూనే నాలో నవనాడులు కృంగిపోయాయి. చైతన్యం వుడిగిన వాడిలా కూలబడిపోయాను. ఇది నిజం కాదు. కాకూడదు అని మనసులో అనుకుంటున్నా చేతిలో వున్న కాగితం నగ్నసత్యమై  నన్ను నిలువెల్లా కబళించి వేస్తున్నది. ఆ  కాగితంలోని అక్షరాలే శరాలుగా మారి నా హృదయాన్ని తూట్లు పొడుస్తున్నాయి.

“అభీ…అభీ…” జ్యోత్న్స నన్ను కుదుపుతూ పిలుస్తున్నది. ఆ పిలుపుకు స్పందించ లేకపోతున్నాను. స్పృహ తప్పలేదు కానీ పూర్తి తెలివిలో లేకుండా అలా వుండిపోయాను. అరగంట తరువాత కొద్దిగా తేరుకున్నాను.

“సిరి ఎక్కడ వుంది?” మెల్లగా అడిగాను.
జ్యోత్న్స రైలు ప్రమాదం దగ్గరినుండి జరిగిన విషయాలన్నీ చెప్పింది. నేను ఆదుర్దాతో లేచి నిలుచున్నాను.

“నేను వెంటనే సిరిని చూడాలి. సిరీ, నేనూ మనసారా ప్రేమించుకున్నాం. భౌతికంగా మాకు పెళ్ళి జరగకపోయినా మానసికంగా మేము ఏనాడో భార్యాభర్తలం అయ్యాం. సిరి నా అర్ధాంగి. నా ప్రాణంలో ప్రాణం. ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరిగిందని సిరిని నేను విడనాడలేను. సిరిని విడిచి నేనుండలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనకు తోడునీడై ఉంటాను అని సిరితో చెప్పాలి.” మాటలు తడబడుతున్నాయి. నాకు ఎలా చెప్పాలో సరిగా అర్థం కావడం లేదు. కానీ నా మనసు నిండా సిరి గురించిన ఆలోచనలే కదలాడుతున్నాయి.

“ఈరోజు వద్దు అభీ. బయట అంతా తుఫాను వాతావరణం అలుముకుని వుంది. వైజాగ్ నుండి నేను రావడమే చాలా కష్టమైంది.” అంది జ్యోత్న్స.

“అయినా సరే, నేను సిరిని వెంటనే కలుసుకోవాలి.” అంటూ నేను ఎయిర్ పోర్ట్ కు ఫోన్ చేశాను. మరో అరగంటలో వైజాగ్ ఫ్లైట్ వుందన్నారు. వెంటనే నేను, జ్యోత్న్స ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాము.
టికెట్ కౌంటర్ లో టికెట్స్ ఇస్తూ “తుఫాను వాతావరణం వుందని మీకు తెలుసు. వాతావరణం అనుకూలిస్తేనే ఫ్లైట్ బయలుదేరుతుంది లేకుంటే కాన్సిల్ అవుతుంది.” అని చెప్పారు.

నేను వెళ్ళి ఎయిర్ పోర్ట్ లాంజ్ లో కూర్చున్నాను. నా ప్రక్కనే జ్యోత్న్స కూర్చుని వుంది. సిరి ఎలా వుందో అన్న ఆదుర్దా నన్ను స్థిమితంగా వుండనీయడం లేదు. బయట తుఫానును మించి నా హృదయంలో తుఫాను హోరెత్తుతున్నది. తనకి ఏం కాకూడదని, ఫ్లైట్ కాన్సిల్ కాకూడదని ముక్కోటి దేవతలను మనసులోనే ప్రార్ధిస్తూ, ఫ్లైట్ ఎనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ వుండిపోయాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.